లెంటులోని ఇరువది తొమ్మిదవ దినము – సొమవారము
లూకా 23:10
ప్రార్ధన:- తీర్పుశాలలో నిలువబడిన యేసుప్రభువా! సిలువను నీమీద వేసికొనిన యేసుప్రభువా! నీ శ్రమ చరిత్రముందు నీవు నడచి వెళ్లుచుండగా, నేటి కాలములో అనేకులు మార్పు కలిగినది. నేటికాలములో మార్పు కలిగించని వస్తువులను నీవు కలుగ చేయలేదు. కలిగియున్నది ఏదియు నీవు లేకుండ కలుగలేదు. సృష్టిలో నేది కలుగజేసినావో దాని ద్వారా మార్పు కలిగించుచున్న నీకు స్తొత్రములు. సూర్యుని ద్వారా గొప్ప మార్పు అనగా పువ్వులకు రకరకములగు రంగులు కల్గించినావు, సూర్యుడు లేనిదే ఆ రంగులు కలుగవు. ఏ సూర్యుని నీవు కలిగించినావో, ఆ సూర్యుని ద్వారానే రంగు, అలాగే అన్ని వస్తువులకు మార్పు కల్గించుచున్న నీకు స్తోత్రములు. నీవు కలుగజేసిన వృక్షములద్వారా భూమిమీద నీడ యిచ్చుట వలన అలసట పడినవారు ఆ నీడలో కూర్చుందురు. చెట్లవలన యిదే మార్పు. అది నీవు కలుగజేసిన మార్పు అనగా నీడ. అలాగే చంద్రునివలన, మానవులకు చల్లనిదనము. నీళ్ళవలన దాహశాంతి కలుగును. ఇదొక మార్పు. ఇది వస్తువేగాని దాహము తీరే గొప్ప మార్పు ఇందులో ఉన్నది. దాహమైనపుడు ఏమి తిన్నను దాహము తీరదు. నీరు త్రాగినందున దాహము తీరును.
ఇట్లు గొప్ప గొప్ప మార్పులు సృష్టివలననే కలుగుచుండినయెడల, యింకను యెక్కువమార్పు నీ వలన కలుగును. నీవు సంచరించు చున్నప్పుడు రోగులలో నెంతమార్పు! అపుడు వారు ఆనంద గీతములతో గంతులువేసిరి. పాపులు వచ్చిన యెడల పరిశుద్ధతో పంపించియున్నావు. నీ బోధ వినినవారి కానంద మార్పుకలిగినది. దయగప్రభువా! నీ శ్రమ చరిత్ర వలన నెందరిని మార్చినావో వినినాము. నీ వలనను, నీ సృష్టి వలన మారిన ప్రతి మనుష్యుని వలనను మార్పు కలుగుచున్నది. అంతయు వింతగానే యున్నది. నీకు స్తొత్రములు నీ శ్రమచరిత్ర వలన మరొక వాలు తీసికొంటున్నాము. దానివలన యిక్కడున్నవారిని మార్చుము. ఆదివారము సింహాసనాసీనుడవై యూరేగింపుగా నూరేగి, ప్రజలలో జయోత్సవ మార్పు కలిగించినావు. ఈ వేళను అట్టి మార్పును కలిగించుమని వినయముగా వేడుకొను చున్నాము. ఆమేన్.
ప్రభువు యొక్క శ్రమానుభవ, విశ్వాసానుభవముగల విశ్వాసులారా! చెప్పిన దానినే మరియొకసారి చెప్పుచున్నాను వినండి.
- 1. ప్రభువే స్వయముగా చెప్పిన ప్రవచనము: 'మనుష్యుల చేతికి అప్పగింపబడి చనిపోయి తిరిగి లేచును.
- 2. కయప, సర్వలోకముకొరకు ఒకరు చనిపోవుట అవసరము అని ప్రవచించుట.
- 3. ప్రభువు యోరుషలేములో జయోత్సవముతో ప్రవేశించుట.
- 4. గెత్సేమనే తోటలో ప్రార్ధించుట.
- 5. గేటువద్ద ఆయనను పట్టుకొనుట.
-
6. ఐదు కోర్టులు :
- 1)కయిప కోర్టు,
- 2)అన్నకోర్టు,
- 3)పిలాతు కోర్టు,
- 4)హేరోదు కోర్టు,
- 5)పిలాతు కోర్టు.
- 7.సిలువ వేయుట.
- 8. సమాధి చేయబడుట.
- 9.మృత్యుంజయుడగుట.
- 11. ఆరోహణుడగుట.
ఈ విధముగా ప్రభువు యొక్క శ్రమల జీవితమును ధ్యానించుటకై పెద్దలు నలువది దినములు శ్రమల ధ్యానకూటముల నేర్పాటు చేసిరి.
