లెంటులోని ఇరువది ఆరవ దినము - గురువారము
గలతీ 3:1
ప్రార్ధన:- తండ్రీ! నీ సిలువలో మేము గ్రహించని సంగతులు అనేకములు ఉన్నవి. ప్రతి దినధ్యానములోనూ ఒక నూతన సంగతి అందించుచున్నందుకు వందనములు. మా కొరకు ఎన్నో మహిమ సంగతులు దాచి ఉంచినావు గనుక నేడును నీ సిలువలోని మహిమ వర్తమానము దయచేయుమని యేసు నామమున వేడుకొంటున్నాము. ఆమేన్.
ఆయన సిలువ వైపే చూస్తూ ఉన్న ప్రయులారా! దేవుని పిల్లలారా! ఈ శ్రమకాల దినములలో ప్రభువుయొక్క శరీర చరిత్ర మన మనో నేత్రములకు కనిపిస్తున్నది. అది మూడు భాగములుగా నున్నది.
- 1. యేసుప్రభువు చేసిన సత్కార్యము.
- 2. అట్టి సత్కార్యములు చేసినందువల్ల ఆయనకు లభించిన హింస.
- 3. ఆయనను హింసించిన వారికి కలిగిన దుస్ధితి.
-
పై మూడు భాగములు మూడు విధములుగా ఉన్నవి.
- 1) సత్కార్యములు,
- 2) శ్రమ మరణము,
- 3) శ్రమ కలిగించిన వారి దుస్ధితి (హింసకుల దుస్ధితి)
- (1) ప్రభువు చేసిన బోధ:- ప్రభువు యొక్క మంచి కార్యములు భాగములో ఇది మొదటిది. ఆయన చేసిన మొదటి సత్కార్యము బోధ. జన సంఘముల ఎదుట ప్రభువు బోధించినారు, బోధకుడుగా బైలుదేరినారు, ఆయన ఎవరో, ఆయన వర్తమానమేమిటో తెలియవలెనంటే ఇతరులకు బోధించవలెను గనుక ప్రజల ఎదుట బోధకుడుగా ప్రత్యక్షమైనాడు. అదిగో 'యూదుల రబ్బీ' అని ప్రజలు చెప్పుకొన్నారు.
ప్రభువు బోధించే బోధ, క్రొత్త బోధయై యుండకపోతే ప్రజలు మెచ్చుకొనరు, అంగీకరించరు. గనుక ఆయన బోధ వినిపించినపుడు, ఇది ఎటువంటి బోధో అని ప్రజలు రిమార్కు చేసినారు. ఇది ఆయన చెప్పినందువల్ల క్రొత్త బోధ. అనగా అధికారముతో బోధించినందున, వారు ఆశ్చర్యపడినారు. ఎందుచేత ఆయన అధికారముతో బోధించినారు. తాను బోధించినవన్నీ నెరవేర్చినారు. పూర్వికులైనవారు బోధించిన పాఠములున్నవి. వాటిని మత గురువులు బోధించినారు. నరహత్య చేయుట పాపము అని బోధించినారు. ప్రభువు ఏమి చెప్పినారంటే కోపపడితేనే పాపమని చెప్పినారు. అది పూర్వికులు చెప్పలేదు. గనుక ఇది క్రొత్తగా ఉన్నది. 'అబ్బో కోపపడితేనే పాపమైతే, మనలో అందరము రుసరుసలాడు వారలమే' అని అశ్చర్యపడ్డారు. నరహత్య చేయవద్దని పూర్వికులు బోధించినారు. కాని నేను మీతో చెప్పునదేమంటే అని ప్రభువు తనకున్న సర్వాధికారము చూపించి, బోధించినారు. ఏమిటా అధికారము? దాని భావము కాలక్రమమున తెలిసినది.
నేనే సీనాయి కొండ దగ్గర నహత్య చేయవద్దని ఆజ్ఞ ఇచ్చింది. ఇప్పుడు నేనే కోపపడవద్దని చెప్పుచున్నాను. ఆ ఆజ్ఞలు ఇంకొకరు చెప్పితే, అది అధికారము కాదు గాని, సందేశమౌతుంది. ఆయనే చెప్పినాడు గనుక అధికారము కనబడినది. నేను చెప్పినది వినండి అని చెప్పినాడు. ఈ మాటల వలన ఎవరికి ఎక్కువ కోపము వచ్చును? మత బోధకులకు కోపము వచ్చును. మాట ఒక్కటే, గాని బోధ ఆశ్చర్యము. కోపపడితేనే నరహత్య అని ఆయన చెప్పినారు. ఆ కోపము ఇక్కడనే కనబడినది. కాబట్టి దేవుని వాక్యము ఒకటే గాని ఫలితములు రెండు:
- 1) ఒకరికి కోపము,
- 2) ఇంకొకరికి ఆశ్చర్యము కలిగినది.
