క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
5. సిలువ తలంపు
"మ్రాను దగ్గరకు వెళ్ళి దాగుకొనుటవలన, మ్రాను శరణుజొచ్చినట్లు" గదా? కాబట్టి దానికి వ్యతిరేకమైన కార్యమొకటి చేసితిని. అదేమనగా సిలువ మ్రానుపైన వ్రేలాడి, మీ విముక్తి కొరకు, నా రక్తమును ధారపోసితిని గనుక చెట్టువద్ద కాక, నా సిలువయొద్ద దాగుకొనండి. అప్పుడు మీకు హానిరాదు అని ప్రభువు చెప్పినట్లు యున్నది.
"మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను" - పేతురు 2:24.
సైతాను నెదిరించు పద్యము
సీ॥
సాతాను సర్పమా! । సర్వకార్యములందు
శ్రమలతో కూడిన । చావు నీకు
నరులను బాధించు । నపుడెల్ల వ్రాతలో
పడిన శిక్షలు పయి । బడునునీకు
యూఫ్రటీస్ నది వద్ద । ఉన్న భూతాలకు
కలిగిన దుర్గతి - కలుగు నీకు
విజ్ఞప్తి పత్రిక । వెల్లడించక ముందె
కంపము భీతియు । కలుగు నీకు
తే॥గీ॥
హేడెస్సను మాట తలనొప్పి । హింస నీకు
హర్మ గెద్దోను యుద్ధం । హడలు నీకు
కడతరుగని గొయ్యియె మొట్టి । కాయ నీకు
అగ్నిగుండ మనంత ని । రాశ నీకు
సాతాను నెదిరించు కీర్తన
పోపోవె ఓ సాతానా - జాగ్రత్త సుమా - నీ గుట్టు మాకు చిక్కెను = నిను చితుక గొట్టి - ఘనసూత్రాలు మాకు మా తండ్రి నేర్పించి - మము సిద్ధపరచెను ॥పోపోవె॥
- ఆదికాలము మొదలుకొని - నేటివరకు - ఆడితివి బహు నేర్పుగా = అద్భుత రీతిగా - ఆత్మతండ్రి నీదు- ఆయువు పట్టును - అందించెను మాకు ॥పోపోవె॥
- మట్టులేని గొయ్యెగా - నీ కష్టమెల్లా - గట్టెక్కె పని లేదుగా సమయము లేదని - సన్నిధిపరులను- చెదర గొట్టుటకీవు - కనిపెట్టుకొన్నావు ॥పోపోవె॥
- కరుణా సముద్రుండైన - త్రిత్వదేవుని - కృప మమ్ము వెంబడించు ఏదోఒక సూత్రాన - రక్షించు చుండును- భక్షించు నీ చేతికి - చిక్కనిచ్చునా మమ్ము ॥పోపోవె॥