లెంటులోని ఇరువది ఒకటవ దినము – శుక్రవారము

ఆది 3:1-8

ప్రార్ధన:- తండ్రీ! మా నిమిత్తమై మానవ శరీరము ధరించినందువలన నీవు శోధింపబడవల్సి వచ్చినది. మా కొరకు నీవు ఎన్నో అవమానములను, తిరస్కారములను అనుభవించినావు. నా మీది ప్రేమతో అన్నిటినీ జయించినావు. అట్టి నీ జయ వర్తమానము నేడు అందించుమని నిన్ను వందించుచున్నాము. ఆమేన్.


క్రిందటి మంగళవారము ప్రభువుకు కలిగిన శోధన చెప్పగా విని, ఒకరు నా మీద-ఒక ప్రశ్న వేసిరి: ప్రభువు శ్రమకాలమునకును, ఈ శోధనకును ఏమి సంబంధమున్నదని అడిగిరి. రాళ్ళు రొట్టెలు చేసికొని వాడు తినమన్నాడు. అది శ్రమకాలమునకేమి సంబంధము? రాళ్ళకేమి సంబంధము? రొట్టలకేమి సంబంధము? దీని వ్యాఖ్యానము ఆది. 3వ అధ్యాయములో దొరుకుతుంది. ఇప్పుడది వివరించడానికి సాతాను, ప్రభువును శోధించిన వాక్యము, అక్కడ హవ్వను శోధించిన వాక్యము ఇక్కడ వ్రాస్తాను. అది మత్తయి 4వ అధ్యాయంలో ఉంది. నీవు దేవుని కుమారుడవైతే. వాడు హవ్వను నెట్లు శోధించెను? అయితే? అనేదే శోధన. 'నీవు దేవుని కుమారుడవైతే అన్నప్పుడు ' నేను కుమారుడను కానా అనవసింది. అయితే అనేది గొప్ప శోధన. ఇక్కడ ప్రభువులో సందేహం పుట్టించాలని వాడు అనుకొన్నాడు. అయితే ప్రభువు సందేహములో పడలేదు. హవ్వతో అక్కడ ఇది నిజమా? అని వాడు అన్నప్పుడు, హవ్వమ్మ తనను దేవుడు తినమన్నాడు కాబోలు అని సందేహపడి ఉండాలి. ఆలాగు సందేహము పుట్టించిన మాటవల్ల హవ్వమ్మ అదైర్యపడింది. ఈ సందేహపరిచే మాటను ప్రభువు జయించెను. సర్పము, భూజంతువులన్నిటిలో యుక్తిగలదని ఉన్నదికదా! సర్పము యుక్తి గలదై శోధించుటకై వచ్చెను. ప్రభువు మరొక యుక్తి గలిగినవాడై సైతానును జయుంచెను. యేసుప్రభువు జవాబు చెప్పకుండా ఉండడమే యుక్తి. ఇది హవ్వమ్మకు తెలియలేదు. హవ్వ పడింది. హవ్వ ఎటువంటి పరిశుద్ధతలో ఉందో, యేసుప్రభువు కూడ అదే పరిశుద్ధతలో నున్నాడు. స్త్రీ గర్భములో కన్యక గర్భములో, పుట్టినందున అసలు స్త్రీకున్న పరిశుద్ధత, పవిత్రత ఆయనకు ఉంది. ఆ స్త్రీకి పరిశుద్ధత ఉంది. ఆ స్త్రీని తన పోలిక చోప్పున చేసినందున ఆ దైవత్వము ఆ స్త్రీలో ఉంది. పరిశుద్ధ శరీరమును, దైవత్వమును ఆ మొదటి స్త్రీలో ఉంది. ఆ పరిశుద్ధ శరీరమును, దైవత్వమును కలిగి రావాలి గనుక అదే వరుసలో యేసుప్రభువు వచ్చి జయించిన అదే జయము. ఆయన దేవుడై వచ్చి జయించిన అది జయము కాదు. ఇప్పుడు ప్రభువు, హవ్వ సందేహించినట్లుగా సందేహించిన యెడల అగాధములోకి దిగినట్లే. అయితే యేసుప్రభువు దృష్టి, ఆయన మనో నిదానము తన పరిశుద్ధ శరీరముమీద ఉన్నది. తనలో ఉన్న పరిశుద్ధమైన పవిత్రతమీద ఉన్నది. ఇప్పుడు ప్రభువు హవ్వమ్మ ఇచ్చిన పరిశుద్ధ శరీరముతో హవ్వమ్మకు తాను ఎంత పరిశుద్ధ శరీరమిచ్చెనో, అంత పరిశుద్ధతోనే జయించెను. అంత దైవత్వముంటే గాని ఆమె పరిశుద్ధ శరీరముతో యేసుప్రభువు జయించిన (అంత పరిశుద్ధకాదు) జయమును హవ్వమ్మ అందుకొని ఉండేది. అటు ఆరుగురు, ఇటు ఆరుగురు జయించిన జయమందురు గాని ఒకరెక్కువ ఒకరు తక్కువ ఉండి జయించిన, అది జయముకాదు. హవ్వమ్మకున్న దైవత్వమెంతో ప్రభువుకున్నట్టి ఆ దైవత్వముతోనే ప్రభువు జయించెను. హవ్వమ్మ -' నాకు సంపూర్ణమైన పరుశుద్ధ శరీరమిచ్చిన, నాకు సంపూర్ణ దైవత్వమిస్తే ఎందుకు పడతాను. నేను పడేటప్పుడు, ఓ హవ్వమ్మా!ఎందుకు పడతావని పిలిస్తే ఎందుకు పడతాను' అన్నదట.


