లెంటులోని ముప్పదియవ దినము – మంగళవారము
యోషయా 53:3-5
ప్రార్ధన:- యేసు ప్రభువా! ఈ వేళ మా సిలువలు మోసిన నీయెడల; నిన్ను చంపువారి కొరకు సిలువలు మోసిన నీ యెడల; నీతో సిలువ వేయబడిన దొంగ సిలువ మోసిన నీ యెడల; కృతజ్ఞత కలిగి ధ్యానము చేయునపుడు మా హృదయములను కృతజ్ఞతతోను, మా నేత్రములను కన్నీళ్లతోను నింపుము. కృతజ్ఞతతో కన్నీరు కార్చుటకు శుక్రవారము కూడుకొనినప్పుడు మా కష్టము కొరకు, వ్యాధి, బాధ కొరకు, కన్నీరు రాల్చక నీ యెడలగల కృతజ్ఞతతో కన్నీరు రాల్చే కృప ఇమ్ము. అప్పుడు నేలమీద, ఒంటిమీద, బట్టల మీదపడు కన్నీరు పరలోక నీ సింహాసనము వరకు వచ్చును. అట్లు కన్నీరు రాకపోతే యూదా ఇస్కరియోతువలెను, మారని దొంగవలెను, ఏడ్చిన స్త్రీలవలెను ఉందుముగదా! మాకు అట్టి ఆనంద కన్నీటితో నింపుకొను కృప ఇమ్ము. ఇట్టి ధన్యత, ప్రయత్న స్ధితి, ఈ కూటములో ఉన్న వారందరికిని ప్రాప్తించు కృప దయచేయుమని వేడుకొనుచున్నాము. దావీదు - నాయొక్క పాపము, కష్టమువల్ల, నా పడకను నా కన్నీటితో నింపుచున్నాననెను. మాకు అది కాదు. అనగా అది వద్దు. కృతజ్ఞతతో నిండిన హృదయమును, కన్నీటితో కృతజ్ఞతతో నింపుకొను కృప ఇమ్ము. త్వరగా రానైయున్న ప్రభువు ద్వారా వేడుకొను చున్నాము తండ్రీ! ఆమేన్.
శ్రమకాల ధ్యానవాస్తవ్యులారా! శ్రమ చరిత్ర అంతయు సువార్తికులు వరుసగా చేర్చియుంటే అది ఒక క్రమము అగును. ఆ చరిత్ర క్రమప్రకారముగా చెప్పుటకు 40 దినములు అవసరము. మనము ధ్యానము చేయునది కొద్ది కాలమే గనుక మిగిలినవి విడుచుచున్నాము. మంచి శుక్రవారము కొరకైన ధ్యానము ముందుగానే చెప్పుచున్నాము. లోకమంతా ఆ దినము ధ్యానింతురు.
- 1) మట్టదివారమున ప్రభువు సింహాసనాసీనుడైనాడు.
- 2) ఆయన శ్రమలో మారినవారి చరిత్రలు (వర్తమానములు),
- 3) మారనివారి చరిత్రలు (వర్తమానములు).
మూడు సిలువలు ధ్యానము:- కొండమీద సిలువలు అనేకములున్నవి. అవి చిక్కులు గలవి. వీటిలో ప్రభువుయొక్క సిలువను జాగ్రత్తగా ధ్యానింపవలెను. ఆయన సిలువమీద మన పాపములు, శాపములు, వ్యాధి బాధలు అన్ని వేసుకొన్నారను సంతోషమును మీ హృదయములో ముద్రించుకొనవలెను. ఆ సిలువ మన కొరకే. కొండమీద మూడు సిలువలు కనబడుచున్నవని సువార్తికులు వ్రాసిరి.
- 1) దొంగ సిలువ
- 2) ప్రభువు సిలువ
- 3) మారని దొంగ సిలువ.
- 1వ సిలువ: లోకపాప భార సిలువ.
- 2వ సిలువ: ఆయనమీద శత్రువులు మోపిన నేరముల సిలువ.
