లెంటులోని పదమూడవ దినము - బుధవారము

మత్తయి 4:5-7; లూకా 4:5-8.

ప్రార్ధన:- మా నిమిత్తమై సైతానుచే శోధించబడిన తండ్రీ! నీకెదురైన అన్ని శోధనలను నా నిమిత్తమై జయించినావు. నీకు స్తోత్రములు. మేమును ఎంతగా శోధింపబడిననూ నీ తట్టుచూచి జయము పొందుటకు మమ్మును నీ సిలువ తట్టు ఆకర్షించుము. ఆమేన్.


మొదట శోధన అరణ్యములో జరిగినది. ఈ రెండవ శోధన పట్టణములో కనబడుచున్నది. మొదటి శోధనలో ఓడిపొయిన వానికి అనగా సైతానుకు సిగ్గులేదు. దిగులు లేదు, నిరాశ లేదు. మనమతని వలన గొప్ప పాఠము నేర్చుకొనవలెను. అతడు దుష్టుడైనను అతనికి నిరాశ లేదు. మనుష్యులలో ఎవ్వరును అంతటి దుష్టులు లేరు. ప్రభువుకి ఈ వేళ శోధనలు ఎదురైనవి. ఆయనను పరిశుద్ధ పట్టణమునకు తీసికొని వెళ్లినారు. ఆయన దేవుడును, నిజమైన మనిషియునై యుండి సాతాను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లుట, ఎంత అవమానకరమో చెప్పుటకు వీలులేదు.


ఇట్టి సంగతియే గురువారము రాత్రి, మరియు శుక్రవారము పగలు జరిగింది. గురువారము తిన్నగా ఊరిలోనికి చేతులు కట్టి తీసికొని వెళ్లినారు. ఎక్కడి కంటే చర్చి కౌన్సిల్ లోనికి తీసికొనివెళ్ళిరి. ఆయన వారిని ఆటంకపెట్టక వారు ఎక్కడకు తీసికొని వెళ్తే అక్కడకు వెళ్లెను. గనుక వారు ఆయనను అక్కడ నుండి కోర్టునకు తీసికొనివెళ్లినారు. ఇక్కడ ఏమియు లేదు. అక్కడనుండి గవర్నమెంటు కోర్టుకు తీసికొని వెళ్లి, అక్కడనుండి కల్వరి కొండకు తీసికొని వెళ్లినారు. 'నేను రాను అని అంటే వారేమి చేస్తారు. ఏమి చేయలేరు గాని ఆయన అలా అనలేదు. ఆయన శోధింపబడుటకు, శ్రమపడుటకు, అవమానము పొందుటకు, తీర్పుపొందుటకు వచ్చారు గనుక ఆయన ఏమియు అనలేదు. మన సంగతి కూడా అంతే. శ్రమలు పొందుటకే మనము సంఘములో ఉన్నది. యేసు ప్రభువును పరిశుద్ధ దేశము లోనికి, పరిశుద్ధ పట్టణము లోనికి అనగా యెరూషలేముకు తీసికొని వెళ్లినారు. 'పరిశుద్ధ పట్టణమనే' మాట మత్తయి వ్రాసిన మాట గనుక యేసు ప్రభువును సైతాను పరిశుద్ధ పట్టణమునకు తీసికొని వెళ్లి శోధించెను. అది మరీ గొప్ప శోధన. అరణ్యములో మనుష్యులు లేరు, శుభ్రత లేదు, ఇండ్లు లేవు. ఈ పరిశుద్ధ పట్టణములోనైతే ఇండ్లు, మనుష్యులు, శుభ్రత ఉన్నది. ముందు శోధనలో పరిశుద్ధమైన అడవి అనిలేదు. అది వట్టి అడవే. మార్కు- అది అడవి మృగములతో నిండిన అడవి అనియు, వాటి మధ్య ప్రభువు ఉన్నారనియు వ్రాసెను. ఇప్పుడు మనుష్యులున్న స్ధలములో శోధన. గనుక ఏది ఎక్కువ బాధ చెప్పండి? మనుష్యులు లేని దగ్గర, ఎవరికి తెలియని దగ్గర శోధింపబడుట ఎంతబాధ! అన్నీ ఉన్న పట్టణములో శోధింపబడుట ఎంతబాధ! అన్ని ఉన్న పట్టణములో శోధింపబడుట ఎంతబాధ?


ఈ శోధనలో 2 భాగములున్నవి. ఒకటి దేవాలయములో జరిగే శోధన. అనగా ఆయనను దేవాలయమునకు తీసికొని వెళ్లుట. రెండవది పరిశుద్ధ పట్టణములో జరిగే శోధన. దేవాలయములో జరిగే శోధన, పట్టణములో జరిగే శోధన; ఈ రెంటిలోను ఏదిగొప్పది? ప్రభువుకు కలిగే తలంపు ఏదనగా, ఈ పరిశుద్ద పట్టణములోను నేను కట్టించిన దేవాలయములోను నాకు శోధన వచ్చినదనే చింత రావలసింది గాని రాలేదు. అవి రప్పించుటకే ఆ స్ధలాలకు సాతాను ఆయనను తీసికు వెళ్లినాడు గాని ప్రభువు మనస్సు ఏమియు చెదరలేదు.