పల్లెటూరిలో బోదికాలువలో ఒక పట్టి ఉంటాది. ఒక పెంకివాడు ఇంకొకడిని ఒరే పడతావు ' అంటే వాడు పడతాడు, కంగారుపడి పడిపోతాడు. సర్కసులో మరాటిపిల్ల తీగమీద నడిచేటప్పుడు పడతావంటే పడదు. అలాగే ప్రభువు పడలేదు. ఎంత గొప్ప శోధననగా: 'నీవు దేవుని కుమారుడవైతే ' అనగా ప్రభువుకు మహా శ్రమ. నీవు దేవుని కుమారుడవు అనుట ప్రభువుకు మహా గొప్ప శ్రమ. దేవుని మాట ఎత్తి తన పేరెత్తినందున మహా శ్రమ. ఇక్కడ దేవుని కుమారుడవైతే అన్నాడు. ఇక్కడ కుమారుడని మరొకమాట పెట్టినాడు. ప్రభువు దగ్గర ఉన్న శోధనలో ఏముందనగా, ' ఏమండోయ్! మీరు చాల మంచివారు, ధర్మకర్త అన్నట్లున్నది. అనగా ఇది దగానా, లేక సక్ష్యమా? ఇక్కడ ప్రభువును వాడు శోధించినపుడు, దేవుని మాటను తుడుపుపెట్టదలంచినపుడు, అవతారము గల కుమారుని దగ్గర పెరెత్తినందున, తానే అక్కడ నిలబడ్డాము. ముందు సర్పములగా వాడు వచ్చినాడు. సర్పమైనండున హవ్వమ్మ గుర్తించలేదు. ఇక్కడ ఆయన దేవుని కుమారుడు. అయినప్పటికిని, కుమారుడని సైతానువలననే తెలిసింది మనకు. మనిషికుమారుని కంటే దేవుని కుమారుడే గొప్ప. ఈ సంగతెత్తి ఆదాము హవ్వల దగ్గర దేవుడనేది తుడుపుపెట్టినందున ఇక్కడ తానే నిలబడ్డాడు. అది నిజమా? అని అక్కడ అడిగాడు గనుక ఇది దగా. మార్కు 1వ అధ్యయములో నీవు దేవుని కుమారుడవు అన్నాడు. అక్కడ ప్రభువు 'నోరుముయ్యి ' అన్నాడు. ఇప్పుడు ఇక్కడ హేళనగా అన్నాడు. మత్తాయిలో దేవుడనేది తుడుపుపెట్టి, అదే(సాతానే) నిలబడింది. ఇక్కడ కుమారుడు అనేది తుడుపుపెట్టి అదే నిలబడింది. యెషయాలో, ఆ దేవుడు సింహాసనముమీద కూర్చున్నాడు. అది వాడు చూచాడు. నేను అక్కడ కూర్చుండకూడదా? అనుకున్నాడు. అక్కడ తానే ఉండలనుకున్నందున వాడు పడిపోయినాడు. ప్రభువుకైతే మనో నిదానముంది. నేను దేవుని కుమారుడను, వీడు సైతాను అనుకొన్నాడు. అందుకే ఆయన పడలేదు. అందుకే ప్రార్ధనమెట్లలో మనో నిదానము మొదటిది. ఆయన కన్నులలో నేను దేవుడను, ఆయన చూపులో ఇది దయ్యము అని ఉంది. నేను దేవుడనని ఆయనకు ఉన్నది గనుక ఇక్కడ శ్రమకాలములో రెండు శోధనలున్నవి.

