శ్రమకాల గుడారము
లూకా 18:31-34;
ప్రార్ధన:- దయగలప్రభువా! నీ కుమారునిద్వారా చరిత్ర జరిగించి, యది మాకు వ్రాసిపెట్టినందులకు వందనములు. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును నిత్యస్తోత్రమని చెప్పు విశ్వాసులకు కలుగు శ్రమలు, ఆనందకరముగా జేయమని శ్రమల గుడారములో ప్రవేశించిన యేసు ప్రభువు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్.
ప్రియులారా! మనము శ్రమలయొక్క గుడారములో ప్రవేశించినాము. ఈ నలుబది దినములలో ప్రభువు యొక్క కుడిప్రక్కను యెడమప్రక్కను ఎక్కడైనను శ్రమయే కనబడును. మనము క్రీస్తుయొక్క శ్రమలను ధ్యానించునపుడు మన శ్రమలు జ్ఞాపకమునకు వచ్చును గాని ఆయన శ్రమల యెదుటనవి యావగింజంత మాత్రమే కనబడుచున్నవి. క్రీస్తు ప్రభువునకు జయముతో శ్రమల ముగిసినవి. భక్తులైనవారు పూర్వకాలమందు ప్రభువు యెక్క చరిత్ర పరీక్షించినారు. అందు క్రిస్మస్ చరిత్ర, ఆయన బోధ, ఆయన యద్భుతములు, ఆయన శ్రమలు ఉన్నవని గ్రహించినారు. అందు క్రీస్తు యెక్క పునరుత్ధానమున్నదనియు, రాకడున్నదనియు గ్రహించినారు. గాని క్రిస్మస్ చరిత్ర కంటే, బోధ కంటే, అద్బుతముల కంటే, ఆరోహణము కంటే, క్రీస్తు యెక్క శ్రమలే మహా ముఖ్యమైనవని, పెద్దలు యీ నలుబది దినములు ధ్యానముగా నేర్పరచినారు. ఈ నలుబది దినములు శ్రమలను గూర్చి ధ్యానించవలెను. క్రీస్మస్ పండుగను ధ్యానించుటకు ఒక్కరోజు మాత్రమే, ఈస్టరు పండుగను ధ్యానుంచుటకు ఒక్కరోజు మాత్రమే, ఆలాగుననే ఆరోహణ పండుగను ధ్యానించుటకు కూడ ఒక్కరోజు మాత్రమే గాని క్రీస్తు శ్రమలను గూర్చి ధ్యానించుటకు యెక్కువ సమయము కావలయునని పెద్దలనుకొని, నలుబది దినము లేర్పరచుకొన్నారు. మార్చి నెలయంతయు, ఇంకా ఏప్రిల్ నెలలో కూడా ధ్యానింతురు. ఇన్నిదినములెందుకని కొందరనుకొనవచ్చును. అయితే ఇవి మనము ధ్యానింపదగినవే. ఈ నలుబది దినములు ధ్యానించుటకు, బైబిలులో ననేకమైన వాక్యములు గలవు. అవన్నియు యిక్కడుపయోగింపక వాటి అన్వయ వాక్యములు మన ధ్యానముకొరకు చెప్పెదను. మీరు చదువుకొంటే 1 పేతురు 1:19-21 వరకని చెప్పుదును. అప్పుడు మీరు అధ్యాయమంతయు చదువుకొనెదరు. నిజమైన విశ్వసి క్రీస్తుయెక్క సన్నిధానమునకు వెళ్ళి, మహావినయముతో " ప్రభువా! నేను బూడిదనై యున్నాను, ధూళినైయున్నని చెప్పగలుగును. అందరును చేప్పలేరు. గుడిలోను, మీటింగులలోను, యిండ్లలో మాత్రము కాదు, హృదయములో అబ్రాహామువలె చెప్పగవారుగా ఉండవలెను. అబ్రాహాము విశ్వాసులకు జనకుడు, ఆయనే 'ధూళినంటే, మనమే మనగలము. నేను ధూళికంటే ధూళిని బూడిదకంటే బూడిదనని చెప్పవలెను. అలాగు యెవరందురో వారే శ్రమకాలపు గుడడారములోనికి చేరగలరు." (ఆది 18:27) యోబు కూడ అలాగు చెప్పెను. (యోబు 30:19) విశ్వాసి (1) నేను పాపిని, (2) అయోగ్యుడను, (3) నేనశక్తుడనై యున్నాను అని చెప్పవలెను. మీరు యింటికి వెళ్ళి, యీ మూడు ఒప్పుకొనవలెను. అప్పుడు శ్రమకాల ధ్యానములో ప్రవేశింతురు. మీరు ఇంటివద్ద, గుడిలోకంటే ఎక్కువగా ధ్యానించగలరు, చదువగలరు.
