లెంటులోని నలుబదియవ దినము - శనివారము

లూకా. 23:50-56;

ప్రార్ధన:- తండ్రీ! నేటి దినమున నీవు లేవు. నీ సంవత్సరములకు మితిలేదని వ్రాయించిన అనంత స్వరూపుడవైన నీవు 'లేవు'. ఇది మేము ఏలాగు గ్రహించగలము! సకల యుగములలో అక్షయుడవైన నీవు నేడు సమాధిలో ఏలాగు ఉన్నావో మేము అర్ధము చేసికొనలేము గాని కేవలము నమ్మి నమస్కరించగలము. నీవు చేసిన ప్రతి పనీ, పొందిన ప్రతి అనుభవము నా నిమిత్తమే గనుక నేటి దిన నీ మౌన రూపములో నుండియు మాకు కావల్సిన వర్తమానమిమ్మని అడుగుచున్నాము. ఆమేన్.


ఈ రోజు ఎవరు హాజరు కాలేదు? ప్రభువే. ఈ ఒక్కరోజు ఆయన భూమిమీద లేడు. ఆయన పలికిన మొదటి మాట రికార్డులో నున్నది. నా తండ్రి పని మీద నేనుండవలెనని మీకు తెలియదా! ఈ దినము ఆయన మాటలు ఏమియు లేవు. ఆయన భూమిమీద లేరు గనుక క్రైస్తవులు ఈ దినమున ఆరాధన పెట్టుకోరు. ఎందుకనగా ప్రభువు హాజరుకాలేదు. నాగా పడెను గాని సెవెంత్ డే(శనివారపు మిషను) వారు ఆరాధన చేస్తారు. క్రీస్తు లేనందున శిష్యులు దిగులుగా నున్నారు. దిగులుగా నున్నందున ఏలాగు ఆరాధన చేయుదురు? గనుక క్రీస్తులేచిన దినమున ఆరాధన చేస్తారు. అది మన సంతోష దినము. మీరెందుకు ఆరాధన చేయలేదు? అని ఒకవేళ ప్రభువు అడిగిన యెడల విశ్వాసులు,

మేము సంతోషముగా నుండి పరిపూర్ణముగా ఉండునట్లు, నీవు లేచిన దినమునే ఆరాధన చేయుదుము అందురు. ఇది ఆదిసంఘము వారు ఆలాగే చేసిరి. ఈరోజంతా శిష్యుల మనస్సులో ఏమున్నది? సిలువమీద ప్రభువున్నప్పుడు వారి దృష్టి సిలువమీద నున్నది. అనగా మ్రానుమీద నున్న ప్రభువు పైగలదు.


శనివారమునాడు అనగా ఈ దినము సమాధిలోనున్న శవముమీద వారి దృష్టి ఉన్నది. వారి జ్ఞానము అంతకన్న పైకిపోలేదు. క్రీస్తు మూడవనాడు లేస్తారని చెప్పెను గాని అది వారికి జ్ఞాపకము లేదు. ప్రభువుయొక్క శవముమీద వారికి దృష్టి ఉన్నది గనుక సుగంధ ద్రవ్యములు సిద్ధపర్చిరి. వారి మనస్సులో శవమున్నది గాని పునరుత్ధానము లేదు. "శనివారము - శవము" రండు 'శ' లున్నవి. సమాధిలో నున్న అయన లేవడని వారికి ఉన్నది. మనకు సమాధిలో ఉన్న ఆయన లేచినాడు అని ఉన్నది.

ఉదా:- మన వారు పెట్టె చేయించి అందులో శవమునుంచి సమాధిలో నుంతురు. 'పెట్టె శవమునకేగాని, మనుషికి కాదని' మనిషి వెళ్లే పోయాడు. సమాధి శవమునకే. పైవన్నియు మనిషికి కాదు, శవమునకే. భక్తులందరు, శవానికే పెట్టె, సమాధి కట్టుట చేస్తున్నారు. ఈ శరీరము పునరుత్ధానమప్పుడు రాదు, గాని చేస్తున్నారు. ఈ వాడుక అంత్య దినము వరకు జరుగును. గౌరవము కొరకు, జ్ఞాపకము కొరకు పైవన్ని చేయుచున్నారు. మన ఉద్దేశము మనుషియొక్క గౌరమునకే గాని అది శవమునకు చేస్తున్నాము. గాడిదమీద కూర్చున్న ప్రభువునిబట్టి గాడిదెకు గౌరవము వచ్చెను. గాని శరీరమునకు చేయుట ఆచారము గనుక కొట్టివేయరాదు.


