లెంటులోని ఎనిమిదవ దినము - గురువారము
లూకా 18:32
ప్రార్ధన:- యేసుప్రభువువా! నీ మరణ చరిత్ర, నీ ఉద్యోగ చరిత్ర మా కన్నుల ఎదుట ప్రదర్శించినావు. ఈ మూడు చరిత్రలలో నీ మరణ చరిత్ర, నీ పునరుత్ధాన చరిత్ర ఆలోచించుటకై మాకు సహాయము దయచేయుము. ఈ రోజులలో నీ మరణచరిత్ర ధ్యానించుచుండగా, వాటివలన మాకు కావలసిన సహాయము ఇమ్ము. ఆమేన్.
భస్మబుధవారమునాడు ఒక వాక్యము, ఇదివరిలో గడిచిన సంవత్సరాలు బోధించినాను. అదేదనగా యేసుప్రభువు సువార్త ప్రచారముమీద తన శిష్యులకు చెప్పినమాట: 'ఇదిగో మనము యెరూషలేము వెళ్ళుచున్నాము'. అక్కడ నాకు శ్రమలు, మరణము ఉన్నదని ప్రభువు వారితో అన్నారు. ఈ వాక్యము లూకా 18:31లో ఉన్నది. అది నేను గడచిన సంవత్సరాలలో వివరించినాను. మీరు వ్రాసుకున్నారు. అప్పుడు లోకములోనున్న 'యెరూషలేము వెళ్ళుచున్నాము' అని ప్రభువు చెప్పిన మాట వివరించి, ఆ తరువాత పరలోకములో నున్న 'యెరూషలేము వెళ్ళుచున్నాము' అని యేసుప్రభువు ఈ కాలములోనున్న పెండ్లి కుమార్తె సంఘముతో చెప్పుచున్నమాటను వివరించితిని. కాబట్టి ఆ రెండును ఈ వేళ వివరించను. పాఠము అదేగాని, వివరము మాత్రము ఆ దినము వంటిదికాదు. లూకా 18:31లో 'వెళ్ళుచున్నాము' అను మాట ముఖ్యమైనది. ఆలాగే 'అప్పగింపబడుట' అనేమాట కూడ ప్రాముఖ్యమైనది. అప్పగింపబడుట, వెళ్లుచూ శ్రమపడుట, పునరుత్ధానము ముఖ్యమే గాని నేనావేళ చెప్పిన చెప్పను. ఒకే మాట ఈ రోజు వివరించెదను: 'అప్పగించుకొనుట'
- 1) అప్పగించుట
- 2) అప్పజెప్పుట
- 3) అప్పగించుకొనుట
- 4) అప్పగించబడుట.
యేసుప్రభువు శ్రమల వృత్తాంతము పై నాలుగు మాటలలో ఇమిడి ఉన్నది.
- 1. అప్పగించుట:- అనగా ఆదాము మొదలు మోషే వరకు, దేవుడు తన కుమారుడు రానైయున్న సంగతి చెప్పాడు. అది ఆయన మాటను బట్టి, దేవుడు వారికి ఆ మాటనే రానైయున్న ప్రభువుని గూర్చి అప్పగించినాడు. అందుచేత ఆదాము, హవ్వలు, షేము, యాపేతు, 12 మంది గోత్రీకులు ఆ మాటను అందుకొన్నారు. తమ హృదయములో భద్రము చేసికున్నారు.
ఉదా:- మనము పొరుగూరు వెళ్లేటప్పుడు ఏదైనా ఒకరికి అప్పగించి జాగ్రత్తగా దాచి, మనకప్పగించమన్నట్లు, దేవుడు తన కుమారుని గూర్చిన వాగ్ధానమును వారికిచ్చారు. అలాగే వారు ప్రభువుని గూర్చి దేవుడుతమకిచ్చిన మాట నమ్మి, ఆ మాటను తమ హృదయములో దాచుకొని, ఆయన కొరకు కనిపెట్టారు. మోషే వచ్చేవరకు వారు ఆలాగు కనిపెట్టారు. అయితే దేవుడు ఇప్పుడు మోషేను కొండకు పిలిచి, 'నేను చెప్పుతాను వ్రాసికో' అన్నారు. తరువాత భక్తులు, ప్రవక్తలు, అదే ప్రకారము వ్రాసారు. ముందుగా దేవుడు, తన మాటను ప్రజలకు అప్పగించారు. అలాగే తర్వాత వ్రాత పూర్వకముగా కూడ అప్పగించిరి. వారు, వీరుకూడ మాటను, వ్రాతను దాచుకున్నారు. తొట్టివద్ద గొల్లలు చెప్పిన మాటలు మరియమ్మ తన హృదయములో భద్రము చేసికొనెనని వ్రాయబడినది. అలాగే ప్రజలు దేవుడప్పగించినది దాచుకున్నారు, పోగొట్టుకోలేదు. వీరికి(మోషేకంటే ముందటివారు) వ్రాత తెలియదు. గనుక మాటమాత్రము ఏ ప్రక్క ఉంచుకొంటారు! అని దేవుడు, మోషే వచ్చిన తరువాత అంతకు ముందు చెప్పినవన్నియు వ్రాతలోపెట్టినారు. ఈలాగు ప్రజలు యేసుప్రభువు వచ్చేవరకు వ్రాతయు, మాటను నమ్మి భద్రము చేసికొనిరి. ఈలాగు మనమును దేవుడిచ్చినవన్నియు, ధ్యానించి నమ్ముట, భద్రము చేసికొనుట మహా గొప్ప విషయము. - 2. అప్పజెప్పుట:- తుదకు యేసుప్రభువు బెత్లేహేములో పుట్టిరి. మాటయు, వ్రాతయు అప్పగించినట్లు, మన రక్షకుని లోకములోనన్న మనుష్యులందరికి దేవుడు అప్పగించాడు. యూదులకే కాదు, అన్యులకును అప్పజెప్పాడు. ఉదా: ఒక తల్లి తన బిడ్డను మరొకరికి పెంపకమునకు ఇచ్చినట్లు దేవుడు తన కుమారుని అప్పజెప్పినట్లున్నది. ప్రభువు అప్పటివాడా? కాదు, అనాదిలోనే ఉన్నాడు. అయుతే, దేవుడాయనను లోకమునకు అప్పజెప్పెను.
