క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

1. సాతాను శ్వాస



ప్రియులారా! మానవ సంతతి అంతటికి ఆదాము, హవ్వ అనువారే మొదటి తల్లిదండ్రులు. పొడపాము మన కాలిబొటన వ్రేలిమీద ఊదిన యెడల, ఆ విషము కాలంతటికి ఎక్కును. అలాగే సాతాను అను ఆది సర్పము, మన తల్లిని మోసపుచ్చుటవలన తన విషము ఆమె చెవిలోనికి ఊదెను. అది నేటివరకు అందరిలోనికి వచ్చియున్నది. అందుచేతనే నరులకు పాపాలోచనలు వచ్చుచున్నవి. ఆది దంపతులు దైవాజ్ఞను మారినందువల్ల ఆరు దుష్ట ఫలితములు కలిగెను.

పాపఫలితములు వరుసగా చెప్పుచున్నాను: అంటించుట, దిగంబరత్వము, భయము, చాడ, వృక్షము నాశ్రయించుట, దేవునిపై నేరము మోవుట, ఈ ఆరును నేటివరకు మనుష్యులందరిలోనికి వచ్చియున్నవి. క్రీస్తుప్రభువు సిలువ మ్రానుమీద, మన పాపములను మనమీద లేకుండ తనమీద వేసికొనెను. అయినను మనము వాటిని జ్ఞాపకము చేసికొనుటవలన, వాటిని తెచ్చిపెట్టుకొను చున్నాము. భయపడుటవలన వాటిని తెచ్చి పెట్టుకొనుచున్నాము.