(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
సృష్టికర్తకు చేయు స్తోత్ర ప్రార్థనలు
I. దైవలక్షణములను గురించి స్తుతి:- ఇది అన్ని మతములవారు చేయదగిన స్తుతి.
- సృష్టికర్తవైన మా తండ్రీ! మా దేవా! మేము పుట్టకముందే మా మేలు నిమిత్తమై ఆకాశవుండలమును దానిలోని సమస్తమును, భూమండలమును దానిలోని సమస్తమును కలుగజేసిన ప్రభువా! నీకు అనేక నమస్కారములు. పిమ్మట మమ్మును కలుగజేసిన తండ్రీ! నీకు అనేక నమస్కారములు.
- ఆదిగాని, అంతముగాని లేని శాశ్వతుడవైన దేవా! నీకు అనేక నమస్కారములు.
- జీవమైయున్న నా దేవా! మేము సుఖముగా జీవించుటకు మాకు జీవమిచ్చినావనియు, మరణ సమయము రాగా మరణమును తప్పించి జీవమును సాగించుచున్నావనియు, మాకు నిత్యజీవనము కూడ ఇచ్చెదవనియు నిన్ను నమస్కరించుచున్నాము.
- జ్ఞానవంతుడవైన దేవా! మేము మా కష్టసుఖములు నీకు చెప్పక పోయినను నీవు జ్ఞానివైయున్నందున నీవు తెలిసికొని మా కోరికలు నెరవేర్తువని నిన్ను నమస్కరించుచున్నాము.
- ప్రేమరూపివైన దేవా! మేము ఎంతగొప్ప పాపులమైనను నీవు ప్రేమవైయున్నందున మమ్ములను క్షమింతువని నిన్ను నమస్కరించు చున్నాము.
- న్యాయవంతుడవైన దేవా! మేము ఎంత గొప్ప అవిధేయత గలవారమైనను నీవు న్యాయమైయున్నందున మమ్మును దిద్దుటకు శిక్షింతువని నిన్ను నమస్కరించుచున్నాము.
- శక్తిమంతుడవైన దేవా! మేము పాపమును విసర్జించుటకు గాని, భక్తిగా నడచుటకు గాని, తగిన శక్తి లేనివారమైనను నీవు శక్తిమంతుడవై యున్నందున మా పనులు చేయుటకు శక్తిని దయచేయుదువని నిన్ను నమస్కరించుచున్నాము.
- పరిశుద్ధుడవైన దేవా! మేము పాపులమైయున్నందున అపరిశుద్ధత గలవారమై యున్నాము, నీవు పరిశుద్దుడవై యున్నందున మమ్మును శుద్ధిచేయుదువని నిన్ను నమస్కరించుచున్నాము.
- సర్వవ్యాప్తివైన దేవా! మేము ఎక్కడ ఉన్నను నీవును అక్కడనే ఉండి మమ్మును కాపాడుదువని నిన్ను నమస్కరించుచున్నాము.
- నిరాకారుడవైన దేవా! ఆకారముగల మా శరీర నేత్రములకు నీవు కనబడకపోయినను మేము నిన్ను చూచుటకు ఆత్మనేత్రమనుగ్రహింతువని నిన్ను నమస్కరించుచున్నాము. స్వతంత్రుడవైన దేవా! నీవు మాకు ఇచ్చిన వాటిని స్వేచ్చగా వాడుకొనలేని వారమైనను నీవు స్వతంత్రుడవైయున్నందున నీ స్వతంత్రత మీద ఆధారపడి మా స్వతంత్రతను సద్వినియోగ పరచునట్టి స్వాతంత్ర్య బుద్ధి అనుగ్రహింతువని నిన్ను నమస్కరించుచున్నాము.
- ఆకాశమును, భూమిని మేము అనుదినము చూచుటవలన నీవు ఉన్నావని మేము తెలిసికొనగల జ్ఞానమును, మా విషయములో నీవు చేయు సమస్త కార్యములను సమ్మతించునట్లు మనస్సాక్షిని మాలో అమర్చినావని నిన్ను నమస్కరించుచున్నాము.
- అద్భుతకరుడవైన దేవా! ఆకాశమును, భూమిని మేము చూచుట వలననే కాక ఇంకను అనేకమైన ఇతర వస్తువులను, చరిత్రలను చూచుట వలన కూడ నీ విషయములు మాకు అర్ధము కాగల వీలు కలిగించుచున్నావని నిన్ను నమస్కరించుచున్నాము. ఈ మా స్తుతులను, అనుదినము మేము నీ వలన అనుభవించుచున్న ఉపకారముల విషయమై చేయవలసిన కృతజ్ఞతా స్తుతులను, నీ మహామహోన్నత స్థితిని బట్టి ఆలకించుమని నిన్ను వేడుకొను చున్నాము.
- దేవా! తేజో మయమగు లక్షణములలో ఒక్క లక్షణము ద్వారా మాకు ఉపకారము చేయునప్పుడు దానితోపాటు తక్కిన లక్షణములన్నియు ఆ కార్యమునే చేయుచుండునంత ఏక లక్షణముగా ఉన్నట్లు, మేము భావించుకొని నిన్ను నమస్కరించుచున్నాము. తధాస్తు.
II. సృష్టికర్తకు చేయు ప్రార్ధన:- (ఈ దిగువనున్న ప్రార్ధన అన్ని మతముల వారు చేయదగిన ప్రార్ధన)
ఇది
క్రీస్తుప్రభువు
నేర్పిన
ప్రార్ధన. దీనిలో క్రీస్తు పేరుగాని, ఏ అవతార పురుషుని పేరుగాని, ఏ మనుష్యుని పేరుగాని లేదు. అందుచేత 1893వ సంవత్సరము
చికాగో పట్టణములో అన్ని మతములవారు సమావేశమైన మహాసభలో ఇది ఉపయోగించిరి. దీనిలో వరలోకము తండ్రీ! యని మనందరి తండ్రిని
సంబోధించుచున్నాము ఆ ప్రార్ధన ఏదనగా :
"పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక! నీ రాజ్యము మాకు వచ్చును గాక! నీ చిత్తము పరలోకమునందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక! మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా యెడల అపరాధములు చేసినవారిని మేము క్షమించియున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక కీడునుండి తప్పించుము. రాజ్యము, బలము, మహిమ, నిరంతరము నీవియైయున్నవి. ఆమేన్" (మత్తయి 6:10-15).
బైబిలు పండితులు వ్రాసిన దీనిలోని ఏడు మనవుల వివరముగా చూడగా దీనిలో మానవుల కోరికలన్నియు గలవని కనబడుచున్నది. మొదటి పంక్తియు, చివరి పంక్తియు, స్తుతి పంక్తులైయున్నవి.
III. మరియొక ప్రార్ధన:- దేవా! నాకు కనబడుము, అందరికి కనబడుము, దేవా! నాతో మాట్లాడుము. అందరితో మాట్లాడుము. తధాస్తు.
ఈ పత్రికలోని స్తుతులు అన్నిటికంటెను, అందరికంటెను గొప్పవాడైన దేవుని లక్షణములను, గురించిన స్తుతులౌటచేత, ఈ ప్రార్థనలు అన్నిటికంటెను, అందరికంటెను గొప్పవాడైన దేవునికి చేయు ప్రార్థనలగుటచేత ఇవి తరచుగా వాడువారు ధన్యులు, మహా సౌఖ్యవంతులు, నిత్యజీవమోక్షార్దులు.