లెంటులోని పదిహేనవ దినము - శుక్రవారము
మార్కు 15:42-47
ప్రార్ధన:- తండ్రీ! నీ ఘన నామమునకు వందనములు. నీ శ్రమల ద్వారా మాకు పాఠము నేర్పించు చున్నందుకు నమస్కారములు. నీ సహింపును, జయమును మాకును దయచేయుదువని యేసు నామమున వందించుచున్నాము. ఆమెన్.
నిన్న వాక్యములో శ్రమల నీడల యొక్క గుంపుల గురించి వివరించితిని. అవి మన ప్రభువుయొక్క శ్రమ, మరణ చరిత్రలో తటస్ధమైనవి. అయితే ఈ వేళ ఆ నీడల గుంపు గురించికాదు, మన శ్రమల గుంపు గురించి చెప్పవలెను. మన రక్షకుడు శ్రమలు అనుభవించినాడు. మనముకూడా శ్రమలు అనుభవించి తీరవలెను. ఇతరులు అనగా అన్యులు మన మధ్యను నిలువబడి, మన మీద ప్రశ్నలు వేయుచున్నారు. ఈలాగు 'అన్యులనే పేరు' కొందరికి, ముఖ్యముగా గవర్నమెంటుకు ఇష్టము లేదు. మేము అన్యులమా? మీరేనా స్వదేశీయులు? అని అందురు. ఇక్కడ ప్రభువు శ్రమల గుంపున్నది. అక్కడ మన శ్రమల గుంపున్నది. అన్యులంటున్నారు : యేసుప్రభువు ఇన్ని శ్రమలు పొంది సహించిరిగదా! ఆయన నామమును స్మరించు మీరరేమి అనుభవించుచున్నారు? అంటున్నారు. జవాబు ఏదనగా ఆయన నామమందు శ్రమలు భరించుటకు మేము సిద్దమే. అయితే క్రైస్తవులు, ఇతరులు కూడా కొన్ని శ్రమలు అనుభవిస్తున్నారు. అవి ఎన్ని రకములైన శ్రమలనగా ఐదు రకములైన శ్రమలు.
1) శ్రమ:- వంశపారంపర్యముగా వచ్చిన శ్రమ. ఏదనగా చిన్నప్పుడు చంటి పిల్లలు జబ్బు చేసి చాలా బాధపడుచుంటారు. కారణం వంశపారంపర్య పాపమును బట్టియే వారికి ఈబాధ. పిల్లలకు, యౌవనస్ధులకు, పెద్దలకు, వృద్దులకు వారి వంశములోనున్న శ్రమ, కీడులను తొలగించుకోవలెను గాని తోలగించుకోలేము. తొలగించుకొనుటకై మనము ప్రయత్నము చేస్తాము గాని కొంతవరకే శాంతి, పూర్తిగా కాదు. ఇక్కడున్న మనందరిలో ఎవరికైనా వంశపారంపర్య జబ్బు, కష్టము, దుర్భుద్ది ఉన్నదేమొ పరిక్షించండి. అప్పుడు మనము క్రైస్తవులము. నొప్పి గనుక వంశపారంపర్యమును బట్టి వచ్చిన వ్యాధితో మనకేమి సంబంధము లేక పోయినా, వచ్చిన బాధను బట్టి తప్పక ప్రార్ధనలో పెట్టాలి. దేవుని చిత్తమైతే పోతుంది, లేనియెడల చనిపొవువరకు అట్లే యుండును. పెద్దల జబ్బు మనకు వస్తుంది, ప్రార్ధించినా పోదు. అది ప్రభువు పూర్తిగా తీసివేస్తే తీసివేస్తారు. ఆయన తీసి వేయుట మన ఆత్మీయ జీవితానికే కీడు. అందుకని తీసివేయరు. అనేకులకు ఇది తీసివేయమంటే తీసివేస్తాడు. గానీ ఆయన తీసివేస్తాను అనక 'నా కృప నీకు చాలు' అన్నారు. "భక్తుడు శ్రమకు సహిస్తే పిశాచి సిగ్గుపడును".
2) శ్రమ:- 1). మనిషి అశ్రద్ధగా ఉంటే ఏదో ఒక దెబ్బ తగలనైనా తగులును. ఉదా:- ఫుట్ బాల్ ఆడే కుర్రవాడు గోల్ చేయాలనుకొని కొడితే, అశ్రద్ధవల్ల దవడమీద దెబ్బ తగిలింది. అయితే అది వంశపారంపర్యము గాదు. అశ్రద్ధ దెబ్బలు అనేకములు. ఇది మనకు అనుభవమే. 2). మరియొక సంగతి ఏమనగా, స్టేషనులో బండి ఆగును. ఒకరు దిగుచున్నారు. ట్రైను తిరిగి కదలగా క్రిందపడి దెబ్బలు తగిలెను. అది అశ్రద్ధ. అశ్రద్ధ వలన వచ్చిన శ్రమలు సహించుకోవలెను గాని ఏడ్చినటైతే పోవునా?
