లెంటులోని ఏడవ ఆదివారము - ఈస్టర్

Other Easter Messages by Devadasu Ayyagaru

దేవదాసు అయ్యగారి 12 ప్రసంగములు
ఈష్టరు ఆరాధన

దావీదు కీర్తనలు 100; యోహాను 20:1-18; 1కోరింధీ 15:53

ప్రార్ధన:- తండ్రీ! నా నిమిత్తమై నీకు వచ్చిన శ్రమలన్నిటిని సహించి, భరించి, జయించి లేచిన ప్రభువా! నీకు వందనములు. నీ పునరుత్ధానము, అన్నిటిపైన నీవు పొందిన విజయమైయున్నది గనుక అన్ని జయములకంటె అది గొప్ప జయమైయున్నది. మా నిమిత్తమై నీవు చేసిన పనికి ఎదురు ఏదీ నిలువనేరదని ఋజువు చేసిన తండ్రీ! అట్టి నీ అనంత జయము మాకును అందించుటకు నీ వాక్య వర్తమానము ఇమ్మని సమస్తమును జయించిన యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.


ఇప్పుడు పునరుత్ధాన చరిత్రలోనికి వచ్చినాము. 40 దినములు శ్రమలో ఇటు అటు తిరిగినాము. ఇప్పుడు పునరుత్ధాన చరిత్రలోనికి వచ్చినాము. గనుక పునరుత్ధాన చరిత్ర వినవలసియున్నాము. ఆ తరువాతి చరిత్రను సంచార చరిత్రగా భావించుకొన వచ్చును.


సంచార చరిత్ర 2 భాగములు:

ఈ రెండునూ పునరుత్ధాన చరిత్రలో ఉన్నవి. సర్వ భూలోకమున నేటివరకు జరిగినటువంటి కధలన్నిటిలో, అద్భుతమైన విచిత్రకధ నేడు జరిగింది. భూమి పుట్టినది మొదలు ప్రభువు సమాధిలోనుంచి లేచినంతవరకు వ్రాయబడిన చరిత్రలు చదువగా, ఇటువంటి అద్భుతకరమైన చరిత్ర ఎక్కడలేదని వేదాంతులు కనిపెట్టిరి. ప్రభువు సమాధిలో నుంచి లేచినారు. ఆదియందు దేవుడు ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రములను అను దీపములతో వెలిగించెను. ఆ ఆదియందే ఇప్పుడు మనము నివసించే భూగోళమునుకూడ సృజించెను. పచ్చని గడ్డితోను, విచ్చవిడిగా సంచరించే మృగములతోను, గాలిలో గానము చేసే పక్షులతోను, హాయిగా ఉండే గాలితోను, మానవుల ధనసంపాదనార్ధము వెండి, బంగారములతోను ఈ భూమిని సృజించెను. ఖగోళము ఎవరికొరకు, మనకొరకే. ఆయన వీటిని కలుగచేసినపుడు మనలో ఎవరైనా ఉంటే, చూస్తే, మహా ఆశ్చర్యపడుదుము. వేసవికాలమున సాయంకాలమున పడమటి దిక్కుగా వెళ్లిచూస్తే గుండ్రని ఎర్రని బంతివంటి గోళమును చూచి, ఎంత కన్నుల పండుగగా ఉన్నదని ఆనందిస్తాము. ఆ విధముగానే ప్రాతఃకాలమున మనము కండ్లు ఎత్తి, ఆకాశము వైపు చూచి ఎంతో కాంతిగా ఉన్నదనియు, భూగోళము వైపు చూచి ఎంతో శృంగారముగా ఉన్నదనియు సృష్టికర్తకు నమస్కరించుదుము. ఈ రెండు గోళములెంతో పరిశుభ్రముగా యున్నవి.


