లెంటులోని ముప్పది తొమ్మిదవ దినము - మంచి శుక్రవారము
అయ్యగారి ఇతర Good Friday ప్రసంగములకు ఇక్కడ క్లిక్ చెయ్యండి
ప్రార్ధన:- తండ్రీ! ఇన్ని దినములు మా నిమిత్తమై శ్రమ పడిన నీవు, నేటి దినముతో నీ శ్రమను ముగించనైయున్నావు. జీవమైయున్న నీవు మరణించినావు. మేమేమి గ్రహించగలము? గ్రహించినను ఏమని స్తుతించగలము! నేటి దినముతో నీ సిలువ వేతను సమాప్తము చేసినావు. మా మీదనున్న సిలువలను తొలగించుకొనుటకు, ఈలాగు నీ సిలువను మాకు ఆధారముగా చేసినావు. నేటి దిన సిలువ ధ్యానము ద్వారా నీ అంతరంగములోని వర్తమానము నీ సిలువలోనుండి మాకు దయచేయుమని సిలువపై మరణించిన యేసు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్.
మనకు సిలువను ధ్యానించుట మామూలు అయిపోయింది. మామూలు అనే దానివల్ల జయింపబడక, నూతనమైన ఉద్రేకముతో నేడు సిలువను ధ్యానించుకొందము. కల్వరి కొండమీద 3 సిలువలున్నవి.
- 1) రక్షింపబడిన వానియొక్క సిలువ.
- 2) రక్షింపబడకుండ మారుమనస్సు లేకుండా, చనిపోయిన వానియొక్క సిలువ.
- 3) సర్వలోక పాపభారమును మోసి, పరిహరించి, రక్షింపవచ్చిన, రక్షణకర్త యొక్క సిలువ.
ప్రభువు సిలువ రక్షింపబడిన వాని సిలువకునూ, రక్షింపబడని వాని సిలువకునూ, వెలుపలనుండక మధ్యనున్నది. 'నీవు రక్షింపబడునావు' అని కుడి ప్రక్కనున్న వానితో చెప్పుటకు, 'నీవు కూడ సిలువ చూపించినాను' అని ఎడమ ప్రక్కనున్న వానితో అనేటందుకు రెండు సిలువలు మధ్యను ఆయన సిలువ ఉన్నది. ప్రభువు సిలువలో నుండి రెండు వర్తమానములు ఇచ్చినారు.
- 1. నీవు బ్రతికిపోయినావు,
- 2. అయ్యో! నీవు చచ్చిపోయినావు.
నేడు ఆయన సిలువ మనకు కనబడుచున్నది. కుడి, ఎడమ ప్రక్కలనుండి సిలువలు మానవులమైన మనము మోయవలసిన సిలువలు. మధ్య సిలువ, మనసిలువను పరిహరించు నిమిత్తము క్రీస్తు (వ్రేలాడిన) సిలువ. మన సిలువలు పరిహరించవలెనంటే, ఆయన సిలువ అనుభవించవలసినదే. మూడు సిలువలు ఒకచోట పెట్టండి. వేరుగా ఉంచండి. మరి మూడు సిలువలు జ్ఞాపకము చేస్తున్నాను. ఇవి మన జీవితకాలములో కనిపిస్తున్న సిలువలు, ఇప్పుడు చెప్పనైయున్న సిలువలు. ఇవి క్రీస్తునామధారియొక్క, లేక విశ్వాసియొక్క మూడు సిలువలు. ఈ మూడు సిలువలు పరిహరం కావలెను అనగా ముగింపు కావలెను. సంఘమునకు కూడ ఈ మూడు సిలువలున్నవి. ఈ మూడు సిలువలు సంఘము ఎత్తుకొనవలెను. ఒక కాలము వచ్చుచున్నది. అప్పుడు సిలువ ఎత్తివేయబడును, అప్పుడు సంఘము మహిమలోకి వెళ్ళును. ఆ సంఘము, ఆ సమయములో వచ్చువరకు ఈ మూడు సిలువలు ఉంటున్నవి. అవి:
- 1) వంశాధార సిలువ;
- 2) పాపఫలిత సిలువ;
- 3) సువార్త సిలువ.