- 1. నేను పాపినైయున్నాను:- 'నేను అక్రమకారుడనని ' మనయపరాధములు మంచి శుక్రవారమువరకు ఈ విధముగా నొప్పుకొనవలెను. శ్రమకాలచరిత్ర రెండువైపుల కనబడుచుండగా, తండ్రీ! నేను పాపినైయున్నాను, అయినప్పటికిని నాకొరకు నీవు పాపికంటె యెక్కువ శిక్షననుభవించినాని యనండి.
- 2. అయోగ్యుడను:- ఒకవేళ, పూర్తిగా క్షమింపబడినవారు, పూర్తిగా పాపములు విడిచి పెట్టినవారును ఉండవచ్చును. అయితే అయోగ్యుడను అంటే "నేను పాపిని కాదు, నీ శ్రమల ద్వారా పొందవసిన భాగ్యమునకు నేను నేను తగనని" యర్ధము. నీవు నాకు, నీశ్రమల ద్వారా అందించే దీవెన నేను అందుకొనలేనని 'యర్ధము. ఆహా! నా అయోగ్యత యెంత చెడ్డది. ప్రభువా! అయినప్పటికిని నీ శ్రమల ధ్యానము ద్వారా నన్ను యోగ్యునిగా చేయుము.
- 3. అశక్తుడను:- అనగా శ్రమ చరిత్ర వల్ల నీవు యెన్ని దీవెనలిచ్చెదవో, వాటినన్నింటిని అందుకొనే శక్తి నాకు లేదు. నీవైతే యెన్నైనను యిచ్చెదవు, నీవు పడిన శ్రమలు చూడగా యొకటి కాదు, ననేకమైనవి అనుభవించితివి. గనుక అనేకమైన దీవెన లియ్యగలవు.
ఐదువేల మంది కాహారమియ్యగా, 12 గంపల రొట్టెముక్కలు మిగిలునని తెలిసినను, మిగిలి పోయేట్లు అద్భత కార్యక్రమము చేసినావు కాదా! అట్లే నీ శ్రమలన్నిటి ద్వారా వచ్చు దీవెనలన్నీ మేము అందుకొనలేమని తెలిసినప్పటికిని, నీవు శ్రమల ననుభవించినావు గనుక నీకు వందనములు. ఇప్పుడు నేను శ్రమ చరిత్ర వినిపించెదను. ఇంతవరకు మన చరిత్ర వినిపించినాను. అనగా పాపియొక్క చరిత్ర, పాపి తన చరిత్ర తెలిసికొని దేవునికి వందనములు చెల్లించిన యెడల అదియెంత మంచిది! ప్రభువా నేను అయోగ్యుడను, అశక్తుడను, నా మీద నీకింత ప్రేమా! యని అనిన యెడల అదియెంత మేలు. అట్టి చరిత్ర ధ్యానించుటకు ప్రభువు ఆత్మ మీకు తోడై యుండును గాక.
