లెంటులోని పదునెనిమిదవ దినము - మంగళవారము
రోమా 8:3,4
ప్రార్ధన:- తండ్రీ! మా పాపమునుబట్టి మేము శిక్షకు పాత్రులమైయుండగా మాకు బదులుగా నీవే ఆ శిక్షనంతటిని నీపై వేసికొని మాకు శిక్షలేకుండా చేసినందుకు వందనములు. మేము చేయలేనివన్నీ మా పక్షమున చేసిన తండ్రీ నీకు నమస్కారములు. మా బదిలీయైన నీవే నేడు మాకు వర్తమానమిమ్మని యేసు నామమున వందించు చున్నాము. ఆమేన్.
ఈ పాఠములో పాపమునకు విధింపబడిన శిక్షనుగూర్చి చెప్పుచున్నాను. ఇది ప్రభువునకు విధింపబడిన శిక్ష. రోమా 8వ అధ్యాయములో ప్రభువు శరీరమందు పాపమునకు శిక్ష అని వ్రాయబడియున్నది. ఇది పాపమును గురించి శిక్ష. ఆదాము, హవ్వలయొక్క శరీరములో పాపము ప్రవేశించినది. కాబట్టి మానవ శరీరములో పాపమున రాజ్యము ఏర్పడినది. శరీరము ఓడిపోయినది, పాపమే గెల్చినది. క్రీస్తు చరిత్రలో కధ తిరగబడినది. ఎట్లనగా పాపము ప్రభువు యొక్క శరీరములో ప్రవెశింపలేకపోయినది. ఆయన శరీరము పాపములేని మానవ శరీరము గనుక పాపము వెలుపట ఉండి పోయినది. ఇదే పాపమునకు శిక్ష. కాగడా చుట్టూ దోమలు తిరుగవచ్చును గాని కాగడా లోపలకు వెళ్లలేవు. అట్లే ఏ పాపమైనా, శోధయైనా, ఏ దయ్యమైనా, సాతానైనా ప్రభువును సమీపింపవచ్చు, శోధింపవచ్చు గాని ప్రభువు లోనికి వెళ్లలేవు. అయితే ఆయన వాటన్నిటి నిమిత్తము శిక్ష పొందితేనే గాని జయము పొందవీలులేదు. అరణ్యములో సైతాను వచ్చేస్ధలమునకు ప్రభువు వెళ్లుట, అతని పని పట్టుటకే గాని అతనివల్ల జయింపబడుటకు కాదు.
గెరాసేనీయుల స్మశాన భూమికి ప్రభువు వెళ్లుట సైతానుయొక్క పటాలమును వెళ్లగొట్టుటకే, జయించుటకే గాని ఓడిపోవుటకు కాదు. ఆదాముయొద్దకు సర్పమును దేవుడు వెళ్లనిచ్చుట ఓడింపజేయుటకే గాని ఆదాము ఓడిపోయెను. తానే గెలిచిన యెడల గొప్ప పరాభవము, శిక్ష కలిగియుండును. అది ప్రభువు యొక్క శ్రీరమునందు జరిగినది. మొదటి ఆదామువద్ద జరగలేదు గాని రెండవ ఆదామైన క్రీస్తునొద్ద జరిగెను. ఆదాము హవ్వలను పాపములో పడవేసినట్టు, క్రీస్తు ప్రభువునుకూడా పడవేయవలెనని సాతాను అనేకమార్లు ప్రయత్నించెను. ప్రతి ప్రయత్నములో పరాభవము, అపజయము అతనికి కలిగెను. సాతానులోనుండి పాపము వచ్చెను. పాపములోనుండి మానవులకు అనగా పాపమునకు లోబడినవారికి శిక్ష అను పాప ఫలితము వచ్చెను. ప్రభువునకు జన్మములో పాపములేదు, క్రియలో పాపములేదు. కాబట్టి పాపమునకు రావలసిన శిక్ష ఆయనకు రాకూడదు గానీ, ఆయన బదులుగా వచ్చినందున అనుభవించెను.
