లెంటులోని ఆరవ దినము - మంగళవారము

యోహాను 19:1-30

ప్రార్ధన:- మా నిమిత్తమై రక్తము కార్చిన తండ్రీ! నీవు పొందిన శ్రమను ఎవరు ఎన్నడూ అనుభవించలేదు. నీ సిలువ చరిత్రలోని ప్రతి అంశమూ మా మేలుకొరకై యున్నది గనుక అట్టి ధ్యానమును నేడు మాకు దయచేయుము. ఆమేన్.


ప్రభువు మనకొరకు అనుభవించిన శ్రమలే ఈ సిలువ చరిత్ర. యేసుప్రభువు పొందిన శ్రమలకంటే ఎక్కువైన శ్రమలెవరైనా పొందినారా? లేదు. ఈ లోకమంతటి కొరకు ఆయన శ్రమ పొందెను. గనుక ఆయనకు ఎక్కువ శ్రమ. క్రీస్తు పొందిన శ్రమ ఎప్పుడును ఎవరును పొందలేదు పొందలేరు. పుట్టిన, పుట్టబోవు వారి పాపముల కొరకైన శ్రమలను కూడ ఆయన అక్కడ అప్పుడే అనుభవించినాడు.


కొండమీద ఉన్న నాలుగు గుంపులు:

సిలువయొద్ద మన కధ అంతా తీర్మానం మీదే ఆధారపడి యున్నది. ఇదే రక్షణ దినము గనుక సిలువ చరిత్ర గొప్పది. మనలోనున్న పాపములన్నీ,సిలువమీద నున్న ఆయన తీసివేసినాడు గనుక కలువరి సిలువయెద్దకు వచ్చినప్పుడు విశ్వాసికి ఆనందము,శాంతి, మోక్షము కలుగును.

నీలకంఠగోరే అనే పండితుడు 4 సువార్తలు చదివినప్పటికిని, క్రీస్తు దేవుడుకాదు భక్తుడు అని బోధించినాడు. ఒకసారి మనస్సు పుట్టి మరలా 4 సవార్తలు వదివి, సిలువ చరిత్ర యొద్దకు వెళ్ళే సరికి, చదువుట మాని "ఇప్పుడు నేను తెలుసున్నాను, తెలిసిపోయింది. ఈయన దేవుడు. దేవుడు కాకపోతే ఒంత శ్రమ అనుభవించలేడు. దేవుడు గనుకనే ఇంత శాంతముగా అనుభవించినారు. గనుకనే అందరి పాపములు క్షమించినాడు. గనుక అందరికి యేసు ప్రభువే దేవుడని" నమ్మి, బాప్తిస్మము పొంది నెహెమ్యా నీలకంఠగోరేగా పేరు మార్చుకొని, హిందూ మతములో నుండి క్రీస్తు మతములోనికి వచ్చెను. క్రీస్తు ప్రభువును సిలువ వేయుటేలాగు అనగా - సిలువను పరుండబెట్టి, ఆయనను దానిపై పరుండబెట్టి, మేకులతో కొట్టి, తరువాత సిలువను ముందుగా తీసిన గోతిలో పాతిపెట్టిరి. యేసుప్రభువును సిలువపై పరుండబెట్టి కుడిచేతిలోను, ఎడమ చేతిలోను, మేకులుపెట్టు సుత్తెతో కొట్టినారు. అల్లగే రెండు కాళ్ళు అనగా రెండు పాదములు ఒక దానిపై మరియొకటి పెట్టి ఒక మేకును ఉంచి, సుత్తెతో కొట్టినారు. అప్పుడు చిమ్మెట గొట్టమునుండి నీరు ప్రవహించినట్లుగా ఆయన రక్తము చిందినది. అందుకే భక్తులు ఆయన రక్తము చిందించినాడు అని వ్రాసినారు. ఇది నేలమీద పరుండియున్నప్పుడు జరిగిన సంగతి. పిదప ముందుగా తీసిన గోతిలో ఆ సిలువను వేసి పాతిపెట్టిరి. తరువాత వారు నిచ్చెన వేసి, ముండ్ల కిరీటము తెచ్చి, ఆయన శిరస్సుపైన వేసి అదిమిరి. అప్పుడు రక్తము కాళ్ళవరకు కారినది. ముండ్ల కిరీటము అనగా మేకుల కిరీటము.


చేతులలో రక్తము:- ఆయన చేతులలో మేకులతో కొట్టినప్పుడు మరింత బాధ. మేకులతో చేసిన కిరీటము ఆయన శిరస్సుమీద అదమగా మరింత బాధ కలిగెను. అదంతయు మన పాపమును బట్టి కలిగినా, మనమీదనున్న ప్రేమనుబట్టి ఆయన అంతయు ఓర్చుకొనెను.


పాదములలో రక్తము:- పాదములలో మేకులను కొట్టినప్పుడు దుర్జనులను ఏలాగు మనస్సు కరగలేదో, అలాగే నేటి కాలములో సిలువనుగూర్చి విని, మారని వారుకూడా క్రీస్తును బాధించుచున్నవారే. ఆనాటి దుర్జనుల హృదయము కరగలేదు. పాదములనుండి రక్తము, శిరస్సునుండి రక్తము కారట చేత, ఆయన రక్తమయమై పోయినప్పటికిని, వారి మనస్సు కరగక ఒక రాణువవాడు బల్లెముతో ప్రభువు ప్రక్కలో పొడిచెను గాన రక్తము ప్రవహించెను.


