(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

స్వస్థి ప్రార్ధన



యేసుప్రభువా! పరమవైద్యుడా! నీవు ఇశ్రాయేలు దేశముయొక్క పట్టణములలో సంచరించి నానావిధ రోగులను స్వస్థపరచినావు. కాబట్టి వందనములు. అది గొప్ప సంగతి. నీవు ఒక్క మాట అన్నావు. నా శిష్యులు నా కంటె గొప్పవి చేస్తారన్నావు. పేతురుయొక్క నీడ తగిలి కొంతమంది బాగైరి. ఈ అద్భుతము నీవు చేసినట్టు లేదు. నీ శిష్యుడు చేశాడు. ఆలాగే ఇప్పుడు కాకానిలో ఈ వేళ నీ శిష్యులు ప్రార్ధనచేస్తే చాలమంది రోగులు బాగైపోతున్నారు. అయితే నీవు బాగుచేసినావని భావిస్తున్నాము. అక్కడ పాలస్తీనాలో పబ్లిక్ గా (బహిరంగముగా) తిరిగిన నీవు ఇప్పుడు లోకములో ఎక్కడ స్వస్థత కలుగుచున్నదో, అక్కడ ఉండి నీ సేవకులద్వారా స్వస్థత జరిగించుచున్నావు. నీవు నేడు, నిరంతరము ఒక్క రీతిగానే ఉన్నావని పౌలు వ్రాసినమాట సత్యము. అప్పుడు బహిరంగముగా చేసిన పని స్వస్థత. ఇప్పుడు రహస్యముగా చేస్తున్న పనికూడ న్వన్థతే. గనుక అప్పుడు స్తుతికి కారణభూతుడవు ఆలాగే ఇప్పుడును మరింత స్తుతికి కారణభూతుడవు. ఇప్పుడు బేతేలు గృహమునకు వచ్చినవారిని గురించికూడ ప్రార్థిస్తున్నాము. అదికూడ స్వస్థతే. మేము చేసినట్లు కాదు, నీవు చేసినట్లే. ఆ ప్రార్ధనలు రోగులు విని, ప్రార్ధనలు చేస్తున్న స్వస్థత అని నమ్మినయెడల వారి హృదయములో కృతజ్ఞత ఉండును.


తైలము తెచ్చుకొని దీవెన కోరుచున్నారు. నేను నా చెయ్యిచాపి దీవించక పోయినను, నోటిమాటతో మాత్రమే దీవించినప్పటికి, అది నీవు చెయ్యి చాపి తైలముమీదవేసి దీవించినట్టే అని వారు తెలుసుకొనినయెడల ఎట్టి వ్యాధియైనను అంతరించును. అట్టి కృప తైలము తెచ్చుకొన్నవారికి చూపును. పూర్వకాలమందే కాక నేడును మా తైలమునుకూడ యేసుప్రభువు ఆశీర్వదిస్తున్నాడు. గనుక మాకు పర్వాలేదని తైలము రాసుకుంటే ఎంత ధన్యులు. నీవల్ల, నీ శిష్యుల వల్ల, పాలస్తీనాలో స్వస్థతపొందిన వారి సంతోషము వీరికినికూడ కలుగును. ఈ తైలము నీవు చెప్పినదే, బైబిలులో వ్రాయబడినదే. కాబట్టి శిలాక్షరముల వ్రాతలో పడినది. నెరవేరినది. నీకే మహిమ ఆమేన్.