లెంటులోని పదునాలుగవ దినము - గురువారము

మార్కు 10:32-34.

ప్రార్ధన:- తండ్రీ! నీ శ్రమలు మేఘమువలె నిన్ను ఆవరించి యుండగా, వాటినన్నిటినీ నీతి సూర్యుడవైన నీవు సహించి, జయించినావు. నేడు సంఘము మీదికి రానైయున్న శ్రమలను నీ సంఘము జయించి నిలబడునట్లు నేటి దిన ధ్యానములో నుండి వర్తమానము దయచేయునని వరుడుగా వచ్చుచున్న యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.


యేసుప్రభువు వారికి కలిగే శ్రమలు సంఘానికి జరగబోవు శ్రమలకు ముంగుర్తు. బైబిలులో అనేక ముంగుర్తులున్నవి. అవి చెప్పాలంటే నెల దినములు పట్టును. ముంగుర్తు వేరు, గుర్తులు వేరు. ముంగుర్తులు జరిగిపోయినవి. మనకాలములో గుర్తులు జరుగుచున్నవి. యేసుప్రభువు వారు రెండవ రాకడకు ముంగుర్తులు జరుగునని చెప్పినారు. భక్తులు అవి చూచి, చంద్రలోకానికి వెళ్లిన సంగతి చూచి, ఆ తరువాత ఏమి గుర్తులు జరుగును అని ఆ భక్తులు అడుగుచుండగా, 'కనిపెట్టుడి' అని ప్రభువు అనుచున్నారు. (వచనం గురుతులను ప్రవచనములను - గుణియించు చున్నది -'వధువు సంఘము') ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో పై రెండు గుర్తులు నెరవేరుట చూచుచున్నాము.

ఈ క్రమమును బట్టియే అయ్యగారు ఆ కీర్తన వ్రాసిరి. ఉదా: కారు మేఘము పట్టునప్పుడు భారీ వర్షము వచ్చునని ప్రకటించగా, అందరు అలాగేనట అని చెప్పుకుంటారు. పొలములో ఉన్నవారు గబగబా ఊళ్లోకి పారిపోవుదురు. ఆ మేఘము అక్కడ ఉన్నప్పుడు మేఘము వాసన కొట్టును. అనగా వర్షము పడుచున్న మట్టి వాసన వచ్చును. గాలి ఆ వాసనను తీసికొని వచ్చును. దానియొక్క నీడలు కొంతదూరము వరకు కనబడును. తీరా వీరు ఇంటికి వెళ్లగానే పొలములో కుంభవర్షము కురుయును. ఆ వర్షమువల్ల కొన్ని ఇండ్లు పడిపోవును. చెట్లకొమ్మలు విరుగును. త్వరగా పరుగెత్తని వారు తడిసిపోదురు. నేను శనిటోరియములో నుండగా ఒక కంట్రాక్టరు గారితో ఏమిచెప్పినానంటే, ఈ పాకలు కట్టి 4 సం||లు అయినది. ఇకమీదట ఇవి పనిచేయవు. 'తీసివేసి మంచి ఇండ్లు కట్టండి' అని చెప్పి కేసవరము సర్కీటుకు వెళ్లిపోయినాను. అక్కడికి 18 మైళ్లు ఉండును. అక్కడకు వెళ్లగా, ఉజ్జీవ కూటములు పెట్టిరి. మరునాడు ప్రభువు ఒక మాట నాకు చెప్పినారు. ఏమంటే, శానిటోరియం పరిస్ధితులు బాగోలేదు గనక నీవు వెంటనే వెళ్ళవలసిందని చెప్పినారు. కూటస్ధులకే ఈ సంగతి చెప్పిరి. అపుడు వారు అయ్యో! ఒక్క కూటమే జరిపినారు. ఇంతలోనే వెళ్లిపోతారా? అనిరి. వారు నమ్మినా నమ్మకపోయినా ప్రభువు మాట అనిచెప్పి, బైలుదేరి శానిటోరియం వచ్చివేసితిని. 4 గంటలప్పుడు మిర్తిపాడు గ్రామము మీదుగా నాలుగు మైళ్ల దూరము వరకు నల్లని మేఘము కమ్మి, కనిపించగా మేమందరము సర్దుకున్నాము. ఇంతలో వర్షము వచ్చివేసింది. అయ్యగారి పాక మీదికిని వచ్చివేసినది. అయ్యగారు గొంగళి కప్పుకొనిరి. వంటగదికి చేరిరి.