వీడిని కలుగ జేసినప్పుడు ఆయన ఆ దూతకు పైగా ఉన్నాడు. ఇప్పుడు మనుష్యునిగా వచ్చినందున ఇప్పుడు క్రిందగా ఉన్నాడు. పిలాతును పుట్టించిన వాడు యేసుప్రభువు. తనకు తీర్పు చేసిన వాడు తాను పుట్టించిన మనిషే. కాబట్టి ప్రభువు ఇవన్నీ చూచెను.


ఇక్కడి శోధనలో దైవ త్రిత్వము మనకు కనబడుచున్నది. దేవుని కుమారునివైతే అను మటలో కుమారుడున్నాడు, తండ్రి ఉన్నారు. ఇక పరిశుద్ధాత్మ ఏరి? ఆయన ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడెను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇక్కడున్నారు. కాబట్టి ఈ త్రిత్వ తలంపువల్ల యేసుప్రభువు శోధనలో పడలేదు. ఆ ధ్యానములో లేకపోయిన యేసుప్రభువు పడిపోవును. మనకు రాకడ గడియ ఎక్కువగా దగ్గర పడుతుంది. మనకు ధ్యాన కూటములు, బైబులు కూటములు, వీధిలో ప్రసంగాలు, ఆదివారపు బడులు, కుటుంబ ప్రార్ధనలు చాలవు. రాకడ సిద్ధబాటుకు ఇవి చాలవు. క్రైస్తవ జీవనమునకు అనగా రక్షణకు సరిపోవును. రాకడకు సిద్దపడుట కొరకు ప్రత్యేకించుకొని కనిపెట్టుట అవసరము. యేసుప్రభువు మొదలుకొని ఈ 20 వందల సం॥లలోకి చేరిన భక్తులు మోక్షములోనికి వెళ్లిరి గాని ప్రభువు వచ్చేగడియలో ఆయనను ఎదుర్కొనుటకు తగిన స్ధితిలో లేరు. అబ్రహాము, ఇస్సాకు మొదలైనవారు వెళ్లిపోయిరి గనుక రాకడకు ప్రత్యేకమైన ఉపవాస కార్యము అవసరము. యేసుప్రభువు ఉపవాసము చేసిరి, ఏలియా ఉపవాసము చేసిరి, అంతకు ముందు మోషే చేసిరి. మోషే 40 దినములు, ఇంకొక 40 దినములు ఉపవాసముండి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని చూచినందున, దేవుని ధ్యానములో నున్నందున చూపు, వినికిడి, శరీర బలము తగ్గలేదు. ఈ 80 దినములు మోషే ఏమి తినలేదు. తినలేదు గాని త్రిత్వదేవుని తలంపులో నుండిరి. అయ్యగారు లూధరుగిరిలో నున్నప్పుడు ధ్యానములో పెట్టగా అందరూ మోకాళ్లమీద ఉండిరి. అపుడు అయ్యగారు - "మీరు జాగ్రత్తగా యేసుప్రభువు తలంపు మీదనే ఉండడి " అని చెప్పిరి. ఇంతలో ఒక పిల్లవాడు అయ్యా స్టోరులో ఉప్పు లేదని గట్టిగా చెప్పగా అందరికి వినబడి ధ్యానము చెడిపోయినది. అలాగే మనము ధ్యానించుచుండగా సైతాను వచ్చి మన ధ్యానము చెడగొట్టును. గనుక జాగ్రత్త. ఈలాగు ఏక దృష్టితో సైతాను పుట్టించే శోధనవైపు చూడక, జయించిన ప్రభువువైపు చూచుచూ సాగి వెళ్ళు కృప ప్రభువు మీకు దయచేయును గాక. ఆమేన్.


కీర్తన : " ప్రేమాతిశయుడ నేను - ఏ మత్రుడను నెన్న - నా మానసమునకందను - నాయేసు - ప్రేమ సారంబు తెలియును = పామరాళినిబ్రోచు - క్షేమాధికారి నిన్ను - యేమంచు వర్ణింతును!" ॥ ఏమి నేరంబులేక ॥