లెంటులోని ముప్పది ఒకటవ దినము - బుధవారము

రోమా 8:35-39; గలతీ 2:20.

ప్రార్ధన:- తండ్రీ! నా నిమిత్తమై శ్రమపడుచున్న తండ్రీ! నను చూచుచూ శ్రమను అనుభవించిన తండ్రీ! నా మేలుకొరకై నీ ప్రాణము పోతున్నంతగా రక్తము ధారపోసిన తండ్రీ! నీకే ఆగని వందనములు, తరుగని స్తోత్రములు. పాపముతో కప్పివేయబడిన ఈ మానవులను నీ ప్రేమతో వెలికితీసి, నీ రూపములోనికి మార్చుకొని మురియుచున్న తండ్రీ! నీ సిలువ పై నీవు కనపర్చిన ప్రేమను మేము గ్రహించుటకు, అనుభవించుటకు ఇతరులకు అందించుటకు నేడు మాతో మాట్లడుమని ప్రేమనాధుడైన యేసునామమున అడుగుచున్నాము. ఆమేన్.


ప్రభువు ఈ లోకములో 33½ సం||లు జీవించినపుడు సుఖమనుభవించినాడా? కష్టము, శ్రమ అనుభవించినాడా? ప్రభువు ఎప్పుడైనా సంతోషమనుభవించెనా? సిలువమీద నున్నప్పుడు సంతోషించెనా? సంతోషించెను. దొంగ మారినప్పుడు, అత్తరు పూసిన స్త్రీ అభిషేకించినపుడు. సంతోషమనుభవించెను. యేసుప్రభువు భూమిమీద సుఖము, కష్టము అనుభవించినాడు గనుక సంఘము కూడ వాటిని అనుభవించవలెను. నేడు సంఘము సుఖమనుభవించుచున్నది గాని ఎప్పుడు కష్టము అనుభవించుచున్నది? సంఘము శ్రమలను అనుభవించకపోతే ప్రభువుతో సమానముకాదు. ఇప్పుడు సంఘమునకు ఎగుడు దిగుడులు ఉన్నవి గాని సంఘము పరలోకమునకు వెళ్ళినప్పుడు ప్రభువుతో సమానముగా ఉండును. ప్రభువు సంఘమును తీసికొని వెళ్లవలసినదిగాని, శ్రమ అనుభవించుమని చెప్పి, నేను వచ్చి తీసికొని వెళ్లెదననెను. ప్రభువు శ్రమపడి పైకి వెళ్లెను. మనము శ్రమ అనుభవించకపోతే ప్రభువుతో సమాన అంతస్ధు లేదు అనగా ఆయనవలె పైకి వెళ్ళలేము. ప్రభువు - పాపము, శిక్ష, రోగము, సిలువ, మరణమును అనుభవించెను. మనమీద అవి లేవు అనెను. అయిననూ అవి మనమీద ఎందుకున్నవి? మన వంతు మనము అనుభవించవలెను గనుక. ప్రభువు, సంఘము సమానముగా ఉన్నారు. విశ్వాసి శ్రమ అనుభవిస్తే క్రమశిక్షణ, కొత్త పాఠము నేర్చుకొనును. దీనివలన 'గొప్ప ఉపకారము చేయుటకు ఈ శ్రమ వచ్చెను' అని విశ్వాసి అనును. అవిశ్వాసి పాపము, ప్రభువు మోసినను' నాకు తీసివేయలేదు, కష్టమౌచున్నాదనును'. విశ్వాసి కొన్ని విషయములలో అవిశ్వాసపడును. తుదకు విశ్వాసము పూర్తియగును. పొందబోవు మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్న తగినవి కాదు అని పౌలు వ్రాసెను. మన యెదుట ఉన్న మహిమ ఆకాశమంత - శ్రమ చోడిగింజంత ! ప్రభువు పొందిన ఆ ఏడు అవస్ధలు సంఘమునకున్నవి.

ఆత్మ జీవనము: సంఘముయొక్క అవస్ధ.

