లెంటులోని నాలుగవ ఆదివారము

మత్తయి 27:1-44

ప్రార్ధన:- సిలువ విలువ నిలివ చేయుటకై ఏటేట సిలువధ్యానము చేసికొనే ఏర్పాటు దయచేసిన నీకు వందనములు. సిలువమీదనుంచి వచ్చే నీతి సూర్యకిరణములు మా మీద ప్రకాశింపజేసి, నీ వాక్కు, నీ సందేశము దయచేయుమని వేడుకొంటున్నాము. ఆమేన్.


దొంగ పరదైసు వెళ్లిన కధ పూర్తి కాలేదు. ఎందుకంటే దొంగయొక్క ఆత్మ పరదైసునకు వెళ్లినా, అతని శరీరము సిలువకు అంటగొట్టబడియున్నట్లు, ఈ దొంగ కధ మనలను అంటుకొనియున్నది. ఈ దొంగ గజదొంగ, బందిపోటు. దొంగ మోక్షము కోరుకున్నాడు ఏమిటి? స్వస్ధత కోరుకోవాలి గాని. "యేసుప్రభువా! నీవు అనేక మందిని రక్షించు చున్నావు, నాకు దేహము మీద అనేక గాయములున్నవి. కాబట్టి ఈ గాయములు మాన్పివేయుము. అప్పుడు నేను ఇంటికి పోయి కష్టపడి బ్రతుకుదును, పాటు పడతాను గాని దొంగ పని చేయను" అని అనవలెను. ఇతడు ఆలాగు ప్రార్ధన చేస్తే సబబుగా ఉండును. కానీ ఆలాగు చేయలేదు.


ఈ కాలములో అనేక స్ధలములలో, ఇక్కడ కాకానిలోను అనేకులు జబ్బులు పోగొట్టుకోనే దృష్టితోనే వస్తున్నారు, గాని రక్షణ కొరకు కాదు. శరీరములోనున్న కష్టమును తొలగించుకొనే ప్రార్ధన ఉన్నది. కాని ఈ దొంగ ఆ ప్రార్ధన చేయలేదు. ఇప్పుడు యేసుప్రభువు అతనిని సిలువ మీదనుండి బాగుచేసి దింపి, ఇంటికి పంపివేయుట గొప్పా? లేక పరలోకమునకు రక్షించి తీసికొని వెళ్లుట కష్టమా! అయితే యేసుప్రభువు గాయములు మాన్పలేడా? పేతురు ఆయన రక్తముచేత స్వస్ధత అని వ్రాసినారు. ఇక్కడ ఎందుకు చేయలేదు ఇతను తాను భూలోకములో నివసించి చూడవలెనని కోరాడు. పరలోకమునకు వెళ్లలేదు. అయినను పరలోక రాజ్యము కోరుకున్నాడు. మన దేశములోని గవర్నమెంటు వేరు, మన ఇల్లు వేరు. ఇతడు ఆ గవర్నమెంటును కొరుకున్నాడు. పరలోకములో రాజ్యమున్నది. పరలోకములో ఇల్లు ఉన్నది. అయితే పరలోకములోని రాజ్యము ఎక్కువ. ఈ దొంగ ఇంటిని కోరుకోలేదు గాని గొప్పదైన దానిని కోరుకొనెను. ఈ దొంగ కష్టపడి సంపాదించుకొనక, వారిని వీరిని దొంగలించినాడు. ఇప్పుడు పరలోకములోని గొప్పది కోరుకున్నాడు. యేసుప్రభువు అక్కడనుండి ఇక్కడకు వస్తాడు అని గ్రహించినాడు. ఉదా:- గవర్నమెంటు వారు (ఢిల్లీలో) మీటింగుచేసి మీటింగు అయిపోయిన తరువాత ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోతారు. కేసు విచారణకు రాజ్యమునకు వస్తారు. అలాగే యేసుప్రభువు రాజ్యము చేయుటకు భూలోకమునకు వస్తారు. అందుచేతనే ఈ దొంగ నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుము అన్నాడు. గనుక మన కోరిక కూడ ఆయన తీరుస్తారు. ఆ దొంగ కోరిక ఆయన నెరవేర్చాడు. ఎందుచేత? అతడు అందుకు సిద్ధమైయున్నాడు. అందుకు దొరికింది. అతడు తన పాపముల విషయమై పశ్చాత్తాప పడినాడు. ప్రక్క దొంగతో నీవును, నేనును పాపులము. శిక్షకు పాత్రులమని చెప్పాడు. కాబట్టి మారుమనస్సు పొందాడు.