తల్లి ప్రక్కను పరుండియున్న బిడ్డను జ్ఞాపకము తెచ్చుకొనండి: మనుష్యులు దేవుని ప్రక్కను, క్రీస్తు ప్రక్కను చేరియుంటే క్రీస్తుకు ఎంతో ఇష్టము గాని మానవుడు దేవునిని విడిచి సైతాను ప్రక్కకు చేరి యున్నందున ఆయన తన ప్రక్కలో బల్లెపు పోటు పొడిపించుకొనెను. రక్తము మాత్రమే కాదు గాని అందులోనుండి నీళ్ళు కూడా ప్రవహించెను. బల్లెపుపోటు పొడిచినప్పుడు నీరు కారెను.


నీరు ఎందుకు కారెను: ఆయన మనస్సులో ఎక్కువ దుఃఖము ఉన్నది. తన జీవితము పొడుగున ఆయనకు దుఃఖమే యున్నది, 33½ సం||లనుండి యున్నది. సిలువ మ్రానుమీద నున్నప్పుడు మరి ఎక్కువగా యున్నది. తన మరణమును గూర్చికాదు గాని మనస్సులో మరొక దుఃఖము కలదు. ఏమిటంటే వీరిని ఇంతగా ప్రేమించితే ఎందుకు ఇలా ద్వేషిస్తున్నారు! వీరేకాదు, లోకమంతా ఇంతగా చెడిపోయిందనే దుఃఖము. ఆయన మనస్సులో గలదు.


గెస్తేమనే తోటలో ఆయన పోందిన విచారము సాధారణ విచారము కాదుగాని ఆయనకు ఆ శ్రమలో రక్తపు చెమట కారినది. బల్లెపు పోటు పోడిచినప్పుడు రక్తమే రావలెను గాని నీరు రాకూడదు. అక్కడ రక్తపు చెమట పట్టకూడదు. సిలువపై నీరు రాకూడదు. ఎక్కువ దుఃఖమువల్ల ఆయన రక్తము కరిగిపోయినది. అనగా క్రీస్తు గుండె నీరైపోయింది. ప్రజలందరికొరకు దుఃఖపడుచుండగా రక్తము కరిగి నీరుగా ప్రవహించినది. గనుక సిలువపైన వ్రేలాడు యేసు ప్రభువునకు నమస్కరించవలెను. చేతులతోకాదు, హృదయముతో, ఆనందముతో నమస్కరించవలెను. యేసుప్రభువు ఈలోకములో ఉన్నప్పుడు ఎవరినిగూర్చి ఆలోచించుచుండెననగా 'మానవులందరి కొరకును' కేవలము ననిషి తలంపులే అనగా మనిషిని రక్షింపవలెననే తలంపే ఆయనకున్నది.

ఆయనను న్యాయము చొప్పున బల్లెపు పోటు పొడవకూడదు. కానీ మనమాయన దరిని చేరుటకు ఆ గాయము పొందెను. ఆయన కేవలము ఉపకారము చేసినప్పటికిని, ఆయన అవయవములతో అపకారము చేయక పోయినప్పటికిని, దుజ్ఞనులు ఆయనకు కేవలము అపకారమే చేసినారు. పరలోకమునుండి భూలోకమునకు, నిన్ను స్వస్ధపర్చుటకు వైద్యుడుగా దిగివచ్చిన, ఆయన నిన్ను బాగుచేసియున్నాడని నమ్ముము.

ఉదా:- గ్రుడ్డివాడు డాక్టరు దగ్గరకు మందు కొరకు వెళ్ళితే, ఈ మందు వేసికొంటే బాగుపడుదువని డాక్టర్ గారు చెప్పితే "ముందే బాగుచేయండి, అప్పుడు మందు వేసికొంటానని" చెప్పడుగదా! గనుక విశ్వాసము అనగా ఏదిలేదో, అది యున్నదని నమ్మండి! ఏది చూడలేదో అది చూచియున్నామని నమ్మండి! బాగుపడకపోయిననూ బాగుపడినట్లుగా నమ్ముటే విశ్వాసము. యేసుప్రభువు మిమ్మును బాగుచేసియున్నాడని నమ్ముచున్నారా? అలాగైతే దేవునికి స్తోత్రము చేయండి.
కీర్తన.'దేవా తండ్రీ నీకు....స్తోత్రములు.అందరు ఆయనను స్తుతించండి.


ప్రభువైన యేసురక్తము మిమ్మును స్వస్ధపర్చునుగాక! ప్రభువు యొక్క మితిలేని ప్రేమద్వారా మీ శరీరమునకు ఆరోగ్యమును, స్వస్ధతయును, మీ ఆత్మకు శాంతియు, ఆనందము కలుగును గాక! ఆమేన్.

కీర్తన: 1) "రక్తంబు నాపైకి - ప్రవహించుచున్నది - రక్షకా నీకు స్తోత్రం = భక్తితో ఈ కధ - భాగ్యంబు గైకొను - భాగ్యమిమ్ము స్తోత్రము"
2) నీ ప్రేమ నీ దయ - నీజాలి నీ మనసు - నీ ముఖ బింబమునగలదు = నీ ప్రభావంబెల్ల - నీ ప్రయాసములోనే - నెగడుచుగన్పడ గలదు"