భూమిమీద ఆయన ఆదాము, హవ్వ అను దంపతులను కలుగచేసినారు. వారే మొదటి తల్లిదండ్రులు. వారిలో నుండి మనమందరము వచ్చినాము. ఇప్పటికి ఆరువేల సం||లు గడిచిపోయినవి. అప్పుడు వారు పరిశుద్ధులుగా ఉండుటను బట్టి, భూగోళము, ఖగోళము అలాగే పరిశుభ్రముగా యుండెను. ఎక్కడ, ఏమియు కళంకములేదు. గాని మిగుల విచారకరమైన సంగతి ఏమనగా ఆది తల్లిదండ్రులు పాపములో పడిపోయి, అపవిత్రులైరి. వారిలో నుండి వచ్చిన వారే తరువాత పాపులై పోయినారు, పాపాత్ములుగా మారిరి. అక్కడనుండి మనవరకు గీతగీయుచూ రాగా మనమును పాపాత్ములై పోయినాము. నది పుట్టుచోట కలుగు కళంకము ఆ నది సముద్రములో పడేవరకు కొట్టుకొని పోవునుగదా! అలాగే ఆదాము, హవ్వలలోని పాపము మనవరకు కొట్టుకొని వచ్చినది. అయితే దేవుడు వారిని క్షమించి రక్షణ వాగ్ధానము చేసినాడు: 'మిమ్మును రక్షించేటందుకు రక్షకుని పంపిస్తాను'. వెంటనే రక్షకుడు రాలేదు గానీ వాగ్ధానమున్నది. అది వారి సంతానమునకు తెలిసినది గాని రక్షకుడు ఇంకా రాలేదు. 1,2,3,4 వేల సంవత్సరములు గదిచినవి. అప్పుడు ఆ రక్షకుడు బెత్లేహేములో జన్మించెను. ఆయన ఎవరని ఆలోచిస్తే దేవుడే. ఆయనే రక్షకుడుగా వచ్చెనని తేలింది. ఆయన పాలస్తీనాలో 3½ సం||లు జీవించారు. 3½ సం||లు మత ప్రచారము చేసెను. ఆయన బోధయొక్క సారాంశమేమనగా, "నేనే లోకమును రక్షించుటకు వచ్చిన రక్షకుడను". దుర్జనులు ఆయనను చూడగా, ఆయన కేవలము మనిషి అని గ్రహించిరి. విశ్వాసులైతే, ఆయన మానవుడేకాదు, దేవుడుకూడ అయియున్నాడని గ్రహించిరి. దుర్జనులు దానిని గ్రహించక నిస్కారణముగా ఆయనను హతము చేసినారు. సిలువమ్రాను మీద చంపివేసినారు. ఆయన చనిపోయి, మూడవ దినమున తెల్లవారేటప్పటికి సమాధిలో నుండి జయశీలుడై బయటకు వచ్చిరి. అప్పుడు సమాధి దగ్గర చూడగా బండ పొర్లించి ఉన్నది. తువాలుచుట్టి పెట్టి ఉన్నది. అందులోని రాతిమీద దేవదూత కూర్చున్నాడు. ఆయన ప్రభువును మీరు చూడవచ్చినారా? ఇక్కడ ఏలాగు ఆయనను చూడగలరు? ప్రభువు బ్రతికిన వారితో , వారిలో ఉంటారు అని ధైర్యము గల మాటలు కొన్ని చెప్పిరి. గాని వారు వాటిని గ్రహించలేదు. ఏలాగైనా ఆశ్చర్యముతో, సంతోషముతో వెళ్లిపోయిరి. తుదకు ఒకటి తీర్మానమై పోయినది. ప్రభువు చనిపోయిన ఎంత నిశ్చయమో, ఆయన బ్రతికినది అంత నిశ్చయము. ఇది పునరుత్ధాన చరిత్ర. మరణ చరిత్ర ఏమిటి? మేకులతో ఆయనను సిలువకు అంటగొట్టి చంపిరి. శిష్యులు వచ్చి ఆయనను సమాధిలో పెట్టగా, గొప్పరాయి పొర్లించిరి. ఎవరు తీయకుండా ముద్రవేసిరి.