- 1. పెద్దలు,
- 2. ప్రధాన యాజకులు,
- 3. శాస్త్రులు,
- 4. యూదుల ఆలోచన సభ,
- 5. రాణువవారు,
- 6. అధికారులు.
ఒక దృష్టాంతము: 'నేను వెళ్లుచున్నాను, సహాయకుడను పంపిస్తాను' ఇది పూర్వికులు బోధించిన బోధకంటే ప్రభువు చెప్పిన ఎక్స్ట్రా బోధ. పరిశుద్ధాత్మ చెప్పినది ఇంకా ఎక్స్ట్రా. ఇప్పుడు అవి బోధించితే, విరోధులు లేస్తారు. ఈ కాలమందు ప్రభువు ఆత్మ బోధించిన ఎక్స్ట్రా టీచింగ్ ఎవరు చేస్తారో వారికి విరోధులు జాస్తి. ఆయన బోధవలన వారి అసూయ ఎక్కువై, తుదకు ఆయనను చంపినారు. "హింసపొందుటకు, చంపబడుటకు కారణము ప్రభువే. ఆలాటి బోధ ఎందుకు చేయవలెను? అందరు చెప్పినట్లు ఆయన ఎందుకు చెప్పకూడదు? అని వారందరు ఆయనను తరిమినారు.
- 1) ఎక్స్ట్రా బోధ,
- 2) ఆయన. ఈ రెండూ ఆయనను చంపుటకు కారణాలే.
పూర్వికులు ఈలాగు చెప్పుచున్నారనగానే ఆనాడు వారికి విరోధము ఎక్కువైనది. మనమును నేడు ఆలాగు చెప్పవచ్చునా? చెప్పవచ్చును. అనవచ్చునా? అనవచ్చును. ఎందుచేత? ప్రభువు ఆత్మ చెప్పుచున్నాడు గనుక అనవచ్చును. ఇప్పుడు మేము చెప్పుచున్నాము వినండి అని అనవచ్చును. ఎవరు దేవుని వాక్యము సరిగా నేర్చుకొంటారో వారే, ఆలాగు చెప్పగలరు. ఎవరు మోషేవలె, ప్రభువువలె సంపూర్ణ అధికారము సంపాదించుకొంటారో, వారే ఆలాగు చెప్పగలరు. ఇప్పటి బోధకులు అధికారము గలవారా? శత్రువుయొక్క బలమంతటి మీద ఆయన అధికారము ఇచ్చినారు. అయితే, సంపూర్ణ సువార్త ఎరిగినవారు, అంతకంటే అధికారము గలవారు. మీరు అంత బాగా వాక్యమును నలగ చదువుచున్నారా? కంఠతగా నేర్చుకొన్నారా? ఎవరు ఏమి అడిగినా జవాబు చెప్పగలరా? వాక్యములో ఏదో సగము నేర్చుకొన్నారు. అయితే ఆ సగములో సగము మాత్రమే చెప్పగలవారు ప్రభువుయొక్క బోధను అధికారముతో ఇతరులకు ఏలాగు వినిపించగలరు? ఓ బైబిలు మిషను సువార్తికులారా!
- 1. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ఎక్స్ట్రా బోధించండి.
- 2. అధికారముతో బోధించండి.
- 3. ఎక్కువగా నేర్చుకొన్నాననే అధికారముతో బోధించండి.
- 4. 'సత్యము నేను చెప్పుచున్నాను, నేను బాగా నేర్చుకొన్నాను' అని బోధించండి.
-
(2) ప్రభువు చేసిన పరిచర్య:- తాను ఏమి బోధించినాడో అదే పరిచర్యగా, ప్రభువు రోగులను బాగుచేసినాడు. దృష్టాంతము: కుష్టరోగిని ముట్టకూడదు గాని ముట్టుకొని బాగుచేసినారు. జ్వరము గల వానిని, గుడ్డివానిని, శవమును ముట్టుకొని బాగుచేసినారు, ఉపకారము చేసినారు. యావగించుకొనలేదు, అసహ్యించుకొనలేదు. రోగులకు ఉపకారము చేసినాడు. ఏమి ఉపకారము? స్వస్ధత. ఇవి తక్కిన బోధకులు చేయలేదు.
