(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

బైబిలు మిషను వారు అభిమానులు చేయదగిన ప్రార్థనలు



  1. తండ్రీ! బైబిలు మిషనును నీవే బయలుపరచియున్నావను సంగతి లోకమంతటికి నీవే స్వయముగా కనబడి చెప్పుము. అనేకులు నమ్మరు. అయినను చెప్పుమని వేడుకొనుచున్నాము.

  2. దేవా! బైబిలు మిషనును నీవు స్థాపించినావను సంగతి మేము కూడా ప్రకటింతుము. మా ప్రకటనలు దీవించుము. మాలో మెంబర్లుగా నుండియు, మా అభిప్రాయుములకు దూరస్తులైయున్నవారి అపరాధములను వారికి స్వప్నములో తెలియపర్చి దిద్దుకొనుటకు వారికి శక్తి దయచేయుము.

  3. దేవా! మా విరోధుల యొక్క మనస్సులను, అనగా మాలోనుంచి విడిపోయినవారి మనస్సులను, మాలోనేయుండి మాకు విరోధముగా నున్నవారి మనస్సులను, ఇతర మిషనులలోనున్న మా విరోధుల మనస్సులను మార్చివేయుము.

  4. దేవా! మేము తప్పు సిద్దాంతములను చెప్పకుండ ఆపుచేయుము.

  5. దేవా! మేము వేసే వత్రికలు, పుస్తకములు మిషనుద్వారా వ్యాపింపచేయుము.

  6. దేవా! మా మీటింగుల ద్వారా, స్వస్థత కూటముల ద్వారా పద్యములద్వారా, ఆరాధన క్రమము ద్వారా నీ విషయములు అందరికి తెలుపుము.

  7. దేవా! బైబిలు మిషను ద్వారా ఆలోచించుచున్న నీ ఆలోచనలన్నియు నెరవేర్చుము.

  8. దేవా! నీకు ఇష్టమైన వారిని మాత్రమే నీ బైబిలు మిషనులోనికి తీసికొని రమ్ము.

  9. దేవా! అయోగ్యులమైన మమ్మును బైబిలు మిషనులోనికి పిలిచినందుకు నీకు ప్రత్యేకమైన వందనములు.

  10. దేవా! ఏ ప్రత్యేకమైన ఉద్దేశ్యముతో నీవు బైబిలు మిషనును బయలుపరచినావో దానిని త్వరలో నెరవేర్చుము.

  11. దేవా! మా బోధలకంటె, మా ప్రవర్తన వెల్లడిలోనికి వచ్చునట్లు తోడ్పడుము.

  12. దేవా! ప్రస్తుతము మా మిషనులోనున్న అక్రమములన్నిటిని పరిహరించుము.

  13. దేవా! మా అందరి బలహీనతలను తొలగించుము.

  14. దేవా! మాకు పాఠశాలలు, వైద్యశాలలు, అనాధశాలలు, చేతిపనులశాలలు, ముద్రాక్షరశాలలు, పుస్తకశాలలు, గొప్ప దేవాలయములు, గొప్ప గ్రంథములు, గొప్ప రాబడులు, జీతనాతములు, పొలములు, సమాధి దొడ్డు, క్రైస్తవ విదేశీ సహాయములు, మిషను స్థానములు మాకు లేవని ఇతర మిషనుల వారు హేళన చేయుచున్నారు. వారి తట్టు చూడుమని వేడుకొను చున్నాము.

  15. దేవా! మా సిద్ధాంతములు విని, అనేకులు నవ్వుచున్నారు. వారివైపు కూడ చూడుము.

  16. దేవా! మా మిషనులలోని పిల్లలను విద్యార్థులనుగాను, ఉద్యోగస్తులనుగాను చేయుము. పురుషులను, స్త్రీలను, బీదలను, పాపులను, చిక్కులలో ఉన్నవారిని ఇట్టి వారినందరిని ఆదరించుము.

  17. దేవా! మా మిషనులో నున్నవారందరికి దర్శనవరము దయచేయుము.

  18. దేవా! మేము దేవునిమీద ఆధారపడియున్నామని చెప్పుచు మనుష్యులమీదను, ఔషదములమీదను, చందాల మీదను, ఆధారపడుచున్నామని ఇతరులు మమ్మును హాస్యము చేయుచున్నారు. దీనికి మేము చోటియ్యకుండునట్లు కృప దయచేయుము. మేము వారికి ఒక జవాబు ఇస్తున్నాము. ఏలియా కాకులమీద ఆధారపడలేదు. మోషేతల్లి ఫరోకుమార్తె మీద ఆధారపడలేదు. ఈ ఏర్పాటుచేసిన నీ మీద ఆధారపడినామని జవాబు చెప్పుచున్నాము.

  19. దేవా! బైబిలు మిషను నీవే బయలుపరచినావనేది ఒక్కటి మాత్రమే గొవ్చ విషయమనియు, తక్కిన మా విషయములలో ఇతర మిషనులలోనున్న బలహీనతలు మాకు కూడ యున్నవనియు మేము చెప్పుచున్నాము. ఈ మాట దీవించుము.

  20. దేవా! ఓహో! ఇది కేవలము దేవుడు బైలుపరచిన మిషను అని నమ్మగల వారు అనుచు సంతోషింతురు. అలాగే మమ్మును చూచి కూడ ఓహో! వీరు దేవుని బైబిలు మిషనులో చేర్చుకొనబడిన వారు అని పలుకుచు సంతోషించునట్లు ఇతర మిషను విశ్వాసులను, అభిమానులను ప్రేరేపింపుమని వేడుకొనుచున్నాము.

  21. దేవా! మాలో యేవైన బహిరంగమగు తప్పులు గాని, రహస్యమైన తప్పులుగాని యున్నయెడల మమ్మును పిశాచికి గాని, శత్రువులకుగాని, సజ్జనులకుగాని, అధికారులకుగాని, అప్పగింపక నీవే మమ్మును క్షమింపుము. దావీదు ఇట్లే కోరుకొనగా అతనికోరిక ప్రకారము చేసినావు కదా!

  22. దేవా! తండ్రీ! ఈ ప్రార్ధనలో ఇంకా ఏమైన చేర్చవలసినవి ఉన్నయెడల నీవే చేర్చుము. తీసివేయవలసినవి ఉన్నయెడల నీవే స్వయముగా తీసివేయుము.

  23. దేవా! నరుల జ్ఞాపకశక్తిలో నుండి మా పొరపాటును సమూలముగా పెరికివేయుము.

  24. దేవా! మమ్మును రాకడకు సిద్ధపరచుము.

  25. దేవా! రహస్య సన్యాసి అను రాకడకు ముందే పంపించుము. మొదటి రాకడలో చేసినట్లు మృతులను లేపుము. పక్షులతోను, మృగములతోను సువార్త చెప్పించుము. ఒక దినము లోకములోనున్న వారందరికి ఏకకాల స్వప్నములో నీవు కనబడి మాట్లాడుము.

ఈ ప్రార్థనలను నీ జనితైక కుమారుని ముఖము చూచి ఆలకింపుమని వేడుకొనుచున్నాము. ఆమేన్.