లెంటులోని ముప్పది ఏడవ దినము - బుధవారము

విమోచకుడు - విజయరూపము; యోహాను 19:30

ప్రార్ధన:- తండ్రీ! మా నిమిత్తమై నీవు చేయవల్సిన పనులన్నీ చేసి ముగించినావు. నీ జన్మము, నీ జీవితము, నీ చివరి ప్రయాస అన్నీ మా కొరకే. నీ పావన తనువంతయూ మా కొరకే ఇచ్చినందుకు వందనములు. ఈలాగు మమ్మును సంపూర్ణులుగా చేయుటకు మా కొరకు చేయవల్సిన పనులన్నీ చేసినందుకు స్తోత్రములు. నేడునూ నీ వాక్య వివరమును దయచేయుదువని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.


కలువరి గిరిపై సిలువ ప్రసంగ పీఠముపై నుండి భూమిమీదనున్న పాపాంధకారములో మరణాంధకారమును పాయలుగా చీలుకొని పాతాళపు నరకాగ్నిలో నుండి అంధకార అధికారులతో యుద్ధము చేసి అపవాదిని వాని దూతలను నిరాయుధులుగా చేసి సిలువ రక్తము చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి అనగా పాతాళములో బంధించి, విజయానందముతో పలికిన ఆరవ మాట. మరియు ప్రభువు తన శిరస్సును ఏటవాలుగ పెట్టి నొక నేత్రముతో పరలోకపు తండ్రిని చూచుచూ పరలోకపు తండ్రీ! చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని. మరియు నరుల రక్షణ కొరకు చేయవలసిన పనులన్నియు సంపూర్ణముగా చేసియున్నానని సంతోషముతో పలికిన ఆరవ మాట. ప్రభువు మరియొక నేత్రముతో భూలోకమంతటిని చూచుచూ, సర్వలోకమా! సర్వలోకములోని సర్వ జనాంగములారా! మీరు పొందవలసిన సమస్త బాధలు, వ్యాధులు, శాపములు, మరణము, నరకము, నేను మీ పక్షముగా అనుభవించి యున్నాను. ఇక మీకు రెండవ మరణమనే నరకము లేదు. మీ పక్షముగా చేయవలసిన రక్షణ కార్యక్రమములన్ని చేసి ముగించియున్నాను. కాబట్టి మీ కొరకు సిద్ధపరచిన రక్షణ, మోక్ష బాగ్యములను అందుకొని అనుభవించండని వధువు సంఘమును చూచుచూ వరుడు పలికిన ఆరవ మాట.


విమోచింపబడిన వారలారా! విమోచకుని విజయరుపమును ధరించుకొందురు గాక! 'సమాప్తము' అను మాట చిన్న మాటగా కనబడినను విలువైనది. ఏది సమాప్తమైనది? ఏది ముగిసినది? ఏది నెరవేరినది? అను ఈ మాటలోని విషయములను పరీశీలన చేసికొందము.

పాపపు ముల్లు విరగగొట్టబడెను. ఇది కూడ నెరవేర్చబడినది. అనగా రక్షణ సంకల్పము, సాతాను సంహారము, ధర్మశాస్త్రము సమాప్తమాయెను.


సమాప్తమనే చిన్న మాటలో సైతాను తల చితుక గొట్టబడెను. భూమిమీద ప్రభువును సాతాను సిలువ వేయించినది. సమాప్తమైనదనే మాట పలుకుట వలన ప్రభువు కాళ్ళ క్రింద సాతాను సిలువ వేయబడెను. ప్రభువు, తాను కాళ్ళ క్రింద త్రొక్కుట మాత్రమే కాక వధువు సంఘమునకు గూడ అట్టి అధికారమిచ్చెను. రోమా 16:20. ఈ చిన్న మాట ద్వారా పరలోకమునుండి పడద్రోయబడిన ప్రధానదూత లూసిఫర్ నరకములో నొకమూలకు త్రోయబడెను. యెషయా 14:18. మరియు చీకటి బిలములో బంధింపబడినది. యూదా 6. పెండ్లికుమార్తెకు సాతానును వాని దూతలను బంధించు అధికారమనుగ్రహింపబడెను. మత్తయి 16:18. మరియు పరలోకపు తాళపు చెవులు, భూలోపు తాళపు చెవులు, పాతాళ లోకపు తాళపు చెవులు, వధువు సంఘమునకు అనుగ్రహింపబడెను. అనగా సాతానుకు, వాని దూతలకు నిత్యగ్ని గుండము ప్రక 20:10. వధువు సంఘమునకు యుగయుగములు సింహాసనాసీనులై రాజ్యమేలు మాహాభాగ్యము అనుగ్రహింపబడెను. అట్టి బాగ్యము నేటి దినధ్యానమునుబట్టి ప్రభువు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.