- 3వ సిలువ: కర్ర సిలువ.
- (1) లోక పాపముల సిలువ:- లోక పాపములు మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల. ఇది కర్రకంటే ఎక్కువ భారమైన సిలువ. లోక పాపము అనగా ఆదాము మొదలుకొని తీర్పు దినము వరకు గల పాపులందరియొక్క పాపభారపు సిలువ. ఎన్ని పాపములున్నవో ఆ అన్ని పాపములు; ఆ పాపములవల్ల కలుగు శాపము ఎంతో, అదంతా ఆయన తనమీద వేసికొన్న భారమైన సిలువ.
- (2) శత్రువులు మోపిన నేరపు సిలువ:- ఏమి నేరములు మోపినారు?
-
- (1) స్నానికుడైన యోహాను తిండి తిప్పలు లేనివాడు అన్నారు. ప్రభునిగూర్చి 'ఈయన అన్నపానములకు అలవాటు పడినవాడు, అలవాటు చేసికొన్నాడు గనుక తిండిపోతు' అన్నారు.
- (2) పాపులు పిలిచినా, సుంకరులు పిలిచినా, వెళ్లి పాపులతో కలిసి భోజనము చేయును. గనుక పాపులకు, సుంకరులకు స్నేహితుడుగాని గొప్ప వారికి, జ్ఞానులకు, పండితులకు, మాకు స్నేహితుడుకాదు. పాపులకెల్ల గొప్ప పాపి. 'అతనికి తిండి, తిండి, తిండి' అని నేరము మోపిరి.
- (3) ఈయన కేవలము మనిషియైయుండి దేవుని కుమారుడనని చెప్పుకొంటున్నాడు. ఇది చంపబడే నేరము. ఇది రెండవ సిలువలోని నాల్గవ నేరము.
- (4) దయ్యము శక్తికలిగి దయ్యపు పూజవల్ల దయ్యమును వెళ్లగొట్టుచున్నాడు. గాని అది దైవశక్తికాదు అను నేరము మోపిరి.
- (5) 'గలలియ మొదలు యూదా దేశము వరకు సంచారముచేసి, ప్రజలను ప్రభుత్వముమీద(రాజు) తిరుగబడి ప్రేరేపించుచున్నాడు గాని సువార్త భోధ కొరకుకాదు. రోగులను బాగుచేయుట కొరకుగాని ప్రజల ఉపకారము కొరకు గాని సంచరించలేదు.తిరుగుబాటు చేయుటకే సంచరించినాడు' అను నేరము మోపిరి.
- (6) ఇతరులను రక్షించెదనన్నాడు. తనను రక్షించుకొనలేదు. తనను తాను రక్షించుకొనలేనివాడు ఇతరులనేలాగు రక్షించగలడు? ఇది గొప్ప అబద్దము! అను నేరము మోపిరి.
- (7) 40 సం||లు కట్టిన దేవాలయమును 3 దినములలో లేపుదునని చెప్పినాడు. ఇది ఎంత అబద్దము? ఇట్టి అబద్దములు చెప్పి ప్రజలను భ్రమపరచినాడనే నేరము మోపిరి.
- (8) పిలాతు, హేరోదులు ఈయనను విచారించి, మాకు ఈయనలో ఏ నేరము కనబడలేదనిరి. వారు, యేసును ఎందుకు తీసికొని వచ్చితిరి అని ప్రజలను అడుగగా, వారు ఏమి నేరము లేకపోతే ఎందుకు తీసికొని వస్తాము. దుర్మార్గుడు కాని యెడల ఎందుకు తీసికొని వచ్చెదము అని అన్నారు. జడ్జిగారు ఎదుట ఆలాగు అన్నారు. నేరము మోపినారు.