వాడు ఆయనను దేవాలయ శిఖరానికి తీసికొని వెళ్లినాడు.


1) పరిశుద్ధ పట్టణము.


2) పరిశుద్ధ దేవాలయము.


3) దేవాలయ శిఖరము.


ఇక్కడికి వాడు ఆయనను తీసికొని వెళ్ళెను. ఒక దానికంటే ఒకటి శోధన ఎక్కువగా యున్నది. అలాగే క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ కుటుంబానికి శోధనలు ఒకదానికంటే ఒకటి ఎక్కువ వచ్చును.


రాజమండ్రిలో ఒకరికి జైలు శిక్ష పడగా, కానిస్టేబుల్ వచ్చి తీసికొనివెళ్తు ఉండగా, ప్రజలు వచ్చి ఆ మనిషిని, ఆ సంకెళ్లను చూస్తూ ఉంటే ఆ నేరస్తునికి ఎంత చింత. ఆ మనిషి క్రిందికే చూస్తూ వెళ్తూ ఉండగా ఒకరు ఇలా అన్నారు: 'ఏమయ్యా నీవు ఏమి నేరము చేసావని తీసికొని వెళ్తున్నారు? దిగాలుగా ఉన్నావు. ఏమి నేరము చేసావని ముఖము వంచావు? ముఖము ఎత్తుకొని పో' అన్నాడట. అలాగే మనము కూడా మా యేసు ప్రభువులోను, మా సంఘములోను ఏమి నేరమున్నదని అనవలెను. యేసుప్రభువు చెప్పినట్టు మా సంఘాన్ని వృద్ధి చేస్తున్నాము. నీకెందుకు అని సైతానుతో అనవలెను. మా ప్రభువును అక్కడకు, ఇక్కడకు, ఆ కొండకు, ఈ కొండకు త్రిప్పుచున్నావు గాని ఆయనలో ఏమియు నేరము లేదు అని అనవలెను.


నేరమున్న వానిని శిక్షంచుట కంటే నేరము లేని వానిని శిక్షించుటవల్ల శిక్షింపబడుచున్న వానికి ఘనత. గనుక యేసు ప్రభువునకు పరిశుద్ధ పట్టణములో, పరిశుద్ధ దేవాలయములో, దేవాలయ శిఖరము మీద సాతాను వలన శోధింపబడుట ఆయనకు ఘనతే. నేరముంటే, అవును నేరము వల్ల శిక్షింపబడినారంటారు. నేరము లేకుండగనే శిక్షింపబడితే ఆయనకు ఘనతే.


పరిశుద్ధ పట్టణమునకు అరణ్యమునుండి తీసికొని వెళ్లుట. ఇది రెండవది. ఇందాకా ఆ నేరస్ధుని జైలుకు తీసికొని వెళ్లుట ఒక శిక్ష. ఇంటివద్దనుండి నడిపించుకొని వెళ్లుట మరొక శిక్ష. దేవాలయము లోనికి తీసికొని వెళ్లుట మూడవ శిక్ష. ఆ దేవాలయము లోనికే యేసుప్రభువు వెళ్లి అనేక సార్లు ప్రసంగించిరి. ఆ దేవాలయములోనే విధవరాలు కానుకను గూర్చి మెచ్చుకొన్నారు. ఆయన ఇదివరకు మసలిన(తిరిగిన) పట్టణానికి, ఇది వరకు ప్రసంగించిన దేవాలయనికి, తీసికొని వెళ్లి శోధించుట ఎంత కష్టము? ఎంత అవమానకరము? పరిశుద్ధ పట్టణము, దేవాలయము, శిఖరము, 'శిఖరమున ఆగు......అని ఆయనను నిలువబెట్టుట, ఆజ్ఞ ఇచ్చి నిలువబెట్టుట మరింత భారము. ఆయన అలాగే నిలువబడెను.


యూదులు పిలాతు దగ్గరకు తీసికొని వెళ్లుచున్నప్పుడును, ఆయన అలాగే నిలువబడిరి. ఏలాగంటే (యాకోబు మేనమామ దగ్గరనుండి పారిపోతూఉంటే) వెనుక మామగారు తరుముతూ రావడము ఒక ముంగుర్తు. ఆ 6 లక్షల మంది సముద్రములో నుండి పరుగెత్తుతూ ఉంటే మామగారు తరిమే దానికి ముంగుర్తు. అలాగే యేసుప్రభువు వారికి కలిగే శోధనలన్నియు ఇకముందుకు జరగబోయే కార్యానికి ముంగుర్తు.


ఈ నలుబది దినములలోను నీకు కలిగే శోధనలన్నిటిలోను ప్రభువువలె జయము పొందుదురు గాక!


కీర్తన: " లేని నేరములు నీ - పైన దుష్టులు వేయగాను క్షమించితివా = నీకు - ఈ నేరములు గూడా - యెంతో భారంబాయె - ఇది రెండవ సిలువాయెనా" ||మూడు||