ఈయన బోధించిన తరువాత రోగులకు బాగుచేస్తే, రోగులకు ఇష్టము కలిగినది. బోధకులకు కష్టము కలిగినది. అందుచేత పగ రెగ రెట్టింపు అయినది. 'అందరికి ఇట్టి అద్భుత కార్యములు చేస్తునారు. అందరూ ఆయన వెంట బోవుచున్నారు' అని వారు అసూయ పడ్డారు. ఆయనలోని ఉపకారము చివరకు వారికి దుర్గుణము అయింది. ఆయన ఉపకారము ఒక కారణము, ఆయనే ఒక కారణము. ప్రభువు రోగులను బాగుచేసినట్లు ఈ కాలమందు ఎవరైనా చేస్తున్నారా? మనము చేస్తామా? మనము చేస్తే నమ్ముతారా? ఈ కాలమందు ఆలాగు చేస్తే ఎవరికి కష్టము? డాక్టరులకు కష్టము. మా బ్రతుకు దెరువు పడిపోయిందని, ఒక డాక్టరు అన్నారు. రోగులను బాగుచేయుట, గాలి తుఫాను అణచుట, చిక్కులు విడిపోవునట్లు చేయుట; ఈలాగు ప్రభువు చేసినట్లు మనమును చేస్తే అందరూ బాగవుతారు. అయితే ఇదివరకు ఎవరైతే బాగుచేయలేదో వారికి ఇది కష్టము.
- 1)ఎక్స్ట్రా బోధ,
- 2) ఎక్స్ట్రా (ఉపకారము) పరిచర్య,
- 3)ఎక్స్ట్రా సాధుత్వము.
- (3) ప్రభువు సాధుత్వము:- 'కొట్టినను మరల వానిని కొట్టడాయెను. తిట్టినను మరల వారిని తిట్టడాయెను'. అందుచేతనే ఆయనను వారు చంపివేసిరి. ఏలియా లాంటివారైతే అగ్ని కురిపించి, వెంటనే చంపించుదురు. గాని ఈయనలోనున్న సాధుత్వము, అధిక సాధుత్వమును బట్టి వారు- 'అంత మందిని రక్షించున్నావు, నిన్ను నీవు రక్షించుకో రాదా' అన్నారు. గనుక ఆయనలో ఉండే సాధుత్వము ఆయన మరణమునకు కారణము. కొందరు సువార్త బోధించుటకు వెళ్లినపుడు, అన్యులు వారిని దూషించితే, కొంతమంది తిరిగి దూషిస్తున్నారు. మరికొంతమంది దూషించుటలేదు. అయితే తిరిగి దూషించుట సాధుత్వము కాదు. ప్రభువాలాగు చేయలేదు. దూషించినప్పుడు దూషిస్తే, కొట్టినపుడు తిరిగి కొట్టితే జయము దొరుకవచ్చునేమో గాని, ఆత్మ దొరకదు. ఘనత కొరకు, గొప్ప సొమ్ము కొరకు, మనము సువార్త పనిమీద వెళ్లము. గాని మనిషి కొరకు వెళ్లుదుము గనుక మనిషి దొరకునట్లు, సాధుత్వమువల్ల సంపాదించవలెను. ప్రభువు తన సాధుత్వమువల్ల అందరిని చెరపట్టినారు. అయితే మీ ద్వేషము వలన మీరు అందరిని చెదరగొట్టు చున్నారు. ఆ మహిమ గల ప్రభువుయొక్క మహిమ వారికి తెలిసియుంటే, అయనను సిలువవేయనే వేయరని పౌలు చెప్పినారు. ప్రభువును ఎందుకు వారు హతము చేసినారు? ఆయనలో ఉన్న ఎక్స్ట్రా సాధుత్వమువల్ల హతము చేసినారు. ఆయన సాధువులందరి కంటే సాధువు. ఉపకారులందరి కంటే మహా మహోపకారి. బోధకులందరికంటే మహా మహోపాధ్యాయుడు. హత సాక్షులకు యేసుప్రభువు మాదిరివల్లనే ధైర్యము వచ్చింది.
