(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

మోషే సుఖోపవాన స్తుతి ప్రార్ధన



  1. దేవా! మాకు కలిగే శ్రమలు మా మేలు నిమిత్తమై ఉపయోగించుము. ఇశ్రాయేలీయులకు ఐగుప్తులో కలిగిన శ్రమలద్వారా వారిని ఒక రాజ్యమునకు ప్రత్యేక జనముగా యుండుటకు సిద్ధపర్చిన రితిగా మమ్మునుకూడ సిద్ధపర్చుము.

  2. దేవా! వెనుక ఉన్న శత్రువుల వల్లగాని, ఎదుట ఉన్న నీళ్లవల్లగాని హాని కలుగకుండ అద్భుతమైన రీతిగా నీ జనులను కాపాడిన విధముగా మమ్ములనుకూడ సైతాను, లోకము, శరీరము అను శత్రువులనుండి కాపాడి ఆటంకములనుండి విడిపించుమని వేడుకొనుచున్నాము.

  3. దేవా! నలుబది ఏండ్లు ఇశాయేలీయులకు ఆహారమిచ్చిన పోషకుడవుగాను, ఆజ్ఞలు బోధించు బోధకుడవుగాను, అరణ్యములో నడిపించిన మార్గదర్శివిగాను ఉన్న విధముగా మమ్ములనుకూడ ఈలోకారణ్యములో పోషించుచు, ఈ బోధ చూపించుచు, చిక్కుదారులనుండి క్షేమముగా నడిపించుమని వేడుకొనుచున్నాము.

  4. ఇశ్రాయేలీయులకు ప్రార్ధన సమయమందు జయము కలిగినట్లు విసుగుదలలేని ప్రార్ధనాశక్తిని అనుగ్రహించుము. ఈ ప్రార్ధన చేతులు వాలకుండునట్లు మమ్మును బలపర్చుము. ఎప్పుడైనను, ఎక్కడైనను కొంచెమైనను సైతాను శోధనలోగాని, అజ్ఞానమును మాకు కలుగనీయకుము. నీవే జయమును ప్రకటించుమని వేడుకొనుచున్నాము.

  5. ఆనందకరమైన దేవా! చేదు నీళ్ళను మంచినీళ్లగాను, సామాన్య జలమును ద్రాక్షారసముగాను, మార్చిన నీవు మా కన్నీళ్లను ఆనంద భాష్పములుగా మార్చుమని వేడుకొనుచున్నాము. కృప మాకు తోడైయుండును గాక!

  6. విడుదలైన తర్వాత ఓ యోచన కర్తా: మరియమ్మకు స్తుతి కీర్తన నేర్పిన నీవు, పరలోకమునకు స్తుతి కీర్తన నేర్పిన నీవు, పరలోకమునకు వినబడే ఆ స్తుతి కీర్తనరాగమును మాకు కూడ నేర్పుమని వేడుకొనుచున్నాము.

  7. నీ జనాంగమునకు అరణ్యములో ఆరాధన స్థలమును నియమించిన దేవా! నీ దానములు పొందే పనికంటెను, శతృవులతో పోరాడే పనికంటెను నీ సన్నిధిని కూర్చుండి నిన్ను ఆరాధించే పని మహా శ్రేష్టమైనదని మాకు బోధించుము. నిన్ను ఆత్మతోను, సత్యముతోను ఆరాధించే హృదయాలను అనుగ్రహింపుము. ఆమేన్.