ఉదా:- ఒక పంతులుగారు వెళ్లగా ఇంకొకరు వచ్చును. ఈ బదిలీ పంతులుగారు మొదటి పంతులుగారు చేసిన పనులు అన్నీ చేయవలెను. అలాగే మనము పాపము చేయగా పాపములేని ఆయన మన శిక్ష అనుభవించెను. ఆయన అక్రమకారులలో ఒకడాయెను. ఒక ఉపాధ్యాయుడు ఒక నెల సెలవుమీద వెళ్లినప్పుడు, ఆయనకు బదిలీ ఉపాధ్యాయుడు ఆ పంతులు గారి పనులన్నీ చేయవలెను! చేసినంత మాత్రమున ఆయన అసలు పంతులు కాగలడా! కాలేడు. అట్లే పాపాత్ములమైన మనకు బదిలీ ప్రభువైయునాడు. కాబట్టి నేను చేయలేనివన్నీ ఆయనే చేసెను. ఆయన మనకు బదులుగా శిక్ష అనుభవించెను. పాప ఫలితము అనుభవించెను. అంత మాత్రమున ఆయన పాపికాడు. ఆ పాపము చేసినవాడు శిక్షార్హుడు గాని, పాపము మోసిన వాడు శిక్షార్హుడు కాడు. మన శిక్ష వహించినవాడుగా, అక్రమకారులలో ఆయన మనకు ఒకడుగా ఎంచబడెను. యెషయా 53:12; లూకా 22:37. పంతులుగారి బదిలీకంటే, మన కొరకు చేయవలసిననది ఎక్కువ గనుక అన్నిటినీ ఆయన చేయువాడైయున్నాడు. లూకా 10:35. కీర్తన:'నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు'.
నీ పాదములు నేను కడిగితేనే గాని నాతో నీకు పాలులేవని(పవిత్రుడవు కావని) ప్రభువు పేతురుతో చెప్పలేదా! (పేతురు కాళ్ళే కడుగుకొనలేడా?) కడుగుకొనలేడు. ఎట్లు కడుగుకొలేడనగా తన కాలికి అంటిన బురద పోవునట్లు కడుగుకొనగలడు గాని ప్రభువు యొక్క భగ్యములో పాలు దొరికేటంతగా కడుగుకొనలేడు. ప్రభువు కడిగితే ఆయన ఆస్తిలో పాలుపొంపులు దొరకగలవు. మనము ప్రతిరోజు కాళ్లు కడుగుకొను చున్నాము. అంత మాత్రమున పరమ భాగ్యవంతులము కానేరము. అట్టి వారమగుటకు మనము చేయలేని పనియగు 'కడుగుటను' ప్రభువే చేయవలెను. మనమైతే బాప్తిస్మ బలము కలిగియుండలేము. మనమైతే రొట్టె తినగలము గాని ద్రాక్షారసము త్రాగగలముకాని ప్రభువుయొక్క శరీరమును కలిగియుండలేము. గనుక మనము చేయలేని అనేక కార్యాలు ప్రభువు చేయుటకై, ఆయన నరావతారియైనాడు. ఆయన ఇంకా ఏమి చేయుచున్నాడు? మన కొరకు సిద్ధపర్చుటకై వెళ్లుచున్నానని ప్రభువు చెప్పలేదా! యోహాను 14:3. మనమీద నున్న శిక్షను పరిహరించుటకు, మనకు రావలసిన సంపద గడించిపెట్టుటకు; ఈ రెండు పనులు చేయుట వల్ల ప్రభువు మన నమ్మకమైన బదిలీయైయున్నాడు.
శిక్షలు:-
- 1) శిక్షలు ఏవనగా వ్యాధి, కరువు, అనుకొని ఆపద మొదలైనవి తాత్కాలిక శిక్షలు అనగా మరణ సమయము వరకు కలిగే శిక్షలు.
- 2) మరణము మరియొక శిక్ష.
- 3) పాతాళము మయొక శిక్ష.
- 4) నరకము అనగా రెండవ మరణము. ఇది అంత్య శిక్ష.
- 1) పాపమును విసర్జించే మారుమనస్సు,
- 2) ప్రభువును అనుసరించే స్వభావము,
- 3)ఆత్మీయ జీవనముయొక్క అభివృద్ది విషయములో కలిగే అనుభవము.
- 1) జన్మము మొదలుకొని 12 ఏండ్ల వయసు వరకు
- 2) అక్కడనుండి 20 ఏండ్ల గృహ నివాసము వరకు,
- 3) అక్కడనుండి సిలువ వేత వరకు. ఇవి ఆయన సేవ కాలములు.
అటువంటి క్రీస్తు శరీర స్వభావమును మీరును ధరించుకొందురు గాక. ఆమేన్.
కీర్తన:- "నా ఋణము తీర్చిన - నా దేవా! నా ప్రభువా! - నీ ఋణము తీర్చగలనా! = నీవు - నా ఋషివై బోధించి - నా బదులు చనిపోయి - నావని మరువాగలనా" ||మూడు||