లెంటులోని మొదటి ఆదివారము
"ఇదిగో మనము యెరుషలేమునకు వెళ్ళుచున్నాము " మార్కు 10:32-34.
ప్రార్ధన:- తండ్రీ, మా నిమిత్తమై వధింపబడిన తండ్రీ, నీకు నమస్కారములు. మా కొరకు వ్రేలాడిన నీ రూపమును చూచి మా పాపపు బ్రతుకు చాలించుకొను కృప దయచేయుము. నేటి దిన సిలువధ్యానమును మా అంతరంగములకు మార్పు కలిగించునట్లుగా చేయుమని యేసునామమున అడుగుచున్నాము. ఆమేన్.
యేసుప్రభువు పలుమారులు యెరూషలేముకు వెళ్ళుచున్నారు. వెళ్లినప్పుడెల్ల ఏదో ఒక గొప్ప కార్యము చేయుచుండెను. యెరూషలేము గొప్ప రాజులు ఏలిన పట్టణము. మన ప్రభువు తెచ్చిన గొప్ప రక్షణ కార్యము అక్కడనే జరిగినది. నజరేతులో నుండి ఏ మంచి రాదన్నారు గాని మన ప్రభువు పుణ్య పురుషుడు గనుక ఆయన అచ్చట్నే పెరిగినాడు. యొర్దాను నదిలో మన ప్రభువు బాప్తిస్మము పొందినారు. యెరూషములో మన ప్రభువు అనేక పుణ్యకార్యములు చేసినారు. మొదటిసారి యెరూషలేమునకు యేసును తీసికొని వెళ్ళినప్పుడు, సుమెయోను మరియమ్మతో చెప్పినది: నీ కడుపులోనుండి ఖడ్గము దూసికొనిపోవును. సుమెయోను యేసుప్రభువుని చూచిన తరువాత తన బ్రతుకు చాలించుకున్నాడు. మనము మన ప్రభువుని మొదటి సారి చూచి, మన పాపపు బ్రతుకు చాలించుకున్నామా? యేసుప్రభువు ఎక్కడుండవలెనో అనగా ఎచ్చట అవసరమో అచ్చటనున్నారు. దేవుని కుమారుడు దేవుని ఆలయములోనే ఉంటాడు. యేసుప్రభువు కొరడాతో దేవాలయములోని వర్తకమంతటిని పారదోలెను. మనము మన బిడ్డలందరిని ఎంత ప్రేమించిననూ, వారిలో తప్పు కనబడగా వారిపైని బెత్తము వాడుదుము. ఈ సిలువ ధ్యాన కాలములో మన పై రూపముకాదు, హృదయమును మార్చుకోవలెను. ప్రభువునందు మనము విశ్వాసముంచుకొన్నటైతే, మనము మన చిక్కులలోనుండి, శ్రమలలోనుండి తిరిగిలేతుము, మహిమను పొందుదుము. ఆయన మహిమ ఎదుట 'ఈ లోకపు బ్రతుకు ఒక నిమిషనుకూడా సరిపోదు' అని భక్తులైన వారు అనిరి. ఈ లోకపు బ్రతుకు నీడవలె గతించిపోవును. గొంగళి పురుగు సీతాకొక చిలుకగా మారుట; గొంగళి పురుగు, మనలోని చెత్త చెదారము అనగా పాత జీవితమునకు అనగా ఇహలోక జీవితముతో సమానము. సీతాకోక చిలుక పరలోక జీవితమునకు అనగా మహిమ జీవతమునకు సాదృశ్యముగా ఉన్నది.
సిలువ వేయబడుట ద్వారా మనకు రక్షణ వచ్చియున్నది. సిలువ అనగా కొరత లేక వధ్య స్ధంభము.
- 1) క్రిస్మసు(క్రీస్తు జన్మదినము),
- 2) మంచి శుక్రవారము (క్రీస్తు చనిపోయు రక్షణ ఇచ్చిన దినము, మంచి దినము, మహాదినము),
- 3) ఈస్టరు (క్రీస్తు మరణము నుండి లేచిన దినము).
- 4) పెంతుకొస్తు(సంఘస్ధాపన దినము - పరిశుద్ధాత్మ
కుమ్మరించబడిన దినము). సిలువ నిమిత్తము అనేకులు సిగ్గుపడుచున్నారు. అయితే సిలువవల్లనే రక్షణ
వచ్చినది. గాన సిలువను గూర్చి సిగ్గుపడకూడదు. సిలువ అనగా కొయ్య. అవిశ్వాసులకు ఇది వెర్రితనము
కనబడును గాని విశ్వాసులకు ఇది తాళము చెవి. మోక్షములో చేరుటకు ఇది తాళము చెవి అని చెప్పవచ్చును.
- 1) దినమును గూర్చిన చేదస్ధము విడచిపెట్టవలెను.
- 2) బైబిలులో లేదనే చేదస్ధము విడచిపెట్టవలెను.
యేసుప్రభువును అంగీకరించినవారు ఆయనను దేవుడన్నారు. యూదులను కుట్రచేసిన సంఘము అనవచ్చును. ఈ దినములలో అనేకులు కుట్రదారులు బైలుదేరిరి. వారి విషయమై క్షమించి, ప్రార్ధనలు చేయవలెను. స్వంత శిష్యుడే ఆయనను అప్పగించినాడు. స్వామి ద్రోహియైనాడు.
ఈనాడు అనేకులు పేరుకు క్రైస్తవులు, చేతిలో బైబిలు గాని క్రియలు సాతాను క్రియలు - వీరే స్వామి ద్రోహులు.
- 1) దేవుడు మనలను జ్ఞానవంతులనుచేస్తే, మనము అజ్ఞానముగా చేస్తున్నాము.
- 2) దేవుడు మనలను పరిశుద్ధులనుగా చేసినాడు, మనము అపరశుద్ధత చేస్తున్నాము.
- 3) దేవుడు శక్తిమంతులను చేస్తే, మనము నిస్సత్తువ కలిగించుచున్నాము.
- 4) దేవుడు మనలను స్వతంత్రులనుగా చేసినాడు, మనము బానిసలవుతున్నాము.
- 5) దేవుడు మనకు క్రీస్తు సిలువమీద చనిపోవుట ద్వారా రక్షణ ఇచ్చియున్నాడు. ఈ మంచి శుక్రవారము మన బ్రతుకులో చాలా సంతోషించుచుండవలెను. 'నాకు విమోచనము దొరికింది' అని ఆనందించవలెను. క్రొవ్విన దూడలు గంతులువేసినట్లు స్త్రోత్రములు చేయవలెను.
అట్లే సిలువ విమోచన అందుకొని ఆయనను స్తుతించు ధన్యత ప్రభువు మీకు దయచేయును గాక. ఆమేన్.
కీర్తన: " నా ఋణము తీర్చిన - నా దేవా! నా ప్రభువువా! - నీ ఋణము తీర్చ గలనా = నీవు - నా ఋషివై బోధించి - నా బదులు చనిపోయి - నావని మరువ గలనా" ||మూడు||