లెంటులోని తొమ్మిదవ దినము - శుక్రవారము

యోషయా 53 అధ్యా||. లూకా.23:40. 1పేతురు 2:20-24.

ప్రార్ధన:- యేసుప్రభువా! మాకు బదులుగా చేయవలసిన పని అంతా, సమాప్తము చేయుటకై, మా కొరకు చేసిన పనులన్నిటికై నీకు వందనములు నీవు చేసినది యావత్తు మా కొరకు, మా ఉపయోగము నిమిత్తము చేసినావు, మా మేలు కొరకు బోధించినావు. మా ఉపకారము కొరకు చేసినావు. మా కొరకు శ్రమపడినావు. మా కొరకు కోర్టుకు వెళ్లినావు. మా కొరకు సిలువ మోసినావు. మా కొరకు గాయపర్చబడినావు గనుక నీకు వందనములు. ఆమేన్.


ప్రసంగ వాక్యము:- మార్కు.14:53-57. యోహాను 2:19.


నేటి ప్రసంగ వాక్యము: 'నా శరీరమనే దేవాలయమును పడగొట్టుడి'. ఈ మాటలో యేసుప్రభువు యూదులతో పందెము వేసినట్టు కనబడుచున్నది. ఏది! పడగొట్టి చూడండి. అప్పుడే మీకు తెలుస్తుంది, నాకు గెలుపో లేక మీకు గెలుపో! పడగొట్టే మీకు గెలుపు వస్తుందో, పడగొట్టబడిన నాకు గెలుపు వస్తుందో మీరే తెలుసుకుంటారు! ఇది పందెపు రంగమందు తెలుసుకుంటారు. ఇది పందెపు రంగమందు పందెము వేసే యోధుని కూటమువలె ఉన్నది. యేసుప్రభువు యూదులతో పందెము వేసినట్టు ఈ వచనములో మోదటి భాగమందు కనబడుచున్నది. గాని ఒక్క యూదులమీదనే పందెము వేయలేదు గాని ఇంకా కొంతమంది మీద, కొన్నిటి మీద పందెము వేసెను. వేటిమీద వేసెను? సైతాను మీద అనగా అసలు పాపము తెచ్చిపెట్టిన సైతానుమీదనే పందెము వేసెను. సైతానా! నీఇష్టము వచ్చినట్లు నన్నుచేయవచ్చు. సైతానా! ఎవరు గెలుస్తారో? చూద్దాము. లూకా 4:2, 1పేతురు 5:9,1


2వది:- సమస్త పాపములమీద ఆయన పందెము వేసెను. తలంపు పాపములు, మాటలోని పాపములు, క్రియలోని పాపములు; అన్ని పాపములమీద పందెము వేసెను. ఓ పాపములారా! నన్ను శోధించుటకు మీ ఇష్టము వచ్చినట్లు చేయండి అన్నట్లు కనబడెను. 'ఆయన మనవలె శోధింపబడెను' అని వ్రాయబడినది. మనకు బదులుగా శోధింపబడెను గాని పాపములో పడలేదు.


3వది:- పాపములవలన వచ్చిన ఫలితములమీద ఆయన పందెము వేసినాడు. జబ్బులు, ఇబ్బందులు, ఆపదలు, అపవిత్రత ఇవన్నియు ప్రభువును ఏమీ చేయలేకపోయెను. ఆలాగే ఆపదలు, ఆకలి, ఇవన్నీ ఏమీ చేయలేకపోయెను. పాపమువలన వచ్చిన దుష్ట ఫలితములు ఆయనను ఏమీ చేయలేకపోయెను. చివరకు యేసుప్రభువే గెలిచెను.


4వది:- దయ్యములు ఎదురుగావచ్చినవి. అవి ఆయనమీద పడలేకపోయినవి. మనుష్యులమీద పడినట్లు ఆయనమీద పడలేకపోయినవి. ప్రభువు దయ్యములను గెలిచెను.


5వది:- ఆయనను పట్టుకొనుటకై శత్రువులు వచ్చిరి. ఆయన పట్టుబడినాడు గాని పట్టబడినట్లుండలేదు. ఇస్కరియోతు యూదాతో ఏమి చెప్పెను, "చెలికాడా! నీవు చేయవలసినది చేయి" అనెను. అప్పుడు యూదా అప్పగించినాడు. అయినప్పటికిని తప్పించుకొని పారిపోలేదు.


