సిలువ నీడ
మత్తయి 16:1-28
ప్రార్థన :- ఓ దయగల తండ్రీ! మా హృదయ థ్యానమును అంగీకరీంచి, మా బలహీనతలు అన్నియు నీకు బట్టబయలే గనుక వాటినన్నీంటిని శుద్దిచేసి, మమ్మును క్షమించుము. మా బలహినతలు, పుండ్లు, నీరసము అన్నీ నీ పాద సన్నిథానములో, నీ అమూల్య రక్తముతో శుద్ది చేయుము. నిన్ను స్తుతించుటకును, సిలువ థ్యానము చేయుటకును మా హృదయములను శుద్దిచేసి, నీ సిలువవైపుకు త్రిప్పుము. ఓ ప్రభువైన యేసూ! నా నిమిత్తము నీవు సిలువ ఎక్కినందుకు అనేక వందనములు, అనేక నమస్కారములు, ముద్దులు. నా నిమిత్తము నీవు సిలువ ఎక్కుట, నాకు ఎంత థన్యత! ఎంత భాగ్యము! నీది ఎంత గొప్ప ప్రేమ! నేను చూచునట్లు నా ఆత్మ కన్నులను విప్పి, నాకును చూపుము.నీకు అనేక స్తోత్రములు.నీ రక్తము నా మీధ ప్రవహింపజేయుచున్న రక్షకా! నీకు స్తోత్రము. భక్తితో నీ కథ గైకొనుభాగ్యము దయచేయుము ఆమేన్.
షరా:- ఆలాగు గైకొనకుండిన పాపమే అగును. నీ ప్రేమ, నీ దయ, నీ జాలి, నీ మనస్సు, నీ ముఖ బంబమున గలదు. నీ ప్రభావాంబేల్ల -నీ ప్రయసములోనే - నెగడుచు గన్పడగలదు || ఏ పాప మెరుగనీ ||
సిలువథ్యానపరులారా! ఆయన సిలువ చరిత్రలోనీ కాంతి మీ మీద ప్రసరించును గాక. ఈ రోజు వాక్యమును నాలుగు మాటలలో చేప్పుదును. ఇందులొ సిలువ చరిత్ర అంతయు ఇమిడి యున్నది. 1) సిలువ నీడ, 2) సిలువ సమీపము, 3) సిలువ మీద ఉండుట, 4) సిలువ మీద జయము. శ్రమలు బహుదూరములో ఉన్నప్పుడే ఆయన తన శ్రమలయెక్క నీడను గుర్తించెను.
- వివరము:-
- 1) సిలువయెక్క నీడ అనగనేమి? ఫిలిప్పుదైన కైసరయలో ప్రభువు వున్నారు. ఇది యెరూషలేము ఉత్తరమున ఉండెను. అక్కడున్నప్పుడు ప్రభువు తాను పొందబోయే శ్రమలను ప్రస్తావించెను. తిరుగు ప్రయణములో శిష్యులకు తన శ్రమలను గూర్చి తెలియజేసెను. వాటిని గూర్చి వారిని అడిగెను. తారువాత పాఠములో వాటి వివరమును ఆయన వారికి చెప్పనైయున్నాడు.
- 2) సిలువ సమీపము: బేతెనియ అనే గ్రామములో బసచేసి, ఆఖరు వారములో ప్రతి దినము యెరూషలేములొ ఉండి, సాయంకాలము బేతెనియకు వస్తూ గదపిన కాలము. దినములు గడచినకొలది ఇక్కడ ప్రభువునకు సిలువ సమీపిస్తున్నది.
- 3) సిలువ మీద ఉండుట: ప్రభువు సిలువ మీద ఉండి, ఇదివరకు కైసరయలోను, బేతెనియలోను పడిన శ్రమలను జ్ఞాపకము చేసికొని అనుభవించెను. అనుభవించుటకు ఏమీ వెనుకదియలెదు.
- 4) సిలువ మీద జయము అనగా సిలువ శ్రమలక్రింద ఆయన పడిపోలేదు గాని, వాటిని లేచి జయించినాడు. అందుచేత ఆయనకు మహిమ వచ్చినది. ఇది పునరుత్ఠాన మహిమ. దీనిని బట్టియే ఎత్తబడే మహిమ వచ్చినది.
