(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

శుద్ధి ప్రార్ధన



యేసుప్రభువా! నీళ్లవల్ల కలిగే శుద్దియు, పాలవల్ల కలిగే శుద్ధియును అసంపూర్ణమైనది. ఎడ్లయొక్కయు, మేకలయొక్కయు రక్తమువల్ల కలిగే శుద్ధి అశాశ్వతమైనది. అయితే అవి ఈ లోకమునకు మాత్రమే పనికి వచ్చును. నీ అమూల్య రక్తమువల్ల కలిగే శుద్ది పైలోకమునకు పనికి వచ్చేది మేము రాబోయే కాలమందు మేము నీ సింహాసనము యొద్దను, మహిమలోను, దేవదూతల ఎదుటను, నీ పరిశుద్ధుల యెదుటను ఉండబోవుచున్నాము. అందుకు పనికివచ్చేటట్లు మమ్మును ఇప్పుడు నీ రక్తమువల్ల శుద్ధిచేయుమని వేడుకొనుచున్నాము.


ప్రభువా! ఒకప్పుడు నీవు యూదుల ఎదుట నిలువబడి, నాలో పాపమున్నదని ఎవరు నిరూపించగలరు? అని పలికిన నీ పరిశుద్ధతను వారికి చూపినావు. అట్లే మేమును నేడు లోకస్థుల ఎదుట నిలువబడి నాలో పాపమున్నదని ఎవరు నిరూపించగలరు? అని పలికే ధైర్యమును, పవిత్రతను అనుగ్రహించుము. మా పరిశుద్ధత వెన్నెల వంటిదైనను, ఎండవంటిదైనను కాక నీ పరిశుద్ధతవంటి పరిశుద్ధత దయచేయుమని వేడుకొనుచున్నాము, ప్రార్ధించుచున్నాము. ఆమేన్.