క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
సాతాను నెదిరించు సూత్రములు
ప్రారంభ ప్రార్ధన:
ఓ త్రియేక దేవుడవైన తండ్రీ! సాతానును ఎదిరించవలెనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము.
దయగల తండ్రీ! సర్వశక్తిగల తండ్రీ! మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయుము. శత్రువు బలమంతటిమీద మీకు అధికారమిచ్చియున్నానని లూకా 10వ అధ్యాయములో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రీ! ఆ అధికారమును మేము వాడుకొనే కృప దయచేయుమని ప్రభువు నామములో వేడుకొనుచున్నాము.
సర్వలోకమును సృష్టించిన సృష్టికర్తయైన తండ్రియొక్క నామములో, సర్వలోకమును రక్షించిన రక్షణకర్తయైన యేసుప్రభువు యొక్కనామములో, సర్వలోకమును ఆదరించుచు, ఆయత్త పరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రియొక్క నామములో, త్రియేక దేవుని నామములో, గాలి లోకములో బంధకములోయున్న ఓ సాతానా! సాతాను అనుచరులారా! దురాత్మలారా! దురాత్మల సమూహములారా! దయ్యములారా! భూతములారా! పిశాచములారా! మేము మిమ్ములను ఎదిరించుచు, గద్దించు చున్నాము గనుక మా ఎదిరింపులు, గద్దింపులు జాగ్రత్తగా ఆలకించుమని త్రియేక దేవుని నామములో మీకు ఆజ్ఞాపించుచున్నాము.
1. సాతాను నెదిరించు ప్రార్ధనలు
సాతానునెదిరించుటకు దేవుని ప్రార్ధించు సూత్రములు:
- 1) ఓ యేసుప్రభువా! నీవు అరణ్యములో సైతానుతో, "సాతానా! పొమ్మని" చెప్పినావు (మత్తయి 4:10). వాడు ఒక్క నిమిషమైన ఉన్నాడా! ఏలాగు ఉంటాడు? ఆ వాక్యము ఈ వేళ మేము వాడుకొనేటట్లు నీ కృప దయచేయుము. నీవు వాడిన ఆ మాటలు, మేము వాడినా సాతానుకు ఎక్కువ భయము. మా ప్రార్ధన ఆలకించుమని వేడుకొనుచున్నాము.
- 2) ఓ దేవా! మేము రక్షింపబడినాము, సాతాను రక్షింపబడలేదు. రక్షింప బడిన వారికి ఎక్కువ బలమా? రక్షింపబడని వారికి ఎక్కువ బలమా? గనుక వాడి మాటలు బలము లేనివని, మేము ఎదిరించుటకు మాకు సాహసము దయచేయుము.
- 3) ఓ ప్రభువా! సైతాను చీకటి వ్యక్తి. తాను చీకటి వ్యక్తి కాదని భక్తులు భ్రమపడునట్లు, వెలుగు దూత వేషము ధరించుకొనును. అందువలన అతడు వేషధారి. ఈ మాటలు మేము సైతానుకు చెప్పి వానిని ఎదిరింతుము. మాకు సహాయము దయచేయుము.
-
4) యేసు ప్రభువా! సైతాను మమ్ములను గురించి చెడ్డ తలంపులు తలంచినపుడు, వాడు కెవ్వుమని కేకవేయునట్లు అతని నిరాకార
తలంపులపై,
బాణము వేయుము.
వాడు మాపై మిర్రుమని చూచునప్పుడు, అతని కండ్లలోనికి బాణము వేయుము.
మమ్ములను గూర్చి అతని దూతలు చెడ్డ రిపోర్టులు వినిపించేటప్పుడు, వాడు ఆలకించుచుండగా, వాని నిరాకారపు చెవులలోనికి బాణము వేయుము.
అతడు నీ యొద్ద మమ్ములను గూర్చి చాడీలు చెప్పునప్పుడు, వాని నిరాకారపు నోటిలోనికి బాణము వేయుము.
తిండి వలనగాని, తిను బండారముల వలన గాని మాకు జబ్బు చేయునప్పుడు, వాని నిరాకారపు ఉదరములోనికి బాణము వేయుము.