అనుదినమును ఒక గంటయైన గుడిలో కూర్చొని వీటిని ధ్యానించవలెను. వీటిలో ప్రభువు విజ్ఞాపన, పస్కాపండుగ, ప్రభుభోజనము మొదలగు కొన్ని అంశములను విడిచినాము. దేవాలయమును శుద్ధీకరించుట, ఆవరణములో రోగుల కొరకు స్వస్ధత కూటములు చేయుట,
సద్దూకయ్యులకు బోధించుట, ఇవి విడిచిపెట్టినాము. తన పూర్వ చరిత్రవలననే గాక అంత్య జీవిత (శ్రమల) చరిత్రవలననూ ఆయన ప్రజలను మార్చెను. దేనివలనను ఆయన మార్చకుండా లేడు. పేతురును, గవర్నరు భార్యను, సిలువపై దొంగను మార్చెను. ఈ వేళ పాఠము శ్రమచరిత్ర కార్యక్రమము పొడుగున వచ్చుచున్న మరోక వాలు తీసికొంటున్నాను. శ్రమ చరిత్రలో కొందరు మారలేదు. ఎవరు మారలేదు.
మారని వారి దుస్ధితి :
- 1) ఇస్కరియోతు యూదా:- పండ్రెండుమంది ప్రభువు శిష్యులకు ప్రజలిచ్చిన బిరుదు : బైబిలులో వ్రాసినది - 'యేసుతోనున్నవారు' ఎంత మంచిపేరు! అందులో నొకడు ఇస్కరియోతు యూదా. ప్రభువుతో నున్నను మారలేదు. ఎంత దుఃఖకరము! ఆయన దగ్గర ఉద్యోగములోనున్నాడు, ఖజానాధికారి, (ట్రెజరరు) చేతిలో డబ్బుసంచి యున్నది. ఆయన దృష్టికి అందరు సమానులే. అంతటి యధికారమిచ్చినను యూదా మారలేదు.
- 1.ప్రభువుతో నున్నవాడు.
- 2.ఉద్యోగి.
- 3.పండ్రెండు గంపలలో యొకటి యూదా పంచిపెట్టెను. అనగా పరిచారకుడే గాని మారలేదు.
- 4.ప్రభువు పండ్రెండుమందిని జతలు జతలుగా బోధకొరకు పంపించెను. బోధించిన వారిలోనొకడు, అయినను మారలేదు.
- 5.యేసుప్రభువు యొక్క బోధలన్ని వినిన గొప్ప వేదాంత విద్యర్ధి, అనగా బైబిలు తరగతిలో నున్నను మారలేదు.
- 6.అద్భుతాల సాక్షి. అనగా ప్రభువు అద్భుతములను చేయుచుండగా చూచెను. ఉదా: చనిపోయిన వారిని లేపుట; ఐదురొట్టెలను రెండు చేపలను, ఐదువేలమంది ప్రజలకు పంచిపెట్టుట, తుఫానును గద్దించుట, స్వస్ధపరచుట మొదలగునవి ఎన్నో యద్భుతములను చూచినను అద్భుత సాక్షిగా మారలేదు.
- 7. మార్పు చెందిన వారిని చూచినను మారనివాడు. మగ్దలేని మరియ మార్పు చెందగా చూచియున్నాడుగాని తాను మారలేదు. ఎంత విచారకరమైన సంగతి!
- 8. యూదా గోత్రము: యూదా అనగా కీర్తి, స్తుతి కల్గిన గోత్రము. ఈ యూదా కీర్తి పొందవలసినదిగాని తాను మారలేదు, కీర్తి పొందలేదు. యేసుప్రభువు పండ్రెండు గోత్రములలో యొకటయిన యూదా గోత్రములో పుట్టెను. ప్రభువెవరి గోత్రములో జన్మించినాడని యెవరయిన ప్రశ్నించినయెడల నా గొత్రములోనే అని యూదాయనును.
-
2) సన్హెడ్రిన్ సభ:- సన్హెడ్రిన్ సభ అనగా యూదుల సంఘము, వీరు 70 మంది. వీరు ప్రభువును అన్యులకప్పగించిరి. ఇది బైబిలులో లేదుగాని 'యూదుల యాలోచన సభయ'ని యున్నది. ఫిర్యాదులుంటే యీ సభకు రావలెను. తీర్మానమైనను సిలువ వేయుమని దీనికి ముందు సాక్ష్యము. ప్రభువు ఉపకారములను, అద్భుతములను చేయుచున్నారని మంచి సాక్ష్యమున్నది గాని యీ సభ సిలువ వేయకుండ యుండలేదు, ఎందుకనగా మారలేదు. అద్భుతములను, సహింపును ఉపకారముల నెరిగియున్న వారేగాని మారలేదు. ఎన్నో గుంపులు మారని వారున్నారు. అంత్యదినములయందు మారని వారుందురు. అంత్యతీర్పు దినమున ప్రభువు ధవళ సింహాసనా (జడ్జి) న్యాయాధిపతిగా నుండును. ఆయన నిలువ బడుదురు. మూడు గుంపులవారు యేసు ప్రభువును కోరనివారు, చేరనివారు, మారనివారు, యూదాలోని లోపము ధనాపేక్ష గాన యెన్ని బోధలు వినినను, ఉపకారములను పొందినను, అద్భుతములను చూచినను మారలేదు. సన్హెడ్రిన్ యెందుకు మారలేదు. మెస్సీయ లోకమునకు వచ్చినపుడు, ఇశ్రాయేలీయులకు, రాజ్యమునకు రాజ్యమే యిస్తడని వారాశించిరి. (అయితే ఆయన రాజ్యము ఆదియంతము లేనిది). యూదా ధనము కొరకాశించెను. అలాగే సన్హెడ్రిన్ వారు లోక రాజ్యము కొరకు ఆశించిరి. అయితే యేసుప్రభువు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదనెను. నా రాజ్యము పరలోక సంబంధమైనదనెను. ఎన్ని యద్భుతములను చేసినా, యెన్ని బోధలు చేసినా, ఎన్ని ఉప్పకారములను చేసినా వారు మారలేదు. మనలో కొందరెన్ని యద్భుతములను చూచినను, బోధలు విన్నను ఉపకారములు పొందినను, మన మనుకొనినది దొరకనందున మారము. మనలో నట్టిదేదైనను ఉన్నయెడల మారలేము. జాగ్రత్త! తాననుకొనినది కలుగక పోయినను, ఆలస్యముగా నందినను వారి యాత్మీయ జీవనము మారదు.
