(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
వర్ష ప్రార్ధన
నా నామమునుబట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతునని ఆయన సెలవిచ్చెను. యోహాను 14:14.
అతడు మరల ప్రార్ధన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. యాకోబు 5:18.
మింటి దృష్టగల సహకారులారా! చలవ చలవ!
- 1. దేవా! నీవు మాకు ఉచితముగా ఇచ్చుచున్న దానములలో ఒకటియగు వర్షదానము నేడు కొదువగాయున్నది. గనుక ఈ కొదువను తీర్చుమని వేడుకొనుచున్నాము. తండ్రీ! నీ ఆజ్ఞలు నెరవేర్చునప్పుడు “మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని దాని కాలమున కురిపించెదను” అని వాగ్ధానము చేసినావు. నీ వాగ్ధానమును నెరవేర్చుము (ద్వితీ. 11:14). గాలి తుఫాను వలన గాని, అధిక వర్షము వలనగాని, హాని రానీయకుము. మాకు ఎంత వర్షము అగత్యమో అంత వర్షము కురిపించుము. ధాన్యాదులు సమృద్ధిగా పండించుము ఆమేన్. అనాది దేవా! సృష్ట్యాది నుండి నేటివరకు లోకమునకు వర్షమును ధర్మము చేయుచున్న నీకు అనేక స్తోత్రములు. ఆమేన్.
-
- 2.
- 1) సృష్టికర్తవైన తండ్రీ! గతకాల ఉపకారములకు నీకనేక వందనములు. మాకును, జీవరాసులకును దాహశాంతి కలుగునట్లును, పొలములు, చెరువులు, తోటలు, ఇతర స్థలములలోని వృక్షములు ఫలించునట్లును, వేడిమి తగ్గునట్లును, చెరువులు, బావులు, నదులు, నిండునట్లును వర్షమును పంపించుము. సమృద్ధిగల వర్షమును పంపుము. ఎక్కడ అవసరమో అక్కడను, ఎంత అవసరమో అంతయును, ఎప్పుడు అవసరమో అప్పుడును, కురిపించుము.
- 2) అధిక వర్షమువల్ల మనుష్యులకు, ఇండ్లకు, పశ్వాదులకు, పంట భూములకు, నౌకాదులకు హాని కలుగుచున్నది. కనుక కావలసినంత వాన మాత్రమే రప్పించుము.
- 3) మేము ప్రార్ధించకపోయినను వర్షదానమనుగ్రహించుచున్న నీవు, ఇప్పుడు ప్రార్ధించుచున్న ఈ సమయమున మా పాపములు క్షమించి, నిశ్చయముగ వర్షదానమనుగ్రహింతువని నమ్ముచున్నాము. తథాస్తు (ఆమేన్).
- 3. దేవా! మానవులకు ప్రత్యక్షము కావలెనని నరజన్మ మెత్తి వచ్చిన దేవా! వచ్చి యేసుక్రీస్తను నామము ధరించుకొని సమస్తోపకారములు చేసిన యేసుక్రీస్తు ప్రభువా! నీకనేక వందనములు. మాకు కావలసిన బోధలు వినిపించి యున్నందుకును, అవి వ్రాయించినందుకును పాపులకు క్షమాపణ, రోగులకు స్వస్థత, మృతులకు పునర్జీవము, భూత పీడితులకు విముక్తి, ఆకలిగలవారికి అద్భుతాహారము, ఆపదలోనున్నవారికి విమోచన అనుగ్రహించినందుకును నీకు స్తోత్రము. నీవెంత దేవుడవైనప్పటికిని, మా మీదగల ప్రేమచేత మా నరుల మధ్య నంచరించి, వారితో కలిసి మెలిసియుండి, మంచి మాదిరి కనుపరచిన నీ అద్భుత చర్య నిమిత్తమై నీకు కృతజ్ఞతా స్తుతులు. శ్రమ మరణము మూలముగా కూడ, మహోపకారము చేయవలెనని తలంచినావు. గనుక శత్రువులు నిన్ను చంపినప్పుడు సహించుకున్నావు. అయినప్పటికిని, నీవు దేవుడవు గనుక సమాధిలో నుండి లేచి వచ్చి, భక్తులకు నలువది దినములు దర్శనమిచ్చినావు. అప్పుడు మహిమ శరీరముతో మోక్షలోకమునకు వెళ్ళినావు. మరల సజీవ భక్తులను తీసికొని వెళ్ళుటకై, త్వరలోవచ్చి నీ వాగ్ధానము నెరవేర్చుకొందువు స్తోత్రము. మమ్ములను సిద్ధపర్చుము. మాకిప్పుడు వర్షము మిగుల అవసరముగా ఉన్నది కురిపించుము. తథాస్తు (ఆమేన్).
