లెంటులోని పదిహేడవ దినము - సోమవారము

యోహాను 18:14

ప్రార్ధన:- ప్రభువువా! నీ సహింపు గ్రహించుకొన్నయెడల ఎండిన మొక్కవలె వాడిపోదుము, తెలిసిన యెడల సహింపలేము, అది సువార్తికులకు తెలియదు, దూతలకు తెలియదు, మాకు అసలు తెలియదు. నీవు శ్రమపడినావన్నది సత్యము గాని దాని వివరమును మేము సహింపలేము ఇదంతా మరుగుచేసి మమ్మును కరుణించుము.


యేసుప్రభువా! నీవు సహింపుద్వారా జయము పొందినట్లు మాకుకూడా సహింపు ద్వారా జయము కలుగు నిమిత్తము, మాకు సహింపు శక్తి దయచేయుము. మేము జయించి జయము పొందకముందు, సహించి జయము పొందే తరుణము దయచేయుము. మేము పాటములో ఏర్పర్చుకొన్న ప్రకారము నీవు 8 పర్యాయములు, 8 విషయములలో సహింపు కనపర్చినట్లు, మేముకూడ అన్నిటిలో సహింపు కనపర్చే ధారుడ్యము అనుగ్రహించుము. ఒక విషయములో సహింపు కలిగియుండుట వల్ల మాకు ప్రయోజనములేదు. కాబట్టి అన్నిటిలో, అన్నికాలములలో, అన్ని విధములైన అవస్ధలలో సహింపు, ఓపిక, ఓర్పు అనుగ్రహించుము. మేము సహించేటప్పుడు నీ సహింపు మాకు జ్ఞాపకము చేసి, నీ సహింపులోనుండి సహింపు అందుకొనే విశ్వాసము దయచేయుము. ఎన్నో పర్యాయములు మా అనుభవ ప్రకారము మా సహింపునకు కదలిక, తగ్గింపు, అంతరింపుకలుగుట చూచుచున్నాము. గనుక మా సహింపును దిట్టపర్చుమని వేడుకొనుచున్నాము.


నీవు త్వరగా వచ్చెదవని వాగ్ధనము చేసినావు. మా దృష్టికి 'నీవు ఆలస్యము చేయుచున్నావు' అని తోచుచున్నపుడు, స్వాభవికముగా సహింపు కదలి పోవును. గనుక అట్టి కదలని సహింపువలన పెండ్లికుమార్తె వరుసకు మమ్మును భద్రపర్చుము. ఒక్కొక్క సహింపు తరుణములో నా అనుభవమునకు కొంత అనుభవమును, నా సిద్ధపడుటకు కొంత సిద్ధపడుటయును, నాకు అనుగ్రహింపుము. మహిమకు కొంత మహిమయును చేర్చబడును గనుక ఈ చేర్చబడుటకు నేను దూరము కాకుండే ధైర్యము దయచేయుము. నీకు వచ్చిన శోధనలు నాకు రావు అని నేననుకొనకుండునట్లు నాకు జాగ్రత్తల జ్ఞానోపాయము లభింపజేయుము. శ్రమలో పాల్గొనుటవల్లనే మహిమలో కూడ పాల్గొందుమని పెద్దలు చెప్పుచున్న వాక్యమును జ్ఞప్తియందుంచుకొనగల జ్ఞాపకశక్తి లభింపజేయుము. ఓ ప్రభువా! నీ శ్రమ ఎంత గొప్పదో ప్రవక్తలకుగాని, సువార్తికులకు గాని, దూతలకుగాని తెలియదని తలంచుచున్నాము. ఒకవేళ మాకు తెలిస్తే మేము ఉండము. నీ మహిమ మాకు మెరుగు, అనగా చాలును, సరిపోవును గనుక అట్టి స్ధితిలో మమ్మును స్ధిరపర్చుము. ఆమేన్.


శుక్రవారము మహా సంతోషకరమైన దినము. ఆదివారముకూడా మహా సంతోషకరమైన దినమే. కొందరు శుక్రవారము దుఃఖింతురు. అయితే ఆ దినమే విముక్తి దినము. శుక్రవారము సిలువమీద జయము. ఆదివారము పునరుత్ధాన జయము. సిలువమీద క్రీస్తుప్రభువుకు కలిగిన జయము. ఆదివారమున పునరుత్ధానమునుబట్టి జయము. ఈ రెండును రెండు విధములుగా కలిగినవి.