- 3) కర్ర సిలువ: ఈ కర్ర సిలువలో పై రెండు సిలువలున్నవి. పైకి ఆ రెండు సిలువలు కనబడుటలేదు. కర్ర సిలువ కనబడెను. ఇందులో మూడున్నవి. ఇది భారమైన సిలువ. మోయలేక పోయినను ఆయన మోసెను. ఈ మూడు సిలువలు ప్రభువుపైన ఉన్నవి. ఈ మూడు సిలువలు ప్రభువును అణచివేసెను. ఈ మూడు సిలువలలో ఏది ఎక్కువ భారమైనది?
|
దేనికదే భారమైనది. ఆయన మనమీద ఉన్న ప్రేమనుబట్టి ఈ మూడును మోసెను. |
ఆయనకు మనమీద నున్న ప్రేమనుబట్టి కర్ర సిలువ మోసెను.
ఆయనకు మనమీద నున్న ప్రేమనుబట్టి నిందలసిలువ మోసెను.
ఆయనకు మనమీద నున్న ప్రేమనుబట్టి పాపభార సిలువ మోసెను.
మొదటి, మూడు సిలువలు : కొండమీది కర్ర సిలువలు.
రెండవ మూడు సిలువలు :
- 1.పాప భార సిలువ
- 2.నేరముల సిలువ
- 3.కర్ర సిలువ ఇవన్ని ప్రభువు మోసెను.
- 1.ఆదాము మొదలు అనగా (పాపములో పడినది మొదలు), తినవద్దన్న పండు తిన్న చెట్టు వద్ద నుండి దేవునికి దుఃఖము, శ్రమ ఆరంభమాయెను. ప్రజలు పుట్టి పెరిగి వృద్ధి పొందిన కొలది, క్రొత్తగా నరులు పుట్టి పెరిగుకొలదీ, ఆయనకు ఈ పాపులకొరకు శ్రమ మరియు దుఃఖముండెను. ఈ దుఃఖము లేక ఈ శ్రమలు, తినవద్దన్న చెట్టు మ్రానువద్ద నుండి కల్వరి కొండమీది ఈ సిలువ మ్రాను వరకు అనగా 4వేల సం||ల పొడగున ఉన్న శ్రమ సిలువ ఆయన మోసెను. అది మనకుగాని, లోకమునకు గాని కనబడలేదు. ఈ కల్వరిగిరిమీదికి మోయవలసిన సిలువను అప్పటినుండి జ్ఞాపకము చేసికొంటు ఆయన మోయుచున్నాడు.
- 2. నరావతార ధారియైన పిమ్మట ఆ కర్ర సిలువను మోసెను(ఇది కర్ర సిలువ). మరణమొది సమాధి చేయబడి బ్రతికి మోక్షమునకు వెళ్లినందున ఆయన ఈ కర్ర సిలువ తప్పించుకొనెను. ఇక కర్ర సిలువలేదు.
- 3. అంత్య తీర్పువరకు కఠినులుందురు. పాపులుందురు. వారిని గూర్చిన దుఃఖము, చింత వలన ఆయన తన సిలువను లోకాంతమువరకు మోయుచునేయుండును. మనము పాపము చేయునపుడెల్ల ఆయన క్రొత్త సిలువ మోయుచునే యున్నాడు. ఆయనకు కఠినులమీదనున్న ప్రేమనుబట్టి వారిని ఇంకనూ సంపాదించుకొంటునే యున్నాడు.
- 1)దేవుడు లోకమును ప్రేమించి, తన కుమారునిచ్చెను(సిలువమోత).
- 2)దేవుడు లోకమును ప్రేమించి ఆత్మను పంపెను(సిలువ మోత).
- 3)దేవుడు లోకమును ప్రేమించి సిలువను మోసెను.
- 1. కుమారుడు సిలువ మోసెను, ఇంకను మోస్తు ఉండెను. ఆత్మ కూడ మోసెను.
- 2. ఆత్మ ఎట్లు సిలువను మోసెను? ఆత్మను అంగీకరింపకుండుట ఆయనకు శ్రమ. ఆత్మ నడిపింపు ఒప్పుకొనక పోవుట ఆయనకు సిలువ.