- 1. శ్రమ చరిత్ర మొదటి భాగము, ప్రవచనముల చరిత్ర భాగము
- 2. శ్రమ చరిత్ర రెండవ భాగము, నాలుగు సువార్తలలో గల చరిత్ర భాగము
- 3. శ్రమ చరిత్ర మూడవ భాగము, పత్రికలలోని జ్ఞాపకము తెచ్చుకొనే భాగము
-
4. శ్రమ చరిత్ర నాల్గవ భాగము, ప్రకటనలోని రాబోయేరాకడ కాల భాగము
పై నాలుగు భాగము లెక్కడెక్కడున్నవో మీరు వ్రాసికొని, యి నలుబది దినములు ధ్యానించండి. ప్రతిరోజూ భస్మ బుధవారము, మంచి శుక్రవారము, పరిశుద్ధవారమని యనుకొంటూ ధ్యానించువారే పరిశుద్ధులు. ఎందుకంటే పాపములను అయోగ్యతను, అశక్తిని శుభ్రము చేసికొని యున్నారు గనుక వారే ధ్యానపరులు. వారే దుఃఖించుచున్న రక్షకుని నవ్వించే ప్రియబిడ్డలు.
(1) ప్రవచన భాగము:-- (1) దీనిలో (ఆది 3:15) యున్నది. ఇందులో, యేసుప్రభువు లోకమునకు వచ్చి సాతాను వలన శ్రమపడునని యున్నది.
- (2) అబ్రాహాము దేవునితో అనిన మాట 'నేను ధూళిని బూడిదను '(ఆది 18:27); కొందరు మారుమనస్సు పొదినయెడల రక్షింపవా! యని అబ్రాహాము యడిగెను.
- (3) యోబు (30:19) నేను ధూళినై యున్నానని అబ్రాహామువలె యోబు కూడ తగ్గంచుకొనెను.
- (4) (దా.కీ.22) ఈ అధ్యాయమంతయు సిలువ మరణము గూర్చి యున్నది. నా దేవా! నా దేవా! నన్నెందుకు చెయి విడిచినావని మొదటే యున్నది. ఆ మాట ప్రభువు సిలువమీద పలికినాడు. ఎంతశ్రమలేకపోతే - నా తండ్రీ! నా తండ్రీ! అనలేదు గాని నా దేవా! నా దేవా! అన్నారు. ఎందుకు చెయ్యి విడిచినావని మనిషి అంటాడు గాని యింకొకరనరు గదా! వారు నా బట్టలు తీసుకొని చీట్లు వేసికొన్నారని యీ కీర్తనలో యున్నది ప్రభువు మరణ సమయములో రాణువవారు ఆయన యంగీని చీట్లు వేసికొనిరి. నా పాదములు, నా చేతులు, వారు పొడిచినారని యున్నది. నేను జ్ఞాపకము చేయుచున్నాను గనుక ఇంటికి వెళ్ళి చదవండి.
-
(5) (యోష 53 అధ్యా.) ఈ అధ్యాయములో మీరెరిగిన మూడు అంశములున్నవి.
- (ఎ) మన శ్రమలు తనమీద వేసికొనినాడు.
- (బి) మన వ్యాదులు తనమీద వేసికొనినాడు.
- (సి) మన శిక్షలు ఆయన మీద వేసికొనినాడు.
- (6) విలాపవాక్యములు: యిర్మియా వ్రాసిన ఈ గ్రంధములో ఒక భక్తుడు ఉన్నాడని, ఆయనకు శ్రమలని, ఆయన యెంత ప్రార్ధన చేసిన వినలేదని, ఈటె తీసుకొని ఆయనను పొడిచినారని వ్రాయబడి యున్నది. ఈ ఐదు అధ్యాయములు బాగుగా చదువుకొనండి. యేసుప్రభువు గెత్సేమనే తోటలో ఏమన్నారు? ఈ శ్రమల గిన్నె నా యెద్దనుండి తొలగించమన్నారు అయితే తండ్రీ విన్నారా? యింత శ్రమ భరించుట యెలాగు? పరిశుద్ధ పట్టణమునకు శ్రమ, నాకు శ్రమ సీయోనుకు శ్రమయని విలాప వాక్యములలో శ్రమ చరిత్ర యంతయున్నది.