పరలోకమునుండి వచ్చిన దేవదూత రాయితీసెను. అంతకు మునుపే, ప్రభువు లేచి బైటకు వెళ్లిపోయిరి. సమాధి ఆయనను గట్టిగా పట్టుకోలేదు. రాయి ఆప లేదు, ముద్ర ఆటంకపరచలేదు. ప్రభువు ముందుగానే వారికి చెప్పిరిగాని వారు గ్రహించలేదు. వారికి జ్ఞాపకము లేదు. ఉన్ననూ, ఉపయోగములేదు. అయితే క్రమముగా గ్రహించి ఆనందించినారు. అదివరకు జరిగిపోయిన 4వేల సం||లలో ఎక్కడా ఇట్టిది లేదు. దైవభక్తులు బ్రతికించినది ఉన్నది గాని, స్వయముగా బ్రతికి బైటికి వచ్చినది ఈ ఒక్కటే. దుర్జనులు ఏమనుకున్నారు? మేము చంపివేసినాము, హతము చేసినామనుకొనిరి. అది సగము నిజము.


ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోకపోతే వారు ఆయనను చంపలేరు.


వారే నిజముగా చంపితే ఆయనను బ్రతకకుండా కూడా చేయగలరు. గనుక వారు ఆయనను చంపలేదు గనుక వారు పట్టుకోలేదు. వారంతట వారే స్వయముగా చంపితే బ్రతకడు. ఆయనే చంపనిచ్చినాడు గనుక ఆయన బ్రతికినాడు. ఇట్టి చరిత్ర లోకములో ఎన్నడూ జరగలేదు. ఇటువంటి చరిత్ర జరుగదుగాని ఇటువంటి చరిత్రకు సంబంధించిన చరిత్ర జరుగుతుంది. గనుకనే ఇది మహా అద్భుతకరమైన చరిత్ర. ఇంతవరకు చెప్పిన కధ నిజముగా జరిగిన బహిరంగ వృత్తాంతము. పైకి కనబడినకధ, అప్పుడున్న వారి నేత్రములకు కనబడిన కధ.


2వ భాగము (అంతరంగ చరిత్ర):- ఇది పైకి కనబడనిది, దీనినే ఇంకొక రీతిగా చెప్పవలసియున్నది. మొదటిభాగములోని ప్రభువు పునరుత్ధానకధ క్రొత్త వారికినీ, ఈ రెండవ భాగము విని బాగా నేర్చుకొన్నవారికిని చెప్పవలసినవి. ప్రభువు సిలువ వేయబడిన రాత్రి భగర్భములోనికి వెళ్ళినారు. ప్రభువు సిలువవేయబడుటవల్ల పాతాళ లోకమునకును ఉపకారము చేసినారు. ఆయన కేవలము భూలోకములో వారి నిమిత్తమై రక్షకుడా? పాతాళమునకు రక్షకుకాడా! ప్రభువు భూలోకములో 33½ సం||లు నివసించి అద్భుతకరమైన రక్షణ ఏర్పాటు చేసినారు. అట్లయితే ఆయన పాతాళములోని వారిని విడిచిపెట్టినారు అని అనకూడదు. అక్కడివారు రక్షింపబడినను, రక్షింపబడక పోయినను రక్షణయొక్క ఏర్పాటు చేయవలెను. భూలోకములో సమాప్తము అన్నను, పాతాళములోని వారికి ఆయన తన మాటలను బోధించినారు. అక్కడే, ఆదాము మొదలు నోవహు కాలములో ఉన్నవారి రక్షణ కొరకు ప్రకటించినారు. 'నమ్మి బాప్తిస్మము పొందుడి' అనునది ఏర్పాటు. సిలువమీద దొంగ బాప్తిస్మము పొందలేదు. అయినను రక్షణ లేదా? ఉన్నది. నమ్ముట, బాప్తిస్మము, రక్షణ పొందుట ఇది క్రమము, ఏర్పాటు. దొంగ నమ్మినంత మాత్రమున రక్షణ పొందెను.


