(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
స్వస్థత ప్రార్ధన
యేసుప్రభువా! మీ పేరులోనే రక్షించేవాడవు అని యున్నది. వైద్యుడు సగము జబ్బు ఆపి సగములో విడిచిపెట్టివెళ్ళడు. అలాగే నీవు ఒక్క శరీరవ్యాధి బాగుచేసి, ఆత్మజీవనములోని పాపవ్యాధి బాగుచేయకుండా మనుష్యుని విడిచిపెట్టవు. గనుక నీవు రెండు విధములైన వైద్యుడవైయున్నావు గనుక స్తోత్రములు.
ప్రభువా! లోకవైద్యులు ఆస్పత్రిలో ఎన్నో రోజులు మందు ఇస్తే గాని రోగులు బాగుపడరు. అయితే నీవు సువార్తలలో వ్యాధిగ్రస్తులను ఒక్కసారే బాగుచేసినావు. మా దేశములో జబ్బుగాయున్న రోగులకు ఒకసారి ప్రార్ధనచేస్తే మరుసటివారము మరల వత్తురు. అయితే పూర్ణ విశ్వాసము ఉన్నయెడల ఒక్కసారితోనే బాగుపడుదురు. అట్టి విశ్వాసము ఇక్కడ ఉన్నవారికి దయచేయుము. వారు తెచ్చుకొన్న తైలమును, ఆ తైలమున్న బుడ్డిని, వాడే రోగిని దీవించుము. కంటికి కనబడే రొట్టె, రసము ఇచ్చుచూ, కంటికి కనబడని శరీర రక్తములు కూడ ఇస్తూయున్నావుగదా! అలాగే వెంటనే స్వస్థత కనబడకపోయినను, ఒకసారి మీటింగులో ప్రార్ధన అయినది గనుక నేను బాగుపడవలెను. రెండవసారి మీటింగునకు వెళ్ళనని నిశ్చయించుకొనే ధైర్యము దయచేయుము. ఈ తైలము నీ శిష్యులు వాడిన తైలమును, పెద్దలు వాడిన తైలమునైయున్నది. గనుక మేముకూడ వాడుచున్నాము.
ఈ గదిలో ఇప్పుడు ఎవరెవ్వరికి ఏ జబ్బులు యున్నవో అవి వ్రేళ్లతోపాటు పెరికివేయుము. వెంటనే ఆరోగ్యము కలుగజేయుము. మరల స్వస్థత మీటింగునకు రాకుండా ఇంటివద్ద స్తుతిచేసేటట్టు దీవించుము. ఆమేన్.