- 4. యేసుప్రభువా! నీవు లేకుండా ఏమియు కలుగలేదని బైబిలులో వ్రాయించిన తండ్రీ! నా నామమందు మీరేమి అడిగినను నేను చేతునని వాక్కిచ్చిన దేవా! ఆకాశము నుండి మా భూమిమీదికి వర్షమును కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. నీకనేక స్తోత్రములు ఆమేన్.
- 5. అనాది దేవా! సృష్ట్యాది నుండి నేటి వరకు లోకమునకు వర్షమును ధర్మము చేయుచున్న నీకు అనేక స్తోత్రములు. దేవా! సమస్తమును, మమ్మును, వర్షమును కలుగజేసిన తండ్రీ! మాకిప్పుడు వర్షము మిగుల అవసరముగా ఉన్నది కురిపించుము ఆమేన్.
- గమనిక : 1. పైన ఉన్న ప్రార్ధనలవంటి ప్రార్ధనలు చేయ వీలు లేనివారు, దినమున కొకసారి కొంతసేపైనను ఏకాంతముగ కూర్చుని, వర్షము వచ్చునట్లు ఏమి చేయవలెనని, జ్ఞానశక్తితో ఆలోచించుట యుక్తమైయున్నది. ఏమి చేయవలెనో అప్పుడు, మనస్సాక్షికి అనుగుణ్యమైన జ్ఞానమునకు బైలుపడును. ఆలోచించుట వలన మనుష్యులెంత గొవ్ప పనులు చేయుచున్నారో జ్ఞాపకము చేసికొనండి. ప్రియులారా! ఈ ప్రార్ధనలు భోజన సమయమందు అనుదినమును చేసిచూడండి ఇదియే మా మనవి. దేవా! అని ప్రార్థించువారికి యేసుక్రీస్తు ప్రభువు బైలుపడును.
-
గమనిక:- 2.
నెరవేర్పు కలుగువరకు ప్రతి కుటుంబములోను, అనుదినము ఇట్టి ప్రార్ధనలు చేయండి, ఆలోచించండి.
2) మేమిదివరకు ఇట్టి పత్రికలు అచ్చువేసి పంచినప్పుడు వెంటనే వర్షము అద్భుతముగ కురిసినది. మరియొకప్పుడు ప్రచురించక ముందే వర్షము వచ్చినది దేవునికి కృతజ్ఞతార్పణలు. - 3) మేము పత్రికలు పంచి పెట్టుటయేగాని అనేకులు ప్రార్థించుటలేదని విన్నమాట నిజమేనా? దేశోపకార్థమైన వర్ష ప్రార్థన పత్రికలు చదువకను, ప్రార్ధింపకను ఉన్న యెడల, రావలసిన వర్షము రాని రీతిగనే, కలుగవలసిన మేలు కలుగదు గదా! అందరును ఇప్పుడు అగ్ని ప్రళయ నివారణ నిమిత్తమై తీవ్రముగా ప్రార్ధించండి. మీకు శుభము కలుగును గాక! ఆమేన్.