రెండవ కధ:- నేను గాలిలో ఒక పటము వేస్తునాను. ఊహా పటము. ఆ పటముమీద గీతగీస్తున్నాను. క్రిందనుండి పైకి ఒక గీత గీస్తున్నాను. ప్రభువు బెత్లేహేములో జన్మించిన జన్మస్ధలము మొదలు, చనిపోయిన సిలువకాలము వరకు ఒక నిలువగీత వేయుచున్నాను.


  • జన్మము, ఆరంభకాలము
  • మరణము, అంత్యకాలము
  • జన్మకాలము, మరణకాలము



2 కాలములు

అక్కడ ఏమి కనబడుచున్నది? ఆయన బోధించినట్లు, సిలువ ఎక్కినట్లు, మరణమొందినట్లు, ఇంకా అనేక కధలున్నవి. మూడు కధలలో వివరించినారు. ఇవన్నియు బోధకధ, శ్రమకధ, మరణకధ. ఈ గీతకు మూడు జానలు దిగువగా అడ్డుగీత గీయవలెను. దాని పేరు.


Easter

ఇవి ఆ గీతపై వ్రాయవలెను. ఆ గీతకు సమానముగా

ప్రభువు జన్మము మొదలు యౌవనకాలము నుండి మరణకాలము వరకు ఆయనను పీడించేవి కొన్ని ఉన్నవి. మానవులందరిని 4 వేల సం||లలో ఏమి పీడించుచున్నవో, అవన్నియు ప్రభువు జీవిత చరిత్రలో కూడ ఆయనకు పీడగాయున్నవి. 1. రకరకములైన పాపములు. పది అజ్ఞల ప్రకారముగా చూస్తే ఎన్ని పాపములున్నవో అన్ని పాపములు ఆయనమీద పడెను. మానవుల పాప జాబిత తయారుచేస్తే చాలా పొడుగుగా యున్నది. దేవుని ఎరుగకుండుట, కోపించుట, పెద్దలను మర్యాద చేయకపోవుట, తిట్టుట, వ్యభిచార దోషము, దేవుడు దయ్యము, దూత ఎవరులేరు అని నాస్తికత్వ బోధ ప్రకటించుట; ఇవి ప్రభువును కూడ పీడించుటకు వెంటబడినవి. ఎందుచేత? ఆయన మానవులను రక్షించుటకు బైలుదేరినాడు గనుక. కాబట్టి ముందు ఆయనను పడగొట్టితే మానవులను ఏలాగు రక్షించగలడని ఇవన్నియు ఆయనను పడగొట్ట ప్రయత్నించెను. కాదు, కాదు, అన్ని పాపములు ఆయనను వెంబడించినవి. కాగడా దీపము చుట్టూ పురుగులు ఆవరించునట్లు ఆయనను ఆవరించినవి.


