(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

స్వస్థత స్తుతి



లోకైక రక్షకుడవైన యేసుక్రీస్తు ప్రభువా! వాక్యమను పేరుగల ప్రభువా! నిన్ను గురించి వాక్యమనియు, దేవుడనియు వ్రాయించినందుకు నీకనేక వందనములు. సమస్తమును నీ మూలముగా కలిగినదనియు, కలిగియున్న దేదియు నీవు లేకుండ కలుగలేదనియు, గ్రంథములో నున్నందుకై నీకు స్తోత్రములు.


తండ్రీ! ఈ వ్రాతనుబట్టి ఉపయోగకరమైన సూర్యచంద్ర నక్షత్రములు, వర్షము, వాయువు, పక్షులు, జంతువులు, వృక్షాదులు, భూమి, భూమిలోని లోహములు, ఇవన్నియు, నీవు లేకుండ కలుగలేదు గనుక నీకనేక స్తుతులు. వాటికి నరులకున్నట్లు వాక్కున్నయెడల అవికూడ మమ్మును కలుగజేసినందుకు నీకు వందనములు అని చెప్పకమానవు. వాటి ఉనికి నీకు కీర్తి తెచ్చునదిగాను, వందనములు ఆచరించునదిగాను ఉన్నది గనుక నీకనేక వందనములు. లోకము పాపమయమైయున్నందువల్ల, లోకము వలన తెలియబడుటకై, లోకములో ప్రత్యక్షమైనావు గనుక నీకనేక నమస్కారములు.


కొన్నాళ్ళు లోకమును నీ నివాస స్థలముగా ఏర్పరచుకొనుట వలన లోకమును ఘనపర్చినావు. గనుక నీకు వందనములర్పించుచున్నాము. మా మానవులు నిన్ను అంగీకరింపవలెనని కోరియున్నావు. మా మానవుల శరీరమునే ధరించుకొని యున్నావు. ఇట్లు మా శరీరమును గౌరవపరచినావు. గనుక నీకనేక స్తోత్రములు. పాపమునుబట్టి వ్యాధితో నిండియున్న శరీరములను స్వస్థపరచుటకై, మానవులను నీయొద్దకు ఆకర్షించి, నమ్మినవారి శరీరములను స్వస్థపర్చినావు. గనుక నీకనేక స్తుతులు. ఒక్క శరీరమునే గాక శరీరమును నివాస మందిరముగా కలిగియున్న ఆత్మకు విశ్వాసము కలిగించి స్వస్థపర్చినావు. గనుక నీకు స్తోత్రములర్పించుచున్నాము.


ఓ యేసుప్రభువా! నీవు కలుగజేసిన లోకములోనికి వచ్చిన పావన దేవా! శరీరమును స్వస్థపరచిన శరీర రక్షకా! ఆత్మను శుద్ధి చేసిన ఆత్మరక్షక్షా! నీకనేక గౌరవానంద వందనములు.


శరీరాత్మల వైద్యుడవైన తండ్రీ! నా శరీరాత్మల కళంకమును పరిహరింతువని నీకు స్తుతులర్పించుచున్నాను. శరీరములోని బాధలను, ఆత్మలోని బాధలను లేకుండ చేసి, మాకు విమోచన కలిగింతువని నమ్మి, ఓ విమోచన కర్తా! నీకు మా వందనములు ఆచరించుచున్నాము.


దీనరక్షకా! తమ్మును రక్షించుకొన శక్తిలేని దీన ప్రజలను రక్షింపగల ఉద్యోగమును వహించి, నీ ఉద్యోగమును యుక్తమైన రీతిని నిర్వహించుకొన్న దీనజన రక్షకా! మా దీనప్రార్ధన ఆలకింతువని ఆశించి నీకు స్తోత్రములాచరించుచున్నాము.


నీవు దేవుడవు గనుక మా వ్యాధి, బాధలు మేము చెప్పక ముందే నీకు తెలిసే యున్నవి. ఈ విషయము మాకు ఆదరణకరమైన విషయమైయున్నది. మాకు తెలిసిన ఈ విషయమును గూర్చి నీకనేక వందనములు సమర్పించుచున్నాము.


ఓ తండ్రీ! నిన్ను ఎట్లు వేడుకొనవలెనో మాకు తెలియకపోయినను, మా అంతరంగములో నున్న కోర్కెను బట్టి, మమ్మును బాగుచేయుదువని, విశ్వసించి, నిన్ను వందించుచున్నాము. ఆమేన్.