లెంటులోని ఇరువది మూడవ దినము - సోమవారము
హెబ్రీ 6:4
ప్రార్ధన:- తండ్రీ! నేడు మాలో అనేకులు నిజమైన పశ్చాత్తాపము లేనివారై ఉన్నారు. హృదయ పరితాపముతో నూతనపర్చబడుటకు నీ శ్రమల ధ్యానములే ఆధారము. గనుక హృదయమును కఠినపర్చుకొనే దుస్ధితి నుండి ఇక్కడ వారిని తప్పించి, నీ తట్టుచూచి మారుమనస్సు పొంది, నిన్ను మరల సిలువవేయని ధన్యత కల్గించుమని యేసునామమున అడుగుచున్నాము. అమేన్.
సిలువ ధ్యాన కూటస్తులారా! ఈ పాఠము ఇది వరకు వివరించినాను కాని ముగించలేదు. ఇంకను అందు కొన్నిమాటలున్నవి. మొదటిది ఏమనగా 'మరల', రెండవది ఏమనగా 'సిలువవేయుచు', మూడవది ఏమనగా 'మారుమనస్సు', నాలుగవది ఏమనగా 'నూతన పరచబడుట'. ఇవన్నీ ఈ వేళ చెప్పను. ఈ నాలుగు నేను ముగించేవరకు సిలువను మీ కండ్ల ఎదుట ఉంచవలెను. ఆయనను మరల సిలువ వేసినారు. అది మొదటి మరల. నాల్గవ మాట దగ్గర నూతన పరచుట అనేమాట దగ్గర మరలా అనే మాట రెండవసారి ఉన్నది. మొదటగా, యేసుప్రభువును మరల సిలువవేసినారు. కాబట్టి మరల నూతన పరచుట అసాధ్యము, అని వ్రాయబడినది. మొదటి వరుసలో మరల అని చెప్పాను. మూడవ వరుసలో మారుమనస్సని చెప్పాను. ఈ మారుమనస్సుకు మరియొక పేరు 'పశ్చాత్తాపము' అని ఉన్నది. మారుమనస్సు కొంతమందికి లేదు. ఇప్పుడు మారుమనస్సు అనగా ఏమిటో, నూతనపరచబడుట అనగా ఏమిటో మనము తెలిసికొనవలయును (అనగా ఆలోచించవలయును).
ఈ శ్రమ కాలములో పెద్దలైనవారు మారుమనస్సు, పశ్చాత్తాపము అను వాటిని ఏర్పచినారు. ఎందుకంటే, యూదులైన వారు ఆయనను రెండువేల సం||ల క్రిందట మొదటి సారి సిలువ వేయడము గొప్ప అన్యాయమని. తెలిసిననూ రెండవసారి మనము సిలువవేయుట మరింత గొప్ప అన్యాయము. ఇప్పుడు మారుమనస్సు లేని స్ధితి ఏమిటో, మనము తెలిసికొనవలెను. మారుమనస్సు లేని స్ధితి ఈ వరండా మీద కూర్చున్న వారిలో ఎవరిలోనైనా ఉన్నదేమో ఎవరి మట్టుకు వారే పరీక్షించుకొనండి. మారుమనస్సు లేని వారి స్ధితి ఏమిటనగా తనలో పాపమున్నదని తెలిసికొనలేకపోవుటయే. మొదటిది తమ తప్పు కాదు. అయితే మాలో పాపములేదు, మాలో పొరబాట్లు లేవని ఎవరనుకొంటారో, తమయొక్క పాప స్ధితి ఎవరు తెలిసికొనలేరో, వారికే మారుమనస్సు లేని దుస్ధితి ఉన్నది. ఈ దుస్ధితి వలన యేసుప్రభువును వారు మరల రెండవసారి సిలువ వేస్తున్నారు. నాలో తప్పులేదు, నన్ను కాపాడు అని చెప్పుటే మారుమనస్సు లేకపోవుట. పాపమున్నప్పటికిని, దుస్ధితి ఉన్నప్పటికిని నాలో పాపము లేదనుకోవడమే దుస్ధితి. ఎవరైనా మాలో తప్పులు ఉన్నవి అనుకొంటే వాటిని ఇప్పుడు దిద్దుకోవలెను. ఆదివారమునాడు పాపపు ఒప్పుదలలో పాపములేదని చెప్పుకొనిన యెడల మనలను మనమే మోసపుచ్చుకొను చున్నామని ఉన్నదా? లేదా? అదే ఇది. అనగా మారుమనస్సులేని అంశములో మొదటిస్ధితి. రెండవ అంశము ఏమంటే, వారిలో తప్పు ఉన్నప్పటికిని వారికి విచారముఏ లేదు. ఆ విచారము లేకపోవుటే మిక్కిలి భయంకరమైన దుస్ధితి. ఇన్ని యప్పులు, ఇన్ని పొరబాట్లు, ఇన్ని లోట్లు పెట్టుకొని, మాలో ఏమిలేదని ఏ విచారము అనుకొనుచూ, తమను గురించే లేకపోవుట మరింత భయంకరము. అయ్యో! నేను ఎరుగక పోయి తప్పుచేసినాననే విచారము లేకపోవుట, మరింత భయంకరమైన దుస్ధితి. ఈ విచారమే లేకపోతే అది మిక్కిలి దుస్ధితి ఈ వరండామీద గత్తరవుంటే నీళ్లు పోసికొట్టివేస్తే, గత్తరంతా పోయినట్లుగా పాపములను గురించి విచారపడితే, కనీటి ధారల వలన మొదటి పాపము కొట్టుకొని పోయింది. ఇప్పుడు, ఆలాగు కొట్టుకొని పోవు కన్నీరుగాని, చింతగాని, బోధగాని లేదు. అందుచేత ప్రభువునకు మరియొక బళ్లెపుపోటు.