3) శ్రమ:- శత్రువులవల్ల బాధ. అనగా శత్రువులు మనమీద పగపట్టి అన్యాయముగా బాధించి కోర్టుకు లాగుట, రౌడీలతో కొట్టించుట, ఇల్లు దోపిడి చేయించుట; ఇవన్నియు శత్రువులవల్ల జరిగిన బాధలే గాని వంశపారంపర్య బాధలు కావు.
4) శ్రమ:- మనిషి పాపము చేసినందువల్ల లేదా ఒకరిని కొట్టినందువల్ల అవతలవారు పోలీసు వారికి రిపోర్టు చేస్తే ఇతనికి శిక్ష. ఇంకొకరు వేరొకరిని చంపితే అతనికి ఉరి. ఆ ఉరి తన పాపమువల్ల వచ్చినది. గాని వంశపారంపర్య పాపమువల్ల వచ్చినది గాదు. అది తప్పదు. భక్తులకైనా పాపముచేస్తే, ఫలితము తప్పదు. భక్తులకైనా వంశపారంపర్యంవల్ల వచ్చిన శిక్ష కొంత వరకు తగ్గ వచ్చును, ఈ నాలుగు రకాల ప్రార్ధనల వల్ల. అయితే, అశ్రద్ధవల్ల వచ్చిన శిక్ష, శత్రువులవల్ల వచ్చిన శిక్ష తప్పదు గాని ప్రార్ధనవల్ల శ్రమ తగ్గినప్పుడు దేవునికి మహిమ, తనకు మేలు. సహింపువల్ల తనకు మేలు.
5) శ్రమ:- ఇది మహా గొప్పది. అదేమనగా నీవు బజారులో ఒక వీధిలో కీర్తనలు పాడుచూ, బైబులు చదువుచూ, ప్రసంగిస్తూ ఉన్నప్పుడు మత విరోధులు వచ్చి నిన్ను పట్టుకొని చితుకబాది ఈడ్చివేస్తారు. ఆలాగు జరుగుట దేనినిబట్టి? వంశపారంపర్యమా? పొరబాటునుబట్టియ? కాదు. మత విరోధమునుబట్టి. యేసుప్రభువు నిమిత్తమై ఆ శ్రమ వచ్చెను. అది చాలా మంచిదే. క్రైస్తవులను మత విరోధులు చంపుచున్నారు. అపొస్తలులులో 7 గురిలో ఒకడైన స్తెఫెనును చంపుచుండగా 'వీరిని క్షమించుము' అని ప్రార్ధించి చనిపోయెను. దేవుడు అతనికి మరణం తప్పించకరానిచ్చెను.
6) శ్రమ:- స్తెఫెను గొప్పతనము(అతిశయము)ఏమనగా,నేను ప్రభువు కొరకు చనిపోయినాననేది. స్తెఫెను బంధువులు క్రైస్తవులై యుంటే, మాలో ఒకరు మా ప్రభువు కొరకు భక్తినిబట్టి, హతసాక్షిగా చనిపోయేనని చెప్పుకొందురు. పాపమును బట్టి కాదు అని ఘనంగా చెప్పుకుంటారు. గనుక ప్రభువు నిమిత్తమై కష్టము, నష్టము అనుభవించినా; లేని పోని నిందలు, దెబ్బలు అనుభవించినా, అన్యాయముగా జైలుకు వెళ్ళినా; ప్రభువును బట్టి హతమై పోయినా;
ఈ 6 అంశములద్వారా ఆ భక్తులకు కీర్తి. భక్తుడంటే పై వన్నీపడి అనుభవించి సహించిన వాడే. చిన్నమాట పడనివానిని భక్తుడంటారా? పై 6 సహించి స్తుతంచిన వారే భక్తులు. పై ఆరునూ అందరికి కావాలని చెప్పను, రావాలని కోరను. ఒకవేళ వస్తే!
- 1) ప్రభువునుబట్టి సహించాలి. 2)క్రీస్తు మతానికి పేరు తేవడానికి సహించాలి.
- 1) ప్రభువునుబట్టి సహించాలి. 2)క్రీస్తు మతానికి పేరు తేవడానికి సహించాలి.
అలాగు అన్ని విధములైన శ్రమలను ఓర్పుతో సహించుకొని, శ్రమలనుండి పునరుత్ధానమగు ధన్యత ప్రభువు మీకు దయచేయును గాక! ఆమేన్.
కీర్తన:- " మరణంబులో నాకు చిర జీవ మెవ్వారు ! - మరణంబునకై గొప్ప - మరణమెవ్వారు = విరివి లేని మహిమ సేనలు - దరిని నుండగ నన్ను చెంతను - స్ధిరముగా స్ధాపించు నెవరు! సల్వబడ్డ యేసుక్రీస్తే! "||నాకింత||