ఇవి సంఘ చరిత్రలో ఉన్నవి. అలాగే ఇప్పుడు ఉన్న సంఘచరిత్రలోను ఉన్నవి.
- 1. వంశమును బట్టి కల్గిన సిలువ.
- 2. తాను చేసికొన్న పాపముయొక్క ఫలితముగా వచ్చిన సిలువ.
- 3. సువార్త ప్రకటన అనేజ్యోతి పట్టుకొని ఇతరులకు ప్రకటించేటప్పుడు వచ్చే హింస సిలువ.
1. వంశాధార సిలువ:- సంఘములో విశ్వాసులున్నారు. అవిశ్వాసులు, నామక క్రైస్తవులు ఉన్నారు ఎన్నిమార్లు దేవుని వర్తమానము వినబడినను మనస్సు మారని వారును ఉన్నారు. ఈ పందిరి క్రింద ఉన్న వారెవరు? ఈ నిమిషమందు నిలువబడి నాకు తెలిసినంత వరకు మారుమనస్సు పొందియున్నానని చెప్ప గలిగినవారే. నా హృదయము పవిత్రముగా నున్నది. దేవుని దృష్టిలో పవిత్రముగా ఉన్నదని ఎవరు చెప్పగలరో, వారే సిలువను సరియైన రీతిగా ధ్యానించగలరు. ప్రభువు సిలువ గురించి, తమ సిలువను గూర్చి ధ్యానించగలరు. అందరూ ఆలాగు ధ్యానించగలరా? లేదు. అందరూ ధ్యానించలేరు. నామక క్రైస్తవులు, విశ్వాసులు, అవిశ్వాసులు, అందరు దేవునికిష్టమైన రీతిగా అంగీకరముగా ఉండే రీతిగా ధ్యానించలేరు. 'నాకు తెలిసినంతవరకు ఏ కళంకములేదు, అన్నిటినీ పరిహారం చేసుకొన్నాను' అని ఎవరు చెప్పగలరో, వారే ధ్యానము చేయగలరు. వాక్యమును బాగా పరిశీలన చేసేటప్పుడు, పరిక్షించుకొనేటప్పుడు మహాగొప్ప చిక్కు కనిపిస్తున్నది. అదేదనగా చూస్తేనే, తలస్తేనే, అనుకొంటేనే, చేస్తేనే పాపము. ఇలాగు ఈ మూడు పరీక్షలకు ఎవరు నిలబడగలరో వారే సిలువ ధ్యానములో నిలబడగలరు. భూలోకములో ఎంత గొప్ప విశ్వాసియైనను, భక్తుడైనను కష్టము అనుభవింపక తప్పదు. ఎవరైనా వారికి కలిగిన మంచి అనుభవము చెప్పగలరు గాని, కష్టాలు కూడ చెప్పగలరా! ఫలాని విషయములో కష్టము, నష్టము, చింత, బాధ కలిగినదని చెప్పగలరు. అయితే, ప్రభువు వారి కష్టములు తొలగింపడా! అని అందురు. ఆ కష్టములనే సిలువని చెప్పుచున్నారు. లోక మానవులందరు మోస్తున్న సిలువలు ప్రభువు సిలువకు సమానమైన సిలువకాదు. విశ్వాసులతో సంభాషించండి. అయ్యా ఈ కష్టము ఎందుకు వచ్చిందంటే, 'మా వంశములో ఈ కష్టమున్నది. ఆ వంశములో ఉన్న దానిని బట్టినాకు వచ్చింది. అది ప్రభువు తీసివేస్తే పోవును, గాని లేకపోతే అది పోదు' అనును. అది ఒక ముల్లు. అది వంశపారంపర్యముగా వచ్చిన సిలువ గనుక దానిని అతడు మోయవలెను. మోస్తూ, మోస్తూ ప్రభువును మహిమ పరచవలెను. ప్రభువు తీసివేసినా తీసివేయకపోయినా మోయవలెను.
