(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
మిశ్రమ ప్రార్ధనాంశము
(ఆది ఆదివార ఆరాధనలోను, ఇతర సమయములోను వాడుకొనవచ్చును)
- 1. పాపపు ఒప్పుదల:- ఓ దేవా! నేను నిన్ను తలంచుటకైనను, నీపేరెత్తుటకైనను, నిన్ను ప్రకటించుటకైనను యోగ్యుడను కాను. జన్మము, తలంపు, మాట, చూపు, వినికి, ప్రయత్నము, క్రియ, నైజము - వీటన్నిటని బట్టి నేను పాపినైయున్నాను, నీ ఉచితార్ధమైన కృపగల ఉపకారములకు లేశమైనను పాత్రుడను కాను. ఇది ప్రభువునుబట్టి అంగీకరించుము. ఆమేన్.
-
2. విశ్వాస ప్రమాణము:- ఓ దేవా! మహాప్రభావముగల తండ్రీ! నీ అధికమైన ప్రేమనుబట్టి నన్ను అంగీకరించుచున్నావని
నమ్ముచున్నాను.
నా
నిమిత్తమే భూమి, ఆకాశములను, మోక్షమును, అనుదినము నేను అనుభవించువాటిని కలుగజేసియున్నావని నమ్ముచున్నాను. మరియు నాకు
అన్ని
విషయములలోను సహాయము చేయగల పరిశుద్ధులైన దేవదూతలను కూడ నా నిమిత్తమే కలుగజేసినావని నమ్ముచున్నాను. నీ ప్రియకుమారుని
ద్వారా
అనుగ్రహించు రక్షణభాగ్యము నా నిమిత్తమే అని నమ్ముచున్నాను. ప్రేమ, శక్తి, జ్ఞానము, న్యాయము, విశ్వాస్యత, పరిశుద్ధత,
సర్వవ్యాపకత్వము, నిరాకారము, జీవము, అనంతము, అనాది, నిర్వికారము(Unchangeableness) మొదలగు పరిశుద్ధ లక్షణములతో నీవు
ప్రకాశించుచున్నావని
నమ్ముచున్నాను. ఇట్టి గొప్పవాడవైన నీవు నా దేవుడవు, నా రక్షకుడవు, నా తండ్రివి, నా సహకారివి, నా వైద్యుడవు, నా
దాతవు, నా
హృదయవాసివి, నాసర్వము అని హృదయ పూర్వకముగా నమ్ముచున్నాను.
నీవు నా పాపములను ఎప్పటికప్పుడే క్షమించియున్నావనియు, నామీదికి కష్టములు వచ్చుటవల్ల నాకు వివిధములైన ఉపకారములను వాటివలన చేయుచున్నావనియు, నన్ను నాశనమునకు అప్పగించవనియు నమ్ముచున్నాను. నీవు పరలోకములోను, ఇతర స్థలములలోను మాత్రముకాక నాలో నిత్యము ఉన్నావనియు పరిపూర్ణముగా నమ్ముచున్నాను.
నా ఆత్మీయ జీవనాభివృద్ధికై సంఘమును ఏర్పాటు చేసినావనియు నమ్ముచున్నాను. తుదకు నన్నుబట్టి కాదుగాని నీకుమారునిబట్టి నా ప్రార్ధనలన్ని ఆలకింతువనియు, నిత్య మోక్షములోనికి నన్ను చేర్చుకొందువనియు నమ్ముచున్నాను. ఈ నా పూర్ణ విశ్వాసమును యేసుప్రభువు ద్వారా ఆలకించుము ఆమేన్. -
3. ప్రార్థన:- ఓ దయగల తండ్రీ! నీవు ప్రార్ధనలు వినువాడవగుట వలన నీ సన్నిధికి వచ్చి ఏదైన చెప్పుకొనవచ్చుననియు,
అడుగకొనవచ్చుననియు తెలిసి నిన్ను స్తుతించుచున్నాను. నాకు కావలసినవి నీకు ముందుగనే తెలిసినను అడుగుడి మీకియ్యబడునని
చెప్పినావు. గాన నా మనవులన్నియు నీయెదుట సమర్పించుకొనుచున్నాను.