ధ్యానము:- మన మనోదృష్టితో ప్రభువు సమాధి ఆయన శవము తలంచుకొనవలెను, ఆయన సమాధిలో నుండుట ఎందుకు తలంచవలెను? క్రీస్తు ప్రభువు ఒకప్పుడు సమాధిలోకి వెళ్లినాడు. గనుక రేపు మనకు సమాధి క్రొత్తకాదు. పాతది అయిపోయెను. గనుక భయములేదు. ఎవరు వెళ్లనిదైతే భయము. ఉదా:- వర్షము వచ్చి వెలిసిన తరువాత ఒకచోటికి వెళ్లవలెనంటే బురదలో అడ్డబడి వెళ్ళము. ఇదివరకు నడచిన వారి అడుగులలో అడుగువేసి వెళ్ళుదుము. అలాగే రేపు మనము మన ప్రభువు వెళ్ళినదే అని ధైర్యముగా వెళ్ళుదుము. సమాధిలో ఉన్న ఆయనకు లేచే ధన్యత, నిరీక్షణ గలదు. మనకు కూడ అదే నిరీక్షణ గలదు. ఆయన సమాధిలోనున్నట్టు తలంచుట ఎందుకనగా ఆయన లేచినట్టు మనము లేతుము. ఇదే ఈష్టరు వర్తమానము. మన శరీరము రేపు మట్టిలో కలిసి పోవును. అది మనది కాదు. ప్రభువు శరీరము రాలేదు. మన శరీరము రాదు. గాని మహిమ శరీరము వచ్చును. బైబిలులో శరీరము నిష్ప్రయోజనము అని ఉన్నది. మహిమ శరీరము ప్రయోజనకరము. ఇది మావారి సమాధి అంటే వారిదికాదు. ఎవ్వరిదికాదు.


ఈ దినము విశ్రాంతి దినము. ప్రభువు వచ్చే వరకు. రాకడలో వచ్చేవరకు చనిపోయిన వారందరకు కనిపెట్టే విశ్రాంతి ప్రభువునందు నిద్రించిన వారికి అందుము గాని చనిపోయినవారిని వాడము. బైబిలులో ఎక్కడాలేదు. సమాధి మంచమాయెను. పరుపాయెను. విస్రాంతిచోటూ ఆయెను. చనిపోయేటటువంటి విశ్వాసి భయపడరాదు. ప్రభువు కుడా వెళ్లియున్నాడు అని మృతులు కావలిసియున్న సజీవులకు నిరీక్షణ రేప్చరులో వెళ్లేవారు. సమాధులు సజీవుల గుంపుకు తయారుకాని భక్తులకు తయారై సజీవుల గుంపుకు వెళ్లలేనివారికి సమాధి భయము ఉందకూడదు. ఎందుకనగా ప్రభువు ఒకప్పుడు వెళ్లినాడు గనుక సజీవుల గుంపు ఎవరికో చెప్పలేము. సమాధి తప్పదని మరణము ఉండుననేది. లోకమంతటికి తెలుసును. గాని సజీవుల గుంపు అనేది ఎవరైతే సిద్ధపడి చావకుండ ఉగ్గపట్టుకొని ఉంటే వారే సజీవుల గుంపు. ఇది లోకమునకు క్రొత్త. ప్రభువుయొక్క శవమును తలంచుకొనవలెను. భక్తులు ఈ ద్వారముగుండా రావలెను. గనుక తలంచుకొనవలెను. చనిపోయిన లేతును అనేది విశ్వాసులకుండ వలెను.


ఉదా:- ఎవరైనా పండుకునేటప్పుడు నేను రేపు చస్తాను, లేవను అని అనుకొందురా? ఎవరు అనుకొనరు. అలాగే విశ్వాసులు లేతుము అను నిరీక్షణతో సమాధికి పోవలెను.


ప్రభువా! ఎవరు మృతులు కావలసిన భక్తులై సిద్ధపడుచున్నారో వారికి నిర్విచారము దయచేయుము. రాత్రి పండుకొనునప్పుడు. ఏలాగు తిరిగిలేతుము అని అనుకుందురో అలాగే మృతులగు భక్తులకుకూడ రేపు రేప్చరులో సజీవులతో రేపు లేస్తాము అను నిరీక్షణ సంఘమంతటికి దయచేయుము.

