లెంటులోని ముప్పది ఐదవ దినము - సోమవారము

యోహాను 19:25-27; మత్తయి 27:45-46.

ప్రార్ధన:- యేసుప్రభువా! మిక్కిలి ప్రేమగల సమీపస్తులతో సిలువమీద నుండి మాట్లాడిన ప్రభువా! స్తోత్రము. నీవు మాట్లడిన మిక్కిలి ప్రేమగల మాటల నిమిత్తమై నీకు వందనములు. మిక్కిలి ప్రేమగలవారితో, మిక్కిలి ప్రేమగల నీవు, మిక్కిలి సమీప వాక్యములు చెప్పినందున నీకు వందనములు. నేడు ఈ చిన్న ప్రేమ చరిత్ర ద్వారా మాకు నీ సందేశము అనుగ్రహించుము. ఆమేన్.


విశ్వాస ప్రియులారా! ఈ వేళ యేసుప్రభువు ఇద్దరితో మాటలాడుట చదువుకున్నాము. ఇది వరకు అనగా నిన్న మొన్న, ఇద్దరితో మాట్లాడినారు.

ఈ వేళ తల్లితో, శిష్యునితో మాట్లాడినారు. తక్కిన శిష్యులు తోటలో నుండే దూరముగా పారిపోయినారు గనుక దూరస్తులైనారు. కొండమీద కొందరు స్త్రీలు దూరముగా నిలువబడి ఏడుస్తునారు. అయితే ఇద్దరు మత్రమే సిలువకు దగ్గరగా నిలువబడి ఉన్నారని వ్రాయబడినది. వారు ఎవరనగా తల్లి మరియు శిష్యుడు. తల్లితో ప్రభువు చెప్పిన మాట 'అమ్మా నీ కుమారుడు'. శిష్యునితో చెప్పిన మాట 'ఇదిగో నీ తల్లి'.


ప్రార్ధన:- యేసుప్రభువా! తల్లి ప్రేమ, శిష్యుని ప్రేమ, నీ ప్రేమ, నేరస్ధిని ప్రేమ రేపు సాయంకాలము వరకు మేము ఎప్పుడుబడితే అప్పుడు, ఎక్కడబడితే, అక్కడ తలంచుకొని నిన్ను వందించే శ్రద్ద దయచేయుము. నేటి ఆరాధనంతా, ధ్యానమంతా అంగీకరింపుమని వేడుకొంటున్నాము. మరియు ఈ రాత్రి నీ దూతలను మా యొద్ద కావలిగానుంచి సుఖ నిద్ర కలుగనట్లు, ఈ నాలుగు దినములైనా అట్టి ప్రేమను జ్ఞాపకము చేయుము. ఆమేన్.

4వ మాట. మత్తయి 27:45.

ప్రార్ధన:- యేసుప్రభువా! నీ బాధ ఎంత గొప్పదో మనుష్యులు గ్రహించలేరు. అంత గొప్ప శ్రమ మా నిమిత్తమై సహించినావు. మామీద నీకున్న ప్రేమ అంత ఎక్కువైయున్నది. మేము గ్రహించ గలిగినంత గ్రహించేశక్తిని మాకు దయచేసి నీ ప్రేమయొక్క లోతును మాకు తెలియజేయుము. వాటినిబట్టి గాఢమైన కృతజ్ఞత ఏర్పడునట్లు, నేడుకూడా వర్తమానము దయచేయుము.


ఇందులో ఆరు సంగతులున్నవి. నేటి వాక్యములో ఉన్న 6 సంగతులను బట్టి ఆయనకు కలిగియుండిన బాధ ఎంత గొప్పదో! అది 7వ సంగతైయున్నది. మొదటి వాక్యములో ఆయన దైవత్వము కనబడుచున్నది. ఈ వాక్యములో ఆయన మనుష్యత్వము కనబడుచున్నది.

బోధ:- యేసుప్రభువుయొక్క అవతారమువంటి అవతారము లేనే లేదు. ఆయన బోధయొక్క సారమువంటి సారము మరియొకటి లేదు. ఆయన అద్భుత కార్యములవంటి అద్భుతాలు లేనే లేవు. ఆయన మరణమువంటి మరణము లేనే లేదు. ఆయన బాధవంటి బాధ లేనే లేదు. కాబట్టి ఆయనకు వందనములు చేయవలెను. ఎన్ని వందనములు చేసినా ఆయన బాధకు సమానము కాదు. ఆ బాధ లోకములో ఉన్న పరమ భక్తులలో గొప్పవాడైన మనుష్యుడుకూడ సహించలేడు. పాపములేని దేవదూతలుకూడ సహించలేరు. గనుకనే వారికిని ఈ బాధ రాలేదు. ఎందుకంటే లోకములో ఉన్న మనుష్యులందరి పాపములు, బాధలు ప్రభువు మీద వేయబడినవి. దూతలే సహించే పనైతే కోట్ల దూతలు వచ్చి సహింపులో పాలుపొందుదురు. అంత గొప్ప శ్రమ కలిగినది. సిలువమోస్తు తూలిపోయినాడు. అందుకే ఒక మనిషికెత్తిరి. సిలువపైని శ్రమ అసాధరణమైన శ్రమ. అది బల్లెపు పోటుకంటే ఎక్కు పోటు. మేకుల పోట్లకంటే ఎక్కువ పోటు. ప్రక్కపోటుకంటే ఎక్కువ పోటు. అందుకనే దేవుని వర్ణించుటకు ఏ కవీశ్వరునికి చేతకాదు. ఫలాని బాధ లేదు అని అనడానికి లేదు. అందుకనే దేవుని కుమారుడని చెప్పగలము. దేవుని కుమారుడు దైవశక్తితోకాక, పాపములేని మనుష్యుని శక్తితో సహించెను. దైవశక్తితో సహించిన మనిషి నీరసముగా మాట్లాడును. గాని ప్రభువు పాపములేని మనిషి శక్తివల్ల సహించెను. దైవశక్తి అయితే అది బాధే కాదు. మనిషి శక్తితో అంత గొప్ప శ్రమను అనుభవించెను. లోకము గ్రహించినా, గ్రహించక పోయినా మనము కొద్దిగా గ్రహించుచున్నాము. అందుకనే హృదయములు నింపుకొని వందనములు చెప్పుకుంటున్నాము. ఇట్టి బాధమీదే ప్రార్ధనలు కల్పించి చేయండి.


ఈలాగు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగల అంతరంగమును, వరుడు ఈ శ్రమకాల ముగింపు దినములలో మీకనుగ్రహించును గాక. ఆమేన్.


కీర్తన: "తల్లికి నొక సంరక్షుకుని - ఎల్లరకు మాదిరి - కనపరచినావా! = తల్లికి సృష్టి కర్తవై - ప్రేమ తనయుండవై గౌరవించి యున్నావా!" ||ఏడు||


"నరుడవు కాకున్న యెడల - దేవా! నన్నేల విడిచితి-వని యడిగినావా! = నరుడవును దేవుడంవును - గాన -నా పూర్ణ రక్షకుడవని ఋజువైనావా!" ||ఏడు||