(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

మెట్ల ప్రార్ధన



(దేవునినెట్లు ప్రార్థించిన యెడల మన కోరికలు నెరవేరునో ఆ సంగతులు ఈ పత్రికలో ఉన్నవి) మానవ సహకారులారా! మీరు ఏకాంత స్థలమున చేరి, ఈ క్రింది మెట్ల ప్రకారము ప్రార్ధించి, మేలు పొందండి.


దేవుడు మీ ఎదుట ఉన్నాడని అనుకొని నమస్కారము చేయండి. ఇది మొదటి మెట్టు. ఇక ప్రార్ధించండి:-
  1. దేవా! నా పాపములు క్షమించుము. నాకు తెలిసిన ఏ పొరపాటులోను పడకుండ నన్ను కాపాడుము.

  2. దేవా! నా శక్తికొలది చెడుగును విసర్జింతును. నా తలంపులో గాని, చూపులోగాని, వినుటలో గాని, మాటలోగాని, ప్రయత్నములోగాని, క్రియలోగాని ఏ దుర్భుద్ధి చేరకుండా జాగ్రత్తగా ఉందును.

  3. దేవా! నా శరీరమును, నా ప్రాణమును, నా ఆత్మను, నా జ్ఞానమును నా మనస్ఫాక్షిని, నా యింటిని నాకు కలిగియున్న సమస్తమును కాపుదల నిమిత్తమై నీ వశము చేయుచున్నాను.

  4. సృష్టికర్తవైన దేవా! నీవు ఆది అంతము లేనివాడవు, అంత గొప్ప దేవుడవు అయినప్పటికిని, నీవు మా తండ్రివి, మా ప్రార్ధనలు విందువు. గనుక నీకు వందనములు. నీవు జీవము గలవాడవు, ప్రేమ గలవాడవు, న్యాయము గలవాడవు, శక్తి గలవాడవు, పాపములేని పరిశుద్ధత గలవాడవు. నీవు అంతటను ఉన్నావు. నా దగ్గరకూడా ఉన్నావు. గనుక నీకు వందనములు. నీలో ఉన్న ఈ మంచి గుణములు నాలో కూడా పెట్టినావు. గనుక వందనములు.

  5. దేవా! తండ్రీ! నాకు కలిగిన ఎన్నో కష్టములు తీసివేసినావు. గనుక వందనములు. కష్టములు తొలగించుట మాత్రమే గాక ఎన్నో ఉపకారములు చేసినావు. గనుక వందనములు. నేను నిన్ను ప్రార్ధించినను, ప్రార్ధించక పోయినను కాపాడినావు. గనుక నీకు వందనములు.

  6. దేవా! ప్రభువా! నేను నిన్ను కోరినను, కోరకపోయినను అనేక మేళ్ళు చేసినావు. గనుక వందనములు.

  7. దయగల తండ్రీ! నాకు ఏవి అవసరమో అవి దయచేయుము. పోషణ, ఆరోగ్యము దయచేయుము.

  8. దేవా! నీవే నా తండ్రివి, నా పోషకుడవు, నా వైద్యుడవు, నాకు విద్యాబుద్ధులు నేర్పు దేవుడవు. నేను ఎల్లప్పుడును నీయందు భక్తి నిలుపగల శక్తిని అనుగ్రహించుము. సమస్తమును అనుహ్రింపగల సమర్దుడవు. నన్ను మాత్రమే గాక నీవు కలుగజేసిన సమస్తమును దీవించుము. మనుష్యులందరిని రక్షించుము. నిన్ను నమ్మిన వారందరిని మోక్షములోనికి చేర్చుకొనుము. నమ్మని వారికి జ్ఞానము నేర్పుము. నమ్మిక కలిగించుము. వారిని కూడ మోక్షములోనికి చేర్చుకొనుము.

  9. దేవా! నాకు మనుష్య రూపముతో దర్శనములో గాని, స్వప్నములోగాని కనబడుము. నాతో మాట్లాడుము. నేను నిన్ను ఏమైన అడిగిన యెడల జవాబు చెప్పుము. ఆమేన్.

  10. ఇప్పుడేమియు మాట్లాడకుండా నిశ్శబ్ధంగా ఉండి, దేవుడు మీకు ఏమి చెప్పునో వినుటకై కనిపెట్టండి. అప్పుడాయన మీకు నిశ్చయముగా కనబడి మాట్లాడును.

గమనిక:- ఈ పదకొండు మెట్లు ఎక్కునప్పటికి మీకు గొప్ప స్థితి వచ్చును. ఈ ప్రార్ధన మీ ఇష్టము వచ్చినట్లు చేసికొనవచ్చును. అందరికి నేర్పవచ్చును. ఈ ప్రార్ధన వలన భూతములు పారిపోవును. చేతబడి తగలదు. శాపము రాదు. శత్రువులు స్నేహితులగుదురు. పాపములు పరిహారమగును. వ్యాధులు కుదురును. పేదరికముండదు. బిడ్డలు లేనివారికి బిడ్డలు కలుగుదురు. అప్పులు తీరును, పొలములు పండును, పశువులు బాగుగా పాలు ఇచ్చును. పురుగు ముట్టదు. ముట్టినను మీ ప్రార్ధన వలన విషము విరిగిపోవును. మీరుతలంచుకున్నదంతయు నెరవేరును. భయపడకుడి. దేవుని తలంచుకొని సంతోషముగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినను ఏమి చేసినను దేవుని తలంపుమీదనే ఉండండి.


ఇది అన్ని మతముల వారికి అనుగుణ్యముగా ఉండునట్లు వ్రాయబడిన ప్రార్ధన. అందరు అంగీకరింపవలసినదే. దీని ప్రకారము చేసి మేలు పొందవలసినదే. మీకు జయము కలుగునుగాక, మీరు అన్నిటిలో వర్ధిల్లుదురు గాక! ఆమేన్. అప్పుడు భూలోకము మోక్షమువలె మీకు కనబడును. విచారము గాని, దిగులు గాని, అపనమ్మికము గాని మీ మనస్సులోనికి రానియ్యకండి. అవన్నియు దయ్యపు చేష్టలు మీ బ్రతుకంతటిలో దేవుని చేష్టలు, దేవుని క్రియలు, దేవుని పనులు మాత్రమే ఉండవలెను గాని, ఇతరమైనవి ఉండకూడదు. మీకు శుభము కలుగును గాక! ఆమేన్.