- 3. తండ్రి సిలువను మోసెను.
మనకొరకు బాధపడుచున్న ప్రభువునుగూర్చి, రేప్చరు వరకు బాధ పడుచున్న ఆయనను గూర్చి ఏడ్వవలెను. ప్రభువు సిలువ శ్రమలో ఉండగా కొందరు స్త్రీలు ఏడ్చిరి. అప్పుడు ఆయన వారితో ఇట్లనెను. కుమార్తెలారా! నన్నుగూర్చి మీరు ఏడ్వవద్దు. మిమ్మును గుర్చి, మీ పిల్లలను గూర్చి ఏడ్వుడి. నేనైతే పాపమును, సిలువను, సమాధిని, మరణమును తప్పించుకొని బైటికి వత్తును గాని మీరైతే బైటికి రాలేరు గనుక మీ నిమిత్తము ఏడ్వుడి;
- 1. పాపములనుగూర్చి పశ్చాత్తప్తులై ఏడ్చుట ఆయనకు ఇష్టముండును గాని కష్టమును గూర్చి ఏడ్చిన యెడల ఆయనకు ఇష్టముండదు. పాపములను గూర్చి నొచ్చుకొని ఏడ్చిన యెడల, "నా బిడ్డలు పాపము నిమిత్తము ఎంత నొచ్చుకుంటున్నారు" అని తండ్రి సంతోషించును. అందుకై కన్నీరు రాల్చిన, మన పాపములను గూర్చి కన్నీరు కార్చిన త్రియేక దేవునికి చాలా సంతోషము. దుఃఖించి, పాపి మారినయెడల పరలోకములో దూతలు పండుగ చేసికొందురు అని ప్రభువు చెప్పెను (లూకా 15:10).
- 2. పాపక్షమనొందిన తరువాత మరల పాపివని ఏడ్చిన, కన్నీరు రాల్చిన యెడల వారినిగూర్చి ప్రభువు కన్నీరు రాల్చి దుఃఖించును, సంతోషించడు. క్షమాపణ పొందిన తరువాత ఏడ్చితే క్షమాపణ పొందనట్లేగదా! గనుక దేవునికికూడ దుఃఖము.
- 3. కష్టము నిమిత్తము కన్నీరు కార్చిన యెడల ఆయన గైచేయడు.
- 4. యేసుప్రభువు లోకము నిమిత్తము, నా నిమిత్తము ఇన్ని శ్రమలు పడినారని ఆయనమీదనున్న ప్రేమనుబట్టి కృతజ్ఞత కన్నీరు రాల్చిన, ఆ కన్నీరు చూచి ప్రభువు సంతోషించును. ఆ కన్నీరు ప్రభువు యొక్క చేతిలో ముత్యమువలె ప్రకాశించును. అది అంగీకారమగును.
- 5.ఇన్ని సిలువలు మీ ఎదుట ఉంచినాను. మీరు పరుండి మెళకువ వచ్చినప్పుడు ఆయన యెడల కృతజ్ఞత చూపుచూ కన్నీరు విడువండి.
- 6. పాపము చేయడమెందుకు? కన్నీరు విడుచుట ఎందుకు? పాపము చేయుట మానండి. ప్రభువు చేసిన ప్రతి ఉపకారమునకు కన్నీరు విడువండి.
అట్టి కన్నీరు ప్రభువు మీకు దయచేయును గాక. ఆమేన్.
షరా:- అపవాది నీ శరీరములోని వ్యాధి, కష్టము, అవమానము, జ్ఞాపకము తెచ్చి కన్నీరు రప్పించుటకు పొంచియుండును. జాగ్రత్త.
కీర్తన: "నా ఋణము తీర్చిన - నా దేవా! నా ప్రభువా! నీ ఋణము తీర్చగలనా = నీవు - నాఋషివై బోధించి - నా బదులు చనిపోయి - నావని మరువగలనా" ||మూడు||