లెంటులోని మూడవ ఆదివారము
లూకా 23:23
ప్రార్ధన:- ఓ దేవా! మానవుని కటాక్షించినావు. మాకు రావలసిన శిక్ష భరించుటకు నిన్ను నీవు శత్రువులకు అప్పగించుకొన్నావు. నీ కృపకు వందనములు. ఈ ధ్యానము వలన మా ఆత్మకు శాంతి, కృతజ్ఞతా హృదయము దయచేయుము. వర్తమానము దయచేయుము. ఆమేన్.
ప్రసంగము:- మూడు సిలువలు, మరి మూడు సిలువలు నేడు జ్ఞాపకము చేయుచున్నాను. అవే తలంచుకొనండి. క్రీస్తు ప్రభువు కల్వరిమీద సిలువ వేయబడిన తరువాత, కుడివైపున ఒకరు ఎడమవైపున ఒకరు సిలువవేయబడిరి. అవి మూడు సిలువలు. ఆ విధమున మూడు సిలువలు జ్ఞాపకము చేస్తున్నాను. సిలువ అనగా బైబిలు అర్ధము, శ్రమ. శ్రమ అనగా సిలువ. ఈ రండు మాటలకు ఒకే అర్ధము. మనకు చిన్న చిన్న శ్రమలు కలుగును అనగా అవి చిన్న చిన్న సిలువలు. క్రీస్తు ప్రభువుకు గొప్ప శ్రమలు అనగా గొప్ప సిలువలు. క్రీస్తు రాకముందు సిలువంటే భయము, అనగా శ్రమ అనగా భయము. అయితే ప్రభువు వచ్చిన తరువాత భయములేదు. ఎందుకనగా ఆయన భరించెను. అయితే ప్రభువు వచ్చిన తరువాత భయములేదు. ఎందుకనగా ఆయన భరించెను. ప్రభువుకు వచ్చిన శ్రమలు క్రీస్తు ప్రభువు యొక్క మనస్సునకును మరియు శరీరమునకును కలిగినవి.
లోకము చాలా పెద్దది. ఆ లోకములోని అందరియొక్క పాపములు ఆయన మీదనున్నవి. అవన్నీ కలసినా ఎంత పెద్దవగునో మనము ఊహింపలేము, కొలువలేము. అందుకే 'లోక పాపములను మెసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల' అని యోహాను వ్రాసెను. ఈ వాక్యములో లోకమంతటి పాపములు, అన్ని పాపములు కనబడుచున్నవి. వాటన్నిటినీ మోసే గొర్రెపిల్ల కనబడుచున్నది. లోకముయొక్క, లోకములోనున్న జనులందరియొక్క పాపములు మోయుచున్న గొర్రెపిల్ల కనబడుచున్నది. మరియు ఆ గొర్రెపిల్లలో దేవుడు కనబడుచున్నాడు. ఎందుకనగా అది అబ్రాహాము, ఇస్సాకు, యాకొబులయొక్క గొర్రెపిల్లకాదు. అది దేవుని గొర్రెపిల్ల. సర్వలోక పాపభారమే అన్నిటికన్న గొప్ప బరువైన సిలువ. క్రీస్తు ప్రభువు ఒక మనిషియొక్క పాపములు వేసికొనలేదు. అనేకుల పాపములు వేసికొని, కొందరివి మానివేయలేదు. అందరియొక్క పాపములు, అన్ని పాపములు తన మీద వేసికొనెను. అన్ని కాలముల పాపములు వేసికొనెను. కయీను కాలమునుండి ప్రభువు కాలము వరకు ఉండే వారి పాపములు, అక్కడ నుండి రేప్చరువరకు ఉండే వారి పాపములు, అక్కడ నుండి అంత్య తీర్పువరకు పుట్టే వారందరి పాపములు ఆయన వేసికొనెను.
- 1) లోక పాపములు ఒక సిలువ.
- 1. కయీను నుండి క్రీస్తు ప్రభువు సిలువవరకు ఉన్న వారి పాపములు ఒక సిలువ.
- 2. అక్కడనుండి రేప్చర్ వరకు నుండే వారి పాపములు, రెండవ సిలువ.
