(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

సేవచేయునప్పుడు అనగా సువార్త ప్రకటించునప్పుడు చేయవలసిన ప్రార్థన



  1. సర్వజనుల యొక్క అధికారివైన దేవా! నన్ను మాత్రమే కాదు, అందరిని రక్షిచుటకు నీకు ఇష్టము. నన్ను రక్షించినావు గనుక ఇతరులు రక్షింపబడేటట్టు, నాకును, సువార్త చెప్పుటకు సమయము దయచేయుము ఆమేన్.

  2. నాయకుడవైన ప్రభువా! నే ఎక్కడికి వెళ్ళవలెనో ఎవరి యొద్దకు వెళ్ళవలెనో అక్కడకు నేను కాల పరిస్థితులను బట్టి వెళ్ళేటట్లు నా జ్ఞానమును ఉపయోగించే కృప దయచేయుము. ఆమేన్.

  3. వాక్కు నేర్పే తండ్రీ! మేము మనుష్యులతో మాటలాడేటప్పుడు మా ఇష్టము వచ్చిన మాటలు కాక మా సర్థామాటలుకాక, వారి హృదయములకు తగిన మాటలే చెప్పేటట్టు మాకు వాక్కు దయచేయుము. ఆమేన్.

  4. యుక్త సమయముల యందు, యుక్త వాక్యములు అందించే తండ్రీ! మేము నీ వాక్యము చెప్పేటప్పుడు కొందరిలో ఫలించదు. కొందరిలో ఫలించును.. అయినను వాక్కు అందించుము. ఎందుకంటే మూర్ఖతనము గలవారికి అది శిక్షగా నిలువబడును. విధేయత గలవారికి పరమవిందుగా వినబడును. ఆమేన్.

  5. ఓ సర్వజ్ఞాని ఎన్నడు నీ వాక్యముఖము ఎరుగని సజ్జనులున్నారు. అట్టి వారి యొద్దకు నన్ను పంపుము. వారి అజ్ఞానమును తొలగింపగల నీ వాక్య వివరణ ధోరణి నాలోనుంచి, ఆ వాక్యము యూటయై రప్పించుము. ఓ సర్వజ్ఞానీ! ఆమేన్.

  6. జాగ్రత్తగా ఆలోచించే ఆత్మను దయచేసే తండ్రీ! కుప్పలు కుప్పలుగా మా మీద పడే చిక్కు ప్రశ్నలకు ఏమి జవాబు చెప్పవలెనో అది మాకు ఒక ఉపాధ్యాయునివలే మా ప్రక్కనుండి చెప్పించుము. స్తెఫను మాటలకు ఎవ్వరును ఎదురు చెప్పలేకపోయిరి. అంటే మా మాటలకు కూడ ఎదురు చెప్పక, ప్రశ్నల జవాబులు విని మనుష్యులు ఆనందించేటట్లు మాకు, వారికి కృప దయచేయుము. ఆమేన్.

  7. నీ వాక్యము తెలిసినవారికి మేము నీ వాక్యము విడచెప్పేటప్పుడు, వినేవారు తమ అజ్ఞానము, తెలిసికొన్నవారై; ఎమ్మాయి శిష్యులయొక్క హృదయములో మంట పుట్టినట్లు, వారి హృదయములో కూడ మంటపుట్టి వారికి జ్ఞానోదయముగల్గు మార్గము సరాళము చేయుము. ఆమేన్.