లెంటులోని ఇరువది ఎనిమిదవ దినము - శనివారము
కీర్తన:- 23:4
ప్రార్ధన:- మా యేసుప్రభువా! నీవు శ్రమలలో ఆదరణ పొందినావు. నీవు శ్రమలలో పొందిన ఆదరణ మేము గ్రహింపలేక పోయినను, గ్రహింపగలిగినంత మాకు అందించుమని, వేడుకొనుచున్నాము. ఆమేన్.
శ్రమకాల: గత ప్రసంగములో "లోయ" అను పాఠమును చదివితిమి. అందు క్రీస్తు ప్రభువు యొక్క శ్రమానుభవము వివరింపబడెను. ఈ పాఠములో ప్రభువు ఆ గాఢాంధకారపు లోయలో ఎట్టి ఆదరణ పొందినది వివరించుదును. ఇదివరకు వివరించిన శ్రమల లోయలో "ఇదిగో యోరుషలేము వెళ్ళుచున్నాము" (మత్తయి 20:17) అని ప్రభువు ప్రవచించినప్పటినుండి, లోయలో ప్రవేశించి, లోయలో చివరినున్న మరణము సమాధివరకు వివరింపబడెను. లోయ మధ్యభాగములో చిక్కుప్రశ్నలు, దూషణలు, అవమానములు, శ్రమలు కలవు. ఇపుడు ధ్యానించెది శ్రమలు కాదు, అవమానము కాదు, శిక్షావిధి కాదు, సిలువవేత కాదు, అయితే మన ధ్యానాంశము మారేది? ఆయనకు శ్రమలో ఆదరణ, అవమానములో ఆదరణ, శిక్షావిధిలో ఆదరణ గలదు. గనుక మన ధ్యానము ప్రభువు పొందిన ఆదరణ. మన శ్రమలలో కూడ మనకు ఆదరణ కావలెను. అందుచేత ఆయన మనకు ముందుగా తన శ్రమలో ఆదరణ పొందెను. లోయ పొడుగునా, ఎడమ ప్రక్క శ్రమలు, అవమానము, కొట్టుట, దూషించుట, సిలువవేయుట, చంపుట అను చీకటి గలదు. అయితే లోయ కుడిప్రక్కన ఆదరణ, ఆదరణ, ఆదరణ గలదు. మనము లోయలో బడి ఆయనతో వెళ్ళవలెను. శ్రమ అనుభ- వించుటకే కాదు, ఆయన పొందిన ఆదరణ కూడ పొందుటకు మనము వెళ్ళవలెను.
- 1. యూదుల సభలో ప్రధాన యాజకుడు 'ఒక మనుష్యుడు మన జనాంగము కొరకు చనిపోవుట మంచిదే' అని చెప్పెను. ప్రధాన యాజకుడు అట్లనునా? సన్హెడ్రిన్ సభలోనున్న ఆయన, ప్రభువు మీద కుట్రాలోచన చేయు సభలోనున్న ఆయన ఆలాగు అంటాడా? అది దేవుడే అనిపించెను. అదె ప్రభువునకు కలిగిన ఆదరణ. సభలో అందరు నీకు వ్యతిరేకముగా మాట్లడినను, ఒకరు నీ పక్షముగా మంచి మాట మాట్లాడినా నీకు సంతోషము కాదా! ఆలాగే ఆ సభలో అందరు ప్రభువును తిట్టిరి గాని ఆ ప్రధాన యాజకుడు ఈ మంచి మాట అనెను. అందును బట్టి ప్రభువునకు ఆదరణ.
- 2. లోయలో మరికొంత దూరము వెళ్ళగా ప్రభువు యొక్క తీర్పు సమయములో ఒక గొప్ప మాట వినబడినది. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళ వద్దు, ఆయనను గూర్చి కలలో బాధపడితిని,(మత్తయి 27:19) కొర్టులో క్రీస్తు పక్షముగా ఒక ఆదరణమాట వచ్చెను. ఈ మాట అన్యురాలిదగ్గర నుండి వచ్చెను. మొదటి మాట స్వజనుల వద్దనుండి కయప నుండి వచ్చెను. కనుక ప్రభువునకు ఆదరణ.