2. స్వకీయ పాపఫలిత సిలువ:- విశ్వాసి కాకముందే, అనగా ప్రభువును ఎరుగకముందు, పిదప విశ్వాసిగా మారిన తర్వాత తాను చేసిన పాపమువల్ల కష్టము కలుగును. ఆ కష్టము విశ్వాసిని విడిచిపెట్టలేదు. మారుమనస్సు పొందినారు గాని పాపము వలన తన జీవితమిలో వచ్చిన కీడు పోలేదు. అది ఎప్పుడు కనబడుతున్నది. పాపము పోయినది గాని పాపఫలితము పోలేదు. అది ఎప్పుడో పోవును గాని నిత్యముండదు. ఏది గొప్ప సిలువ. వంశాధార సిలువా? పాప ఫలిత సిలువా? అప్పుడప్పుడూ శోధన పాపము కూడ నిజమే. క్షమాపణ నిజముగాని పాపఫలితమెందుకు ఉండవలెను? అప్పుడు ప్రభువు యెడల అతనికి విసుగుదల కలుగును. మీకే సిలువ ఉన్నదో పరీక్షించుకొని ప్రభువు సిలువను బట్టి పరిహారం చేసుకొనండి. మీ విశ్వాసమును బట్టి స్తుతివల్ల, కృతజ్ఞతవల్ల, సహింపువల్ల పరిహారం చేసుకొనండి. రక్షింపబడిన విశ్వాసి ఎల్లప్పుడు సిలువమీద ఉండడు. కొంత సమయము మాత్రమే సిలువమీద ఉండును.
3. సువార్త సిలువ (సంఘస్తులమీద ఉన్నసిలువ): ఒక విశ్వాసి ఉన్నాడు. గ్రామసంచారము చేసి, సువార్త ప్రకటించాడు. అజ్ఞానులు పట్టుకొన్నారు, కొట్టారు. చాల దినములు మంచము మీద నున్నాడు, చనిపోయాడు పాపము చేసినావా? అని అడిగితే నాకు తెలియదన్నాడు. ఇది ఏ సిలువ అని అడిగితే తెలియదన్నాడు. అతనికి తెలియక పోవచ్చును గాని మనకు తెలుసు. సువార్త ప్రకటించినందున అతనికి సిలువ వచ్చినది. ఈ మూడు సిలువలలో ఏ ఒక్క సిలువ, ఏ రెండు సిలువలు, ఏ మూడు సిలువలు, ఏ సిలువ మీరు మోస్తున్నారో! అను ప్రశ్నకు జవాబు మీరే చెప్పుకొండి. మీరు, మీ ఇష్టం పనికిరాదు. పై సిలువలు ప్రభువు మనమీద పెట్టలేదు. ఒకటి మాత్రము పెట్టినారు. అది సువార్త ప్రకటించే భారం. ఈ సిలువమీద పెట్టబడియున్నది. అది మన మందరము ఎత్తుకొనవలసి యున్నది. అది ఎత్తుకొన్నప్పుడు శ్రమలు, సిలువలు అనేకములు మనకు రావచ్చును. గాని ఈ సిలువను దించివేయకూడదు. సువార్త సిలువకు మరియొక ఉద్యోగమున్నది. వంశాధార సిలువకుకూడ మరియొక ఉద్యోగమున్నది. అయితే ఈ సువార్త సిలువ ఉద్యోగమే. ఒక గొప్ప పాఠము, బహు గొప్ప పాఠము. అయితే ఏదో ఒక పాఠము నేర్పించుట వంశాధార సిలువయొక్క ఉద్యోగ ధర్మము. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాఠము నేర్పును. నాకు నేర్పిన పాఠము మీకు నేర్పడు, మీకు నేర్పినది నాకు నేర్పడు. సిలువ లేకపోతే గొప్ప పాఠము బోధపడదు. పాపము పాపముగానే ఉండును. 