-
3. అప్పగించుకొనుట:- అప్పుడు యేసుప్రభువు శిశువు చిన్నవాడు, ఇప్పుడు యుక్తవయస్సు వచ్చింది. బాప్తిస్మము పరిశుద్ధముగా పొందినారు, శోధనలు జయించినారు. ఇప్పుడు ఆయన లోకమంతా తిరిగి అందరికి కనబడవలెను. గలలియ, సమరయ, యూదయ, దెకపోలి మొదలగు ప్రాంతములన్నిటిలో అంతా కనబడవలెను. "ఇదిగో ఆయన వస్తాడని మాటలో విన్నారు, వ్రాతలో చూచినారు. నా జన్మ చరిత్రలను విన్నారు. ఇప్పుడు 30 ఏండ్లయినది" అని దేవుడు మాట అప్పగించినట్లు, వ్రాత అప్పగించినట్లు; యేసుప్రభువు ప్రజలకు తన్నుతాను అప్పగించుకున్నారు. చేయవసిన పనులన్నీ చేసి, బోధించవలసినవన్నీ భోధించి, రోగులందరిని బాగుచేసి, పాపులను క్షమించాడు, మృతులను లేపాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, ఆకలిబాధ తీర్చాడు, ఆపద తీర్చాడు, శత్రువులను ప్రేమించాడు, క్షమించాడు. మరణము వచ్చినప్పుడు సహించారు. ఈ విషయములు చేయుటవల్ల ఆయన ప్రజలకు అప్పగించుకున్నాడు. ఏలాగు? భోధ వినేవారికి, జబ్బులు బాగుచేసికొనే వారికి, ఆపదలోనున్న వారికి; ఈ 10 క్రియలు ఎవరెవరికి ఆయన చేసినారో, వారందరికి ఈ 10 అంశములు ద్వారా అప్పగించుకున్నారు. ఈ క్రయలవల్ల నన్ను తెలిసికొనండి అని అన్నట్టు ప్రజలకు అప్పగించుకున్నారు.
ఉదా:- సుఖారు బావివద్ద స్త్రీ అన్నది: 'రక్షకుడు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకంతయూ తెలిసిపోతుంది' ఆ ప్రకారముగా ఆయన మాటవల్ల, ఆమెకు తనను తాను అప్పగించుకున్నాడు. ఆలాగే ఈ 10 క్రియలద్వారా అప్పగించుకునారు. ఆ బావివద్ద స్త్రీ నమ్మింది. నీళ్లివ్వడం మరిచిపోయింది. కుండ మర్చి పోయింది. తాడు కొరకు రావడమ్ మరిచిపోయింది. 'మెస్సీయా వచ్చాడు, రండి' అని అందరికి చెప్పింది. ఈలాగు పైన చెప్పిన 10 విషయములద్వారా ప్రభువు తన్ను తాను అప్పగించుకొన్నారు.