భక్తులకు మరణ భయములేకుండా చేయుటకు ఆయన మరణమైనాడు. భక్తులకు సమాధి భయములేకుండా ఆయన సమాధిలోనికి వెళ్ళినాడు. రేపు భక్తులు మేము కూడ లేస్తాము అనే నిరీక్షణ కలిగియుండుటకు ఆయన లేచినాడు. మరణ భయము, సమాధి భయము లేకుండుటకై నీవు వాటిని పొంది, సమాధిలోనికి పోయిన తండ్రీ! నీకు స్తోత్రము. మేముకూడ లేతుము అనే నిరీక్షణ సహించుటకే సమాధినుండి లేచిన తండ్రీ! నీకు స్తోత్రము. ప్రభువా! మమ్మును సజీవుల గుంపుకు తయారు చేయుము. గాని పాపము విడిచిపెట్టకపోతే పై ప్రార్ధన చేస్తే ప్రభువును వేళాకోళము చేసినట్టుండును. పాపములు ఉంటే ఆ ప్రార్ధన చేయరాదు. పాపము చేయుట శాపము తెచ్చుకొనుటే, చిన్న పాపము కూడ చేయరాదు. అలాగు చేస్తే 'ఈత ముల్లుతో గుచ్చుకొనుచూ, ప్రభువా! గ్రుచ్చుకొనకుండ చేయి' అన్నట్టుండును. ఒకవేళ ఆ సమయానికి పాపము మానివేయుదును అంటే అది ఇంకా శాపము.


ప్రార్ధన:- ప్రభువా! మాలో ప్రతి వారిని భూమిమీద నున్న విశ్వాసిలందరిని ఈ రెండు గుంపులలోనికి తయారు చేయుము. ఎవరు మరణము ద్వారా రావలెనో నీకు తెలుసును. వారికి మరణ భయము, శరీర భయము లేకుండా చేయుము. ఎవరు సజీవుల గుంపులో రావలెనో వారికి మరణము సమాధి అంతకుపూర్వము నందే శ్రమలు తలంపే లేకుండా చేయుమని వేడుకొనుచున్నాము ఆమేన్.


ఈ దినము ఆయన సమాధిలో యున్నాడు. ఇది విశ్వాసులకు మంచి పాఠమైయున్నది. మన ప్రభువు సమాధిలో యున్నాడు గనుక నేను చనిపోయినను, సమాధిలోనికి వెళ్ళుదునని విశ్వాసి అనుకొనును గనుక విశ్వాసికి సమాధి భయంకరముకాదుగాని విశ్రాంతి స్ధలము. యేసుక్రీస్తు నా కోసమే పరలోకమునుండి వచ్చెను, నా కోసమే పశువుల తోట్టెలో పరుండెను, నా కోసమే కొండ ప్రసంగము చేసెను, నా కోసమే శ్రమలు పొందెను, నా కోసమే మరణము పొందెను, నా కోసమే సమాధిలో నుండెను, నా కోసమే తిరిగి లేచెను, నా కోసమే పరలోకమునకు వెళ్ళెను, నా కోసమే తిరిగి వస్తాడు, నన్ను తీసుకు వెళ్ళును అని నమ్మవలెను. మనిషి ఎక్కడెక్కడకు వెళ్ళెనో అక్కడకు ప్రభువు వెళ్ళెను గనుక ఆయనే రక్షకుడు. ఆయన వెళ్ళిన చోట్లనెల్లను శుద్ధిచేసెను. సమాధి అవిశ్వాసులకు భయంకరము. విశ్వాసి ఎంతకాలము సమాధిలోయున్నను, తిరిగిలేచుట మూడవ దినముననే. అనగా వారు లేచిన వారితో సమానులు. విశ్వాసిపై కధలో చాకలి వంటివారు. ఈ కాలములో కొందరిని ఎత్తబడే వారినిగాను, కొంతమందిని సమాధులలో విశ్రాంతి పొందువారినిగాను ప్రభువు చేసినాడు. ఈ రెండు విషయములకు వందనములు.


