క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
9. ముగింపు ప్రార్ధన
మహోన్నతుడవైన తండ్రీ! నీవు మహిమలో మహిమస్వరూపుడవు. జ్ఞానములో జ్ఞానస్వరూపుడవు, శక్తిలో శక్తిస్వరూపుడవు, న్యాయములో న్యాయ స్వరూపుడవు. కాబట్టి నీకనేక స్తోత్రములు. నీవు సమస్తములో సమస్తమై యున్నావు. అన్నింటిలో నీవున్నావు. నీవు లేకుండా ఏమియు జరుగదు. మేము లేకుండా కూడా ఏమియు జరుగదు. ఇట్టి ఆశ్చర్యము ఆదికాలమునుండి చేయాలని తలంచుకొన్నావు. నీవు నా స్థలము ఏర్పరచుకొనిన స్థలజ్ఞానివై యున్నావు. ఇట్టి తలంపులు మాకు అనుగ్రహించి సాతానును పడవేయుటకు, దానిని ఎదిరించుటకు శక్తి దయచేసినావు. నీకు వందనములు. ఇవి వింటే సాతానుకు, వాని దూతలకు పులకర జ్వరము తగులుతుంది.
తండ్రీ! ఈ దినము జపాను దేశమును గూర్చి ప్రార్ధించినాము గదా! రేపు చైనా తరువాత బర్మా, సైయాం ఇండియా, పాలస్తీనా, టిబెట్టు... ఈలాగు అన్ని దేశములను గురించి, అదే ప్రార్ధన కొద్ది మార్పులతో చేయుదుము. గాని, ఒక్కొక్క దానిలో కొద్దికొద్దిగా మార్పులుండ వచ్చును. ఈ ప్రార్ధనలన్ని సాతానును ఎదిరించేవి కావు గాని, సాతాను దృష్టిలో ఎదిరించేవే. ఈ ప్రార్ధనలు సాతానుకు ఇష్టము లేదు. ఎందుకంటే, శత్రు దేశస్థులు క్రిందటి యుద్ధములో, అనేకమందిని చంపిరి. వారు దుర్మార్గులైననూ, వారిని నాశనము చేయుమని మేము ప్రార్ధించము. వారు పాతాళములో నున్నను, వారిని క్షమించుమని ప్రార్ధించిన యెడల, అది సాతానును ఎదిరించే ప్రార్ధనయే. సృష్టిని కాపాడుమని ప్రార్ధించుట, సాతానును ఎదిరించుటే. ఈ ప్రార్ధన చేయుటకే మేము పుట్టినాము. మేము పాపులమైతే మాత్రము, ఎప్పుడో ఒకప్పుడు ప్రభువు శుద్ధిచేస్తాడు.
ప్రభువా! మీరు లేకుండా మేము, మేము లేకుండా మీరు ఉండుట అసాధ్యము. నీవు ఉన్నావు గనుక మాకు జయము. ఎందుకనగా పాపములో నీ తలంపే కలిగియున్నాము. గనుక నేను పాపములో పడినను, అపజయము లేదు. (పాపములో పడినట్లే గనుక) నేను జయము పొందినట్లే ఎందుకంటే, సాతానును ఎదిరించే ప్రార్ధన చేసిన దానికి అపజయమే. ఈ వేళ మేము ఇంకొకమారు సాతానును ఎదిరించి ప్రార్ధన చేస్తాము. సాతాను రాజ్యము దుంపనాశనము. అవే ఎదిరింపులు చేస్తుండగా భక్తుల సమూహము, బైబిలు బోధలు వృద్ధే. ఇక్కడ మేము సాతానును ఎదిరిస్తే నీ రాజ్యము పైకి రావడము, రక్షితుల వృద్ధి, సువార్త వృద్ధి మరియు సమస్త జనుల వృద్ధి. మా చూపు ఇక్కడ, అక్కడ కూడ ఉన్నది. మేము అందరి క్షేమము కోరుచుండగా, వానికి సిగ్గు మరియు వాని రాజ్యము కూలిపోతుంది. నీ రాజ్యము వృద్ధియగుచున్నది. సాతాను అది చూచుట లేదు ఇది చూచుట లేదు. ఇక దానికేమి గతియున్నది.
అవును ప్రభువా! నీవు రాకపోతే పుట్టగతులు లేవు. నీవు పాత నిబంధనలో పుట్టలేదు, కొత్త నిబంధనలో పుట్టినావు. క్రొత్త నిబంధనలో ఆది సంఘ కాలములో మేము పుట్టలేదు. ఈ కాలములో పుట్టిన మేము, నీవు ఏకమైయున్నాము. గనుక మేము నిద్రపోకూడదు. మేము మేల్కొని సేవ చేస్తున్నాము, చేస్తాము. ఇక్కడ చేయకపోతే రేపు ఎక్కడైనా పూర్తి చేస్తాము. సంఘము పరలోకములోనికి వెళ్ళిన తరువాత కూడ చేస్తాము. చెడ్డకలలు వచ్చినా మేము ఆ సమయములోనే, మంచికలలు గలవారమై యున్నాము. గ్రుడ్డివారమైనను, చూపుగలవారమై యున్నాము. ఎందుకనగా, నీవు మేము ఒకటేనని పౌలు వ్రాసినాడు. అబ్రాహాము, మేము విశ్వాసులకు తండ్రులమే. అబ్రాహాము మనిషే. అబ్రాహామునకు ఉన్నది మాకును ఉన్నది, ఉన్నట్లే.