షరా:- ఉపకారములున్నను లేకపోయినను మారవలెను.
-
3. సిలువ దగ్గర మారని దొంగ:- సిలువ దగ్గర మారినదొంగ మోక్షమునకు (పరదైసు) వెళ్లెను. రెండ్వ దొంగ మారలేదు. మన అంశములోనున్న ఈ మూడవ వ్యక్తి మారలేదు.
- 1.యూదా
- 2.సభ
- 3.రెండవ దొంగ.
- మొదటి దొంగ యేసుప్రభువు యొక్క సహనమును, శాంతిగుణములను చూచి మార్పు చెందెను. రెండవవాడును చూచిన యెడల మారడా? యేసుప్రభువు యొక్క సిలువ వద్ద మొదటి ప్రార్ధన ఏదనగా దేవా! సిలువ నావరించిన వీరు నాకు ఏ కీడు చేయుచున్నారో వీరెరుగరు.
- 1.వీరెరుగరు.
- 2.వీరిని క్షమించుము.
- రెండవ మాట నీవు నాతో పరదైసులో నుందువు. మొదటి దొంగ మారినదానిని బట్టి రెండవ దొంగ కూడ మారవలసియున్నది గాని మారలేదు. మొదట యిద్దరును దూషించినారు. పిదప మొదటివాడు మారెను. యూదా, ధనాపేక్ష గలవాడు గాన మారలేదు.
- రెండవ దొంగ నిన్ను నీవు రక్షించుకొని నన్నును రక్షించుము, నీవు దేవుడవైన యెడల, గొప్పవాడవైనయెడల నిన్ను నీవు సిలువనుండి దించుకొని నన్నును దించుమని దూషించెను. తాననుకొన్నది దొరకనందున దూషించెను. మారలేదు. షరా:- ఏదో లోపము మనస్సులో నున్నయెడల పాలువంటి పదార్ధములను తినినను ఆరోగ్యము మారదు.
-
4. సమాధి కావలివారు:- సమాధి కావలి కాచిన రాణువవారు మారలేదు మారవలసినదేగాని మారలేదు. ఎందుకంటే ప్రభువు సమాధిలో నుండిలేచి వెళ్ళిపోయిన చరిత్రను చూచినారు. ఆయన మహిమా ప్రభావమును చూచి పడిపోయినను మారలేదు.
- 1.యూదా స్వహత్య చేసికొనినాదు.
- 2. సభ:-ఆయన రక్తము మా మీద మా పిల్లలమీద యుండునుగాక.
- 3.దొంగ మరింత చెడిపోయి దూషించినాడు.
- 4.కావలివారు ఆయన బ్రతికి వచ్చినాడని ఊరిలో సాక్ష్యమివ్వక, శిష్యులు శవము నెత్తుకొని పోయిరని అబద్దసాక్ష్యము చెప్పి మరింత చెడిపోయిరి. ఆలాగే మనలో కొందరు మారలేదు. మరింత చెడిపోవుచున్నారు. ఈ దినము నేను మారినానా! యని ప్రశ్నించుకొనండి. క్రైస్తవులలో ననేకులు మరింత చెడిపోయి మారకుండయుంటున్నారు
ఆలాగు మారని వారివలె కాక పూర్తిగా మారిన వారి స్ధితి ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్.
ప్రార్ధన:- యేసుప్రభువా, మాలో ప్రతివారిని నీలోని ప్రతికార్యమువలన మార్చి ప్రతిదినము ప్రతి గండముల వలన తప్పించుమని సిలువపైనున్న ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
కీర్తన: "తల వంచి సిగ్గున - నే జేయు నేరముల - నెంత నాలోన = పలుమారు నీ గాయములన్ - గెలికి నిన్ శ్రమపరచు నా - ఖల దోషములకై ఇపుడు - విలపించి వేడుకొందు" ||నా యన్న||