- 4. అప్పగించబడుట:- దీనిని బలపరచుటకు, "వ్రాత, మాట, కుమార జన్మము, ఆయన ఉద్యోగము చెప్పాను. అసలు పాఠము ఇది. 'ఆయన అప్పగించబడును'. యూదులాయనను పట్టుకుని, కాళ్లమీద పడి నమస్కారముచేసి, ఓ దేవా! ప్రభువా! ఇన్నాళ్లకొచ్చావా! అని గౌరవమియ్యవలసినది. గాని వారు ఆలాగు చేయలేదు యేసుప్రభువు తనను అప్పగించుకొన్నప్పటికిని, వారు ఆయనను మరియమ్మవలె భద్రము చేసికోలేదు. అయితే, వారాయనను భద్రము చేసికొనుటకు బదులు తీసికొని వెళ్లి, అన్యులకు అప్పగించినారు. దేవుడు ప్రభువును వారి చేతులకప్పగించుట అందుకేనా! ప్రభువు తనను వారికప్పగించుకొనుట అందుకేనా? గాని వారందరు ఆయనను అన్యుల కప్పగించి చంపించివేసినారు. అంతకు ముందు యేసుప్రభువు నోటితో నీతి బోధలు చేసినారు, చేతితో వడ్డించారు, చేతులతో పని చేశారు, కాళ్లతోను పనిచేసారు, కష్టములో ఉన్నవారిని జాలితో చూచారు. ఇప్పుడు పనిచేసిన ఆయన చేతులను వారు కట్టేసారు. నడిపాదములు ఇక నడవడములేదు. శత్రువులు వచ్చారు. కాళ్లకు సంకెళ్లు వేశారు. వారు ఆయనను అన్యుల కప్పగించినందువల్ల ఆయన అప్పగించ బడినాడని వ్రాయబడినది. వారాయనను ఏమి చేసిరి? వారు గౌరవించలేదు సరికదా! చివరకు అన్యులకప్పగించి చంపించారు. ఆ తరువాత ఏమి జరిగినది?' ఆయన లేచారు.
5. ఆయన లేచిన తరువాత తన శిష్యులకు ఒకటి అప్పగించారు."మీరు భూదిగంతముల వరకు వెళ్లండి. నా బోధ వినిపించండి, నమ్మినవారికి బాప్తిస్మము ఇవ్వండి" అనే ఈ పని అప్పగించినాడు. యూదులకు, పరిశుద్దులకు ఒకసారే, అప్పగించబడెను. ప్రభువు పరలోకమునకు వెళ్తూ తాను చెప్పిన పని అంతా అప్పగించాడు. తన విషయములన్నీ శిష్యులకు మాత్రమే కాక, సంఘమునకును అప్పగించెను.
6. పాత నిబంధనలో మాట అప్పగించినట్లు, వ్రాతనుకూడ అప్పగించెను. అక్కడ మాట అప్పగించినట్లు, క్రొత్త నిబంధనలో ఆయన చేసిన పనిని అప్పగించెను. అన్నియు కలిపి శిష్యులకు అప్పగించెను. అందుచేత ఈ వాక్యములో ఒక మాట ఉన్నది. 'ప్రవక్తలు చెప్పిన మాట' అని ఉన్నది. దావీదు, సొలోమోను, యెషయా మొదలైన ప్రవక్తలు వ్రాసినది ధర్మశాస్త్రము లేక ప్రవక్తల ప్రవచనములు. "నన్నుగూర్చి చెప్పినది, వ్రాయబడినది నెరవేర్చినాను. ఆ నెరవేర్చింది మీకప్పగించినాను" అని ప్రభువు అనెను. అప్పుడు శిష్యులు(హింసనుబట్టి) స్వంతదేశములో ఉండుటకు ఇష్టపడక, చెదరిపోయి అందరికి ఆ సువార్త అప్పగించిరి.
ఇప్పుడు 6 సంగతులు చెప్పాను. అందులో చివరి మాట 'అప్పగించుట' అనే మాట. కొందరు ఈ మాటను లెక్కచేయలేదు. దేవునిమాట మనకిప్పుడున్నది. 'మనమెంత వరకు ఆయన మనకప్పగించిన మాట, వ్రాత చదువుచున్నాము'? అంతా(బైబిలులో ఉన్నదంతా) చదువుచున్నామా! అంతా చదివితే, దానిలోనున్న దాని ప్రకారము నడిస్తే, మనకప్పగించినదంతా చేసినట్లే. ఉదా: బైబిలు చదివినావా? అని ఒకరిని అడిగితే లేదు. అన్నారు. కొందరు కీర్తనల గ్రంధము, మరికొందరు బైబిలులో అక్కడక్కడ చదువుతారు. కొందరు మాత్రము 'బైబిలు అనగా దేవుడప్పగించిన మాట' అని అంతా చదువుతారు. దేవుడు పంపిన ఈ బైబిలనే ఉత్తరమంతా చదవాలి. యేసుప్రభువు చేసినవన్నీ మనకే అని నమస్కరింపవలెను. ఆయన చేసినవన్నియు మనకు సమృద్ధి, సుఖము, సంతోషము కలిగించుటకే. ఆయన మాటను, ఆయనను, ఆయన క్రియను హృదయమందు భద్రపర్చుకొని, ఆ క్రియలన్నీ మాకే అని ఆయనకు కృతజ్ఞతగలవారమై, ఆయన మన కప్పగించిన ఆయన మాటలు, క్రియలు అన్నియు భద్రపర్చుకొనవలెను.
అట్టి ధన్యత చదువరులకు, సిలువ నాధుడైన క్రీస్తు ప్రభువు దయచేయును గాక! ఆమేన్.
కీర్తన: "అప్పగింతు తండ్రి నీకు - నాత్మనంచును = గొప్ప యార్భాటంబు చేసి - కూలిపోతివా!" ||ఆహా మహా||