'శ్రమ కాదు, సువార్త సిలువలేక పోతే, పాప ఫలిత సిలువలేకపోతే ఆ పాఠము బోధపడదు. ప్రభువు పాప ఫలితము తీసివేయలేదు, వాటి ద్వారా మనకు కావల్సిన బోధ అనుభవము నేర్పుటకు వాటిని తీసివేయలేదు. పాత పాఠము నుండి క్రొత్త సంగతి నేర్పును, జ్ఞానోదయం కలిగించును. అనుభవపూర్వకముగా ఎరిగించును. ఈ మూడు చేసేపని సిలువయొక్క గొప్ప సాధనమై యున్నది. కష్టం, శ్రమ, హింస ఉన్నది గాని హాని ఏమి లేదు. జ్ఞానపాఠం, అనుభవ పాఠము ఉన్నది. ప్రతి సిలువ మాలమున మేలు కలుగుతుంది. ప్రతి విశ్వాసియొక్క జీవితకాలము పొడుగున ఈ మూడు సిలువలు ఉన్నవి. ఈ మూడు సిలువలను అందరు సంతోషముతో భరించవలెను. బైబిలో కధ ఉన్నది. (అపో.కార్య. 5:33-42) ఇక్కడ ప్రభువుయొక్క శిష్యుల కేసు విచారణ జరుగుచున్నది. అందువలన ప్రభువుయొక్క శిష్యులు కోర్టుకు వెళ్లినారు. విచారణ అయింది. అధికార దండన జరిగినది. దెబ్బలు పడ్డరు. అయితే, బైటికి వచ్చి నవ్వుకున్నారు, మురిసినారు. ఎందుకు? 'ప్రభువు నామ ఘనత కొరకు ఎంత భాగ్యము దొరికినది! ఎంతగొప్ప ధన్యత లభించినది!' అన్నారు. ఆలాగు ఎవరంటారు. పేతురు, యోహాను గనుక అలా అన్నారు.
మనలో ఆలాగు ఎవరుంటారు? నాలో ఏమి పొరపాటు లేదు గాని శ్రమ వచ్చిందంటారు. అంతేగాని భాగ్యము కలిగిందంటారా! ధన్యత అంటారా! ఎవరైతే అలా అంటారో వారు మహా ధన్యులు. భూమిమీదే ఆ మహాభాగ్యము వారికి (ఆ శిష్యులకు) ఎందువల్ల కలిగినది? కల్వరిగిరి సిలువ ఎరుగుదురు గనుక వారికి గొప్ప అనుభవము కలిగినది. మనలో ఎవరైనా సేవకు సమర్పణ అయిపోయిన వారు, పూర్తిగా సమర్పణ అయిపోయిన వారు ఉంటే, వారు పూర్తిగా సమార్పణ అయితే మాత్రం సిలువ రాకమానదు. అంతా సిలువగానే కన్పించును. విశ్వాసియొక్క జీవితకాలము (ఎప్పుడు మారినదో), ఆ సమయము మొదలు జీవాంత పర్యంతము సిలువ ఉండక మానదు. సిలువను జయించుట ఎట్లు? పరిహరించుట ఎట్లు? విసుకుకొనేవారు ఎప్పుడు సిలువ వలన మేలు పొందలేరు. పైకి మాత్రమేకాక అంతరంగములో విసుకుకొనువారికి కూడ సిలువవల్ల మేలురాదు. కీడు మిక్కిలి చౌకగా వస్తుంది. సంతోషముతో అనుభవిస్తే సిలువవల్ల తప్పక మేలు కలుగుతుంది. నాకు నా మనో దృష్టిలో మూడు జండాలు కనబడుచున్నవి.
- 1) సిలువ మోసిన,
- 2) సిలువ సహించిన,
- 3) సిలువయందు సంతోషించిన వారికి ఆ మూడు జండాలు ఉండును.
