లెంటులోని ముప్పది రెండవ దినము - గురువారము
మత్త.26:36-46; మార్కు 14:32-42; లూకా 22:39-46; యోహాను 18:1.
ప్రార్ధన:- తండ్రీ! మనవ మాత్రునిగా గెస్తేమనె తోటలో నీవు పడిన శ్రమ, వేదన మా జ్ఞానమునకు అందదు. మా అందరి నిమిత్తము నాడు నీవు చేసిన ప్రార్ధనే నేటివరకు మమ్ములను విమోచించుచున్నది, బలపర్చుచున్నది, నడిపించుచున్నది గనుక నీకు వందనములు. అట్టి నీ ప్రార్ధనానుభవము మాకును కలుగుటకు నేటి దిన వర్తమానమిమ్మని యేసు నామమున అడుగుచున్నాను తండ్రీ. ఆమేన్.
ప్రభువు గెత్సేమనే తోట వెలుపల ఎనిమిదిమంది శిష్యులను ఉంచిరి, తోటలోపలికి ముగ్గురుని మాత్రము తీసికొని వెళ్ళెను. ఈ ముగ్గురి యొద్దనుండి రాతివేత దూరము వెళ్ళి అక్కడ ప్రార్ధనలో నుండెను. ఆ మహాప్రార్ధన దినము మూడు ఏర్పాటు ప్రార్ధన స్ధలములు గలవు. అచ్చట ఆయన
- 1.
- (i) చింతించుటకును,
- (ii) దుఃఖపడుటకును,
- (iii) విభ్రాంతి పడుటకును,
- (iv) వేదనపడుటకును,
- (v) అతురపడుటకు - దుఃఖసముద్రములో మునిగిపోవుటకును ఆరంభించెను.
- 2. ప్రభువు తన వేదన దేవదూతలకు చెప్పుకొనలేదు. మనుష్యులకు చెప్పుకొలేదు. ఇది కేవలము మనుష్యత్వమును వాడుకొనుట. మానవుల యెడల ఆయనకెంత గౌరవము. వారివలన ఆదరణ కలుగక పోయినప్పటికిని వారితో సంభాషించుటవలన వారియెడల కనపరచినది ఎంత ప్రేమ! ఎంత గౌరవము! ఎంత చనువు! తోటలో ఆయన మనిషి సహాయము కోరుకొనెను. ఒక ఇంటిలో అందరు వెళ్ళిపోయిరి. ఒక్కరు మాత్రము ఉన్నారు. పెంపుడుపిల్లి, కుక్క, ఇంటిలో ఉన్నప్పటికిని ఇంకొక మనిషి ఉన్నట్టుండునా? చిన్నవారైన ఉన్నయెడల బాగుండుననిపించును. ఎలాగైనను మనిషికి మనిషే జత. జంతువునకు జంతువే జత. తోటలో నున్న ముగ్గురు శిష్యులైన మెళుకువగా లేరు. నిద్రమీద ఉన్నారు. అయినను ప్రభువు వారిని లేపి పలుకరించుచుండెను. ఇంతగా ఆయన మనిషి జత కోరుకొనెను.
- 3. ప్రభువు యొక్క వేదన తెలుపునట్టి మాటలు చూడగా మానవులు దుఃఖించు దుఃఖము యొక్క వర్ణన కనబడుచున్నది. ఆ మాటలు దుఃఖము యొక్క అంతస్తును తెలియజేయుచున్నవి. మనము కూడ ఎక్కువ దుఃఖ సమయమందు కొంతసేపు చింతతోను మరికొంతసేపు చాల దుఃఖముతోను ఇంకా కొంతసేపు హడలిపోవుచు తుదకు దుఃఖసముద్రంలో మునిగి పోవునట్లుందుము. ప్రభువు యొక్కవేదన కూడ గడియ గడియకు హెచ్చునట్లు కనబడున్నది.
- 4. ప్రభువు దైవత్వముతో నున్న యెడల దుఃఖించుటకు వీలులేదు. దుఃఖబాధ అనుభవించుటకు వీలులేదు. ఎందుచేతననగా లోకములోని వారేమందురు? దేవుడు గనుక దుఃఖము అనుభవించగలిగినాడందురు ఆయన దైవత్వము కలిగి దుఃఖసముద్రము అనుభవించలేదు కేవలం మనుష్యత్వముతోనే అనుభవించెను. అందులోనే గొప్పతనమున్నది. దైవత్వ సహాయము వల్ల దుఃఖమనుభవించిన గొప్పతనమేమున్నది. దైవత్వముంటే మామూలు మనిషి కూడ అనుభవించగలడు. అనగా మనము కూడ అట్టి దుఃఖము అనుభవించగలము. దైవత్వ సహాయముతో కాక పూర్తిగా మనిషివలెనె ప్రభువు గెత్సేమనే దుఃఖపడెను.
- 5. విశ్వాసులు రెండు భాగములుగా నున్నారు. గెత్సేమనేలో తోటలోపల ఉన్నవారు (ముగ్గురు శిష్యులు మాత్రమే) వెలుపల ఉన్నవారు (ఎనిమిదిమంది) యేసుప్రభువు తన హృదయ రహస్యము వెలుపల ఉన్నవారికి చెప్పలేదు. 'నేనక్కడికి వెళ్ళి ప్రార్ధన చేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని' (మత్తయి 26:36) మాత్రం చెప్పెను. అయితే లోపలనున్నవారికి తన హృదయ రహస్యము చెప్పెను. "నా ప్రాణము...నాతో కూడ మెళకువగా నుండుడి" మత్తయి 26:37,38 విశ్వాసులు కూడ ప్రభువుతో ప్రత్యక సహవాసము కలిగి యుండవలెను. అట్టివారికి ప్రభువు యొక్క హృదయ రహస్యములు తెలియును. వారే పెండ్లికుమార్తె వరుసలో నుందురు.