అయ్యగారు ఏడిద అనే గ్రామములో ఉన్న గుడిలో ఒకరాత్రి మీటింగు చేస్తున్నపుడు, అందులో ఉన్న 70 మంది ఘోల్లున ఏడ్చినారు. దూరాన, రోడ్డుమీదనున్న ముసలమ్మ గుడిలో ఎవరో చచ్చిపోయినారు కాబోలు, పాపము! అందుచేతనే వారు ఏడుస్తున్నారు అని గుడి దగ్గరకు వచ్చింది, చూచింది. అందరూ మోకాళ్లమీదనే యున్నారు. ఈ ముసలమ్మ కూడా మోకాళ్లూనింది. అందరితో పాటు తను కూడా ఏడ్చింది. తక్కిన వారందరికి నిజమైన దుఃఖము వచ్చింది. అందరు ఏడ్చారు గాని ఒకమ్మాయి మాత్రము ఏడ్వలేదు. ఆ అమ్మయి మీటింగు అంతా అయిపోయిన తరువాత అయ్యగారియొద్దకు వచ్చి అందరు ఇంతగా ఏడ్చినారు గాని నాకసలు ఏడ్పే రాలేదు అన్నదట. అది రాత్రి ఒంటి గంట సమయము. నాకు ఏడ్పు రాకపోతే నేనేమి చేసేది అన్నదట.
కాబట్టి ఎన్ని తప్పులున్నా, ఎన్ని పొరబాట్లున్నా వాటి నిమిత్తము విచారణగాని, కన్నీళ్లుగాని, పశ్చాత్తాపముగాని లేని క్రైస్తవులు ఇప్పుడున్నారు. అట్టివారు ప్రభువుకు బళ్లెపు పోటుపొడిచిన వారితో సమానము. ఇక్కడ ఈ లోపములు కలిగినవారు పశ్చాతాపపడి ఏడువకపోతే, పలోకమునందున్న ప్రభువు వారిని గురుంచి ఏడుస్తున్నారు. పాతనిబంధన కాలములో ఇట్టివారున్నారు. ఇప్పుడును ఇట్టివారున్నారు.
- 1) పాపమున్నదని తెలిసికూడ లేదనుకోవడము.
- 2) 'దానికే ఏడ్వనా!' అని మొండికెత్తి ఊరుకోవడము,
- 3) తనలో తప్పున్నదని ఒప్పుకోక పోవడము. ఆ దుస్ధితి ఏమనగా, తెలుగు సామెతె ఒకటి ఈలాగు ఉన్నది: "చేసిన పాపము చెప్పితే మాసిపోతుంది". రాతిగుండె గల వారికి ఆ లోక సామెతకూడ తెలుసు, నాది తప్పు అని తెలుసు, దుఃఖపడాలి అనికూడా తెలుసు. అయితే వారు ఒప్పుకోక పోవడమే కాక, అడిగితే అబద్ధమడుదురు. అది మరియొక దుస్ధితి. ఒప్పుకొనక పోవడము ఒకటి, అబద్దమాడుట మరుయొకటి. ఈ రెండును ఒకటే.
