(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
పాప విమోచన ప్రార్థన
I.
- 1) ప్రార్థన:- యేసుప్రభువా! మేము తలంపులో పాపులమై యున్నాము. చూపులో పాపులము, వినడములో పాపులము, మాటలో పాపులము, ప్రయత్నములో పాపులము, క్రియలో పాపులము, ప్రవర్తనంతటిలో పాపులము. జీవితకాలమంతటిలో పాపులము. గనుక మమ్మును క్షమించుము. పాపమును జయించుటకు శక్తి దయచేయుము. ఆమేన్.
- 2) మా శరీరములో పాపఫలితములు, జబ్బులున్నవి. వాటిని పరిహారము చేయుము. నీవు కలుగజేసిన శరీరము, నీవు కలుగజేసినట్లు లేదు. ఆలోచనలో పొరపాటు, చూపులో పొరపాటు, వినడములో పొరపాటు, మాటలో, ప్రయత్నములో, క్రియలో, జీవితములో పొరబాట్లు ఉన్నవి. పొరబాట్లేకాదు జబ్బుతో శరీరము చిక్కిపోవుచున్నది. గనుక స్వస్థత దయచేయుము. ఆమేన్.
- 3) మా ఆత్మకు కూడ కళంకమున్నది. గనుక స్వస్థపరచుము. మా ప్రాణము ఎప్పుడుబడితే అప్పుడే మరణమునకు లోనగును. నీ ప్రభావమువలన మమ్మును రక్షించుము. ఆమేన్.
- 1. ప్రభువా! యోనా నీ సన్నిధినుండి పారిపోయినప్పుడు, సముద్రము మీద గొప్ప తుఫాను కలిగినది. అప్పుడు ఓడ నాయకులు "ఎవరి దేవుండ్లను వారు ప్రార్థించండి" అని ప్రార్థించినారు. అలాగే మేము మా దేవుడవైన నిన్ను ప్రార్థిస్తున్నాము. పిశాచి మా బైబిలు మిషను మీద, ఇతర మిషనుల ద్వారా, పరజనుల ద్వారా దండెత్తినది. గనుక నిన్ను వేడుకొనుచున్నాము.
- 2. ప్రభువా! మేము మాకు కనబడిన వారితో ఈలాగు చెప్పవలెను అని యున్నది. గనుక సెలవిమ్ము. అయ్యలారా! అమ్మలారా! బాలబాలికలారా! ఆర్య సమాజమువారు మమ్మును లేకుండా చేయజూస్తున్నారు. మీరు వారికి చెప్పండి. మేమేమి చేసినాము! క్రైస్తవ మతము ఇండియాకు ఎన్నో మేళ్లు చేసినది. మీరు వారితో చెప్పి వారివలె మీటింగులు పెట్టి మా పక్షముగా వాటలాడండి. మా పక్షముగా పత్రికాదులు వేయండి.
- 3. ప్రభువా! నీవు కలుగజేసిన ఇండియా భూమి విడిచి మేము ఎక్కడికి పోగలము! పోతే వారుకూడా తోలివేస్తారు. గనుక కృప కొరకు ప్రార్ధించండి.
- 4. ప్రభువా! మా విరోధులందరికి జ్వరము రప్పించి మంచము పట్టించి, మళ్ళీ లేవకుండా చేయుము గాని ఆ సమయములో నీవు వారి తప్పు తెలియగలిగేటట్టు బోధించుము. "నేను ఆకాశము, భూమి, మానవ సంతతి కలుగజేసినవాడను" అని చెప్పుము కాని మరణము వారి దరి చేరనీయకుము. వారికి రక్షణ మార్గము చూపించుము. బైబిలులోగాని, నీలో గాని, మతములోగాని ఏ దోషములేదు అని చెప్పుము. నమ్మినను, నమ్మకపోయినను చెప్పుము. సంగతి తెలిసికొననివారు తెలిసికొంటారు గనుక బోధించుము. 20 వందల ఏండ్లనుండి అనగా తోమా ఇండియాకు వచ్చిన కాలము నుంచి, నీ బోధకులవల్ల మా దేశమునకు వర్తమానము వినబడుచున్నది. అయితే వారు ఆ బోధవల్ల మేలుపొందక, మాకు కీడు ఆలోచిస్తున్నారు. నీవు ఊరుకుంటున్నావు. నీ ఉద్దేశము మంచిదైయుండవలెను. మాకు అంతగా తెలియదు. అది పూర్వకాల భక్తులు “దేవా! ఊరుకోవద్దు, శత్రువులు చెలరేగుచున్నారు" అని ప్రార్థించగా మేముకూడా అట్టి ప్రార్ధన చేయవచ్చును అని చెప్పి గ్రంథములో వ్రాయించినావుగదా! గనుక చేస్తున్నాము. వారి నాశనమునకు కాదు, వారి రక్షణ కొరకే. జ్వరం, వ్యాధి వారికి మహోపకార సాధనమైయుండునట్లు దీవించుము. వారు మా స్వజనులే, మా దేశస్థులే, మా ప్రార్ధన అవసరమైనవారే మా బోధ కావలసినవారే ఆలకించుము. ఆమేన్.