బోళము:- అనగా మారుమనస్సు అందించే చేదు. పాపములు ఒప్పుకొన్నప్పుడు కూడ ఈ బోళమువలె నుండును. మద్దెల వాయించేటప్పుడు బోళము వేస్తారు. ఈ బోళమనేది అరేబియా దేశములో నున్నది. అది ఒక చేదైన వేరు. ఆ చేదే పశ్చాత్తాపమునకు, మారుమనస్సునకు గుర్తు. ఆ బోళము అనగా మేము మారుమనస్సు పొందాము అనట్టే. గనుక ఇతడు మారుమనస్సు పొందాడు గనుక యేసుప్రభువు దగ్గరకు తూర్పుజ్ఞానులు తెచ్చిన బోళము తెచ్చాడు. రెండవది


సాంబ్రాణి:- సాంబ్రాణిని నిప్పులపై వేస్తే పొగ పైకి వెళ్లును. అది ప్రార్ధనకు గుర్తు. దొంగ కూడ సాంబ్రాణి తెచ్చినాడు. ఎందుకంటే దేవా! అని ప్రార్ధన చేసినాడు. ఇతడు మారుమనస్సు పొందాడు, ప్రార్ధన చేసాడు.

ఇది మాట. మారుమనస్సు పొందేకంటే, ఈ మెచ్చుకొనడము ఎక్కువ.


ఉన్నపాటు:- పాపములు ఒప్పుకొని, స్నానముచేసి, బట్టలువేసికొని, శుద్ధిచేసికొని రావడము ఏలాగున్నదో అలాగే ఈ దొంగ ఉన్నపాటున ప్రభువు దగ్గరకు రావడము, మారుమనస్సు పొందడము తప్పు చేసినప్పుడు పట్టు పడినప్పుడు, పోలీసులు కొట్టినప్పుడు, మారుమనస్సు పొందలేదు గాని యేసుప్రభువు వద్దకు వచ్చినప్పుడు అతనికి మారుమనస్సు వచ్చింది. ఆయనలో నేరము లేదు, ఆయన పరిశుద్దుడు గనుక ఆయనతో పోల్చుకుంటే అతనికి దుఃఖము వచ్చింది. అప్పుడు పశ్చాత్తాపము, మారుమనస్సు కూడ వచ్చింది. అలాగే యేసుప్రభువును మెచ్చుకోవడము వచ్చింది. అందుకే యేసుప్రభువును గురించి దొంగకు ప్రసంగము చేశాడు. అనగా యేసుప్రభువు సేవ చేశాడు. మనము ప్రసంగము చేస్తే అందరు మారుమనస్సు పొందరు. అలాగే ఈ దొంగ కూడ ప్రసంగము చేశాడు. ఇతనిలో చాల మంచి సుగుణమున్నది. ఆయన చచ్చిపోయి తన రాజ్యముతో వస్తాడు అని అనుకొన్నాడు. గొప్ప జ్ఞాని. తూర్పు జ్ఞానుల కంటే ఎక్కువ జ్ఞాని గనుక ఇతనిని పడమటి జ్ఞాని అందాము.


