(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
గొలుసు ప్రార్ధన
“మీరు స్వస్థత పొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్ధన చేయుడి” యాకోబు 5:16.
ఈ ప్రార్ధన వేకువఝామున సుమారు మూడుగంటల సమయమున లేచి మోకాళ్ళమీద ఉండి పది నిమిషములు స్తుతిచేసి, ఆ మీదట ఈ ప్రార్ధన చేసిన యెడల శరీరమంతటికి, అవయములన్నింటికి ఆత్మసంబంధమైన ధైర్యము, శౌర్యము అలుముకొని, అనారోగ్యము అంతరించి ఆరోగ్యము అభివృద్ధి పొందును. నానాటికి శరీరములో ఉన్న క్షయమైన స్థితి లయమై అక్షయమైనే స్థితి అలుముకొని ఆరోహణమునకు సిద్ధపడగలరు. రాకడ విశ్వాసము వృద్ధి చెందును. పెండ్లికుమార్తె ధరించు ఆభరణములచేత అలంకరింపబడుదురు.
ప్రార్ధనలు
- 1. దేవా! నాకు కనబడుము. నాతో మాట్లాడుము. అందరికి కనబడుము. అందరితోను మాట్లాడుము ఆమేన్. ప్రభువైన యేసూ! త్వరగా రమ్ము. మరనాత. దేవునికి స్తోత్రము.
- 2. దేవా! నాయందు శుద్ధహృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధానములోనుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్దాత్మను నాయొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము. సమ్మతిగల మనస్సును కలుగజేసి నన్ను ధృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను. పాపులును నీ తట్టు తిరుగుదురు.
- 3. ఓ తండ్రీ! గర్వహృదయము, అహంకార దృష్టి కల్లలాడు నాలుక, అబద్దములాడు పెదవులు, నీకు హేయములు, గనుక వాటిని నాలోనుండి తీసివేసి, వాటి స్థానములను శుద్దీకరించి, ఆ స్థానములలో వినయము, సాత్వికము, సత్యము, నీతిని అమర్చి స్థిరపరచుమనే వేడుకొనుచున్నాము.
- 4. తండ్రీ! నేను నిత్య జీవమునకు వారసుడనగునట్లు, నిత్యము నాలో సంతోషము, సమాధానము, ఆనందము సమృద్ధియైన ధననిధిగా నింపుమని యేసుప్రభువు వారిద్వారా వేడుకొనుచున్నాను.
- 5. ఓ నాయనా! మీరు పరలోకమునుండి పంపించే పావన వర్తమానములను నేను అవలీలగా అందుకొని అర్ధము చేసికోగల ఏకాంత స్థితి ననుగ్రహించుమని యేసుప్రభువు వారిద్వారా వేడుకొనుచున్నాను.
- 6. ప్రభువా! సాత్వికము, సహనము, సహింపు అను మూడు ఆయుధములను నా విశ్వాస హస్తములలో అమర్చిపెట్టండి. ఈ మూడు ఆభరణములను నా నిరీక్షణ కంఠమునకు ధరింపచేయండి. ఈ మూడు పదార్థములతో నా బలహీన హృదయమును బలపరచి విశాలపరచండి. ఈ మూడు సుగంధములతో నా హృదయ కాఠిన్యమును, నా మనస్సు మాలిన్యమును, నా బుద్ధిమాంద్యమును, నా గుణహీనతను శుద్ధీకరించమని వేడుకొనుచున్నాను.
- 7. ఓ తండ్రీ! నాకు మౌనమును, వినయమును, దీనమనస్సును, దృఢమైన మనస్సును, స్థిరమైన మనస్సును, సమ్మతిగల మనస్సును దయచేయుము. దయచేసి నేను మాట్లాడునప్పుడు నెమ్మదిగాను, మితముగాను మాట్లాడగలిగిన దివ్యమైన స్థితి దయచేయుమని యేసుప్రభువు వారిద్వారా వేడుకొనుచున్నాను.
- 8. ఓ యేసూ, తండ్రీ! మీ సత్యమే నా జీవము, మీ జీవమే నా ప్రాణము, మీ శరీరమే నాకాహారము, మీ రక్తమే నా పానము, మీ పాదమే నా శరణము, మీ సన్నిధే నాకాశయము, మీ వాక్యమే నాకద్దము.
- 9. సైతానా! దేవుడగు యేసుక్రీస్తు నాలో నివసించుచున్నారు. నీకు చోటులేదు. మరణమా! జీవముగల యేసుక్రీస్తు నాలో నివసించుచున్నారు. నీకు చోటులేదు. లోకమా! వాక్యమగు యేసుప్రభువు నాలో నివసించుచున్నారు. నీకు చోటులేదు.
- 10. త్రియేకుడవైన తండ్రీ! మీరు దయచేసిన ధన్యగుణములను నేను పొందుటకును, మీరు అనుగ్రహించిన కృపావరములు పొందుటకును, మీరు దాచియుంచిన ఆత్మఫలములు నేను ఫలించుటకును, లోకనాధులను ఎదిరించుటకును, అంథకార శక్తులను బంధించుటకును, చీకటి శక్తులను పారద్రోలుటకును, మాటయందు తప్పని స్థితి కలిగియుందుటకును నన్ను అర్హునిగా చేయండి. మీరిచ్చు సమస్తము సంపూర్ణముగా పుచ్చుకొనుటకు అర్హునిగా చేయండి. పొందిన దానిని పోగొట్టుకొనకుండ ఉండే వరము దయచేయండి. పొందుటకున్న ఆటంకములు ఛేధించి, అనర్హతలను తీసివేసి త్రియేకుడవైన తండ్రీ మీరే నా లోపల స్థిరనివాసము చేయుచూ, నన్ను నడిపించి ఏలండి. మీలోపల నాకు స్థిర నివాసము ఏర్పరచి నన్ను మరుగుపరచి మీరే నా కార్యక్రమములన్నింటిలో ఘనత, కీర్తి మహిమ పొందుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.