ఓ ప్రభువా! వారికి రహస్యమైన వ్యాధిగాని, బాధకరమైన వ్యాధిగాని రానీయకుము. జ్వరము ఈ రెంటికి నంబంధించినదని మేము అనుకొంటున్నాము. జ్వరము శిక్షకాదు.
III.- 1) మాకున్న శ్రమలను గూర్చి ప్రార్థించండి పరలోక పరిశుద్దులనుగూడ మేము కోరుకుందుము గాన మా గురించి వారు చేయు ప్రార్ధన కూడా అంగీకరించుము. ఆమేన్.
- 2) రక్షణ కార్య సహాయకులగు దేవదూతలనుకూడ మా కొరకు ప్రార్ధించండి. సహాయము చేయండి అని వారికి కూడ ప్రార్ధన ఆర్జీ పెట్టుకొంటాము. గాన మాగూర్చి వారు చేయునదియు అంగీకరించుము. ఆమేన్.
- 3) యేసుప్రభువా! మాకున్న శ్రమనుగూర్చి మా దేశములోని క్రైస్తవ సోదరులకును, విదేశీయులైన అమెరికా, ఐరోపా మొదలగు దేశములలోను ఉన్న క్రైస్తవ సోదరులకును, అభిమానులకును ఆయా మిషనులవారికిని తెలియజేసికొందుము. అప్పుడు వారు మా కొరకు ప్రార్ధనచేయుదురు. ఆ ప్రార్థనలను నెరవేర్చుము. ఆమేన్.
- 4) మా దేశ నాయకులు కొందరు క్రైస్తవ మతమువలన మన దేశమునకు మేలే కలిగినది, మేలే జరిగినది, ఇంకను జరుగుచున్నది. దానిలోనే మేమందరము చదువుకొన్నాము. చదువుకొని పైకి వచ్చినాము. అది మనకు కీడేమి ఇవ్వలేదని వివరముగా చెప్పుచున్నారు. ఇది మిగిలినవారికి నచ్చుటలేదు, కీడుచేయ చూచుచున్నారు. గాన వారికి నచ్చేటట్టును, కీడేమియు కలుగకుండునట్లును సహాయము చేయుమని ప్రార్థించుచున్నాము. ఆమేన్.
- 1. ప్రభువా! మా విరోధులకు ఈ మాట చెప్పేటట్టు మాకు ధైర్యము దయచేయుము. అది ఏమిటంటే "మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్దుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒక వేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసు కొనుము."" దానియేలు. 3:17,18.
- 2. ప్రభువా! నీ ప్రజలను నాశనముచేయుటకు ఐగుప్తీయులు ప్రయత్నముచేసిరి, గాని వారి జ్యేష్టపుత్రులు నశించిరి. వారి పటాలము ఎర్ర సముద్రములో పడి మునిగి నశించిరి. మా శత్రువులు ఆలాగు నశించకుండా వారికి జ్ఞానోదయము, రక్షణ జీవాంతమందు మోక్షభాగ్యము దయచేయుము. ఐగుప్తీయులను నీవు చంపలేదు. వారి మూర్ధత్వము వారిని చంపెను. ఈ కథ మా శత్రువులకు చెప్పుము.
- 3. ఓడలోనికి రండని 120 ఏండ్లు నోవహు బోధించగా వారు పెడచెవిని బెట్టినందున దానివలన వారు జలప్రళయములో నాశనమైపోయిరి. ఆలాగు మా శత్రువులు నాశనము కాకుండా కాపాడుము.
- 4. ఓ తండ్రీ! మా బైబిలు మిషనులో కొందరు విరోధులైయున్నారు. ఇతర మిషనులోకూడ శత్రువులున్నారు. అన్ని మతములలో శత్రువులున్నారు. హాని చేయని శత్రువులున్నారు. అయితే ఆర్య సమాజకులు హానిచేసే శత్రువులై యున్నారు. ఈ శత్రుత్వమునుండి మమ్మును తప్పిస్తే, నీవే సర్వశక్తిగల లోకైక రక్షకుడవు అని వారు తెలిసికొంటారు. నమ్మిన నమ్మకపోయిన సంగతి మాత్రము తెలిసికొందురు.
- 5. ఓ ప్రభువా! యూదులు నీ మహిమ తెలిసికొంటే, నిన్నుసిలువ వేసి చంపించకుందురు. మా శత్రువులు నీ మహిమ తెలిసికొంటే మా మీదికి రారు. గనుక వారికి చెప్పుట మా వంతు. 20వందల ఏండ్లలో చెప్పడము అయిపోయింది. ఇప్పుడు నీ వంతు గనుక నీవే చెప్పుము. ఆమేన్.