- 4) ఇంతవరకు తెలిసో తెలియకనో తప్పుచేసెను. 'ఇకమీదట నేను వాటిని చేయను' అని ప్రమాణము చేయాలి అయితే (మనిషి) చెయ్యడు. ఎందుకు చేస్తాడు? ఈ పై మూడింటిలో పెద్ద మనిషిగా ఉంటే, నాలుగవ దానిలోకూడా పెద్ద మనుషిగానే యుండును. ప్రమాణము చేయడు గనుక ఆ ప్రమాణము చేయక పోవడము ప్రభువుకు మరియొక బళ్లెపు పోటు.
- 5) మాలో ఏ తప్పులేదనుకొని మరల తప్పులేదనుకొని మరల ఆ తప్పే చేస్తున్నారు. ఇక్కడున్నట్టే అక్కడను మనిషి అంటాడు గనుక చేసిందే చేయడము, పైన వివరించిన తప్పులున్నను లేదనుకోవడమువలన, ఆ మొదటిదే ఇక్కడికి అవతారమెత్తి వస్తుంది. మొదటి నాలిగింటికంటే ఈ ఐవది ఇంకా ఎక్కువ దుస్ధితి. అప్పుడు కూడ ప్రభువుకు మరల మగియొక బళ్లెపు పోటు. అది మరలా సిలువ వేయుటయే.
-
6) ఎన్ని తప్పులున్నా మొదటి అంశములో తప్పులేని అనుకోవడముకాక, క్రొత్త తప్పు ఇంకొకటి ఉన్నది. అదేదనగా, ఆ తప్పు చెప్పడు. ఉన్నదని చెప్పడు. లేదని చెప్పడు, బహుబింకముగా తప్పులేనట్లే అందరకు కనబడతాడు. తప్పున్నదనీ చెప్పడు, లేదని చెప్పడు. ఇతరులకు ఏ తప్పు లేని వానివలె అగుపడతాడు. అట్టివారు ఈ లోకములో ఉన్నారు.
ఉదా: ట్రైన్ వచ్చింది, బండినుండి ప్రయాణీకులు దిగుతున్నారు. టీ.సి. గార్కి ప్రయాణికులంతా టిక్కెట్లు ఇచ్చి వేస్తున్నారు. దొంగలను పట్టుకొనుటలో ప్రసిద్దికెక్కిన ఒక జవాను అక్కడనే నిలబడి, ప్రతియొక్కరి ముఖము చూచుచున్నాడు. అందరి కళ్లు ఆయననే చూస్తున్నాయి. ఒక పెద్ద మనిషి మంచి బట్టలు వేసికొన్నాడు, బయటకు వస్తున్నాడు. అప్పుడు ఆ పోలీసు జవానుగారు ఆ పెద్ద మనిషి యొద్దకు వచ్చి 'మీది ఏ ఊరు' అని అన్నారు. ఏదో ఒక ఊరు పేరు చెప్పాడు. అయితే నిలబడు! అన్నారు. అతడే దొంగ అని తోచింది గనుక అతన్ని పట్టుకొని అడిగాడు. అప్పుడు ఆ దొంగ నేనెందుకు నిలబడాలి? అన్నాడు. అప్పుడు ఆ జవాను 'నీవు దొంగవు కాకపోతే వెళ్లిపోవుదువుగాని లేదా స్టేషనులో ఏదొయొక సమాధానము చెప్పుదువు గాని' అన్నాడు. ఈలాగు అతని రికార్డు వెతకగా అతడే దొంగని ఋజువైనది. అదే మారుమనస్సు లేని దుస్ధితి. అది ప్రభువుకు ఒకపోటు.
-
7) ఇది అన్నింటికంటే చెడుగు. అది దేవునిమీది మంచి అభిప్రాయము, చాలా గొప్ప గౌరవము. ఇక్కడ మనిషి ఏమనుకుంటున్నాడంటే దేవుడు గొప్పవాడు, ప్రేమగలవాడు, ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు, నేనడిగినా అడుగకపోయినా క్షమిస్తాడు, నేనేదైనా తప్పుచేస్తే నా తల్లిదండ్రులు పట్టీపట్టనట్లు ఊరుకుంటారు, క్షమిస్తారు. దేవుడు అంతకంటే దయగలవాడు అని అనుకొని తమ ఇష్టము వచ్చినట్లు ప్రవర్తిస్తారు. అదే మారు మనస్సులేని దుస్ధితి.