- 1. జండా ఒక విశ్వాసి కుడి ప్రక్కన,
- 2. మరొక జండా విశ్వాసి ఎడమ ప్రక్కన
- 3. మూడవ జండా విశ్వాసియొక్క శిరస్సు తిన్నగా ఉండును.
ఈ మూడు మహిమగల జెండాలే. జయమును చూపించే ఈ జెండాలు ప్రభువు జయమును, మన జయమును సూచించును.
1. అనన్యపాపి:- వంశాధార సిలువ సహించుటలో ఏమి గొప్ప తనమున్నది? తల్లిదండ్రులు చేసేదేమో మీరు సహించుచున్నారు గనుక అందులో ఏమి గొప్ప! విసుకుకొనడం లేదు సహిస్తున్నాము. అందులో ఏమి గొప్ప! మరి ఎందులో గొప్ప ఉన్నది. సువార్త ప్రకటించేటప్పుడు నీకు కలిగిన కష్టములన్నీ సంతోషముతో అంగీకరించేటప్పుడే గొప్ప ఉన్నది. ఓ విశ్వాసీ! నీ చెవిలో ఒక మాట చెప్పుచున్నాను, వినగలిగితే విను. చెవిగలవాడు వినవలెనని ఉన్నది. 'నేను చాలా శ్రమ పడుతున్నాను, సహిస్తున్నాను, విసుగుకొనుట లేదని' అంటున్నావు. అందులో ఏమి గొప్ప తనమున్నది. ఆ గొప్ప తనములేనప్పుడు ఈ గొప్ప తనమెందుకు? నేను సువార్త నిమిత్తము బాధ, హింస, ఇరుకు, నింద, ప్రతి కష్టము సంతోషముతో అనుభవిస్తున్నానని చెప్పగల విశ్వాసి ఉన్నాడా? ఈ రెండు గొప్ప తనములకు (శ్రమపడుట, సహించుట) ఆ ధ్యానములు (సిలువయందు సంతోషించుట) లేకపోతే వీటికి విలువలేదు. సువార్త శ్రమానుభవము వల్ల కలిగిన ఆనందము నీకు లేకపోతే , ఈ రెండు గొప్పతనములవల్ల ప్రయోజనము లేదు. ప్రభువుయొక్క సిలువధ్యానములవల్ల మేలు కలుగకపోతే ఈ మూడు సిలువలవల్ల ప్రయోజనములేదు. సువార్తికులు శ్రమ పడేటప్పుడు ప్రభువు- నేనుకూడ నీతో శ్రమపడుతున్నాను అని చెప్పును. అప్పుడు గొప్ప విలువ, మేలు కలుగును. సిలువ చరిత్ర ముందుగా నీకు ప్రకటింపబడకపోతే, మహిమగల సిలువ చరిత్ర బోధపడేటట్లు నీవు వీధిలోకి వెళ్లి ప్రకటించితే ఏమీలాభములేదు. ఒక ఇవాంజిలిస్టు అయ్యా! ఒక గంటసేపు నేను కష్టపడి బోధించితే ఎవరికి వాక్యము తెలియలేదు. నచ్చలేదు అన్నారు. అప్పుడు అయ్యగారు "అడుగుకోవడమునకు వచ్చినాడు గాని సిలువ బోధించడానికి రాలేదు అన్నారు". నీకు మొదట సిలువ ధ్యానములేదు. అనగా నీ జ్ఞానమునకు సిలువ ధ్యానమున్నది గాని నీ హృదయమునకు సిలువ ధ్యానమనేది అందలేదన్నారు. అటువంటి సువార్తికులందరు ప్రకటించుట మానివేయవలెను. అనుభవము