అయ్యగారు అచ్చటికి చేరినారని తెలుసుకొని, 10 సం||లు వయసు గల ఇద్దరు ఆడపిల్లలు అయ్యగారివద్ద అపాయము రాదని చేరిరి. మిగిలినవారు బాబూ, నాయనా అంటూ కేకలువేస్తున్నారు. అయ్యగారు వారిని ప్రార్ధించమన్నా వారికి ప్రార్ధన రాలేదు. పాకలన్నీ పడిపోయినవి. 400 రూపాయలు ఖరీదైన మందు బుడ్లు ముక్కలై పోయినవి. ఇంటిమీద రేకు పడి ఒక మనిషి కాలికి గాయము తగిలినది. ఒక రోగి, రెండు ఫర్లాంగులు రోడ్డుమీదైకి దొర్లిపోయెను. ఎంత నష్టము!

అయ్యగారు గొంగళి కప్పుకున్నారు. కప్పుకున్నను బాధలోయున్నారు. ఎందుచేత? మేఘము దూరముగా ఉన్నప్పుడే, సమీప గ్రామములోనికి అయ్యగారు వెళ్ళి ఉంటే అయ్యగార్కి జబ్బు చేయక పోవును. ప్రభువు నన్ను శానిటోరియంకు వెళ్ళమంటే, వేరోక ఊరికి ఎట్లు పోదునని దగ్గరున్నా ఊరైనా పోలేదు. (అందుచేత వారం రోజులు జబ్బుచేత బాధపడిరి).

ఇదిగో మనము యెరూషలేముకు వెళ్లుచున్నాము. యూదులైన వారు నన్ను అక్కడ పట్టి చంపుదురు. అన్యులకు అప్పగింతురని ప్రభువు చెప్పిరి. మంచి శుక్రవారమునాడు ఆయన అనుభవించబోయే శ్రమ, మరణమనే మేఘచ్చాయ ఆయన శిరస్సుమీద పడినది. ఆయినను ఆయన లెక్కచేయలేదు. దానిని శిష్యులు గ్రహించలేదు. ప్రభువుతో వారును యెరూషలేము వచ్చిరి. అక్కడనుండి యేసుప్రభువు, తన శిష్యులతో గెత్సేమనే తోటకు వెళ్లినారు. అప్పుడు ఆయన మహా వేదనతో ప్రార్ధించారు. అప్పుడు శుక్రవారమునాడు అనుభవించవలసిన సిలువ శ్రమల నీడ మరింత దగ్గరకు వచ్చినది. అదే ఎక్కువ బాధ, అందుచేతనే తండ్రీ! నీ చిత్తమైతే తొలగించమని ప్రార్ధించెను. రక్తము స్వేదము (చెమట)వలె ప్రవహించెను. ఎంత బాధ లేకపోతే అట్లు రక్తము స్వేదముగా ప్రవహించెను! నేడే ఇంత బాధయైతే శుక్రవారము పొందబోయే బాధ ఇంకెంతగా యుండును! ప్రభువు తోటనుండి బైటకు వచ్చియున్నారు. అప్పుడు ఊళ్లోనుండి యూదులు, అన్యులు, గవర్నమెంటువారు - కత్తులతోను, గుదియలతోను, కర్రలతోను ఎదురువచ్చారు. అప్పుడు ఆ మేఘచ్చాయ మరింత దిట్టమై పోయింది. కత్తులు, గుదియలు చూస్తే భయముండదా? తప్పకుండా ఉంటుంది. ప్రభువు భయపడలేదు. అట్టిది ఇప్పుడుంటే మనకు భయము ఉండదా? ఉంటుంది.