నా దగ్గరున్న పదిహేను బూరలతో నేను మాట్లడుచున్నాను. ఈ బూరలు శుక్ర, ఆదివారములు వినబడును. చాకలి వాని బట్టల శబ్ధము మనకు వెంటనే వినబడును. అయితే అది కొంచెము సేపుండును. అలాగే గొడ్లచావిడిలోని శబ్ధము ఉండును. ఈ సమయములో ఆ శబ్ధములవైపు కాక, అందరు సిలువవైపు చూడవలెను. అటువంటి మనో నిదానముండవలెను, చివరి వరకు అది ఉండవలెను. రెండు మనో నిదానములు. 1) సిలువ, 2) సంఘములను తలంచుకొనవలెను. యేసుక్రీస్తుయొక్క శ్రమచరిత్రలో జయము. యేసుక్రీస్తుయొక్క పునరుత్ధాన చరిత్రలో జయము. ఇవి సంఘము పొందవలసిన జయములు. వీటిని ప్రభువు పొంది చూపించెను. సంఘము శ్రమలో జయము పొందవలెను. అలాగే సంఘము తమ పునరుత్ధానములో జయము పొందవలెను.


యేసుక్రీస్తు ప్రభువు శ్రమలో ఎన్ని రకముల జయములున్నవి? హెబ్రీ 12:2 సిలువ గురించి :

ఆయన మన ప్రతినిధియై మన కొరకు విజ్ఞపన చేయుచూ, జయమిచ్చు చున్నారు (యోహాను 17:9).


ఆయన జన్మములో, బోధలో, శ్రమలో, విజ్ఞాపనలో, పునరుత్ధానములో మన ప్రతినిధియై ఉన్నారు. ఆయన మన కొరకు శిశువై పుట్టెను, మనకొరకు బోధించెను, మన కొరకు విజ్ఞాపన చేసెను. ఆయన మన కొరకు సిలువ మ్రానుమీద శ్రమ అనుభవించెను. ఆయన మనకొరకు మరణమును జయించి తిరిగిలేచెను. మన కొరకు మనము ప్రార్ధించుకొనలేము. మన కొరకు శ్రమపడలేము. గనుక ఆయనే ప్రార్ధించవలెను. శ్రమపడవలెను.


మన జన్మము అసంపూర్తియైనందున, మన జన్మము వర్ధిల్లిటకు ఆయనే జన్మించెను. మన బోధ చాలదు. ప్రార్ధన చాలదు. శ్రమ చాలదు. మనము గాని శ్రమపడితే చచ్చి ఉరుకుందుము. ఇక తిరిగి లేవలేము. మనము కీడు కొరకు ప్రార్ధింతుము, అజ్ఞాన బోధ చేస్తాము గనుక ఆయన మన కొరకు పూటపడెను. ప్రార్ధన, శ్రమ, జన్మ ప్రతినిధిగా మన కొరకు ఆయెను. ఈయన శ్రమలో మనకొరకు ప్రతినిధియై యున్నాడు.


షరా:-

'తొలగింపుము' అనే మాటలోను, ఏల చేయి విడిచినావు' అనే మాటలోను, స్వేద రక్త బిందువులలోను ఆయన శ్రమ ఎంత గొప్పదో గ్రహించగలము! సిలువమీద తాను మనిషై 'దేవా' అని ప్రార్ధించెను. కుమారుడైతే తండ్రీ! అని ప్రార్ధించును. ఒక మనిషి వలె గొప్ప బాధలో చేయి ఎందుకు విడిచితివనెను. ఆయన మన ప్రతినిధియైనందున ఇన్ని విధములైన శ్రమలను, అవమానములను సహించుకొని భరించెను.


అట్టి ధన్యత ఇక్కడ చేరిన వారికిని, ప్రతినియైన క్రీస్తు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్.


కీర్తన: "పంచ గాయములు నే-నెంచి తలంచి నా - వంచన ఇది సోదరా! నన్ను - వంచించు సైతాను - వల నుండి గావ తా - నెంచి బొందెను సోదరా" ||యేసుక్రీస్తు||