గలవారు సిలుచ చరిత్ర, ఒకదాని తరువాత మరొకటి వరుసగా చెప్పగలరు. అయితే అనుభవములేని వారు అలాగు చెప్పలేరు. ప్రభువు శాపఫలితము బహు చక్కగా బోధించినా, అంగీకరించని వారున్నారు. కొందరు మంచి బోధకులున్నారు, అయితే వారిని ఇతరులు గ్రహించలేక పోవచ్చు. ఈ దినము సిలువ ధ్యానము బాగుగాచేయగలిగితే, దానికి కారణము ఏమైయుండునో అది తలస్తే, అనుకుంటే, చూస్తేకాదు గానీ చేస్తేనే సరేసరి అని తలంచిన వారే బాగా సిలువధ్యానము చేయగలరు. ఎవరు సిలువధ్యానము బాగా చేయగలరో వారు సువార్త ప్రకటించగలరు. ఎవరు సువార్త బాగా ప్రకటించగలరో, ఆ మూడు సిలువలు వారే మోయగలరు. ఎవరు మోయగలరో వారికే జండాలు. ఎన్ని పాపములు చేసినా, చివరకు నాదే జండా అని ఎందరు తలస్తే, చూస్తే, చేస్తే, అనుకొంటే; దానినిబట్టి వారు ధ్యానముచేసిన స్ధితినిబట్టి వారికి జెండా రాగలదు. మూడు జెండాలన్నారు. అవి ఏమి జండాలు? జయ జండాలు.
"విజయగీతములు....పాడరే".
కుడివైపున ఒక గుట్ట ఉన్నది. ఏమిటి గుట్ట? అది చెత్త గుట్టకాదు, రాళ్ళగుట్టకాదు. వజ్రాల గుట్ట. అది దేవుని వాక్య గ్రంధములో ఉన్నటువంటి వాగ్ధానముల గుట్ట. విశ్వాసి ఆ గుట్టమీద జండా. విశ్వాసియైన తారీఖు మొదలు, తాను ఈ లోకములో విశ్వాస యాత్రచేయుచున్నప్పుడు సిలువలు కూడ అతని వెంబడి వెళ్లును. అలాగే ఈ గుట్టకూడ వెళ్లును, ఈ గుట్టలేకపోతే విశ్వాసికి జయములేదు. ఈ గుట్టపై ఏ వాగ్ధానము ఉన్నది? నీ రక్షకుడు సహించినారు గదా! అనే వాగ్ధానమున్నది. "ఎందుకు భయపడవలెను? ప్రభువు సహించినారు గదా! ఫర్వాలేదని ధైర్యము చెప్పును". అటువంటి వాగ్ధానములు, బైబిలో 30వేల వాగ్ధానములున్నవి, గనుక అన్ని వాగ్ధానములుంటే విశ్వాసికి ఏమి భయము. ఏ సమయమునకైనా, పనికి వచ్చిన వాగ్ధానమున్నది. అదేదనగా "నేనున్నాను", అని ప్రభువు అంటారు. అది తళుకు తలుకుమని మెరయుచుండును. విశ్వాసులు వాగ్ధానములు నమ్మినారు, వాటిమీద ఆనుకున్నారు గనుక జయము కలిగినది. గనుక జండా వచ్చును అది గొప్ప జండా; అబ్రాహామును గురించి వ్రాయబడినదేమనగా: 'అబ్రాహాము దేవుని నమ్మినారు గనుక ఆయన నమ్మిక నీతిగా ఎంచబడెను'. అబ్రాహాము విశ్వాస వాగ్ధానము మీద ఉన్నాడు గనుక ఫర్వాలేదు.