అక్కడనుండి ఆయనను యూదుల పంచాయితీకి, సన్హెడ్రిన్ సభకు అనగా 70 మంది పెద్దలు గల సభకు తీసికొని వెళ్లిరి. అప్పుడెంత బాధ! 1) మర్యాదస్తులు, ఎరిగినవారు ఎదుట చేతులు కట్టుకొని ఉండుట ఎంత సిగ్గు, అవమానము! అలాగే యూదులు గురువైన యేసు యూదుల ఎదుట నిలువబడి ఉండుట ఎంత సిగ్గు! అది మరియొక విధమైన సమీప మేఘచ్చాయ. అప్పుడు వారాయనను బంధించి పిలాతు కోర్టుకు తీసికొని వెళ్లిరి. ఇక్కడ స్వజనులు, అక్కడ పరజనులు; ఇదీ సిగ్గే, అదీ సిగ్గే.

ఇక్కడ స్వజనులు శిక్షించుటకంటే అక్కడ పరజనులు శిక్షించుట మరీ కష్టమైన మేఘచ్చాయ. క్రమముగా ఆయనను శ్రమల మేఘచ్చాయ వద్దకు నడిపించుకొని వెళ్లుచున్నారు. అసలు మేఘము దగ్గరకు నడిపించుకొని వెళ్లుచుండిరి. ఈ నీడలన్నీ సిలువ మేఘ స్ధలములు. ఈ మేఘములన్నీ క్రమక్రముగా అసలు మేఘమైన సిలువ దగ్గరకు తీసికొని వెళ్లుచుండెను. అక్కడ మేఘము కుమ్మరించినట్లు వేదన, గాయములు, దుర్మరణము ఇవి ఆయనపై కుమ్మరింపబడినవి. పెద్ద వర్షము కురిసినప్పుడు ఇండ్లు ఏలాగు కూలిపోవునో, అలాగే శ్రమలు ముమ్మరముగా కుమ్మరింపబడినప్పుడు ఆయన కూలిపోయి చనిపోయెను.

మేఘచ్చాయలన్నీ కలసి అక్కడ ఆయనను మరణింపజేసెను. మన కాలములో ఇండియా దేశములో నున్న క్రైస్తవులకు (శ్రమల) మేఘచ్చాయ పోయిన సం||నుండి కనిపించుచుండెను. మనకిది చాయ కాలమే గాని సిలువకాలము కాదు. మీరు మా(హిందు) మతములోనికి రండి, రాకపోతే మీ మతమున్న దేశమునకు పొండి, లేకపోతే మిమ్మును ఏమిచేస్తామో చెప్పమంటున్నారు. ఇదే మనదేశములోని సంఘముమీదికి వచ్చే మేఘచ్చాయ అయి ఉన్నది. గాని ఎవరికిని చీమకుట్టినట్టైనలేదు. అందరమును ప్రార్ధనలో ఉంటే జయించగలము గాని లేనిచో జయమురాదు.

20 వందల ఏండ్లు క్రిందట స్ధాపించబడిన ఆది క్రైస్తవులను, అన్యులు చాలా హింసించిరి. అనేకులను చంపివేసిరి. కత్తితో నరికినవారి చేతులు నొప్పిపుట్టినప్పుడు చంపుట మానిరి. అట్టిది తిరిగి రానైయున్నది. మేఘచ్చాయ వచ్చినది గాని మేఘము ఇంకను రాలేదు. రానైయున్నది ప్రార్ధన చేయనిచో ఆపలేము. క్రైస్తవులందరికీ ఈ సంగతి చెప్పి ప్రార్ధన చేయించవలెను. క్రీస్తుమీదికి వచ్చిన

గనుక సిద్ధపడి ప్రార్ధించిన యెడల, అప్పుడు సహించుటకు బలము వచ్చును. అప్పుడు క్రీస్తునకు సిలువ. ఇప్పుడు మనకు(సంఘమునకు) సిలువ. ఇక్కడేకాదు, ఇండియా అంతట.

ఈ శ్రమలధ్యానముద్వారా రానైయున్న శ్రమలను మీరు తప్పించుకొందురు గాక! ఆమేన్.

కీర్తన: "ఇచ్చక మిదిగాదు - మిగుల దలపోయ - ముచ్చట దీరదు = అచ్చి వచ్చిన నా - యవతారుడా నీ ప్రక్క - గ్రుచ్చు గాయము లోపల నే - జొచ్చి నీ ప్రేమ జూతు" ||నాయన్న||