(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

పుట్టుక దిన ప్రార్ధన



ఓ దయగల తండ్రీ! లోకములోనున్న ప్రతివారియొక్క జన్మదినము గొప్పదైయున్నది. నీవు ఏర్పాటు చేసిన వ్యక్తులు ఎప్పుడు జన్మించవలెనో, అప్పుడే వారిని జన్మింపజేసినావు. ఒకరియొక్క జన్మచరిత్ర బైబిలులో అద్భుతరీతిగా వ్రాయించినావు. యిర్మియా 1:4 ఆయనయొక్క తల్లి గర్భములో ఉండగానే "నిన్ను ఏర్పర్చుకున్నాను" అని అన్నావు. ఆ మాట ఎవరిని గురించి లేదు. పౌలు, పేతురులను గురించికూడ లేదు. గొప్ప ప్రవక్తయిన యెషయాను గురించికూడ లేదు.


యెషయా గ్రంథము ముందు చదివి, ఆ తరువాత 4 సువార్తలు చదివినవారు తేడా లేదని ఆనందిస్తారు. అటువంటి ఆయనను గురించికూడ ఈ మాట చెప్పలేదు. దయగల ప్రభువా! నీ కుమార్తెను (లేక) నీ కుమారుని ఏ ఉద్దేశముతో ఈ లోకమునకు పంపి, బైబిలు మిషనులో చేర్చినావో ఆ నీ ఉద్దేశమును సంపూర్తిగా నెరవేర్చుకొనుము, నెరవేర్చుటవల్ల నీవు మహిమపొందుము. జన్మమున్న ప్రతివారికిని మరణమున్నది. ఉండి తీరాలి. అయితే ఈ కడవరి దినములలో రాకడకు ముందు అనేకమందికి మరణముండదు అని సువార్తవల్ల తెలుస్తున్నది. గనుక ఈ నీ కుమార్తెను, (లేక) నీ కుమారుని ఆ శాఖకు సిద్ధపర్చుము. తన కుటుంబములో నున్న ప్రతివారిని దీవించుము. తన కుటుంబములో మొలచిన సన్నిధికూటమును వృద్ధిలోనికి తీసికొని రమ్ము. ఇంకను ఈమెవల్ల జరుగవలసిన వాక్యములు ఏమున్నవో అవన్ని జరిగించి మహిమపొందుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్.