శుక్ర, శని, ఆది ఈ 3 రోజులు 3 కాలములు. మనము పుట్టినది మొదలుకొని చనిపోయేవరకు ఒక కాలము. సమాధిలో ఉన్నంతకాలము, రెండవ కాలము. యేసుక్రీస్తు ప్రభువు మనలను సమాధిలో నుండి లేపుకాలము, మూడవ కాలము. యేసుక్రీస్తు ప్రభువు సమాధిలో ఉన్నట్లు భక్తులుకూడ సమాధిలో ఉందురు. ప్రభువు లేచినట్లు భక్తులు కూడ లేస్తారు. చనిపోయిన భక్తులకు శుక్రవారము అనగా సమాధిలో ఉన్నారు. యేసుప్రభువు మూడవ దినము లేచినట్లు ప్రభువునందు చనిపోయినవారు, మూడవకాలమందు లేస్తారు. బ్రతికినవారు ఎత్తబడతారు. శుక్రవారము ఎన్ని శ్రమలున్నను ప్రభువు లెక్కచేయలేదు. సమాధిని లెక్కచేయలేదు. మూడవ దినము లేస్తానని చెప్పినట్లు లేచెను. సంసోను గొలుసులతో కట్టినను, జడలకు మేకులు వేసిననూ లెక్కలేదు, అన్ని తెంపివేసినాడు. అలాగే క్రైస్తవ భక్తులకు శ్రమలున్నను, మరణమున్నను లెక్కలేదు. "యేసుప్రభువు లేచినారు, మేమును లేస్తాము" అను లెక్కలేని తనము భక్తులు కలిగియుందురు. ప్రభువు శ్రమలన్ని జయించెను గనుక మహిమ శరీరము వచ్చెను. ఇవ్వన్నీ మనకేయని మనము నమ్మిన పునరుత్ధాన బలము వచ్చును. యేసుప్రభువు ఈష్టరును బట్టి మన ఈష్టరు. ఓ యేసుప్రభువా! ఈ వేళ నీ పునరుత్ధాన బలము నాకు దయచేయుము అని ప్రతి దినము ప్రార్ధించవలెను. ఆయన గాయములు మానిపోయెను, ఎవ్వరును ఆయనకు కట్టుకట్టలేదు. ఈ సంగతులు నమ్మిన వింత, నమ్మకపోయిన సంత. వింత అనగా అద్భుతము, సంత అనగా గందరగోళము. మనము చనిపోయినను, సమాదైనను, ప్రభువు పునరుత్ధాన బలమును బట్టి లేస్తాము. యేసుప్రభువు మనలను సజీవుల గుంపుగా తయారుచేయును. పాపమును విడిచిపెట్టకుండా చేసిన యెడల ప్రభువుని హేళన చేసినట్టు, శాపము తెచ్చుకున్నట్టు. యేసుప్రభువు సమాధిలోనికి వెళ్లినాడు, లేచినాడు గనుక నాకు సమాధి లేదు. 'యేసుప్రభువు సజీవుల గుంపులో ఉన్నడు, గనుక సమాధి లేదు' అని విశ్వసించవలెను. అప్పుడు ఎవ్వరు మృతుల గుంపో, ఎవ్వరు సజీవల గుంపో నీకు తెలియును.


ఇగ్నేషియస్ చెప్పిన సంగతి: సింహమువస్తే నాకు భయము లేదు. ఆ సింహము నోటిలో, దాని దంతములు అనే తిరుగటిలో విసరబడి గోధుమ గింజవలె పిండి వేయబడి, రొట్టె చేయబడి, పరలోకములో భోజనపుబల్లపై పెట్టబడునని ఎంతో ధైర్యముతో చెప్పెను. నేడు ఎవరికేది దయచేయవలెనో, అది వారికి దయచేయుటకు నీ గొప్ప కటక్షము దయచేయుమని వేడుకొనుచున్నాము. ఆమేన్.


ఈ రాకడ విశ్వాసముతో సమాధిని జయించే స్ధితి పెండ్లికుమారుడు మీకు దయచేయును గాక! ఆమేన్.


కీర్తన : "అక్షయదేహము దాల్చితివీవు - ఆనంద మొందుమీ = లక్షల కొలది శ్రమలు వచ్చినా - లక్ష్యము పెట్టకుమీ, నీవు - లక్ష్యము పెట్టకుమీ సాద్వలాస్" ||జయము||