(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

అనుదినము చేయవలసిన ప్రార్థన



  1. సర్వశక్తిగల దేవా! అనేకమంది రోగులను బాగుచేసినావు. మమ్ములను కూడ బాగుచేయుము.

  2. అనేకమంది అనారోగ్యవంతులకు ఆరోగ్యమిచ్చినావు. మాకు కూడా ఆరోగ్యము దయచేయుము.

  3. అనేకమందికి వ్యాధి లేకుండ చేసినావు. మాకు కూడా వ్యాధి లేకుండ చేయుము.

  4. అనేకమందికి నీ వాక్యము వినిపించినావు. మాకును నీ వాక్యము వినిపించుము, బోధించుము.

  5. అనేకమందికి నీ వాక్యప్రకారము నడుచుకొను శక్తి ఇచ్చినావు. మాకు కూడా అట్టి శక్తి ఇమ్ము.

  6. అనేకమందికి ఏదో ఒక వరమిచ్చినావు. మాకు కూడా నీకిష్టము వచ్చిన వరము ఇమ్ము.

  7. అనేకమందికి నీ సేవచేయు సమయము, శక్తి ఇచ్చినావు. మాకు కూడా అట్టి సమయము శక్తి ఇమ్ము.

  8. అనేకమందికి నీ సన్నిధిలో సమస్త అంశముల ప్రార్థనలను చేసే సమయమునిచ్చినావు. మాకు కూడా అట్టి తరుణము దయచేయుము. అనేకమంది ద్వారా నీవు కీర్తి పొందినావు. మాద్వారా కూడా కీర్తి పొందుము. అనేకమందికి శత్రుబాధ తొలగించినావు. మాకు కూడ శత్రు బాధ తొలగింపుము.

  9. అనేకమందిని విషసంబంధమైన పురుగులనుండి, దుష్ట మృగములనుండి తప్పించినావు. మమ్ములను కూడ వాటి నుండి తప్పించుము. అనేకమందిని అవమానము నుండి తప్పించినావు. మమ్ములను కూడ తప్పించుము.

  10. అనేకమందిని శీతోష్టాది భేధముల నుండి తప్పించినావు. మమ్ములను కూడ తప్పించుము.

  11. మమ్ములను ఏ ఉద్దేశ్యముతో కలుగజేసినావో ఆ ఉద్దేశ్యమును నెరవేర్చువరకు మమ్ములను విడిచిపెట్టకుము.

  12. అనేకమందికి ఉన్న ఆటంకములను తొలగించినావు. మాకుకూడ ఉన్న ఆటంకములను తొలగించుము.

  13. మాలో ఎవరికి మరణము అవసరమో వారికి నెమ్మదిగల మరణమిమ్ము. మాలో ఎవరు రెండవరాకడకు సిద్ధపడవలెనో వారిని సిద్ధపర్చుము. మా దర్శనములన్నియు నెరవేర్చుము. మా మంచి ఊహలు, కోర్కెలు నెరవేర్చుము.

  14. మా జీవిత కాలమంతయు నీ తలంపుతో నింపుము.

  15. అధైర్యము, అవిశ్వాసము, భయము, తాత్మాలిక భక్తి- ఇవి మాలోనికి రాకుండ కాపాడుము.

  16. మేము మా ప్రార్థనలో ఏవి విడిచిపెట్టినామో, అవికూడ నీకు సమర్పించుచున్నాము.

  17. మరియు మమ్ములను, సర్వజనులను, మృగాదులను, పక్షులను, వృక్షాదులను, నీ సర్వసృష్టిని కాపాడుము.

  18. ఎప్పటికప్పుడే సాతాను యొక్క క్రియలను లయము చేయుము.

  19. మా జీవిత కాలమంతయు, నీ దేవదూతల యొక్క సహాయమను గ్రహింపుము.

  20. మా అజ్ఞానము, మా అయోగ్యత, మా పాప స్థితి ఎప్పటికప్పుడే తొలగించుము. పరిశుద్ధ స్థితిలో స్థరపర్చుము.

  21. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుడవైన నీవు, మాకు ఇచ్చిన వాటిలో ఏమియు పోగొట్టుకొనకుండ కాపాడుము.

  22. అన్ని మంచి విషయములలో మాకు సమృద్ధి కలుగజేయుము.

  23. మేము భూలోకములో ఉన్నప్పటికిని మా పేర్లు పరలోకములో నీ కుమారుని ద్వారా రిజిష్టరు చేయుము.

  24. ఆయన ద్వారా నీకు ఆది స్తుతి, మధ్య స్తుతి, జీవాంత స్తుతి, కష్టకాల స్తుతి, ఆనందకాల స్తుతి, ఏమియు తెలియక తోచకయుండు కాలమందలి స్తుతియు, మా ఘటముయొక్క స్తుతియు, మా జన్మము మొదలుకొని కడవరి భూలోక నిమిషము వరకు బుణపడే స్తుతియు, పరలోక స్తుతియు, అంగీకరించుమని మిక్కిలి వినయముతో వేడుకొను చున్నాము. ఆమేన్.