(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

కుటుంబముల కొరకైన ప్రార్ధన



ఓ దేవా! కుటుంబమున చాలామందికి బిడ్డలను ఇచ్చినావు. సంతోషమే, కాని వారికి మంచి లక్షణములు ఇమ్మని వేడుకొనుచున్నాము. వారిని భక్తి మార్గములో పెంచుటకు తల్లిదండ్రులకు శక్తికూడా ఇమ్మని వేడుకొనుచున్నాము. పిల్లలు సరియైన స్థితిలో లేనప్పుడు వారిని ఎట్లు మళ్ళింపవలెనో నేర్పుము. బాగా ఉన్నప్పుడు నడిపించుట సుళువే. అప్పుడు తల్లిదండ్రులకు అంత పని ఉండదు. పిల్లలు తప్పుదారి నడిచేటప్పుడు వారిని మళ్ళించే గొప్ప పని ఉండును. తల్లిదండ్రుల భక్తి, జ్ఞానము, మనస్సాక్షి శరీరబలము, సమయము వాడుకొనుటకు అదే మంచి సమయము. కాబట్టి అందరికి అట్టి తరుణము దయచేయుము.


అబ్రాహాము ఎవ్వరిమీద కోపపడినట్లు లేదు అతనితో ఉన్నవాడు నరిగా ఉన్నారు, గనుక కోవపడవలసిన అవసరము లేదు, దిద్దవలసిన అవసరము లేదు. నేటికాలపు పిల్లలు క్రమము తప్పినారు. తల్లిదండ్రులు వారిని మళ్ళించుటకు ఎక్కువ కష్టపడవలెను. అది వారికి దయచేయుము. పిల్లలు “చెప్పిన మాట వినరు” అని నీ వాక్యములో (2తిమోతి 3:2) పౌలుచేత వ్రాయించినావు గదా! అది ఇప్పుడు నెరవేరు చున్నది. గనుక బాగుచేయుట కూడ నెరవేరవలెను. పిల్లల విషయములో పూచి తల్లిదండ్రులే గనుక తమ విధి తామే నెరవేర్చుకొనవలెను. శక్తిగల ప్రభువా! ఓ ఎల్ షద్ధాయ్ ! వారికి శక్తి దయచేయుము. నడుపుటకు, నడుచుటకు ఈ రెండు శక్తులు దయచేయుము. ఆమేన్.


ఒక ఇంటిలోనికి వ్యతిరేకమైన శక్తి వచ్చునప్పుడు దానిని ఎదిరించుటకు పరలోకము నుండి, ఎల్ షద్ధాయ్ నుండి శక్తి రాకమానదు.

  1. దయగల తండ్రీ! కుటుంబములో పిల్లలు ఒక శాఖకు సంబంధించి యున్నారు. ఆ శాఖ పేరు సర్వస్వతంత్ర శాఖ. అందుచేత తల్లిదండ్రులు చెప్పిన మాట వినక, తమకు తోచిన ప్రకారము చేస్తారు. అందుచేత తల్లిదండ్రులకు బాధ. ఇది అనేక పర్యాయములు జరుగుచున్నది. ఈ కుటుంబములలో అట్టిది జరగకుండా చేయుమని మా ప్రార్ధన.

  2. మరియొక శాఖ:- కొందరు పిల్లలు ఏదైన అడిగితే నిజము చెప్పక అబద్ధము నిజము వలె ఎంతో నిజముగా ఉన్నట్లు దృఢముగా చెప్పుదురు. ఇది పరిహరింపుము.

  3. ఇంటిపట్టున ఉండక తమకు ఇష్టమైన చోట్లకు వెళ్ళుదురు. ఇది కూడ పరిహరింపుము.

  4. “బడికి వెళ్ళవలసినది” అని చెప్పి పంపించగా, ఎక్కడికో వెళ్ళి “ఇప్పుడే బడి అయిపోయినది” అని చెవ్చుదురు. ఈ దుర్గుణమును పరిహరింపుము.

  5. బడిలో పాఠములు సరిగా నేర్చుకొనక ఫెయిల్ అయితే నిన్ను దూషింతురు. ఇది కూడ పరిహరింపుము.

  6. ఇంటిలో ఏదైన ఎత్తుకొనిపోయి అమ్ముకొందురు. స్నేహితులకు పంచిపెట్టుదురు. పొరుగూరు వెళ్ళుదురు. ఎందుకు ఈలాగు చేసితిరని అడిగితే మాకు “వెళ్ళుమని” స్వరము వినబడినది. అందుచేత వెళ్ళినాము అని అందురు. వినబడటం నిజమే కాని, అది దురాత్మ చెప్పెనని వారికి తెలియదు. అది వారికి తెలియజెప్పుము.

  7. వారిని తల్లిదండ్రులు శిక్షించితే మరింత మొద్దుబారుదురు. ఈ మొండితనము పరిహరించుము.

  8. ప్రార్ధనలో యుండవలెను. బైబిలు చదువవలెను, కీర్తనలు పాడవలయునని చెప్పితే “నీవు చెప్పినట్లు చేయు బుద్ధి మాకు కలుగుట లేదు” అని అందురు. ఈ దుర్గుణమును గూడ పరిహరింపుము.

  9. మీలో దుర్మార్గత ఉన్నది అని చెప్పితే, ఏ మాత్రము నమ్మరు. ఓ ప్రభువా! ఈ కాలమందు సాతాను కొందరికి మతి చాంచల్యము కలిగించు చున్నాడు. కొందరిని ఎక్కడికో తీసికొని వెళ్లి అక్కడ పరుండబెట్టుచున్నాడు. వారికి తెలియదు. మరియు పిశాచి భిక్షకుని వలె కనబడి, కొంతమందికి మాయ మాటలు చెప్పిన క్రైస్తవులు యేసుప్రభువే అని భ్రమపడుదురు. పరీక్షింపకుండా భిక్షము వేయకూడదు. మరియు అనవసరముగా అతడు భయము పుట్టించును. జాగ్రత్తగా ఉండవలెను.