(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

దైవిక స్వస్థత ప్రార్ధన



మహిమ ప్రభావములు గల తండ్రీ! మానవుని కొరకు సమస్త దానములు గల భూమి, ఆకాశములు కలుగజేసిన తండ్రీ! వందనములు.


మానవుడు తన జ్ఞానమును వినియోగించి నీవు కలుగజేసిన వాటిని వాడుకొని స్వస్థత నొందుటకు, సృష్టిలో నీ ప్రభావమును ఉంచిన తండ్రీ! నమస్కారములు. "నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే" అని పలికిన తండ్రీ! నీ ప్రవక్తల ద్వారా అనేక రోగులను స్వస్థపరచిన నీకు స్తుతులు.


కుమారుడవైన తండ్రీ! నీవే స్వయముగా నీ ప్రభావము చేత రోగులను స్వస్థపరచిన నీకు స్తుతులు.


ప్రభువా! పక్షవాతరోగి నీయొద్దకు తేబడి నిన్ను అడుగకపోయినను, వాని హృదయములోనున్న కోరికనుబట్టి స్వస్థపరచిన నీకు వందనములు.


దేవ మానవుడవైన ప్రభువా! సేన దయ్యములు పట్టినవాడు నిన్ను చూచి నమస్కరించిన చర్యనుబట్టి, అతనిలోని దయ్యములను వెళ్ళగొట్టిన నీకు నమస్కారములు.


జీవమైన తండ్రీ! ఒక అధికారి వచ్చి “నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము. ఆమె బ్రతుకును” అనెను. అధికారి నిన్ను కోరిన వెంటనే వెళ్ళి ఆ చిన్న దానిని బ్రతికించిన దేవా! నీకు ప్రణుతులు.


ఏర్పాటు రక్షకుడవైన ప్రభువా! కనాను స్త్రీ వచ్చి తన కుమార్తె స్వస్థతకొరకు ప్రాధేయపడి అడుగగా, ఆమె కుమార్తెను బాగుచేసిన నీకు వందనములు.


పరిశుద్దుడవైన తండ్రీ! పదిమంది కుష్టురోగులు “మమ్మును కరుణించుమని” వేడుకొనగా వారి మనవి విని “మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకొనుడని” చెప్పిన నీ మాట ప్రకారము వారు వెళ్ళుచూ దారిలో బాగుపడిరి. ఈ విధముగా స్థలాంతరమున బాగుచేసిన నీకు స్తోత్రములు.


“ప్రార్ధన చేయునపుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది యున్నారని నమ్ముడి. అప్పుడవి మీకు కలుగునని చెప్పుచున్నాను” అని సెలవిచ్చిన ప్రభువా! మేము ప్రార్థించినవియు, ఆశించినవియు నెరవేరనప్పుడు నెరవేరినవని నమ్మగల గట్టి విశ్వాస పద్ధతిని మాకు అలవరచిన నీకు వందనములు.


మా స్థితిని, గతిని ఎరిగిన తండ్రీ! మేమెంత ప్రార్థించినా నెరవేరనప్పుడు, మా ప్రార్ధనాంశము నీ దివ్యచిత్తమునకు సంపూర్ణముగా సమర్పించి, నీ సహాయము కొరకు అబ్రాహాము వలె నిరీక్షింపగల కృప దయచేయుదువని నమ్ముచూ నీకు స్తుతులు చెల్లించుచున్నాను.


పరిశుద్ధాత్మవైన తండ్రీ! నీ సంఘమునకు నీ శక్తులను దయచేసి రెండువేల సంవత్సరములనుండి అనేకులను నీ ప్రభావముచే బాగుచేయుచున్న నీకు స్తోత్రములు.


మాకు కలిగిన............... (జబ్బు పేరు) అను ఈ అస్వస్థతను మీ పాదములయొద్ద ఉంచి ప్రార్ధన చేస్తున్నాము. మీ ప్రభావముచేత ఈ అస్వస్థతను తొలగించి స్వస్థత దయచేయుమని విశ్వాసముతో వేడుకొనుచున్నాము. ఈ స్తుతులు త్వరగా రానైయున్న యేసుక్రీస్తు నామమున అంగీకరించుము. ఆమేన్.