లెంటులోని ఇరువది ఏడవ దినము - శుక్రవారము

కీర్తన:- 23:4

"గాఢాందకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను"


ప్రార్ధన:- తండ్రీ! నీ శ్రమలు అంధకారపు లోయవంటివైనను, నీవు ఒక్కడవే ఒంటరిగా అన్నిటినీ నాకొరకు సహించి, భరించి, జయించినావు గనుక నీకు వందనములు. నీ శ్రమలు అధికమైన కొలది, నీ ఓర్పు సహనము మరింతగా అధికమైనవి. గనుక నీ శ్రమానుభవములోనుండి నేటిదినమున వర్తమానము దయచేయుమని యేసునామమున అడుగుచున్నాము. ఆమేన్.


ప్రభువు శ్రమలను ధ్యానించు కాలములో ఉన్న సిలువ ధ్యానపరులారా! వినండి. ఆయన సిలువ తట్టు చూచుచున్న ప్రొద్దు తిరుగుడు పువ్వు, సూర్యుడు కనిపించు వైపునకే తిరుగుచుండును. కుండకు చిన్న రంధ్రము చేసి, చిన్న మొక్కమీద బోర్లించి అప్పుడప్పుడు త్రిప్పుచున్న యెడల, మొక్క శిఖరము కూడ ఆ రధ్రము వైపే తిరుగుచుండును. దానిలో నుండియే కదా సూర్యరశ్మి కనబడును. అట్లే క్రిస్మస్సు కాలమందు తొట్టెలోని శిశువు తట్టును, ఎపిఫనియా కాలమందు జ్ఞానులారాధించిన శిశువు తట్టును, లెంటుకాలమందు శ్రమపడుతున్న ప్రభువు తట్టును, మంచి శుక్రవారమునాడు మరణమొందుచున్న ప్రభువుతట్టును, ఈస్టరునాడు పునరుత్ధానుడైన ప్రభువు తట్టును, ఆరోహణ దినమున పైకి వెళ్ళుచున్న ప్రభువు తట్టును, పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్మను పంపనైయున్న ప్రభువు తట్టును, త్రిత్వకాలమందు మాదిరి చరిత్ర నడిపిన ప్రభువు తట్టును అడ్వంటు కాలమున రెండవసారి రానైయున్న ప్రభువు తట్టును, సంఘము తన ముఖము త్రిప్పుకొని, నీతి సూర్యునియందానందించుచు వందనములర్పించును.ఇది క్రైస్తవ పెద్దలలో కొందరి ఏర్పాటై యున్నది.


ప్రభువు జీవితకాలమంతటిని చీకటిగల ఒక లోయకు పోల్చుచున్నాము. శ్రమకాలచరిత్ర గాఢాంధకారమైన లోయవంటిది, అమావాస్య చీకటికాలము వంటిది. గాఢాంధకారమైన లోయలో నడుచుచున్నాను అను తలంపు దావీదునకు కలిగెను. అది ఆయన అనుభవము. దావీదు కుమారుడయిన క్రీస్తు ప్రభువు యొక్క అనుభవము కూడ అట్టుదే. ఆ లోయ గాఢాంధకారమైన లోయ, ఆ లోయ సంచారపు లోయ, ఆ లోయ అపాయకరమైన లోయ. అయినను దైవజనుడు భయపడని లోయ. ఆలాగే మన ప్రభువు తన జీవితకాలమంతయు శ్రమలు అనుభవించినను భయపడలేదు. నిజ క్రైస్తవులకు శ్రమలు వచ్చినను భయపడరాదు. ప్రభువు శ్రమలు తలంచుకొన్న దైవజ్ఞుడు, నా శ్రమలు ఆయన శ్రమల ఎదూట ఏమూల అని అనుకొనును.


ప్రభువుయొక్క గాఢాంధకారపు లోయలో ఆయనను భయపెట్టునవి.


ఒక మర్మమేదనగా చావును తన చావుచేత చంపివేసెను. ఆయన పునరుత్ధానములో మరణమును జయించినట్టు కనబడుచున్నది. మరణము ఓడిపోయినది. ఆ గాఢాంధకారపు లోయ ఇంతటితో అంతమాయెను. సిలువ-నీలో నిలువ-ఉన్నయెడల నీకు విలువ-కష్టాలలో చలువ. పైన వ్రాసిన బైబిలు వాక్యములో మరికొన్ని మాటలున్నవి. అవేవనగా "నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును". ఈ వచనములో కవి పొందిన ఆదరణ గలదు. దుడ్డుకర్ర, దండము అను ఈ రెండు పనిముట్లవలను రెండువిధములైన ఉపకారములు కలుగును. ఒకటి కష్టాలలో నశింపకుండ లాగునట్టి సాధనము, మరొకటి తిన్నగా నడిపించునట్టి సాధనము. "నేను బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును" అను శుభవాక్యము ఈ కీర్తన చివర కనబడుచున్నది. ముగింపులో ఒకటి వినండి:


ఆయన తన శ్రమలను గురించి ప్రవచించినపుడు ఆయన యెదుటనున్నది లోయ;


దగ్గర దగ్గరకు సాగివచ్చినది సిలువ చాయ;


చిక్కు ప్రశ్నలు వేసిన వారియత్నము మాయ;


ఈతగాడు నీళ్ళను పాయచేసికొనుచు అద్దరికి చేరును. అట్లే క్రీస్తు శ్రమల లోయలోబడి ఎదురు వచ్చిన శ్రమలను ఒత్తిగించుకొంచు అద్దరికి వెళ్ళగలిగెను. ఇది ఆయన చేసికొన్న పాయ;


ఈ శ్రమలు మీ శ్రమలను శ్రమింపజేయును గాక.


కీర్తన: "కష్టంబులను చీ-కటి లోయలో ఇక = స్పష్టముగ సౌఖ్యమును నా-దృష్టికిన్ జూపి - నా - నష్టముల్ దీర్చున్ గనుక ||నాకేమి||