వాని చేతులతో మాకు హాని చేయునప్పుడు, వాని నిరాకారపు చేతులలో బాణములు గ్రుచ్చుము.
వాడు మా కాళ్ళకు హాని చేయునప్పుడు, వాని నిరాకారపు కాళ్ళ లోనికి బాణములు గ్రుచ్చుము.
వాడు మా జీవితకాలములో ఏ హానిచేసినను, మాకు కలిగిన దేనికైనను హాని చేయునప్పుడును వాని నిరాకారపు చోటుపై బాణము గ్రుచ్చుము.
వాడు మాలో కలిగించు కోపము, అసూయ, సోమరితనము, ఆందోళన, మందస్థితి, నిష్ఫలస్థితి, అపజయము, నిరాశ, అపనమ్మిక, భక్తిహీనత, దిగులు, అధైర్యము, దీర్ఘకాలచింత, దుఃఖము, అశ్రద్ధ, చెడు కోరికలు, అపార్థములు, మనస్పర్ధలు, కలహగుణము, అందని వాటిని ఆశించుట, వృద్ధాప్యమువల్ల కలుగు హాని, నిస్సహాయత్వము: ఇవి రానీయకుము. అతడు మా ప్రార్ధనను బట్టి చెలరేగిన యెడల, అతనికే హాని రానిమ్ము గాని మాకు హాని రానీయకుము. - 5) ఓ సృష్టికర్తవైన తండ్రీ! టోబియా, సన్బల్లటుల మాటలు తుదకు నెరవేరలేదు గదా! ఎజ్రా, నెహెమ్యాల యొక్కమాటలు నెరవేరినవి గదా! నీవు మా దగ్గర ఉన్నావు గనుక సాతాను మాటలు ఎలాగు నెరవేరును? ఇంతవరకు అతని పంతము నెరవేరలేదు గదా! అలాగే చివర వరకు నెరవేరదు. నెరవేరకుండ చేయువాడవు నీవే. సైతాను మాటలన్నియు బెదిరింపు మాటలే గాని నిజమైన పలుకులు కావని వాడును, భూతములును గ్రహించునట్లు చేయుము.
- 6) ఓ తండ్రీ! మేము ఒక్క భూతమును ఎదిరించునప్పుడు, వాడి సైన్యమంతటిని ఎదిరించినట్లే మా ఎదిరింపులు వాడి సైన్యమంతటికిని చెందును. అతని సైన్యమంతటిని ఎదిరించి గెల్చుటకు నీ సైన్యమును, పరలోకపు దూతలను, భక్తులను, విశ్వాసులను మాకు సహాయముగా దయచేయుము. నీవే మా పక్షముగా సైతానుతో యుద్ధము చేయుమని వేడుకొనుచున్నాము.
-
7) యేసు ప్రభువా! నీవు సిలువమీద ఉన్నప్పుడు, దుష్టులు- "నీవు ఇతరులను రక్షించినావు. నిన్ను నీవు రక్షించుకోలేవా" అని
హేళన
చేసినారు. అయితే ప్రభువా! నిన్ను నీవు రక్షించుకొంటే, లోకమంతటిని రక్షించుకొనలేవు. అందుచేత ఆ హేళన అబద్ధముతో కూడుకొని
యున్నది. సైతాను నీ పనికి అడ్డము వచ్చి, ఏదో ఒక మాట అని వెళ్ళిపోవును గాని ఆ మాటలో నిజము ఉండదు, గనుక మాకు ధైర్యము
దయచేయుము.
"ఓ సాతానా! నిన్ను నీవు రక్షించుకొనలేవు, ఎవరిని రక్షింపలేవు. దుష్టుల చేత మా ప్రభువును అనిపించిన మాట ఎందుకు నీకు"? అని మేము సాతానును ఎదిరించేటట్లు మాకు బలము అనుగ్రహించుము. -
8) ఓ దేవా! సైతాను ఇట్లనుకొనుచున్నాడు.
- 1) "నేను విశ్వాసులకు కూడ జబ్బులు, కష్టములు పంపించుచున్నాను గనుక నాదే జయము, నా రాజ్యమునకే వృద్ధి". అయితే మేము "సైతానా! నీ రాజ్యమునకు, నీ జయమునకు లయము, నాశనమని" ప్రకటించుచున్నాము.