- 3. ఇంకా కొంత దూరముపోగా శిష్యులెవవ్వరూ లేరు. అందరు పారిపోయిరి. యోహాను ఒక్కడే ప్రభువును వెంబడించెను. శిష్యులందరు ప్రభువునకు ఎడమైరిగాని, యోహాను మాత్రము కనబడుచుండెను. ప్రభువునకు ఎంత సంతోషము! ఏంత ఆదరణ! యోహాను 19:26 అందుచేత "అమ్మా, యిదిగో నీ కుమారుడు" , "ఇదిగో నీ తల్లి" అని ప్రభువు పలికెను. ఈలాగున శ్రమలలోనే ఆదరణ పొందెను. ఆయనతో గేస్తేననే తోటనుండి పంచాయితీ సభకు, అక్కనుండి గవర్నమెంటు కోర్టుకు, కల్వరిగిరి రోడ్డుమీదకు, చివరకు సిలువదగ్గరకు యోహాను వెళ్ళెను. తన శ్రమలో ఆయనకు ఒకప్రక్కన తన నమ్మకమైన శిష్యుడు కనబడెను. ధైర్యముగల పేతురు ఎక్కడ? నేనా నేనా అని చెప్పిన మిగతా శిష్యులు ఎక్కడ? యొహానును చూడగానే ప్రభువునకు ఆదరణ. ఇంటిలో ఎవరైన చనిపోయి దుఃఖములో నున్నపుడు, బంధువులు కనబడినయెడల ఆదరణ కలుగును గదా! అలాగే ఈ యోహాను, తోట దగ్గరనుండి తిన్నగా కల్వరిగివరకు వచ్చెను, నిలబడిచూచుచుండెను. ఏమియు చేయలేడు. అట్టి శిష్యుడు ప్రభువు కంటబడెను గనుక ఆదరణ.
- 4. ఇంకా లోయలోబడి పోగా, గలలియనుండి వచ్చిన స్త్రీలు, ప్రభువును చూచి రొమ్ముకొట్టుకొనుచు ఏడ్చుచున్నారు (లూకా 23:27). వారిని చూచి యేసుప్రభువు ఏమి అనుకొనెను? నా దుఃఖములో వారు పాలు పొందుచున్నారు, నన్ను చూచి జాలిపడు చున్నారు. మిగిలిన వారికైతే జాలిలేదు. ఈలాగు ఆయనకు ఆదరణ కలిగి, అమ్మా నాకొరకు కాదు, మీకొరకు మీ బిడ్డల కొరకు దుఃఖించండి అని చెప్పెను.
- 5. లోయ చివర ప్రభువునకు శత్రువును, గవర్నమెంటు అధికారియు మరియు పటాలపు నాయకుడైన శతాధిపతి పలికినమాట "నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే" (మార్కు 15:39), అన్యులలో ఒకరు అట్లు పలుకుట ఎంత గొప్ప సంగతి! ఇది ఆయనను శిక్షించేవారిలో ఒకరినుండి వచ్చిన మాట. పలాతు భార్య శిక్షించేవారిలో ఒకరు కాదు. గాని ఇతడు క్రీను శిక్షించేవారిలో ఒకడు. ఎంతమార్పు అతనిలో లేనియెడల ఇంత గొప్పమాట అనగలడు!