ఏడవ మాట: సజీవుడు - మహిమ రూపము;

'తండ్రి! నీ చేతికి నా అత్మను అప్పగించుకొనుచున్నాను' లూకా 23:46.

సిలువ ధ్యానోపదేశకులారా! కలువరి సిలువ బలిపీఠముపై వధింపబడిన దేవుని గొర్రెపిల్లయైన ప్రభువు పాతాళ గర్భములో ప్రవేశించి పునాదులను పెకిలించివేసి పాతాళలోకపు పరదైసుగా మార్చెను. అనగా మొదటి ఆదాము పాపము వలన పరదైసు అను ఏదెను తోటద్వారము మూయబడెను. అలాగే రెండవ ఆదామైన ప్రభువు సిలువ ద్వారా పరలోక పరదైసు ద్వారము తెరువబడెను. ప్రభువు ప్రారంభములో పలికిన మొదటి మాట తండ్రి, అలాగే సిలువలో మొదటి మాట తండ్రి. చివరి మాట కూడ తండ్రియని సంబోధించుచు పరలొక తండ్రివైపు చూచుచు తనయుడు పలికిన ఏడవ మాట. ఈ మాటనుబట్టి చూడగా ప్రభువు తన జీవిత పర్యంతము తండ్రిని ఘనపరచుచున్నారు. తండ్రిలో నుండి తనయుడు వచ్చినట్లుగా తనయునిలో నుండి వచ్చిన పెండ్లికుమార్తె జీవితాంతము ప్రభువును ఘనపరచుచుండవలెను. తండ్రి తన కుమారుని తాత్కాలికముగా నాల్గవ మాటలో విడిచి పెట్టినట్లు కనబడుచున్నది. గాని ఆయన నన్ను విడువలేదు. కాబట్టి నా ఆత్మను తండ్రికి అప్పగించుచున్నానని చెప్పయున్నాడు. ఉదా: తల్లి ఒడిలో బిడ్డ పండుకొని తన ఆటబొమ్మను తల్లిచేతికి అప్పగించెను. ఆ బిడ్డ లేచిన తరువాత తన బొమ్మను తాను తీసికొనెను. ఆ విధముగానే ప్రభువు శుక్రవారము తన తండ్రికి ఆత్మను అప్పగించి ఆదివారము తన ఆత్మను తాను తీసుకొనెను. ఆయనకు మరణముపై అధికారము కలదు. యోహాను 10:18 మరణమనగా తండ్రి చేతికి తన యాత్మనప్పగించుటయే.


చావు అనునది మనకు గొప్ప మర్మముగా నున్నందున చావంటే సహజముగా భయము తోచును. ప్రభువు పలికిన ఈ మాట చూడగా భక్తుని యాత్మ శరీరమును విడువగానే తండ్రి చేతిలోకి బోవునని స్పష్టము. ఇదే మనకు చాలును. ప్రసంగి 12:7 మన తండ్రి చేతిలోకి వెళ్ళిన తరువాత నిత్యకాలము మనకు క్షేమము. ఈలాగు మనము ఆలోచించిన మరణమునకు భయపడనక్కరలేదు. తండ్రి చేతిలోకి పోవుటకు ఏ బిడ్డయైన భయపడునా? భక్తునికి మరణము అట్టిదే. దేవుడు ఆయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును. 1ధెస్స 4:14. మరియు రెండవ రాకడ దినమున రాకడ విశ్వాసులకు సంతోషము, సన్మాన దినము. అవిశ్వాసులకు అంధకార దినము. ఆపద్దినము. సిలువ నాధునికి మానవ శరీరము పోయి మహిమ శరీరము వచ్చినది. అనగా ఆయనకు మరణము మనకు పునరుత్ధానము. మహిమ దినము, మకుటము ధరించుకొను దినము. విమోచన దినము. విశ్రాంతి దినము. మనము మార్పుపొందుదుము, మేఘముల మీద కొనిపోబడుదుము.