ఓ తండ్రీ! నాకు ఏమి ఇయ్యవలెనని నీకు ఉన్నదో అదే దయచేయుము. నేను ఎల్లప్పుడు నీ సన్నిధిలో స్వేచ్చగా సంచరింపగల బిడ్డనుగా నన్ను స్థిరపరచుచుండుము. కష్టకాలములోను, సంగతులు అర్ధముకాని కాలములోను నేను నీ పక్షముగా నిలువబడగల ధైర్యము దయచేయుము. నిన్ను గూర్చి నాకు గల మంచి అభిప్రాయమును మారనీయకుము. పాపము నుండియు, పాప ఫలితమునుండియు నన్ను కాపాడుచుండుము. ప్రతి పర్యాయము నీ వాక్యము నాకు బోధపరచుచుండుము. నా ఆత్మతో సదా మాట్లాడుచుండుము. మరియు నీ విషయమై కృతజ్ఞతతో కష్టపడి పనిచేయగల సేవకునిగా నన్ను స్థిరపరచుచుండుము. నన్ను పెండ్లికుమార్తె వంశమునుండి విడిపోనీయకుము. నీకిష్టములేనిదే నేను అడుగ తలంచునప్పుడు అవి ప్రార్ధన వాలులోనికి రాకుండా తప్పింపుము. మరియు ఒక అంశమును గురించి ప్రార్థింపవలసిన గడియ దాటిపోనీయకుము. నాకు ప్రార్థన వాలు దయచేయుము. సర్వజనులకు నీవాక్య వార్త అందింపగల బోధకులను పంపుము. వాక్యముపదేశించు ఏర్పాటులన్నిటిని వృద్ధిచేయుము. పాపులకు, బాధితులకు, బీదలకు, అన్యాయము పొందుచున్నవారికి తోడైయుండి, వారి పక్షమున జరుగవలసిన సత్యకార్యములను వృద్ధిచేయుము. ఈ ప్రార్ధన నీ కుమారుని ముఖముచూచి ఆలకించుము. ఆమేన్. - 4. సమర్పణ:- ఓ దేవా! నీవు నాకు ఇచ్చినవన్నియు నీకు సమర్పించు చున్నాను. మరియు నా శరీరమును, నా ఆత్మను, నాకు కలిగియున్న సమస్తమును, నా జీవిత కాలములోని గత కాలమును, నేటికాలమును, రాబోవుచున్న కాలమును నీకు సమర్పించుచున్నాను. నీ చిత్తము ఏదో అదే నా చిత్తమైయున్నది. నీ చిత్తము అనేక మారులు నాకు ఇష్టముగా నుండక పోయినను, నేనది ఇష్టపడునట్లు సహాయపడగోరుచున్నాను. ఏది నేను చేయలేక పోవుచున్నానో ఆ మంచి కార్యమును, నాకుగాని నీకుగాని ఇష్టములేనిది ఏది చేయుచున్నానో ఆ కార్యమును నీకు అప్పగించుచున్నాను. మా బంధువులను, స్నేహితులను, అధికారులను, నేనంటే ఇష్టములేనివారిని, మాకు ఇష్టములేని వారిని, శత్రువులను నీకప్పగించుచున్నాను. మమ్మును బాధ పెట్టు పురుగులు, జంతువులు, పక్షులు మొదలైన వాటిని నీకు సమర్పించు చున్నాను. ఆలాగే మాకు బాధకరముగానున్న దయ్యములను, సైతానును, తత్ సంబంధమైన వాటినన్నిటిని నీ వశము చేసికొనుచున్నాను. మేము బాధ తెచ్చుకొను వృక్షాదులు, శిలలు నీకు అర్పించుచున్నాను. మాకు హానికరము కలుగునట్టి పంచభూతములను నీకు అర్పించుచున్నాను. ఈ అర్పణ నీ కుమారుని పరిముఖముచూచి అంగీకరించుము. ఆమేన్.
- 5. రాకడ ప్రార్ధన:- ఒక గ్రామములో అందరు కలహములతో నుండిరి. ఒక దినమున తన జ్వరముగానున్న కుమార్తెను చూడవచ్చిన తండ్రి భయంకరమైన కలహముల సంగతి విని, తన కుమార్తెను తన ఇంటికి తీసికొనిపోయెను. ఈ లోకము గత్తరలోకము, విషపురుగుల లోకము, నిరీక్షణ లేనిలోకము, మరణలోకము, దయ్యాల లోకము, దయ్యాలకు లోబడిన మనుష్యులున్న లోకము, కాబట్టి మన తండ్రియైన దేవుడు మనలను ఇచ్చట నుండకుండ మోక్షమందిరమునకు తీసికొని వెళ్ళును. ఆయన శీఘ్రముగా వచ్చును. ఇదే రెండవ రాకడ. తండ్రి కుమార్తెను తీసికొని వెళ్లునప్పుడు రాను అని చెప్పదు. మనముకూడ మేఘములోనికి రాము అని చెప్పకూడదు. ప్రభువా! తండ్రీ! సిద్ధముగానున్నాను అని చెప్పవలెను. ఓ ప్రభువా! మేమట్లు చెప్పగల కృప దయచేయుము. ఆమేన్.
- 6. స్తుతి:- సర్వ సద్గుణ నామధారివైన ఓ ప్రభువా! నా సృష్టికర్తా! నీ స్థితినిబట్టి నీకు వందనములు. నేను ఏ విషయములో నిన్ను స్తుతించుట మానగలను? నా మనస్సులోనికి తెచ్చుకొనగల సర్వాంశములు నీ స్తుతియై యున్నవి. నేనుకూడ నీ స్తుతియై యుండగోరుచున్నాను. నా బ్రతుకంతటిలో నిన్ను స్తుతింతునుగాక! దేవదూతలు పరిశుద్ధులగుటచేత, పాపినైన నేను వారివలె స్తుతించలేకపోవుచున్నాను. గాని స్తుతించవలెనని నాకు ఉన్నది. నా హృదయములోని నా స్తుతి, రాత్రంతయు వెలిగే కాగడావలె ఉండవలెనని కోరుచున్నాను. నేను పొందుచున్న ఉపకారము వలనను, కష్టమువలనను, నా సేవ వలనను నీకు కీర్తి కలుగును గాక! ప్రార్ధనవాలు దయచేయుమని అడిగిన నేను, స్తుతిగానము కూడ దయచేయుమని వేడుకొనుచున్నాను. ఈ నా బలహీనమైన స్తుతి ప్రభువైన యేసునిబట్టి అందుకొనుము. ఆమేన్ , ఆమేన్ , ఆమేన్.