6వది:- కయప, సన్హెద్రిము పంచాయతీ కోర్టులోకి వెళ్లెను. అక్కడ వారిని గెలిచెను. ఎందుకంటే వారు ఏమియు చేయలేకపోయిరి. వారు చేయవలసినదంతా చేసినను వారాయనను నాశనము చేయలేకపోయిరి. ఆయనే గెలిచెను, గాయములు పొందెను, రక్తము కార్చెను. అయినను తప్పించుకొని పారిపోలేదు. తుదకు భూస్ధాపనపుడుకూడ నేను సమాధిలోనికి వెళ్లను అనలేదు. అక్కడకూడా ప్రభువే గెలిచెను.


ఉదా:- రెండు గొఱ్ఱె పొట్టేళ్ళు పోట్లడుకొన్నప్పుడు ఒకటి పారిపోయినట్లు ఆయన పారిపొలేదు. పంచాయతీ సభలో పారిపోలేదు. కోర్టులో పారిపోలేదు. మరణము వచ్చినప్పుడు పారిపోలేదు. రాతి సమాధిలో పెట్టినప్పుడు పారిపోలేదు గనుకనే పందెములో గెలిచెను. రెండు సంగతులు ముఖ్యము. పేతురు పత్రికలో ఉన్నట్లు 'సహించెనని' వ్రాయబడినది. పందెపు రంగమందు రెండవ పొట్టేలు వలన మొదట పొట్టేలునకు ఎన్ని దెబ్బలు తగిలిననూ పారిపోలేదు. సుళువైన పద్దతి లేక మాయ పద్ధతి శత్రువులాయనకు చూపిరి. అనగా 'సిలువ మీద నుండి దిగు' అని అనుటలో ఆ మాయ మార్గమును చూపారు. గాని ఆయన ఆలాగు చేయలేదు

తప్పించుకొనకపోవుట చరిత్రలో యున్నది. సహించినాడనే మాట పేతురు పత్రికలో యున్నది. ఈ రెండును పందెపు రంగమందున్న పెద్ద పొట్టేలుయొక్క పెద్ద కొమ్ములను విరుగగొట్టే పెద్ద కొమ్ములవలెయున్నవి. మన నిమిత్తమై ఆయన ఈ పందెపు రంగములో ప్రవేశించెను. కాబట్టి శ్రమలయొక్క కొమ్ములకు తాళలేక పారిపోలేదు. నిలువబడిపోయారు. అందుచేత ఆయనకు సైతానువల్ల, దయ్యములవల్ల, పాపములవల్ల శ్రమలు వచ్చినా, వ్యాధులు వచ్చినను, అవమానములు వచ్చినను, మారణావస్త కలిగినను, యేసుప్రభువు సహించినట్లు మనమును సహించితే మనకే గెలుపు. మన సహింపు యేసుప్రభువుమీద ఆధారపడితే జయముగాని, స్వశక్తిమీదనైన యెడల అపజయము. ఆయన మరణము చూచి, మన మరణము సహించవలెను. ఈ ప్రకారము ఆయన శ్రమలన్నిటిని, మరణ చరిత్రను, భూస్ధాపన చరిత్రను చూచి మనము అన్నిటిని గెలువగలము. ఆయన గెలుపువల్ల మనకు గెలుపు. ఆయన కీర్తి వల్ల మనకు కీర్తి. ఆయన గెలిచినట్లు మనము కూడా పందెము వేసి గెలువవలెను. మనకు శ్రమ కలిగినప్పుడు చింతించుటవల్ల ఏమి లాభము? ఆఖరికాలము గనుక శ్రమలింకా వచ్చును. 33½ సం||లవరకు ప్రభువుకు శ్రమ వెనుక శ్రమ. అయితే మంచి శుక్రవారము అవి అన్ని కలిపిన దానికంటే ఎక్కువ శ్రమ. ఎందుకంటే అవి ఆయనను చంపలేదు. గాని ఆఖరు శ్రమ ఆయన చంపెను. ఆలాగే సంఘమునకు శ్రమలుకూడా ఎక్కువే. భక్తులమీదికి వచ్చినవి కూడా ఎక్కువే. భక్తులలో ఒక్కొక్కరికి వచ్చే శ్రమలకంటే, సంఘముమీదికి వచ్చే శ్రమలు ఎక్కువే. సంఘము, భక్తులు వీరికి మాత్రమేగాక క్రీస్తు పేరు ధరించుకొన్నవారందరికి శ్రమలే. వారు భక్తులుగాకున్నను శ్రమలే. వారికే కాదు, వారి అభిమానులకు కూడ ఎక్కువ శ్రమలే. క్రైస్తవులు లేక భక్తులు పక్షముగా నున్నందువల్ల, అలాగే ప్రభువు పక్షముగానున్నందువల్ల శ్రమలే. ఎక్కువైన శ్రమలని భయపడవద్దు.