సిలువ వీరులారా! సిలువ నాధుని ధ్వజమెత్తికొని సంపూర్ణులముగా పరమునకు సాగిపోవుదము గాక. ఈ దినము పస్కాపండుగ దినము. లేక మంచి శుక్రవారము. పాత నిబంధనలో ఫరో దాస్యపు విమోచన కొరకు గొర్రెపిల్ల వధింపబడిన దినము పస్కా. అలాగే క్రొత్త నిబంధనలో పాపమనే ఈ లోక దాస్యము నుండి విమోచించుటకు దేవుని గొర్రెపిల్లయైన ప్రభువు వధింపబడిన దినమే మంచి శుక్రవారము. ఈ పండుగ దినమున సాయంకాలము మూడు గంటలకు బలిపశువులను వధించెదరు. మన పస్కా గొర్రెపిల్లయగు ప్రభువు సాయంకాలము మూడుగంటలప్పుడు పాపప్రాయశ్చితార్ధ బలిపశువుగా వధింపబడి తన ఆత్మను దేవునికి అప్పగించుకొనెను. ఈ దినమున ప్రపంచములో చెదరియున్న ఇశ్రాయేలియులందరు యెరూషలేము పట్టణము దేవాలయమునకు వచ్చి ఒక్కొక్క కుటుంబమునకు ఒక్కొక్క గొర్రెపిల్ల చొప్పున పాపపరిహారార్ధము బలిగా అర్పింతురు. లక్షలాది గొర్రెపిల్లలను వధించగా ఆ రక్తము ప్రవాహము కెద్రోను వాగుద్వారా పట్టణము వెలుపలనుండి ప్రవహించును. అలాగే ప్రభువుయొక్క రక్తధారలు యెరూషలేము పట్టణ వీధులు మాత్రమేగాక ప్రపంచమందలి ప్రతివీధిలో రెండువేల సం||ల నుండి ప్రవహించుచున్నది. మనము నీతిమంతులముగా తీర్చబడు పర్యంతము ప్రవహించుచునే యుండును. రోమా 5:9.


తండ్రీ! ఆనాదిలో నీలోనుండి బయలుదేరినప్పుడు ఏ మహిమతో ఉన్నానో ఆ మహిమతో "నా ఆత్మను నీచేతికప్పగించుచున్నాను" అని పలికెను. అని తండ్రితో చెప్పెను. తండ్రీ! నేను పాపలోకములో జీవించునప్పటికిని లోకమాలిన్యమేమి అంటించుకోలేదు. పరిశుద్ధముగానే "తండ్రీ! నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను" అని తండ్రితో చెప్పెను. లోకముతో వధువు సంఘమా! నా పిల్లలారా! నేను పుట్టక మునుపు నాకు ఏ మహిమ యుండెనో ఆ మహిమకు వెళ్ళుచున్నాను. మీరు కూడ అక్కడికి వస్తారు. గనుక మరణించిన తరువాత తలవంచుతాము. గాని ప్రభువుమీద మరణమునకు అధికారము లేదు. గనుక ముందే తలవంచి మరణమా! రా! అని పిలిచినారు. సిలువలో ఆయన మరణించి, మన మరణమును మరణింపచేసారు. ప్రభువు సిలువలో పలికిన ఏడు మాటలద్వారా నరులకు సంపూర్ణ రక్షణ, సాతానుకు సంపూర్ణ అపజయము కలిగినది.


ఈ ఏడు మాటల ధ్యానముద్వారా ధ్యానపరులకు రావలసిన దీవెనలు అనుగ్రహింపబడును గాక!


కీర్తన : "పాపుల రక్షణ కొరకు - చేయ - వలసిన పనులెల్ల - ముగియించినావా! = ఆ పగలు పగవారి పగలు - తుదకు - అంతము కాగా సమాప్తమన్నావా!"


"కనుక నీ యాత్మన్ మరణనున - నీదు - జనకుని చేతుల కప్పగించితివా! = జనులందరును ఈ పద్ధతిన్ - కడను - అనుసరించు - నట్లు - అట్లు చేసితివా!" ||ఏడు||