(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
జబ్బుగా నున్నవారి కొరకు ప్రార్ధన
(మార్కు 11:24వ వచనము మన ప్రార్ధనకు ఆధారము)
- 1) ఓ దేవా! సృష్టికర్తా! మా తండ్రీ! తలపోటు, మాడుపోటు, మతిచాంచల్యము, చుండ్రు, దురద, వెంట్రుకలు ఊడిపోవుట, తలకు పేలెక్కుట, ఈ విధమైన శిరస్సు బాధలు ఉన్నవారికి స్వస్థత దయచేయుదువని నమ్ముచున్నాను. నీకు నమస్కారములు, ఆమేన్.
- 2) చెవిపోటు, చెవుడు, చెవిలో చీము కారుట, వినబడకపోవుట; ఈ విధమైన జబ్బులు గలవారికి స్వస్థత దయచేయుదువని నమ్ముచున్నాను. అలాగే చెవిలో స్వస్థత దయచేయుదువని నమ్ముచున్నాను.
- 3) కండ్లు కలుగుట, కంటిలో పువ్వులు, కంటి నొప్పి, మంటలు, దురదలు, నీరుకారుట, మసకగా కనబడుట, దృష్టిహీనత ఈ మొదలైన వారికి స్వస్థత దయచేయుదువని నమ్ముచున్నాను.
- 4) నాసిక జబ్బు, పడిసెము, కొందరికి నాసిక రంద్రము పెరుగుట, కాయలుండుట వలన వాటిని డాక్టర్లు కాల్చుదురు: అట్టి జబ్బులు ఏవైన ఉన్నవారికి స్వస్థత దయచేయుదువని నమ్ముచున్నాను. ముక్కుచీదుట, రక్తము కారుట, ముక్కువ్యాధులు బాగుచేయుటకు నేర్చుకొనుటకు డాక్టర్లు యున్నారని వెళ్ళుదురు; వారి దగ్గరనూ తగ్గనివి నేడిక్కడ బాగుచేయుదువని నమ్ముచున్నాను.
- 5) దగ్గు, క్షయ, రొంపదగ్గు అన్ని విధములైన దగ్గులు గలవారికి స్వస్థత దయచేయుదువని నమ్ముచున్నాను.
- 6) సంతానము లేనివారికి సంతానము దయచేయుదువనియు, ఇబ్బందిగలవారికి ఇబ్బంది తీర్చుదువనియు, అప్పుగలవారి అప్పులు తీర్చుదువనియు, విష పురుగుల బాధగలవారికి బాధ నివృత్తి, కోర్టులో అన్యాయము జరిగిన వారికి న్యాయము జరిగింతువనియు నమ్ముచున్నాను. చేతబడి, బాణామతి, శక్తిపూజ, మెస్మరిజం ఈ మొదలగు వాటివల్ల హాని పరిహరింతువని నమ్ముచున్నాను. పరీక్షలలో జయము కలుగు కృప, వివాహములో మంచి ఏర్పాటు కలుగు కృప కుటుంబ కలహములు తీర్తువని నమ్ముచున్నాను. మీటింగులకు రావలెనని అనుకుంటే తక్కినవారు రానివ్వరు. అట్టి ఆటంకము తీసివేతువని నమ్ముచున్నాను. తల్లిదండ్రులలోని దుర్గుణాలు, వారిలోని జబ్బులు పిల్లలకు రాకుండ చేతువని నమ్ముచున్నాను. ధనాపేక్ష కలిగియుండు వారికి అట్టి అపేక్ష తీసివేతువని నమ్ముచున్నాను. గూడెంలో ఒకరికి, ఒక భక్తునికి ధనాపేక్ష కలిగినందున అతనికిచాంచల్యము కలిగినది ఇంకొకరికి జబ్బు, వేరొక నష్టము ఇట్టివి అనేకములు కలుగుచున్నవి. ఈ జాబితాలోని వాటిని పరహరింతువని నమ్ముచున్నాను.
దశమ భాగము ఇవ్వనివారికి ఇబ్బంది కలుగును. ఇచ్చినవారు భాగ్యవంతులౌదురు. జీవాంతమందు మాకు ప్రతి ఫలము కలుగునని నమ్ముచున్నాను. మేము తలంచుకున్న పనులన్నీ సఫలము చేయుదువని నమ్ముచున్నాను. ఆమేన్.