యేసుప్రభువు తొట్టిలోనుంచి శ్రమలకు ఎదురెక్కెను. ఐగుప్తులోనుండి పాలస్తీనా దేశమునకును, అక్కడనుండి సిలువపైకి ఎక్కి, వెళ్లిపోవలెను. గనుక మనము భయపడకూడదు! జంకుట మనపనికాదు. గాని యుద్ధరంగమునందు మనము స్ధిరముగా నిలువబడవలెను. ఒక్క ప్రక్కకు ఒరిగితే మనకు జయము రాదు. శ్రమ అయినా సరే! మరణమైనా సరే, యుద్ధరంగమునందు ఉంటే ఏ భయము లేదు. 2000స||ల క్రిందట పందెపు రంగమందు గెలిచిన 'మన ప్రభువు మన ప్రక్క ఉన్నాడు. గనుక అపజయము రాదు. మన తెలివి తక్కువవల్లనో, లేక భీతివల్లనో తప్పించుకోగోరితిమా! ఆయన ఉన్నా మనకు అపజయమే. భయపడినా దిగులుపడినా మనకే అపజయము. జయశాలియైన ప్రభువు నా ప్రక్కనున్నాడు గదా! అంటే ఏమీ భయము, యోబునుగూర్చి సైతాను దేవునితో వాదించాడు. దేవుడు సెలవు ఇయ్యగా యోబును శోధించెను. గాని యోబు - 'దేవుడిచ్చెను, దేవుడే తీసికొనెను' అని అన్నాడు. అందువల్ల అపవాది సిగ్గుపడి పారిపోయెను. ఆలాగే మనకును కలుగును. ఎన్ని కష్టాలువచ్చినా మనము సైతానుకు లొంగకపోతే వాడు పారిపోవును. ఇక ఎన్నడును మన యొద్దకు రాడు. కాబట్టి మంచి శుక్రవారమునందుగల పందెపు రంగమందు మనము ఎక్కువగా సహించవలెను. అప్పుడు గెలుపు కలుగును.


యేసుప్రభువు సిలువమీద ఎక్కువ బాధ సహించినప్పుడు ఎవరిని తలంచినాడని మీరనుకుంటున్నారు. తల్లిని, శిష్యుని, తలంచుకున్నాడనుకున్నారా? నిజమేగాని ఆయన వర్తమానము వినుచున్న నిన్ను ఆయన 2000 సం||ల క్రిందనే తలంచుకున్నాడు. ఎన్నో కోట్ల సూర్య కిరణములు నేలమీదకు వచ్చి నేలను చూస్తున్నట్లుగా, ఆ నీతి సూర్యునియొక్క కనుదృష్టిలోని కిరణలు 2024 యేండ్ల క్రితమే; రాబోవుచున్న నిన్నును, నీ శ్రమను, నీ సహింపును చూస్తునే యున్నవి. అది మీరు నమ్మరు. శిష్యుడినే, నేరస్తుడినే ఆయన జ్ఞాపకము తెచ్చుకొనెను అని అనుకొంటున్నారా? సంఘమనే దేవాయమును పడగొట్టండి! చూస్తాను అంటున్నాయన. నా భక్తుడు ఒక అడవిలో ఉన్నాడు. ఆయనను పడగొట్టు అంటున్నారు. సంఘము పడిపోయినట్లు కనబడునువచ్చుగాని పడిపోదు. ఆలాగే భక్తులు పడిపొయినట్లు కనబడ వచ్చు గాని పడిపోరు. కాబట్టి సంఘమా! సంఘములోనున్న శ్రమానుభవ శరీర శ్రమను పొందుము, సహించుము గాని పడవద్దు, అదే మంచి శుక్రవారముయొక్క మంచివార్త. 'పడవద్దు', ఈ మంచివార్త విని ఏడ్వవద్దుగాని సంతోషించండి.

అట్టి దీవెన ప్రభువు మీకు దయచేయును గాక. ఆమేన్.


కీర్తన: "యేసుక్రీస్తు ప్రభువొందిన జయమే - ఎల్లవారికౌను - కోరిన ఎల్లవారి కౌను- వేడిన ఎల్లవారికౌను - నమ్మిన ఎల్లవారికౌను = యేసు పేరే మీ చిక్కుల పైన వేసికొన్న జయము - జయమని వ్రాసికొన్న జయము సద్విలాస్" ||జయము||