- పూర్తి వివరము:-
- 1) సిలువనీడ: అనగా మనకేదైనా కష్టము రాబోయేటప్పుడు ముందుగనే తెలియడము. కొందరికి ఇతరులు చెప్పటము వల్ల తెలియును. కొందరికి కలలోనో తెలియును, దర్శనములోనో తెలియును. అప్పుడు అవిశ్వాసి అనగా అవిశ్వాసము గల విశ్వాసి అయితె హడలిపోవును. ప్రభువు హడలిపోలేదు. ప్రభువైతే యెరూషలేమునకు వెళ్ళుచున్నానని, దైర్యముతోనే చెప్పెను. అవిశ్వాసి అయితే, నాకు ముందుకు దర్శనము రానైయున్నదని విచారముతో, భయముతో చెప్పవచ్చును. ఆలాగైతే మహిమ ఏలాగు పొందగలరు.
- 2) సిలువ సమీపము: అనగా మనకు కలలో కనబడిన కష్టము, దగ్గరబడుట, అప్పుడు మరింత హడలిపోవుదుము. ప్రభువు అట్లు భయపడలేదు. పగలు త్వరత్వరగా భోదపని ముగించెను. ప్రతి రోజు బేతెనియలో విశ్రాంతి పొందెను.'మీకు ఒక శ్రమ రాబోవుచున్నది, కాచుకో!' అని ఎవరైనా అంటే విశ్వాస హృదయము ఎట్లుండునో! అది సమీపించింది అని అంటే ఇంకెట్లుండునో?
- 3) సిలువమీద ఉంచుట: ఇది భయంకరమైనది. ఇది శ్రమలను తలంచుకొనే కాలము కాదు. అనుభవించేకాలము. సంతోషముతొ క్రీస్తు వాటన్నిటిని అనుభవించెను. మనముకూడా అట్లే అనుభవించాలి.
- 4) సిలువమీద జయము: సిలువ నీడను, సిలువ సమీపమును, కేవలము సిలువను అనగా సిలువ వేయబడుటను ప్రభువు అనుభవించినందున, పునరుత్థాన మహిమను పొందెను, ఎత్తబడెను. అట్లే సంఘముకూడా సంతోషముతో తన సిలువను భరించిన యెడల మహిమను పొందును, ఎత్తబడును. ఎత్తబడే వారందరు సిలువయెక్క నీడను, సిలువ సమీపమును, కేవలము సిలువను అనుభవించుటకు వెనుక తీయకూడదు. క్రీస్తు మహిమలో పాలు కోరితే, శ్రమలోకూడా పాలుకోరవలెను గదా!
- స్తుతి:
- 1. గత కాలమందు మనకు కలిగిన శ్రమలను, ఆ శ్రమలలో కలిగిన అనుభవమును, శ్రమ తరువాత కలిగిన జయమును తలంచుకొని స్తుతించవలెను.
- 2. రాబోయే శ్రమలను తలంచుకొని స్తుతించవలెను. అట్టి శ్రమలలో నూతన విశ్వాసము, నూతన ధైర్యము, నూతన జ్ఞానము, నూతన సహవాస భాగ్యము కలుగునని మురియవలెను.
- 3. 'నిజముగా జయము కలిగిన తరువాత అప్పుడు తండ్రిని మరెక్కువగా స్తుతించెదను ' అనుకొని, మందుగానే స్తుతించవలెను. కళ్ళ అద్దములు పెట్టుకొనకుండా చదువబోతే, అక్షారలు మసకగా కనబడును. పెట్టుకొని చదివితే మసకగా కనబడవు. గాని అక్షరములు తేటగా కనబడును. అట్టే మన సిలువను ప్రభువుయెక్క సిలువలో నుండి చూస్తే, బాగా ఉండును, గాని కష్టముగా నుండదు. అద్దములో నుంచి చూస్తే బాగానే ఉండును. అద్దము లేకుండా చూస్తే కళ్ళు లాగును.
షరా:- ప్రతి కష్టమును మనము ప్రభువుయెక్క సిలువలో నుంచి చూడడము అలవాటు చేసుకొనవలెను. అప్పుడు నిరాశ కలుగదు. జయము కలుగును. మరియు ప్రభువునకు శ్రమలు కలిగినట్లు, సంఘమునకు శ్రమలు కలుగును. అప్పుడూ ప్రభువునకు కలిగినట్లు, అరోహణ మహిమ మనకును కలుగును.
అట్టి స్థితిలో ప్రభువు మిమ్ములను ఈ వాక్యము ద్వారా స్థిరపర్చునుగాక! ఆమేన్.
కీర్తన : " సిలువ దరి కాకర్షించుము - ఖలుడను ఘోరపాపిని = కలుషములు విడ శక్తినీయుము - సిలువ ధ్యానమున " ||కల్వరి||