సాతాను మా బైబిలు చింపినా, మా బట్టలు చింపినా, మా బట్టలు మాకే యున్నవి, మా బైబిలు మాకే యున్నది, మా సంఘము మాకే యున్నది. తండ్రీ, నీకు స్తోత్రములు. సాతానుయొక్క దుర్భుద్ధి కనబడుచున్నది. మేము రాజ్యమేలుచున్నాము. రాజులమే, లేవీయులమే, యాజకులమే, పరిశుద్ధులమే. ఇట్టివారమైయుండగా పిశాచి కాదన్నను చెల్లదు. సమయము అయిపోయినదని పిశాచి చెలరేగినాడు. అయితే అన్ని సమయములు, గడియలు మాకే. మా తండ్రివి నిమిషములన్నియు మాకే. గదిలోని వారందరు చెడ్డవారని సాతాను అంటే మాకేమి? దాని చెడ్డనోరు కల్పించినది కాని మాకేమి? దాని దుండగతనము తీర్పులో కన్పించును. ఎలాగనగా దొంగవానిని శిక్షించునప్పుడు, వాని దొంగతనమంతయు కన్పించును.
సాతానా! మా మంచి కార్యములన్నియు, దేవదూతలు మా కుడి ప్రక్కన ఉండి వ్రాస్తారు. ఎడమ ప్రక్కన ఉన్నవారు, మా రికార్డు అంతయు వ్రాయుట మాని నిదానిస్తూ యుంటారు. దేవదూతలు మా తోబుట్టువులే, మా అన్నదమ్ములే, మా అక్కచెల్లెండ్రే, వారు మా వారే. సాతానా! నీవు ఇంకను దుండగతనము చేస్తున్నావు. నీకు నాశనమని తెలిసినను మానవు. మా తండ్రి మా అడ్డములను, మా బలహీనతలను, మా పాపాలను పడగొట్టి వేసినాడు. తండ్రీ! ఇక్కడ బూటకపు బోధకులు కొందరు అక్రమకారులై, నరకాగ్నికి వెళ్ళుదురని మత్తయిలో వ్రాయబడియున్నది. ఇది ఒక్కటే మాకు అర్ధము కావటము లేదు, కాని నీకు అర్థమగుచున్నది. అందరిని క్షమించుము, అందరిని రక్షించుము. నరకములోనికి వెళ్ళనీయవద్దని ప్రార్ధించుట తప్పే. ఎందుకంటే కొందరు వెళ్ళుదురని బైబిలులో వ్రాయబడియున్నది. అయితే నాది కూడా ఒప్పు అయియున్నది. ఎందుకంటె, హేడెస్సులో అనేకులు మారుచున్నారు. నీ వాక్యము నెరవేరుతుంది, నా మాట నెరవేరదు.
ప్రభువా! మేము ఒక్కటే పట్టుకొన్నాము. "నరులారా! నరకము మీది కాదు" అని వ్రాయించినావు. అదే నేను పట్టుకొన్నాను. అలాగు ప్రార్ధించుట తప్పేగాని, "అడుగుడి మీకిస్తానన్నావు" గనుక అడుగుచున్నాము. యేసుప్రభువా! ఎక్కడనో మహిమ లోకములోనున్న నీవు, పాప లోకములోనికి శిశువుగా వచ్చినావు గనుక చనువైపోయినావు, గనుక అడుగుచున్నాము. ఎమ్మాయికి వెళ్ళినవారితో, నీవు వెళ్ళినావు. వారు నీతోను, నీవు వారితోను నడచినట్లు; నీవు మాతోను, మేము నీతోను ఉన్నాము, నడుస్తున్నాము.
ఓ సాతానా! నేను నరకాగ్ని గుమ్మమువరకు వెళ్ళినా అక్కడ నున్న గొర్రెపిల్లను భుజముమీద వేసికొన్నట్లు, నన్ను భుజముమీద వేసికొని, నా ప్రభువు తన సింహాసనముమీద కూర్చుండ బెట్టును. నీ కేమి యున్నది? ఓ సాతానా!
" ఎట్టివారినైన - ఏ స్థలమునందైన పట్టి రక్షించుటకై = పాట్లొందు తండ్రికి మంగళార్చ (మంగళ స్తోత్రా)".
దేవదాసు అయ్యగారు - టైం (సమయము) అయ్యిందని అనగా కొందరు ఆకలివల్ల గడియారము తట్టు చూచుచున్నారు. ఆకలివల్ల కొందరు బిడ్డలు అలసియున్నారు. అయితే మాత్రము ప్రభువా! కాలము నీ చేతిలో నున్నది. నేను ఏర్పాటు బిడ్డను. నీ కుమారుడను గనుక అడుగు చున్నాను. నన్ను కొడతావా! కొట్టవు. ఇట్టి ప్రార్ధన చేయుటకే మంచముమీద లేవకుండా పండుకొన్నాను.
అక్షయ దేహము దాల్చితివీవు...... లక్ష్యము పెట్టకుమీ!
భయపడకండి (ఏనుగు చచ్చినా వెయ్యే, బ్రతికినా వెయ్యే). త్రియేక దేవుడవైన ఓ ప్రభువా! నీకనేక వందనములు. నీవు మా తండ్రివి. మేమెన్నిసార్లు పడినా, నిన్నెన్ని అడిగినా నీవు కోపపడవు. పరమ భక్తులైనవారు పడిపోతే, నీవు కోపపడ లేదు గనుక త్రియేక దేవా! నీకు స్తోత్రము. "త్వరగా వస్తున్నానని" చెప్పుచున్నావు, త్వరగా సిద్ధపడండని చెప్పుచున్నావు. త్వరగా సిద్ధపడే కృప కొరకు, మా గలిలయ యేసు ప్రభువా! నీ నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. మరనాత.