- 2) మరియు సాతాను ఇట్లనుకొను చున్నాడు. "విశ్వాసులు ఎంత ప్రార్ధన చేసినను, వారి కష్టములు నేను పోనీయలేదు గనుక నాదే జయము, నా రాజ్యమునకే వృద్ది. విశ్వాసుల దాబుసరి మాటలు ఏవి"? మేమైతే, "సైతానా! నీకెన్నడు జయమురాదు. గడియ వచ్చినప్పుడు మా కష్టములు తీరిపోవును, మా ప్రార్ధనలు నెరవేరును. మాకే జయము. నీవు అపజయపరుడవని" ప్రకటించుచున్నాము.
- 3) ఇంకను సైతాను - "నేను కష్ట నివారణకు ఆటంకముగా నున్నప్పుడు, నీ తండ్రి వచ్చి కష్టనివారణ చేసినాడా! లేదు. గనుక నా రాజ్యము వృద్ధి పొందుచుండగా, దేవుని రాజ్యము వృద్ధి పొందుటలేదు కదా!" అనుచున్నది. అయితే మేము, "ఓ సాతానా! నీకు, నీ పనులకు లయము, నాశనము" అని ప్రకటించుచున్నాము.
ఉదా: వరద రోజున గోదావరి గట్టుమీద నున్న చిన్న కుర్రవానికి సుడిగుండము కనబడుచున్నది. పైనుండి వచ్చుచున్న నీళ్ళు ఆ సుడి గుండములోనే ఆగిపోవుచున్నవని అనుకొనుచుండెను. ఇంతలో ఒక పెద్ద విద్యార్థి ఆ కుర్రవానిని చూచి, నీవు మొదట చూచిన నీరు, ఆనకట్ట మీదికి వెళ్ళిపోయినదని చెప్పెను. అలాగే పైకి కనబడకపోయినను, దేవుని రాజ్యము వృద్ధి పొందుచునే ఉన్నది.
ఓ యేసు ప్రభువా! ఈ సత్యములను అందరికిని బయలు పరచుము. నమ్మునట్లు విశ్వాసము దయచేయుము. సైతానును సాహసముతో ఎదిరించునట్లు శక్తి దయచేయుము. -
9) యేసు ప్రభువా! నీవు మత్తయి 18: 18లో సెలవిచ్చినావు గదా! భూమి మీద మీరు వేటిని బంధింతురో, పరలోకములో నేను వాటిని
బంధింతునని అన్నావు. గనుక ఇప్పుడే మేము సాతానును, వాని దూతలను బంధించుచున్నాము. నీవును వాటిని
బంధించుము.
ఓ భూతములారా! మా పరలోకపు తండ్రియొక్క స్వాతంత్ర్యమును బట్టి, మిమ్ములను ఇప్పుడే బంధించుచున్నాము. మీరు ఏలాగు తప్పించుకొందురో చూచెదము! సాతానా! నీకు బంధన కలుగలేదని నీవు అబద్ధమాడుచున్నావు. నీకు సత్యము చెప్పుటరాదు. -
10) "భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని" అన్నావు (మత్తయి 18:18). సైతాను భూలోకములో అనేక
మంది
భక్తులను కట్టివేసినాడు. యేసుప్రభువా! పరలోకములో ఆ బంధకములను విప్పుము.
షరా: మన దృష్టిలో ఎవైనా బంధింపబడిన వారున్న యెడల వారిని తలంచుకొని, ఈ పైన వ్రాసిన విధమున ప్రార్ధింపవలెను. -
11) ఓ దేవా! అంతములేని కృపగల దేవా! నీకు స్తోత్రములు. సైతాను తనకు ఎక్కువ సమయము లేదని చెలరేగి, విశ్వాసుల మీద
పడుచున్నాడు.
అతని ఆలోచనలు సాగనీయకుము. అతని ప్రయత్నములు నెరవేరనీయకుము. అతని పన్నాగములను చెడగొట్టుము.
యూఫ్రటీసు నదివద్ద ఉన్న నాలుగు భూతములను నీవు బంధించినావు. ఆలాగుననే ఇప్పుడును, లోకమంతట తిరిగే భూతములను, వాటియొక్క పనులను నీవు బంధించుము. ఆమేన్.