- 6. ప్రభువు తోటలోపల ఉన్న ముగ్గురు శిష్యులతో చెప్పిన మాటలు: మెళుకువగానుండండి. ప్రార్ధన చేయండి, ప్రార్ధన ఎట్లు చేయవలెనో ప్రభువు వారికి చెప్పలేదు. ప్రార్ధన చేయండి అని యేసుప్రభువు ముభావముగ చెప్పి వెళ్ళిపోయెను. అయితే ముమ్మారు ఆయన వచ్చి చూచిన శిష్యులు నిద్రమీదనే యుండిరి. నిద్రపోవుదురని ప్రభువుకు తెలిసినను వారినే ప్రభువు ప్రార్ధించమని కోరెను. సంఘము యొక్కస్ధితి కూడ నేడు అలాగే యున్నది. నామకార్ధమైన ప్రార్ధన, పట్టింపులేని ప్రార్ధన, నిరీక్షణ లేని ప్రార్ధన, ఆత్మ ఏకీభవించని పెదవుల ప్రార్ధన, త్వరగా ముగించవలెనని చేయునట్టి బద్దకమునకు సంబంధించిన ప్రార్ధన, ప్రార్ధనాంశములు కొన్ని మరచి కొన్ని మాత్రమే చేయునట్టి ప్రార్ధన - ఇవన్ని కలసి నిద్ర అని పేరుపొందును. శరీర నిద్ర కంటె ఈ నిద్ర కీడుగల నిద్ర. శరీర నిద్ర కూడా ఆ సమయమందు కీడుగల నిద్రయై యున్నది.
- 7. ఈ ముగ్గురు శిష్యులును సేవలోనికి పిలువబడక ముందు చేపలు పట్టుటకు రాత్రి అంతయు నిద్రమాని వేసిరి. గాని ఇక్కడ ఒక గంట నిద్ర మానలేకపోయిరి. ఇది అందరకు మెళుకువ చెప్పు పాఠము.
-
8. ప్రార్ధన:-
- 1.ప్రార్ధన లోకముయొక్క ఎడబాపు మీద ఆనుకొని యున్నది.
- 2. ప్రార్ధన మీ తత్వము మీద ఆనుకొని యున్నది.
- 3. మీ తీవ్రత మీద ఆనుకొని యున్నది.
- 4. దేవుని చిత్తము అని అనడము మీద ఆనుకొని యున్నది.
- 1. యెరూషలేమునకు గెత్సేమనే ద్వారమునకును కొంతదూరము ఉన్నది. ఆ దూరము చాలదు.
- 2. తోట వెలుపల నున్న శిష్యులకును, లోపల ఉన్న శిష్యులకును కొంత ఎడమున్నది. అది చాలదు.
- 3. లోపలనున్న శిష్యులకును ప్రభువునకును రాతివేత దూరమున్నది. అంత ఎడముగా నుండవలెను.
- 4. ప్రభువు ప్రార్ధన చేయుటకు యెరూషలేము విడిచినట్లు మనమును లోకస్ధులను విడిచి ఏకాంత ప్రార్ధనకు వెళ్ళవలెను.
- 5. ప్రియులయిన శిష్యులను ఎనమండుగురిని విడిచి ఏకాంత ప్రార్ధనకు వెళ్ళవలెను. అలాగే మనమును మన ప్రియులను విడిచి ఏకాంత ప్రార్ధనకు వెళ్ళవలెను.
- 6. ప్రభువు తనకు అట్లే మనమును అతిప్రియులను కూడ విడివిపెట్టెను.
అట్టి స్ధితిలో పెండ్లికుమారుడైన క్రీస్తుప్రభువు మిమ్ములను స్ధిరపర్చును గాక. ఆమేన్.
యేసుప్రభువా! మేము పరలోకమునకు వచ్చువరకు బహు మెళుకువగ నుండు స్ధితి అనుగ్రహించుము. మేము పరలోకమునకు వచ్చువరకు ప్రార్ధనలో నుండు శ్రద్ద అనుగ్రహించుము. మేము పరలోకమునకు వచ్చువరకు శోధనలో పడకుండ జాగ్రత్తగ నుండు స్ధితి అనుగ్రహించుము. మేము పరలోకమునకు వచ్చువరకు నీతో కలిసి సహవాస ప్రార్ధనలో ఏకీభవించు ఏకీభావము అనుగ్రహించుము. మేము పరలోకమునకు వచ్చువరకు ఆశ్రద్ద అను కునుకుపాట్లు రాకుండా మా కన్నులను కాపాడుము. మేము పరలోకమునకు వచ్చువరకు "మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెళుకువగా నుండి ప్రార్ధన చేయండి" అను ఈ నీ గద్దింపు మాట, ఈ జాగరూకత వాక్యము ఈ వజ్రవాక్యము జ్ఞాపకముంచుకొను శక్తి దయచేయుము. ఆమేన్.
కీర్తన: "ఒక తోట లోపట - నాడు నీవు పడిన - సకల శ్రమ లిచ్చోట = నికటమైయున్నట్లుగా - నిట్టూర్పులతో - దలంతు – నకట నా రాతి గుండె - శకలంబై పోవునట్లు ||నా యన్న రాగదే||