-
(4) ప్రభువు సత్ప్రవర్తన:- సత్ప్రవర్తన అనగా మాటలో దోషములేదు, చూపులో కళంకము లేదు, వినడములో కళంకములేదు, క్రియలో కళంకములేదు, ఏందులోనూ కళంకములేదు. గనుక ఆయన మహా పవిత్రుడు. ఆయన ప్రవర్తన సత్ప్రవర్తన గనుక ఆయన పరిశుద్ధుడుగాను నిష్కళంకముగాను ఉన్నారు. ఆయన తన బోధలో పరిచర్య, ఉపకారములో సాదుత్వము,సత్ప్రవర్తనలో నిష్కళంకుడుగా నున్నాడు.
అంతకు పూర్వమున్న భక్తులు మాత్రమే సత్ప్రవర్తనగలవారు కారు. వారిలో పోరబాటులు గలవారు ఉన్నారు గాని తరువాత వారు దిద్దుకున్నారు. ఈయన ఎందుకు దిద్దుకొనలేదు. ఈయన అసలే కళంకము లేనివారు గనుక దిద్దుకొనలేదు.
ఎక్స్ట్రా సత్ప్రవర్తన:- 'ఆయన ప్రవర్తించినట్లు ఎవరూ ప్రవర్తించలేదు. 'ఎందులో ఒక దానిలో మనము జారిపోయినాము' అని ఆ కాలము నాటివారు ఆయన ఎక్స్ట్రా సత్ప్రవర్తన పై మత్సర పడ్డారు. మనలో నిన్న అపవిత్రత ఉంటే, ఈ వేళ సత్ప్రవర్తన యుండవచ్చు గాని ప్రభువు వంటి సంపూర్ణ సత్ప్రవర్తన గలవారు ఎవరులేరు. ఆయనవంటి సత్ప్రవర్తన చూపించే వారు లోకములో ఎవ్వరు లేరు. చివరిది, అన్నిటికంటేఅ గడ్డయినది, 'నాలో ఏ దోషము లేదు. ఎవరైనా దోషము ఆరోపించగలవారుంటే ఆరోపించుడని' జనసముహము ఎదుట ఆయన చెప్ప గలిగెను.
- (5) నేనే ఆయనని (దేవుడనని) బోధించుట:- ప్రభువు వాక్యోపదేశము చేసే సమయమందు ఏమన్నారంటే 'అబ్రాహాము పుట్టకముందే నేనున్నానని' చెప్పెను. '30 ఏండ్లున్న ఆయన సృష్టికిముందే ఉన్నాను' అన్నందున వారికి కోపము వచ్చినది. ఆయన నేను మెస్సియాను అన్నారు. దేవును కుమారుడవా! అంటే అవును. తండ్రి నేను ఒక్కటే అన్నాడు. నరమాత్రుడు, దేవునితో సమానం చేసుకొన్నాడు. ఆ కోపముకంటే ఈ కోపము ఎక్కువగా కాగా, నేనే దేవుడనని చెప్పుకుంటున్నాడని అధికారులకు అప్పగించారు. కేసు విచారణప్పుడు గవర్నమెంటువారి ఎదుటే దోషము ఆరోపించిరి. దేవునితో సమానము చేసికొన్నాడని చెప్పిరి. కోపము, పగ ఎందులోకి దిగింది, ఆలోచనలోకి దిగింది. ఆ ఆలోచన, చంపడములోకి దిగింది. ఇవన్నీ నేను దేవుడనని చెప్పుటలోకి దిగింది. సత్ప్రవర్తనపుడు నీతిపరుడుగా కనబడెను. ఇదంతా సినిమాగా కనిపించినది. సినిమాలో ఈ ప్రకారముగా బొమ్మలుచూపిస్తే, కూలివాడు చివరకు రాజైనాడు అని అందురు ఆలాగే బోధకుడు, సాధువు చివరకు దేవుడైనాడా! అని వారందరు అనుకున్నారు. సమరయ స్త్రీతో మాట్లడినపుడు, తాను దేవుడైయున్నాడని ఆయన బోధించినాడు.
ఆయన,
- 1.బోధకుడు
- 2. పరిచారకుడు
- 3.సాధువు
- 4.నీతి ప్రవర్తన కలవాడు.
- 5. ఆయన మన దేవుడు గనుక విరోధము ఎక్కువాయెను. పెండ్లికుమార్తె శాఖవారు. ఇవన్నీ చేయగలరు.
అట్టి అంతస్ధు ప్రభువు మీకు దయచేయును గాక. ఆమేన్.
కీర్తన: ధీరుండై దీనుండై - ధారుణ్య పాప భారంబు మోసెను సోదరా = తన్ను - జేరిన వారిని - పారదోలనని - ఎవరు బల్కిరి సోదరా! ||యేసు క్రీస్తుని సిలువ ||