ఇతడు సేవచేయుట, ప్రసంగము చేయుట ఈ మొత్తము కలిపి బంగారపు ముద్ద అయినది. గనుక ఈ దొంగ బంగారము కూడ తెచ్చాడు. యేసుప్రభువు దగ్గరకు ఈ మూడు తెచ్చాడు. అతడు చేసిన సేవ, ప్రార్ధన, పెద్ద ఎత్తు వేయడమా? ఏది బంగారము? ఆ దొంగే బంగారము. యేసుప్రభువుకు కావలసినది మనిషి. తండ్రి తప్పిపోయిన కుమారుని విషయములో సొమ్ము అక్కరలేక పోయింది. కొడుకు కావలసి వచ్చింది.అలాగే మనమే యేసు ప్రభువుకు కావాలి. యేసు ప్రభువుకు ఉన్నపాటున వచ్చినవారు కావాలి. యేసుప్రభువు పరలోకమునుండి మనిషి కొరకు వచ్చాడు. కాబట్టి మనిషినే తీసికొని పోయాడు. ఆయన కోరిక నెరవేరినది. పని సంపూర్తి అయినది. దొంగను రక్షించి పరలోకమునకు తీసికొని వెళ్లుట, రాబోయే కాలములో కూడ మనిషిని తీసికొని వెళ్లుటకు ముంగుర్తు. దొంగ, శ్రమల ద్వారా ప్రభువును తెలిసికొన్నాడు. మనిషి దేవుని తెలిసికొనవలెనంటే శ్రమలు కావలయును. ఒక వేళ శ్రమలు లేకపోతే సమాప్తము కాలేదన్న మాట. శ్రమలు భక్తులకు శ్రమలుకాదు. ఎడమ ప్రక్కనున్న దొంగకు శ్రమయైనదిగాని, కుడిచేతి ప్రక్క నున్న దొంగకు శ్రమకాలేదు. దొంగకు కలిగిన ఈ శ్రమ ఎటువంటిదైనదంటే, ఆ శ్రమ అతనికి తూర్పు నక్షత్రమువంటిదైనది. తూర్పు జ్ఞానులకు యేసుప్రభువును చూపింది నక్షత్రము. అలాగే ఈ సిలువమీద నున్న దొంగకు శ్రమ అనే నక్షత్రము యేసుప్రభువును చూపింది గనుక శ్రమలు నక్షత్రములు . యేసుప్రభువుకు మారుమనస్సుపొందిన వ్యక్తి దొరికితే, బంగారము దొరికినట్లు మనకు శ్రమలు కలిగితే నక్షత్రములు కలిగినట్లు.


ప్రార్ధన:- యేసుప్రభువా! నీ పాపములు జ్ఞాపకము చేసికొననన్నావు. దొంగను జ్ఞాపకము తెచ్చుకున్నావు. అతని పాపమును జ్ఞాపకము చేసికొనలేదు. అతనికి రావలసిన మోక్షము జ్ఞాపకము చేసికొన్నావు. నక్షత్రము నిన్ను జ్ఞానులను జ్ఞాపకము చేసింది. ఇంటివద్దనున్నప్పుడు నిన్ను జ్ఞాపకము చేసింది. అలాగుననే ఇతని శ్రమ నిన్ను జ్ఞాపకము చేసింది. జ్ఞాపకము చేయడము రహస్యముగా నీవే, అనగా పైకి శ్రమద్వారా జ్ఞాపకము చేసావు. 'నేను జ్ఞాపకము చేసికొంటాను నిన్ను' అని నీవు చెప్పలేదు. దానికంటే ఎక్కువే చేస్తావు. ప్రభువా! 'నేడు నీవు నాతో పరదైసులో ఉంటావు' అని చెప్పినావు. అలాగే తండ్రీ! మేము కూడ మారుమనస్సు పొంది నీ దగ్గర ఉంటే, మోక్షములో చేర్చుకొంటావు. మా జబ్బులు తీసివేసిననూ, తీసివేయక పోయిననూ మోక్షము ఇవ్వకుండా ఉండవు. నీకనేక వందనములు. ఈ వేళ మేము మాట్లాడుకున్న మాటలు, మా ఆత్మకు ఉపయోగకరముగా నుండునట్లు దీవించుమని సిలువమీద నున్న యేసు ప్రభువు ద్వారా పరలోకపు తండ్రీ వేడుకుంటున్నాము. ఆమేన్.


ఒక పాపి మారుమనస్సు పొందితే పరలోక దేవదూతలు ఆ దినము డిన్నర్ పార్తీ పెట్టుకొందురు. అంత సంతోషము అక్కడ కలుగును.


అట్టి స్ధితిలో, ఈ శ్రమల ధ్యాన కాలములో ప్రభువు మనలను స్ధిరపరచుకొనును గాక! ఆమేన్.


కీర్తన: "తన్ను జంపు జనుల యెడల - దయను జూపెను = చెన్నుగ దొంగను రక్షింప - చేయి చాపెను" ||పాప మెరుగనట్టి||