వాగ్ధానముల గుట్ట, కల్వరి గుట్ట, నెరవేర్పుల మెట్ట. మనిషిని బ్రతికించుటకు ఒక వాగ్ధానము చాలును. అయితే మనకు 30 వేల వాగ్ధానములు ఉన్నవి. వాగ్ధానముల జండా నమ్మనందున కలిగిన జండా ఒకటి ఉన్నది. అది నిరాశ జండా. ఈ ప్రక్క ఒక జండా ఉన్నది. అది ఏమి జండా? అది సంతోషించే జండా. ఈ వాగ్ధానములు చూచినప్పుడు, బైబిలు తెరచినప్పుడు, ఎక్కడో ఒక వాక్యము కనబడగా 'ఇది నాకే అని సంతోషించుచూ, ధైర్యము కలిగి సంతోషించుచుండవలెను. అయితే మనిషి స్వభావము నిరాశ. గానీ ఈ వాగ్ధాన జండా చూచినప్పుడు సహింపు కలుగును. ఒక ప్రక్కన సహింపు ఉన్నది, రెండవ ప్రక్క సహింపు ఉన్నది. ఎందుకనగా వాగ్ధానములవలన బలము పొందడములేదు గనుక సహింపులేదు. ఆకలిగా ఉన్నప్పటికిని కొందరు సహించుకొంటారు, దాని పేరు సహింపు. ఆకలి ఉన్ననూ, ఓపిక పట్టుట జరుగును. ఎందుకనగా, సహింపు ఉన్నది గనుక. ఐదు నిముషములు ఓపికపట్టి భుజించువారికి బలమువచ్చును. అట్లే వాగ్ధానమువల్ల బలము కలుగును. స్వంతగా కష్టపడినందున సహింపును కలుగును. ఒక జండా వాగ్ధానముల కొరకైన జండా. ఇంకొక జండా సహింపు కొరకైన జండా. పది గొప్ప వాగ్ధానములకంటే సహింపు జండా గొప్పది. సహింపున్నది గనుక వాగ్ధానము చూడగానే బలము వచ్చినది. ధైర్యము వచ్చినది. "సిలువ మోసే వారికి చిరసౌఖ్యోన్నతి రా....." అను పాటలోని వచనము (మా యేసు) శ్రమ సహించుకున్నందుకు జెండా, వాగ్ధానము నమ్మినందుకు జెండా.
విశ్వాసి శిరస్సుమీద నున్న సిలువ. అది ఏమి? విశ్వాసి దైవ వాగ్ధానములమీద ఆనుకొని, బలము ధైర్యము పొందుచూ శ్రమలు సహిస్తూ, స్వంత శక్తిమీద ఆనుకొలేదు. వాగ్ధానములవల్ల కలిగిన విశ్వాసమునైననూ, బలమునైననూ, ధైర్యమునైననూ, అది పరలోకపు తండ్రిదే అని తనకు తాను వట్టి వానిగా నెంచుకొని నిరీక్షించితే, మనో దృష్టి అంతా పైతట్టు ఉంటే అది గొప్పది. వారి నిరీక్షణకర్త పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. గనుక ఈ నిరీక్షణ, ఈ పౌరస్ధితి అక్కడ ఉన్న వాగ్ధాన కర్తవల్ల బలము పొందును. పైకి చూచునందుకు పైన ఒక జండా. స్వశక్తి, వంశము, బలము, విద్య, పలుకుబడి, సామర్ధ్యంమీద ఆనుకొనలేదు గాని దేవుని మీద ఆనుకొన్నారు. 'కొండలతట్టు నా కన్నులెత్తుచున్నాను. యెరూషలేము పైనున్నది గనుక దేవుని విశ్వాసికి నిరీక్షణ ఉన్నది గనుక
- 1. నిరీక్షణ జండా,
- 2. వాగ్ధాన జండా,
- 3. సహన జండా.
అలాగు క్రీస్తు ప్రభువు శ్రమలలో పాలుపొంది, మహిమ కిరీటము సంపాదించు గొప్ప భాగ్యము ప్రభువు మీకు దయచేయును గాక! ఆమేన్.
కీర్తన : "మహిని యేసే - మహాశ్రమ పొంది - మహిమకు వెళ్ళెను గాదే! = మహిమ కోరని మనుజుడెవ్వడు - మర్యాదగ నెవడిచ్చు - శ్రమలు లేక స్వర్గము లేదు". ||మానవుడు||