హెబ్రీలో పౌలు తేటగా వ్రాస్తున్నారు. 'మనవలె ఆయన అన్ని విషయములలో శోధింపబడెను. అన్ని పాపములలో ఆయన పడిపోవుటకు కావలిసినంత వీలు, సందు దొరికినది, ఏర్పడినది. కాని ఆయన పడలేదు. పడితే రక్షించలేడు. ఆయన పడితే మనకు ఇక ఏమి గతియున్నది? ప్రభువునకు బాల్యవస్ధ మొదలు యౌవనకాలవస్ధ వరకు పాపశోధనలు కలిగినవి. ఎప్పుడుబడితే అప్పుడే పడిపోవచ్చు గాని పడలేదు. ఆఖరుమెట్టులో వధ్య స్తంభమెక్కి మరణమాయెను. అప్పుడు దుర్జనులు సంతోషించిరి. ఆయన పని అయిపోయింది అనుకొన్నారు. ఆయన ఇతరులను రక్షించినాడు గానీ తన్ను రక్షించుకొనలేదని దుర్జనులు సంతోషించిరి. ఈ ప్రక్కన ఉన్నావారు కూడ అదే తలంపుతో ఉన్నారు. సైతాను తలంపుకూడ అదే. అంధకారరాజ్యములోనివారికి అదే తలంపు. మానవుని చరిత్ర అయిపోయింది. అదే మానవునికి, దయ్యానికి తెలుసు. భూస్ధాపన చరిత్ర, రాయివేసిన చరిత్ర, ముద్రవేసిన చరిత్ర, కావలి చరిత్ర తెలుసును గాని ఆ తరువాత చరిత్ర వారికి తెలియదు. ఇక ఆయన ఏమి చేయలేడని తలంచిరి. గాని ఆయన లేచినాడు. జన్మకాలము మొదలు మరణ నిమిషము వరకు జయము, జయము. పాపమాకర్షించినా ఆయన పడలేదు. జయించినాడు. ఒక్కొక్కటి జయించినాడు గాని పడలేదు. అన్ని విధముల ప్రయత్నించినను పడలేదు గనుక జన్మకాలము మొదలు మరణకాలము వరకు ఆయనకే జయము. పునరుత్ధానము, ఇది ఒక ఋతువు. ఆయన జయము పొందినాడు, పడలేదు, నిలిచే ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు, మాట్లడుతున్నాడు, నడుస్తూయున్నాడు, పునరుత్ధానమైయున్నాడు. గనుక అంతా జయమే.


రాబోయే కాలమందు క్రీస్తు నామమున ఒక సంఘములేవనై యున్నది. అది భక్తుల సంఘము, విశ్వాసుల యొక్క సంఘము. సంఘము తన జన్మకాలము మొదలు, మరణకాలము వరకు జయించవలెను. పాపశోధనలను తమ రక్షకుడు జయించినపుడు, ఆ శత్రువులను కూడా సంఘము జయించవలసినదే. విశ్వాసులు పాపములో పడుతున్నారు, లేస్తున్నారు గాని ప్రభువు ఎప్పుడూ లేచే భాగ్యము కలిగిస్తున్నారు. భక్తులు పడిపోయునా లేచే భాగ్యము కలిగినది. ప్రభువు సంపాదించిన భాగ్యము అనగా లేచే భాగ్యము క్రైస్తవ సంఘమునకు, శిష్యులకు భక్తులను, రావలెను. అది ఇప్పుడు ఈవేళ దొరికినది. అయితే, పడకుండా ఉండే భాగ్యము ఇంకా దొరకలేదన్నారు. అది కూడ దొరుకుతుంది. ఇక మీదట ఎన్నటికిని పాపముచేయని సంఘముగా తయారగు కృప ప్రభువు సంఘమునకు అనుగ్రహించును. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపముచేయడు. పాపము చేయని స్ధితి, ప్రభావము దేవుడు సంఘమునకు ఇవ్వబోవుచున్నాడు.


ఆ మహా గొప్పవరము పొందేటందుకు సంఘము ఇంకా సిద్ధపడలేదు. అది తప్పక వస్తుంది. ఆయన జన్మకాలము మొదలు మరణకాలము వరకు నిలువు గీతతో ముగించిరి.


Easter

ఆయన బ్రతికియున్నప్పుడు వీటిని జయించినారు.


పాపశోధనలు:- ఆయన తన జీవిత కాలములో పాపములను జయించినాడు. ఇప్పుడు వేటిని జయించవలెను? ఈ ఆరింటిని జయించవలెను. వీటన్నిటిని జయించుట కష్టమే. ప్రభువు పని అయిపోయినట్టే ఉన్నది. 'జన్మము మొదలు మరణము వరకు పడని ఈ మహానుభావుడు' ఇపుడు పడిపోయినాడని వారు అనుకొన్నారు. ఆయన పడ్డరా? పడలేదు. ఇంకొకటి వచ్చింది. అయిననూ పడలేదు. ఆయనలో ప్రాణమున్నది గనుక పైవన్నియు జయించగలిగినాడు. ఇప్పుడు ప్రాణములేదు గనుక ఏలాగు జయించగలడు? అని వారు అనుకొన్నారు. అయితే తుదకు వారికే చావు వచ్చింది. ఈ పునరుత్ధాన కధలో ఆయన లేచినారు గనుక