- 3. అక్కడనుండి తీర్పు వరకునుండే వారియొక్క పాపములు మూడవ సిలువ.
ఈ మూడు సిలువలు నమ్మనివారు ఒక జట్టు. నమ్మినవా రు జట్టు. వీరికి విముక్తి. నమ్మని వారికొరకు కూడ వారి భారము ఆయన మోసెను. గాని వారంగీకరింపలేదు. 'అనేకుల కొరకు చిందించెను' అని వాక్యములో గలదు. ఎవరు ఆ అనేకులు? నమ్మిన అనేకులు, నమ్మనివారనేకులు కలరు అయితే నమ్మని వారు అంగీకరింపలేదు. గనుక అందరికొరకు చిందించెను అని వ్రాయబడినది వారు అందుకొలేదు. అనేకుల కొరకు అనగా నమ్మిన అనేకుల కొరకు అని అర్ధము. కయీను కాలమునుండి ఏలాగు మోసెను? ఆయన వట్టి మనిషి అయిఉండి, సిలువమీద ఉండే మోయలేదు. ఆయన దేవుడు గనుక మోయగలిగినాడు. ఆయన దేవుని గొర్రెపిల్ల గనుక కయీను దగ్గర ఉన్నడు. అప్పటినుండి ఉన్న వారికి విమోచన. లోక పాపములు మోయుట ఆయన కిష్టమయెను. ఉదా: ఒకరు సంతర్పణ చేసినారు. అందరి కొరకు చేసినారు. అయితే, రాని వారికి అందదు గదా! వారు రానందున వారికి సిద్ధము చేయలేదని అనరాదు. వారికిని ఉన్నది గాని వారు రాలేదు. అలాగే క్రీస్తుప్రభువు అందరి కొరకు మోసినాడు. మోసినది బలమైన సింహముకాదు, పెద్ద ఏనుగుకాదు, పెద్ద ఒంటెకాదు, సాధువైన గొర్రెపిల్ల. ఆయన గనుక విసుగుకొనలేదు, మోయననలేదు. సహించినందున క్రీస్తు ప్రభువుకు జయము.
- 2) అంతరంగ సిలువ: క్రీస్తుప్రభువుయొక్క అంతరంగము లేక మనస్సు ఈ సిలువను మోసినది.
అన్న, కయప, సన్హెడ్రిన్, హేరోదు, పిలాతు ఈ కొర్టులలో చేయని నేరముల సిలువ ఈ అంతరంగ సిలువలో ఉన్నాయి. లోక పాపములన్ని వేసికొన్నది మొదటి సిలువ. ఇక్కడ క్రీస్తుప్రభువు నేరముల సిలువ మోసారు. అనగా ఆయనలో నేరములు లేకపోయిననూ, నేరములు చేసినాడని మోపిన నేరాలన్నీ ఆయనకు ఒక సిలువయైయున్నవి. మొదటి సిలువలో లోకస్తుల పాపములన్నీ కయీను వద్దనుండి సజీవుల తీర్పు వరకు ఉన్నవారందరి పాపాలు ఆయన మోసారు. అంత పొడుగైన సిలువ అది. ఇక్కడ ప్రత్యకమైన సిలువ గలదు ఆ సిలువ ఏమి?
- 1. తాను మనిషైనప్పటికిని, దేవుడనని చెప్పుకొనుచున్నాడనిరి. అది ఒక నేరము. ఎవడు దేవుడని చెప్పుకొనునో, వాని చంపవలెనని మోషే ధర్మశాస్త్రము చెప్పుచున్నదనిరి. అది ఒక నేరము.
- 2. యూదుల రాజునని చెప్పుకొనుచున్నాడు. అడిగి చూడండి! అది ఒక నేరము.
- 3. గలిలయ మొదలు యూదయ వరకు చక్రవర్తికి పన్ను ఇవ్వద్దని ప్రజలను రేపుచున్నాడు. ఇది గవర్నమెంటుకు విరోధముగా నేరము.
- (1) దేవుడనని చెప్పుకొనుట, దేవునికి విరోధముగా నేరము.