ఇప్పుడు సువార్తలలో చూద్దాము.- (2) సువార్త భాగము: మత్తయి 16-17 అధ్యాయములలో మరణ చరిత్రకు సంబంధించిన ప్రవచనములున్నవి. ఈ ప్రవచనములలో ప్రభువు తన చరిత్ర తానే చెప్పుకున్నాడు."ఇదిగో యెరుషలేముకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు పాపుల చేతి కప్పగింపబడి, శ్రమలపాలై, మరణము పొందునని" మూడు ప్రవచనములున్నవి శిష్యులందరు ప్రవచనములన్ని విని దుఃఖించినారు. దీని యర్ధము మాకు తెలియుట లేదు, ఈయనే దేవుడని యనుకొనుచున్నామని వారు భావించి, చివరకు పేతురు ప్రభువా! శ్రమలు నీకు దూరమగును గాక అని చేతులు పట్టుకొని బ్రతిమలాడినాడు. ప్రభువందుకు పేతురును సాతానా! నా వెనుకకు పొమ్మని గద్ధించినాడు.తరువాత శ్రమచరిత్ర వచ్చును. ఇది యసలు జరిగిన చరిత్రయైనను నేను చెప్పునదేమనగా - రాబోయే ప్రభువుయొక్క శ్రమచరిత్ర అంతయు నాలుగు సువార్తల యొక్క చివర యధ్యాయములలో కలదు.
- (3)పత్రికల భాగము: ఆరోహణమై వెళ్ళిన తరువాత భక్తులు జరిగిన చరిత్రను తలంచుకొని ధ్యానించినారు. మనమాలాగే జరిగిన చరిత్రను భస్మ బుధవారము మొదలుకొని మంచి శుక్రవారము వరకు ధ్యానించెదము. 1 పేతురు 1,2 అధ్యాయములలో జ్ఞాపకము తెచ్చుకొనిన చరిత్ర ఉన్నది. పౌలు ఏమి వ్రాసినాడంటే ఆయన సిలువమీద పొందినది శ్రమ కాదు, ఆయన బ్రతుకు అంతయు శ్రమ చరిత్రే. రోదనముతో, కన్నీళ్ళతో ఆయన కాలము గడిపెనని వ్రాసెను. (హెబ్రి 5:7)లో ప్రభువు ఎప్పుడును యేడ్చుచునే యున్నారు అని పౌలు అన్నాడు. సంఘ చరిత్రలో భక్తులు యేసుప్రభువును గూర్చి యేమన్నారంటే యెప్పుడును దుఃఖముతో నుండేవాడనియు, కస్టములలో యున్నావారిని చూచి జాలిపడేవాడనియు వ్రాసిరు. ఎవరైతే ప్రభువును పొడిచినారో వారాయనను చూచి యేడ్చెదరు, ప్రధమ కమారుడు చనిపోయిన యెడల తల్లిదండ్రులు ఎట్లేడ్చెదరో (జెకర్యా 12 అధ్యాయము) యట్లే ఏడ్చెదరు.
- (4) ప్రకటనలోని భాగము: ప్రకటన 5వ అధ్యాయములో నొకాయన సింహాసనము మీద కూర్చున్నారు. ఆయన యెదుట వధింపబడిన గొఱ్ఱెపిల్ల నిలువబడి ఉన్నదని వ్రాయబడి యున్నది. ఇది ఇంకను జరగలేదు. మనము యెత్తబడినపుడది చూస్తాము. ఇవన్నియు ఈ నలుబది దినములు తలంచుకొని, చదువుకొని, వీలైతే వ్రాసికొంటే, ప్రభువు మిమ్ముని చూచి చిరునవ్వు నవ్వును. ఆలాగు మనము ప్రభువును ఆదరించెదము. ప్రభువు మనలను ఆదరించును. పాపము చేసిన తరువాత పేతురు సంతాపపడి యేడ్చినట్లు కాదు గాని ప్రభువా! యీ గొప్ప పాపినైన నా మీద నీకెందుకింత ప్రేమ! యని మీరు జ్ఞాపకము చేసుకొని యీ కీర్తన పాడుకొనండి.
అట్టి కృతజ్ఞతానంద దీవెనతో వరుడు మిమ్ములను ఈ గుడారములోనికి నడిపించుకొనును గాక! ఆమేన్.
కీర్తన: "ఎందుచేత యీ పాపిపై - యింత ప్రేమ యుండగలదో! = డెందము గ్రహింపలేదు - వందన మిమ్మాను యేలా!" ||నీకు||