ఆయన ఎక్కడ ఉన్నప్పటికినీ వెలుపలికి ఎందుకు రాగలిగినాడు? జీవమైయున్నాడు. గనుక మరణమును మొదలైన వాటిని జయించెను.

స్టీమరు మీద ఉన్న మనిషిని నీటిలో పడవేస్తే చనిపోయాడను కుంటారు గాని బుడుంగున ఒడ్డు దగ్గర పైకి లేచి కనబడ్డాడు. అతడు జీవము కలిగియున్నాడు గనుక జీవమైయున్నాడు. సంఘమునకును భూస్ధాపన అను అవస్ధ వస్తున్నది. రాయి అడ్డము వస్తున్నది. సంఘము వెలుపలికి రాకుండా ముద్ర వస్తున్నది. కావలివారు కూడ వస్తున్నారు. సువార్త ప్రకటించకుండాయున్ననూ, కట్టు దిట్టాలున్ననూ, సంఘము తుర్రున ఎగిరిపోతుంది. వేటగాడు పక్షిని కొట్టగా, తుర్రున ఎగిరి గూటలో పడ్డది. అక్కడకు వెళ్లి పట్టుకొనబోతే తుర్రున ఎగిరిపోయింది. అట్లే సంఘము కధకూడ ఉండును. ఇంకొక క్రొత్త సంఘము. అనగా ఇప్పుడున్న సంఘమునకు కాదుగాని రేపు రాబోయే సంఘమునకు రాయి ముద్ర కావలి ఏమి లేదు. ఎవరినిబట్టి? ప్రభువుని బట్టి! అట్టి స్ధితి ఆయనే ఇచ్చినాడు. అది పడకుండా ఉండే వరకు వరము. మరణము సంఘము వరకు రాకుండా ఉండే వరము. ఏదిగొప్పది? జన్మకాలము నుండి మరణకాలము వరకు పాపము చేయలేని గొప్పవరము, మరణము రాకుండా ఉండే గొప్ప వరము, పాపములో పడినా లేచే వరము. ఏది గొప్పదో, అది సంపాదించుకొనండి.


3వ గీత:- మూడవ గీత ఇపుడు వివరించవలెను. మనసానందము పొందుటకన్నను అను కీర్తనలోని వచనము, "సాధుజనోత్తమ" అను వచనము. శోధనలన్నిటిలో పడకుండా ఉండి అన్నిటినీ జయించే స్ధిరమైన స్ధితి. మనకందరికి ఆ మహా గొప్ప భాగ్యము దొరుకుతుంది. ఎవరైనా విశ్వాసులు మరణము పోందిన యెడల పరిశుద్ధులతో కలసి యుందురు. మరణము దాటి సజీవుల గుంపులో వెళ్లినవారు. అక్కడ పరిశుద్ధులతో కలసియుందురు.