- (2) సన్హెడ్రిన్ సభకు విరోధముగా రాజునని చెప్పుకొనుట.
- (3) గవర్నమెంటుకు విరోధముగా తిరుగుబాటు నేర్చుట.
ఈ మూడు గొప్ప నేరములు ఆయనమీద మోపినారు. ఆ కాల ప్రజల సిలువలు మూడు, నేరములు మూడు. ఈ నేరములవల్ల మనస్సుకు హాని, చింత, విచారము. ఆయనలో నేరములు లేకపోయినా నేరములు మోపినారు.
ఒకటవ సిలువ దైవత్వముయొక్క సిలువ. అది దేవుని గొర్రెపిల్ల తప్ప మరెవ్వరును మోయలేని సిలువ. ఇంకెవ్వరు మోయలేని పాపము. రెండవ సిలువ ప్రభువుయొక్క మనుష్యావతార సిలువ. క్రీస్తు ప్రభువు అనే మనుష్యునియొక్క సిలువ.ఒకటవ సిలువ దేవత్వముమీదపడిన సిలువ. రెండవది ఆయన మానవత్వము మీద పడిన సిలువ. మనుష్యులందరిమీద మోపవలసిన నేరములు ఆయనమీద నున్నవి. అనేక కోట్ల జనులు చేసిన పాపములు మోపిన ఆయన, ఈ మూడు నేరములు మోయలేడా?
క్రీస్తుప్రభువు సిలువమీద నున్నప్పుడు ఒక బంటు బల్లెముతో పొడిచునప్పుడు నీరు రక్తముకారెనని గలదు. రక్తము కారుట సహజముకాని నీరు కారుట సహజముకాదు. ఆయన శరీరములో నీళ్లెక్కడివి. గురువారము పస్కాలో నీళ్లు త్రాగినాడేమో! తోటలో నీళ్ళులేవు, దారిలోనులేవు. సిలువమీదను నీళ్ళులేవు. గనుక ఈ నీరు మనో విచార జలము.
'అయ్యో! నా గుండె నీరైపోయినది, మనస్సు నీరైపోయినది' అందుము గదా! ఆయనకు విచారము కాదా! లోక పాపములన్నీ మోస్తే, కొందరే అంగీకరించినారు. అందరు అంగీకరించలేదు. విచారముకాదా! లేనిపోని నేరాలన్నీ వేసినారు. విచారముకాదా! ఈ రెండు విచారములవలన ఆయన రక్తము నీరాయెను. అందుచేత నీరుకూడా కారెను.
-
3. కర్ర సిలువ:-
- 1) లోకపాపములు లోకమునకు సంబంధించినవి.
- 2) నేరముల సిలువ, లేనిపోని నేరముల వలన మనస్సునకు కలిగిన సిలువ.
- 3) కర్ర సిలువ ఇది శరీరమునకు సిలువ.
- 1. ఆత్మకు విచారము కలిగించే సిలువ.
- 2. మనస్సుకుబాధ కలిగించే సిలువ. 3. శరీరమునకు బాధ కలిగించే సిలువ.
ఈ మూడు సిలువలు ధ్యానించుచు మీ హృదయములను దుఃఖముతో నింపుకొనవలెనని చెప్పుటలేదు. ఆయన మూడు సిలువలు మోయుట మానవుల కొరకే, దుఃఖపడుటకు కాదు గానీ సంతోషించి స్తుతించుటకే. ఆయన
- 1) మీ వ్యసనములను,
- 2) శిక్షను ,
- 3) వ్యధులను భరించెను.
నేటి ధ్యానమును బట్టి, మూడు సిలువలు మోసిన క్రీస్తుప్రభువు మనలను అట్టి దుఃఖానంద స్ధితిలో స్ధిరపర్చును గాక! ఆమేన్.
కీర్తన: 'మూడు సిలువలు మోసితివా - నాకై మూడు-సిలువలు మోసితివా! = మూడూ సిలువలు మోసి - మూటివలన కలుగు-కీడు సహించితివా! = ఆ-కీడును నీ కాళ్ళక్రింద - వేసి త్రొక్కి - ఓడించి లేచితివా. “ ||మూడు||