ఈ శ్రమలు కలిగినప్పుడు అవిశ్వాసపడవద్దు. విశ్వాసులకు ఆహారము లేకుండునా? లేకుండును. ప్రభువు ఆహారలేమిని అనుభవించెను. ఆయనకు సిలువమీద నీళ్ళు దొరకలేదు. ప్రభువుకు వచ్చినవి అన్నియు సంఘమునకు వచ్చును. అన్ని కష్టములలో ప్రభువు ఉన్నాడు. ఈ ఏడు శ్రమలు మనకు కలిగినప్పుడు ప్రభువు ఉండును. ఈ ఏడు అవస్ధలు సంఘమునకు కలిగినప్పుడు ప్రభువు ఉండును. ఏందుచేత? 'ఏడు అవస్ధలు పడి సంపాదించిన ఈ సంఘమును ఎట్లు విడువను! 'అని ప్రభువు సంఘముతోనే ఉండును. విశ్వాసులు అన్ని అవస్ధలలో ప్రభువు ఉండును. యేసుప్రభువునకు వచ్చినవే సంఘమునకు వచ్చును. కాని ప్రభువు సహాయకారుగా ఉండును. విశ్వాసి అవస్ధలలో ప్రభువు ఉండకుండా ఉండడు. ఆయన సంఘమును విడిచిపెట్టి ఉండలేడు. ఈ విషయములు తలచి, స్తుతించవలెను. అప్పుడు శ్రమలు పూర్తిగా తీసివేయును. పూర్తిగా తోలగించును. ప్రభువా! ఇన్ని ప్రార్ధనలు చేసినను, నా కష్టములు తీసివేయవే ప్రభువా! అంటే, "మీరు శ్రమలకు భయపడకండి, నాకు భయపడండి. మిమ్మును రక్తముతో కొన్నది శ్రమలకు భయపడుటకు కాదు. నేనున్నాను, ఫర్వాలేదు" అనును. విశ్వాసికి పాపశోధన వచ్చునా? వచ్చును గాని వడలిపోకూడదు. శ్రమలలో మూల్గితే ప్రభువుకు శత్రువులగుదురు. 'ప్రభువా! ఈ వేళ మేలున్నది' అని శ్రమ దినమున అంటే ప్రభువుకు మిత్రులౌతారు. మీకు ఏది ఇష్టము? మీరు విసుగుకున్నను ప్రభువు ఏమీ అనడు. శ్రమ పెట్టినప్పుడే ఏమీ అనలేదు. విసుగుకుంటే విసుగుకొన్నవారికే శ్రమ కాని ప్రభువుకేమి కష్టము లేదు. ఆయన అన్ని జయించెను. 'నేను ప్రార్ధన చేయను' అని అనుకొంటే మనకే కీడు. కనుక శ్రమలలో ప్రభువును స్తుతించండి. ఇదే గొప్ప విషయము. మన శ్రమలలో ఆయన మనలను విడిచి వెళ్ళరు. మనము శ్రమ పడుచున్న కొలదీ, ఆయన ప్రేమ మన యెడల అధికమగుచుండును. ఈ పాప జీవుల యెడల దేవునికి ఉన్న ప్రేమను తెలియజేయుటకు ఒక ఉదాహరణ చెప్పుదును.


దృష్టాంతము:- ఒక మామిడి తోటలో కోతులు ఉన్నాయి. వాటిలో ఒక కోతి పిల్ల చనిపోతే దానిని తోటమాలి చూచి విచారించెను. కోతి తన పిల్లను ముద్దుపెట్టుకొనుచుండగా, తోటమాలి నీవు వెళ్ళిపో! పిల్ల చనిపోయినదని చెప్పి అదరిస్తే వెళ్ళలేదు. కర్రతో జడిపించగా పిల్ల జారిపడెను. తోటమాలి పిల్లను తీసివేసెను. కోతి పిల్లవైపు, కర్రవైపు చూచుచున్నది. తోటమాలి గొయ్యి తీసి పాతిపెట్టగా, కోతి దానిని (గొయ్యి) త్రవ్వబోయెను. తోటమాలి బెదిరించగా అక్కడక్కడ తిరుగుచుండెను. ఇతడు అవతలకు వెళ్ళగా కోతి త్రవ్వి తీసెను. మరలా తోటమాలి పాతిపెట్టగా, మరలా త్రవ్వి తీసి, ముద్దుపెట్టుకొనెను. తోటమాలి అది చూచి దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ! ఈ కోతిలో ఇంత ప్రేమ పెట్టినాడని సంతోషించినాడు. తోటమాలి ఆ పిల్లను తీసి మరియొక చోట పాతిపెట్టెను.


అలాగే దేవుడు- నిన్ను రక్షిస్తానంటే, మానవుడు వద్దు అనుచున్నాడు. చివరి గడియవరకు ప్రభువు మనిషి ఆత్మను విడిచి పెట్టడు. లాభము లేకపోయినా ప్రయత్నించుచూనే ఉండును. మనిషి దృష్టి, మనిషి విలువ, మనిషికి అక్కరలేదు గాని దేవుని దృష్టికి మాత్రము మనిషిని రక్షించుటే. 'నన్ను వెంబడించుడి' అని యేసు ప్రభువు శిష్యులతో అన్నారు. నేడును యేసుప్రభువు 'పాపి నన్ను వెంబడించు మనుచుండెను. పాపి బంధకములు, తీర్పు, మరణములో ఉండగా ప్రభువు పాపివద్దకు వెళ్లెను. కోతిపిల్ల శవము తల్లిని పిలువలేదుగాని కోతి తనంతట తానే వెళ్లెను. యేసుప్రభువునకు కూడ ఆలాగు మనిషి కోసము వెళ్ళినది నిజము. నశించిపోయిన మనిషి వద్దకు వెళ్ళి రక్షించినది నిజము. పాపికూడ యేసుప్రభువు తనవద్దకు వచ్చెనని సంతోషించుచున్నాడు గనుక యేసుప్రభువు - 'పాపీ! నీవు ఊరుకో! నేను నిన్ను రక్షిస్తాను' అనుచున్నారు. ఇది దేవుని అనంత ప్రేమయై ఉన్నది. గనుకనే నశించిపోయిన మానవుని శరీరాత్మలను వెదకి రక్షించెను, తన తనువును సిలువపై చాలించెను.


అట్టి నిండైన దేవుని ప్రేమ ఈ శ్రమకాలమంతయు మిమ్ములను ఆవరించుకొని, ఆయన అనంత ప్రేమలో ఓలలాడించును గాక. ఆమేన్.


కీర్తన: "తనువు బలిపెట్టెను మా యన్న - తప్పుల్విడగొట్టెను మా తండ్రి = మనసులో సాక్ష్యమిట్లున్న - మనుజు లెట్లన్నను మాకేమి" ||యోహోవా||