- 6. కుడివైపుననున్న నేరస్ధుడు ఇంకొకరిని గద్దించి, ప్రభువుతో పలికిన మాటలు (లూకా 23:10) : ప్రభువా! నీవు నీ రాజ్యముతో వచ్చినపుడు నన్ను జ్ఞాపకముచేసికొమ్మని అన్నాడు. ప్రభువునకు ఎంత ఆదరణ! ఒకప్రక్క ఆయనను దూషించుచుండగా ఇతడు ఆయనను భూషించుచున్నాడు. ప్రభువునకు కలిగిన ఆదరణను బట్టి " నీవు నాతో కూడ పరదైసులో నుందువని" చెపీను. సిలువమీద గొప్ప సాక్ష్యము; సిలువమీద గొప్ప వాగ్ధానము; అనగా ఇతడు ఐలువమీద నుండి పలికిన సాక్ష్యము మరియు పటాల నాయకుడు క్రిందుండి పలికిన సాక్ష్యము, ప్రభువునకు గొప్ప ఆదరణ. ఈ లోయ, శ్రమల లోయ అయినప్పటికిని ఆదరణగల లోయ. మన జీవితము శ్రమల లోయ అయినను అందులో ఆదరణ కూడ నుండును. అవమనమున్నను ఆదరణ కూడ ఉండును. వ్యధి ఉన్నను ఆదరణ గలదు. క్రీస్తుప్రభువునకు వ్యధికంటె గొప్ప వ్యాధి ఉన్నది అనగా ఆయన శిరస్సు రక్తమయము, శరీరము రక్తమయము, చేతులు రక్తమయము, పాదములు రక్తమయము, జబ్బులకంటే జబ్బు ఉన్ననూ అట్టి స్ధితిలో కూడ ఆదరణ గలదు. జబ్బు జబ్బుగానే యున్నది గాని ఆదరణ కూడ ఉన్నది. మన విషయములో కూడ అలాగే ఉండును. యేసుప్రభువు శ్రమలు సహించినపుడు దేవుడుగా సహించలేదు, మనిషి వలె శ్రమపడెను, మనిషి వలె సహించెను, మనిషివలె ఆదరణ పొందెను. ఈ లోయలో ప్రభులవు పొందిన ఆదరణ సంగతులు ఇంకను గలవుగాని వివరించుటకు సమయము లేదు గనుక ఉదహరించుచున్నాను.
- 7. పేతురు ప్రభువును ఎరుగనని అబద్ధమాడెను. గాని వెంటనే పశ్చాత్తాపపడెను. ప్రభువునకు ఆదరణ కలిగించు సంగతులలో ఇది ఒకటి లూకా 22:61,62.
- 8. గెస్తేమనేలో ప్రభువు పొందిన ఆదరణ లూకా 22:43. ఇది దూతల వలన కలిగినది ఆదరణ.
- 9. మీలో ఒకడు నన్ను అప్పగించునని ప్రభువు చెప్పగా, శిష్యులు ప్రభువా, నేనా! నేనా! అని అన్నారు మార్కు 14:19. ఇదికూడ ప్రభువునకు ఆదరణ.
- 10. ఇంకా ఏమైన ఒక ఆదరణ ప్రభువునకు కలదా? లేదు గాని ఉన్నది. ఏమిటి?(లూకా 23:46) తండ్రీ, నీచేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నా ఆత్మను చేర్చుకొనుము అని ఆదరణలేనివారు అనగాలరా? దేవా, దేవా! నా చేయి ఏలా విడనాడితివి? అన్న ప్రభువు, 'నా ఆత్మ అందుకొనుము' అని ఆదరణ లేనిదే అనగలడా!
- 11 . క్రైస్తవ జీవతములో ఇది చివర ప్రార్ధన. ఈ ప్రార్ధన తర్వాత ఇంకా చేయవలసిన ప్రార్ధనలు లేవు. లూధరుగారు ప్రతిరాత్రి పరుండబోవునపుడు, చివరిలో ఈ ప్రార్ధన చేయించేవాడు. దాని తర్వాత ఇంక ప్రార్ధన లేదు, పండుకొనుటయే. మనము చివర చేయు ప్రార్ధన ఆయన ప్రతిదినము చేసేవాడు. పరుండిన తర్వాత ఇక లేస్తమో, లేవమో మనకు తెలియదు గనుక ఆ ప్రార్ధన చేయవలెను.
యేసుప్రభువు యొక్క చివరి ప్రార్ధన మనకుకూడ అలవాటగును గాక!
కీర్తన: "ఎవరు నా శత్రువు - నెదిరించి గెల్చిరి - ఎవరు వా శోకంబు - నెగుర గొట్టిరి? = ఎవరు నా హృదయంపు మూర్చను - నీడ్చి సేదదీర్చి మనసు - చివుకు మనుగాయంబు మాన్పిరి! - సిల్వబడ్డ యేసుక్రీస్తే" ||నాకింత||