ప్రభువును నాశనము చేయవలెనని పూనుకొన్న వారెవరు? పాపములు అపవాది, అతని సైన్యము, అతని రాజ్యము ప్రభువును నాశనము చేయపూనుకొన్నవి. ఈ రెండు గీతలకు కారణముగల గీతలు: ఒకటి ఎడమ ప్రక్క గీత. ఎడమ ప్రక్క గీతలోని అపవాది, దయ్యము, అంధకారము లేకపోతే, ప్రభువుకు ఈ అవస్ధలు లేకపోవును. ఈ అవస్ధలు సంఘమునకు ఉన్నవి. సంఘమున్నంతవరకు పాపశోధనలే. సంఘము మృతియైన పిమ్మట అనగా లోకమును జయించిన పిదప రెండవ గీతలోనివి వచ్చును. సంఘము నాశనమునకు పూనుకొన్నవారైన అపవాది, పాపములు ఓడిపోయినవి. మరణావస్ధలు ఓడిపోయినవి. ఎడమ ప్రక్కనన్ను అపవాది ఓడిపోయింది. 3 గీతల వారు ఓడిపోయిరి. సైతాను ఇక లాభము లేదనుకున్నాడు. ఆయన లేచిన తరువాత ఇక ఆయనను శోధించలేదు. జన్మకాలవస్ధలు, మరణావస్ధలు, సైతానవస్ధనేవి ఇక ఆయనను శోధించవు. వాటికి ఆ వీలు లేదు. ఏమి చేయ తగవు. పౌర్ణమినాడు, మతాభి వెలుగువలె చెన్నెల కాస్తున్నప్పుడు, (కాళ్ళలో) ఎన్ని ముళ్ళు గుచ్చుకొన్ననూ వేటకాడు వెళ్లి పులికి మాటిగ్గినపుడు, వెన్నెలకు ఎన్ని దెబ్బలు తగిలినవి? వెన్నెలకేమియు కాదుకదా! అట్లే అపవాది ఇక ప్రభువును శోధించనే శోధించడు. ఎందుచేత? ఆయన మహిమలోనికి వెళ్లిపోయినాడు. గనుక ఇక ఏవరు శోధించరు, వాడివన్నీ ఓడిపోయినవి. రేపు సైతాను దయ్యము, అంధకారము మనలను ఏమిచేయలేవు. దగ్గరకు వచ్చీనా ఏమిచేయలేవు. 3 గీతల పొడుగు న నడిచి వెళ్లిపోతాము. ఏమియు ఏమిచేయలేవు. తుదకు ఏ వరుస వచ్చింది. సిలువ వరుస వచ్చింది. ఆ సిలువగీత, అడ్డుగీత కలసి సిలువు అయినది. ప్రభువు సిలువను జయించిరి. శుక్రవారము సిలువమీద ఉన్నారు. ఆదివారము సిలువ జయించినారు. సిలువ ఆయనను జయించగలదా! లేదు. సంఘము సిలువను జయించగలదా! జయించగలదు. గనుక ఆదివారము సిలువ గొప్పదా! సంఘము (ఆయన) పొందిన జయము గొప్పదా! ఇంకొక సిలువ ఉన్నది. కల్వరికొండ మీదనున్న సిలువకంటే ఇంకొక సిలువ ఉన్నది. అదేదనగా, ఇప్పుడు అందరికి బోధానందము కలిగినది. ఆలాగే ధ్యానందము కలుగవలెను. అందరికి ఈష్టరు సలాం.


కల్వరికొండమీద కన్నీరు కార్చిన మనము, ఆదివారమందు ఆనందిచెదము. ఆనంద భాష్పములు రాల్చెదము. అదే గొప్ప ఈష్టరు. ఎప్పుడు? ప్రభువు రెండవమారు వచ్చినప్పుడు జరుగును. పునరుత్ధానములు రెండు రకములైన పునరుత్ధానములు. అవి ఒకటి ప్రభువు పునరుత్ధానము, మరియొకటి సంఘ పునరుత్ధానము. జయించినవాడు వ్రాస్తే, తాను పొందిన జయమును గూర్చియే వ్రాస్తాడు. జయించనివాడు ఏమి వ్రాయలేడు.


అట్టి జయ జీవితము పునరుత్ధానుడైన ప్రభువు మీకు దయచేయును గాక! ఆమేన్.


కీర్తన : "మరణంబులో నాకు చిరజీవమెవ్వరు - మరణంబునకై గొప్ప మరణమెవ్వరు = విరివిలేని మహిమ సేవలు - దరిని నుండగ నన్ను చెంతను - స్ధిరముగా స్ధాపించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే" ||నాకింత||