చాలమంది దీనివలననే చెడిపోవుచున్నారు. కాబట్టి, ఇక్కడున్నా మనందరము ఈ ఏడు అంశములలో ఏదీ లేకుండా చేసుకొంటే, మారుమనస్సు ఉండును. అవి ఇండేటట్లు చేసుకొంటే మారుమనస్సు ఉండదు. ఇప్పుడు ఏడు అంశములు చెప్పాను. అవతల మరియొక ఏడు అంశములున్నవి. అందులో మొదటి వాటికి వ్యతిరేక గుణములున్నవి. ఒకదాని ప్రక్కన ఒకటి. రెండవదాని ప్రక్కన రెండవది, అలాగే ఏడు అంశములు ఏడు ఉన్నవి. కానీ, అవి మంచివి. గనుకనే అవి మొదటి వాటికి వ్యతిరేక గుణములుగా ఉన్నవి. మొదటివాడు పాపముచేసి చేయలేదు అంటున్నాడు. అయితే, రెండవవాడు నేను పాపము చేసాను అని తెలుసుకొంటున్నాడు. ఈ మొదటి అంశము మనిషి ఎప్పుడైతే తెలుసుకుంటాడో, ఇక మిగతా విషయములు దిద్దుకుంటాడు. అవతల ప్రక్కనున్న ఏడుగురు మారుమనస్సు గలవారు. మొదటి వరుసలో ఉన్నవారు మారుమనస్సు లేనివారు.
- 1) ఈ ఏడు రకములవారు తెలియనివారు కాదు. తెలిసియు ఒకప్పుడు మంచి పేరు పొందినవారే. అటువంటి వారిని గురించియే ఈ వాక్యము వ్రాయించినారు.
- 2) ఆ కాలములోనే అట్టివారుంటే, మన కాలములో అట్టువారికి కరువు రాదు. ఏక్కువ చౌక. ఎందుకంటే జనసంఖ్య ఎక్కువైనది.
ఈ కాలములో వింత లేదు. గనుక మనము ఈ లోకుల జనసంఘము మధ్యను విశ్వాసజనసంఘముగా నున్నాము. అనగా క్రీస్తుజనసంఘముగా ఉన్నాము. దైవవాక్యమును ఎరిగిన జనసంఘముగా ఉన్నాము. కాబట్టి ఈ రెండవ గుంపు వరుసలోనుండి ఆ మొదటి ఏడుగురి వరుసలోనికి మనము జారి రాకూడదు. కానీ, ఈ మొదటి ఏడుగురికి ఒక ప్రశ్న. ఆ శక్తి ఏమనగా, ఆ రెండవ వరుసలోనున్న ఆ ఏడుగురురిని ఆకర్షంచుకొనే శక్తి ఉన్నది. గనుక మనము జాగ్రత్తగానుండే నిమిత్తమై పౌలు గారు ఈ మాటలు వ్రాసారు. రెండవసారి 'మరలా మరలా' అంటే అర్ధమేమిటంటే; ఒకప్పుడు బాగా ఉన్నారు, అయితే, ఇపుడు పడిపోయారు. అందుచేత మరల సిలువ వేసినారు అని వ్రాసినారు. 'మరల, అనుమాటకు అది అర్ధము. ఈ రెండవ వరుసలోనున్నవారు ఆ మొదటి వరుసలోనికి జారివస్తే, వీరిని మరల ఆ మొదటి వరుసలోనికి మార్చుట కష్టమని పౌలుగారు వ్రాసినారు. కాని చాలామంది వారి వరుసలు మార్చుకుంటున్నారు. మొదటినుండి రెండవదానికి మారుట ఆరంభములో కుదురును గాని, ముదిరిన తర్వాతకాదు. పౌలు ఇందులోనుంచి అందులోనికి వెళ్లిపోయిన వారిని గురించి చెప్పుటలేదుగాని, మొదటి వరుసలోనే ఉండి
- 1) మనస్సాక్షి ఎంత చెప్పినా వినకుండా,
- 2) మనస్సాక్షి ఎంత గద్దించిన వినకుండా,
- 3) దేవుని గ్రంధము ఎంతగా గద్దించిననూ వినకుండా,
- 4) తన జ్ఞానము ఏంతగా గద్దించినా వినకుండా,
- 5) నలుగురు భోధకులు ఆదివార ప్రసంగములలోను ఎంతగా భోధుంచి, గద్దించినప్పటికినీ విననివారు మారుమనస్సు లేనివారు.
ఇది మీ ఉపయోగము నిమిత్తమై దేవుడు దీవించును గాక! ఆమేన్.
కీర్తన: "నిన్ను మరల సిలువ వేసి - యున్న పాప జీవినయ్యో! = నన్ను క్షియించుమని - యన్న నరులు మారు వారు" ||ఏకాంత స్ధలము||