(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
కష్టకాల స్తుతి ప్రార్ధన
దేవుని ఎట్లు స్తుతించిన యెడల మన కష్టములు తీరునో ఆ సంగతులు ఈ ప్రార్ధనలో ఉన్నవి. “వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక” ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురు గాక! (దావీదు కీర్తనలు 107:22).
ఈ స్తుతి అత్యధిక సంతోషముతో చేయవలెను:
- 1. ఓ దేవా! నా పాపస్థితిని నిర్మూలము చేయుటకై ఒక పనిముట్టగా ఈ కష్టమును రానిచ్చుచున్నావు. గనుక ఈ మేలు నిమిత్తము నీకు వందనములు.
- 2. ఈ కష్టమున్నంత కాలము నేను నీ తట్టు తిరిగి యుండునటుల చేయుటకై, ఈ కష్టకాలము రానిచ్చుచుంటివి. కాబట్టి నీకు వందనములు.
- 3. నేను నిన్ను నమ్ముకొని, విశ్వాసమును అభ్యసించుటకై ఈ కష్టము నింకను ఉంచినావు గనుక వందనములు.
- 4. కష్టములో ఓపికను నేర్చుకొనుటకై దీనినింకను ఉంచినావు. గనుక వందనములు.
- 5. నా ఆత్మీయ జీవితములో అవసరమైన వాక్యపఠనము, ప్రార్ధనాభ్యాసము, వాక్యప్రకటన మొదలగు వాటి మీద మరింత గొప్ప ఆశ కలిగించుటకై ఈ కష్టకాలములను ఇంకా ఉంచినావు గనుక వందనములు.
- 6. నీ సహవాస భాగ్యము నాకు బాగుగా లభించుటకై కష్టములు రప్పించినావు గనుక నీకు వందనములు.
- 7. నేను పరలోక మహిమకై సిద్ధపడుటకు, ఈ కష్టమును రప్పించుచుంటివి. గనుక వందనములు.
- 8. సుఖకాలమందు నిన్ను మెచ్చుకొనుట మాత్రమేగాక, కష్టకాలమందు కూడా మెచ్చుకొనుటకై ఈ కష్టమును కల్పించుచుంటివి. గనుక వందనములు.
- 9. సదా నిన్ను స్తుతించుచు నిన్ను నమ్ముకొని యుండుట, తరచుగా నీ గ్రంథములో మాటలు వినుట, నిన్ను గురించి సదా ఆనందించుట మొదలగు ఈ చర్యల వలన ఈ కష్టస్థితిని సంపూర్ణముగా నేను జయించుటకు, దీనినింకా ఉండనిచ్చుచున్నావు. గనుక స్తోత్రములు.